దైవపరిపాలనా కార్యకలాపాల కోసం ఉపయోగించే వనరుల పట్ల కృతజ్ఞతను చూపించండి
1 యోషీయా రాజు ఆలయాన్ని బాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఆ పని చేయడానికి నియమించబడినవారిని ఇలా ప్రశంసించాడు: “పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగినవారు.” (2 రాజు. 22:3-7, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఆ వ్యక్తులకు పవిత్రమైనవాటి పట్ల ఉన్న అవగాహన, తమకు అప్పగించబడిన వనరులతో వారు వ్యవహరించిన విధానాన్ని బట్టి వెల్లడయ్యింది. నేడు, మనం దేవుని సువార్త అనే పవిత్ర పనిలో పాల్గొంటుండగా, మనం కూడా అలాగే మనకివ్వబడిన వనరులతో వ్యవహరించడంలో నమ్మకస్థులముగా ఉండాలి.
2 క్షేత్ర సేవలో: మన ప్రచురణల్లో ఉన్న ప్రాముఖ్యమైన సందేశం పట్ల మనకున్న కృతజ్ఞతా వాటిని ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చును గురించిన గ్రహింపూ మనం వాటిని ఎంతో విలువైనవిగా ఎంచేలా చేస్తాయి. బైబిలు సందేశం పట్ల నిజమైన మెప్పును చూపించని వారికి మనం మన సాహిత్యాన్ని ఆలోచనా రహితంగా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి సువార్త వినడానికి అంతగా ఆసక్తి చూపించకపోతే మనం ఆయనకు ఒక ప్రచురణను ఇచ్చే బదులు ఒక కరపత్రాన్ని ఇవ్వవచ్చు.
3 సాహిత్యాన్ని, దాని విలువపట్ల మనకున్న గౌరవం వ్యక్తమయ్యే రీతిలో పంచిపెట్టండి. గాలికి అటూ ఇటూ ఎగిరిపోయేలా బహిరంగ ప్రదేశాల్లో వాటిని విడిచి పెట్టకండి. సాహిత్యం నిరుపయోగం కాకుండా ఉండేలా చూసుకోవడానికి, ఇంకా ఎక్కువ సాహిత్యాన్ని తీసుకునే ముందు ఇంట్లో మీ దగ్గర ఎంత సాహిత్యం ఉందో ఒకసారి లెక్కచూసుకోండి. మీకు పత్రికల సంచికలన్నీ ఎప్పుడూ అదనంగా ఉంటుంటే, మీ ఆర్డర్‌ను తగ్గించుకోవడం గురించి ఆలోచించండి.
4 వ్యక్తిగతంగా ఉపయోగించడం కోసం ప్రచురణలు: మనం ఇప్పుడిక డీలక్స్ బైబిళ్లు, రెఫరెన్స్ బైబిళ్లు మాత్రమే గాక అకారాది పట్టిక, ఇండెక్స్, అంతర్దృష్టి సంపుటులు, ప్రచారకులు పుస్తకం వంటి ప్రచురణల కోసం ఆర్డర్ చేయలేము కాబట్టి, అవి ఎంత విలువైన సంపదలో మనం మరింత పూర్తిగా గ్రహిస్తాము. మీ లైబ్రరీలో అవి ఇప్పటికే ఉంటే ఆ ఆధిక్యతను బట్టి వాటి గురించి బాగా శ్రద్ధ తీసుకోండి. రాజ్య మందిర గ్రంథాలయంలో ఉంచబడిన ప్రతులను ఇతరులు ఉపయోగించుకోవలసిన అవసరం ఉండవచ్చు. అవి మంచి స్థితిలో ఉండేలా, పోకుండా ఉండేలా చూడడంలో అందరూ సహకరించాలి.
5 మీరు మీ సొంత ప్రచురణల మీద మీ పేరు, చిరునామా తప్పకుండా వ్రాసిపెట్టుకుంటారా? అలా చెయ్యడం, ప్రచురణలను పోగొట్టుకొని తిరిగి క్రొత్తవాటిని తీసుకొనే అవసరాన్ని తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది. మీ పాటల పుస్తకం, బైబిలు, లేదా అధ్యయనం చేసే ప్రచురణ గనుక పోతే, రాజ్యమందిరంలోగానీ సమావేశ స్థలంలో గానీ పోయిన వస్తువులను ఉంచే స్థలంలో వాటిని తిరిగి కనుగొనవచ్చు.—లూకా 15:8, 9.
6 మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడానికి మనం కృషి చేద్దాము. యెహోవా మనకు అప్పగించిన రాజ్య వనరులతో వ్యవహరించడంలో మన నమ్మకత్వాన్ని చూపించడానికి ఇదొక మార్గం.—లూకా 16:10.