సాక్షికాని జీవిత భాగస్వామికి మనమెలా సహాయం చేయవచ్చు?
1 యెహోవా సేవకుల్లో అనేకమంది, మన సహోదరుల పట్ల స్నేహ భావం, సంఘం పట్ల ఆసక్తి ఉండి దేవుని సేవకులుగా మారడానికి వెనకాడుతున్న వారిని పెళ్ళి చేసుకున్నారు. ఒక భర్త ఇలా ఒప్పుకున్నాడు: “ఇంటింటికి వెళ్ళడం అనే తలంపే నాకు పెద్ద అడ్డంకుగా ఉండేది.” మరికొందరికి అధిగమించవలసిన లేఖన విరుద్ధమైన అలవాట్లు ఉండవచ్చు, లేదా దైవపరిపాలనా పనులతో తమ జీవిత భాగస్వామి నిమగ్నమై ఉన్నట్లు తాము ఎన్నడూ ఉండలేమని భావిస్తుండవచ్చు. వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు?
2 వ్యక్తిగత ఆసక్తి చూపించండి: ఇతరుల పట్ల ఆసక్తి చూపించడం, వారికి ఇబ్బంది కలిగిస్తున్న చింతలను గమనించడం, వారు బైబిలు సత్యానికి ప్రతిస్పందించేందుకు మార్గం సుగమం చేయవచ్చు. (ఫిలి. 2:4) గతంలో తమ జీవిత భాగస్వామి విశ్వాసాన్ని పంచుకోనివారు, తమ పట్ల ఇతరులు చూపించిన ప్రేమాసక్తులను తరచూ ప్రస్తావిస్తారు. “హోసే అనే ఒక సంఘ పెద్ద, నాపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే చివరకు నేను అమిత శ్రద్ధతో అధ్యయనం చేసేందుకు నన్ను పురికొల్పిందని భావిస్తున్నాను” అని మొదట పేర్కొన్న భర్త వివరించాడు. మరొక భర్త, తనను సందర్శించే సహోదరులు తనకు ఆసక్తిగల విషయాల గురించే మాట్లాడే ప్రయత్నం చేశారని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. “నేను [నా భార్య] విశ్వాసాన్ని పూర్తిగా వేరే కోణంలో నుండి చూడడం ప్రారంభించాను, ఆమె స్నేహితులు చాలా తెలివైనవాళ్ళు, వారు వివిధ విషయాల గురించి మాట్లాడగలిగేవారు” అని ఆయన అన్నాడు.—1 కొరిం. 9:20-23.
3 ఆచరణాత్మక సహాయం చేయండి: సాక్షికాని జీవిత భాగస్వామి బహుశా తనకు చేసిన ప్రేమపూర్వక సహాయం ద్వారా కూడా ప్రభావితం కావచ్చు. (సామె. 3:27; గల. 6:10) అవిశ్వాసిగావున్న ఒక భర్త కారు పాడైపోయినప్పుడు, ఒక యౌవనసాక్షి ఆయనకు సహాయం చేశాడు. “అది నన్నెంతో ప్రభావితం చేసింది” అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొక సహోదరుడు, ఒక సహోదరి యొక్క అవిశ్వాసి భర్తకు వాళ్ళ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేయడంలో సహాయం చేస్తూ ఒక దినమంతా గడిపాడు. అలా వారు కలిసి పనిచేస్తూ, మాట్లాడుతూ తమ స్నేహాన్ని వృద్ధిచేసుకున్నారు. రెండు వారాల తర్వాత, ఆ వ్యక్తి ఆ సహోదరుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “ఇది నా జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవలసిన సమయం. మీరు నాతో బైబిలు అధ్యయనం చేస్తారా?” చాలా వేగంగా అభివృద్ధి సాధించిన ఆయన ప్రస్తుతం బాప్తిస్మం తీసుకున్న ఒక సాక్షి.
4 మనం మన క్షేత్రంలో యోగ్యులైనవారిని వెదకుతూ వెళ్తున్నప్పుడు, మన తోటి విశ్వాసులను పెళ్ళి చేసుకున్నవారికి సహాయం చేయడంలో కూడా కొనసాగుదాం.—1 తిమో. 2:1-4.