యెహోవాను మహిమపరచడానికి ఇతరులకు సహాయం చేయడం
1 భూవ్యాప్తంగా ప్రజలకు ఈ ప్రాముఖ్యమైన సందేశం ప్రకటించబడుతోంది: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” (ప్రక. 14:6, 7) ఆ ప్రకటనా పనిలో భాగం వహించడం మన ఆధిక్యత. ప్రజలు యెహోవాకు భయపడుతూ ఆయనను ఆరాధించాలంటే వారు ఆయన గురించి ఏమి తెలుసుకోవలసిన అవసరం ఉంది?
2 ఆయన పేరు: ప్రజలు, నేడు ఆరాధించబడుతున్న అనేకమంది అబద్ధ దేవుళ్ళ నుండి ఏకైక సత్య దేవుణ్ణి ఆయన పేరు ద్వారా గుర్తించవలసిన అవసరం ఉంది. (ద్వితీ. 4:35; 1 కొరిం. 8:5, 6) వాస్తవానికి, బైబిలు రచయితలు యెహోవా విశిష్టమైన పేరును 7,000 కంటే ఎక్కువసార్లు ఉపయోగించారు. దేవుని పేరును ఎప్పుడు పరిచయం చేయాలనే విషయంలో మనం వివేచనను ఉపయోగించడం సముచితమే అయినప్పటికీ మనం దాన్ని ఎన్నడూ మరుగు చేయకూడదు లేదా దాన్ని ఉపయోగించడానికి వెనుకాడకూడదు. మానవజాతి అంతా తన పేరును తెలుసుకోవాలన్నది దేవుని చిత్తం.—కీర్త. 83:18.
3 ఆయన వ్యక్తిత్వం: యెహోవాను మహిమపరచడానికి ఆయన ఎలాంటి దేవుడు అనేది ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. మనం వారికి ఆయన గమనార్హమైన ప్రేమ, అత్యున్నతమైన జ్ఞానము, సంపూర్ణమైన న్యాయము, సర్వోన్నత శక్తి వంటి వాటితో పాటు ఆయన కనికరాన్ని, ప్రేమపూర్వక దయను, ఇతర అద్భుతమైన లక్షణాలను పరిచయం చేయాలి. (నిర్గ. 34:6, 7) వారు యెహోవా ఆమోదంపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తిస్తూ దేవునిపట్ల ఆరోగ్యదాయకమైన భయాన్నీ భక్తినీ కలిగి ఉండడాన్ని కూడా నేర్చుకోవాలి.—కీర్త. 89:7.
4 దేవునికి దగ్గరవ్వడం: రాబోయే దేవుని తీర్పునుండి రక్షించబడాలంటే ప్రజలు విశ్వాసంతో యెహోవాకు ప్రార్థించాలి. (రోమా. 10:13, 14; 2 థెస్స. 1:6-8) దీనిలో, కేవలం దేవుని పేరునూ ఆయన లక్షణాలనూ గురించిన జ్ఞానాన్ని పొందడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. ప్రజలు యెహోవాను తమ పూర్ణ హృదయంతో విశ్వసిస్తూ ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి మనం వారికి సహాయం చేయాలి. (సామె. 3:5, 6) వారు, తాము నేర్చుకుంటున్నదాన్ని అన్వయించుకొంటూ హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తూ తమ జీవితాల్లో ఆయనిచ్చే సహాయాన్ని చవిచూస్తుండగా వారి విశ్వాసం అధికమవుతుంది, యెహోవాకు సన్నిహితమయ్యేందుకు అది వారికి తోడ్పడుతుంది.—కీర్త. 34:8.
5 మనం దేవుని పేరును ఆసక్తితో ప్రకటిస్తూ ఆయనపై పూర్తినమ్మకం ఉంచడానికీ ఆయనకు భయపడడానికీ ఇతరులకు సహాయం చేద్దాం. అనేకులు యెహోవాను తెలుసుకుని, ‘రక్షణకర్తయైన దేవునిగా’ ఆయనను మహిమపరచడానికి మనం సహాయం చేయగలుగుతాము.—కీర్త. 25:5.