ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పర్చుకోండి
1 యెహోవాను నిరంతరమూ స్తుతించడమనేది ఎంత గొప్ప ఆధిక్యత అయ్యుంటుందో కదా! ఆ ఆధిక్యతను పొందేందుకు ప్రస్తుతం మనం ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటిని సాధించడానికి కృషి చేయవచ్చు. ఇది మనం మన సామర్థ్యాలను సరైన విధంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. (1 కొరిం. 9:26, 27) ఏ లక్ష్యాలు మీకు చేరుకోదగినవిగా ఉంటాయి?
2 బైబిలు అధ్యయనం: మీరు ప్రతి సంఘకూటానికీ సిద్ధపడతారా? అలాగైతే మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశోధన చేయడానికీ ధ్యానించడానికీ సమయాన్ని కేటాయిస్తారా? ఉదాహరణకు, వారంలో జరిగే కావలికోట అధ్యయనానికీ సంఘ పుస్తక అధ్యయనానికీ సిద్ధపడేటప్పుడు, మీరు సమాధానాలను కేవలం అండర్లైన్ చేసుకుంటారా లేక ఉల్లేఖించబడిన లేఖనాలను చూడడమే కాకుండా అక్కడ ఇవ్వబడిన వివరణలకు కారణాలను ఆలోచిస్తారా? దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కోసం నియమించబడిన బైబిలు పఠన భాగం నుండి ప్రతివారం కొన్ని అంశాలపై పరిశోధన చేయడాన్ని మీరు లక్ష్యంగా పెట్టుకోగలరా? ఆధ్యాత్మిక విషయాలపై ఇలా పరిశోధన చేయడానికి సమయం, కృషి అవసరం, అయితే అది అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను తెస్తుంది.—సామె. 2:4, 5.
3 సంఘ కూటాలు: ఐదు సంఘ కూటాలకూ క్రమంగా హాజరవ్వాలన్నది ఇంకొక లక్ష్యం. తోటి విశ్వాసులతో సహవసించడానికీ ప్రారంభపు పాటకు, ప్రార్థనకు ఉండడానికీ వీలయ్యేంత ముందుగా కూటాలకు వస్తే, సంఘ స్ఫూర్తిని బలపర్చడానికి అది సహాయపడుతుంది. మనం ప్రతి కూటంలోను వ్యాఖ్యానించడానికి, మన వ్యాఖ్యానాలను మెరుగుపర్చుకోవడానికి కూడా కృషి చేయవచ్చు. బహుశా పేరాలో ఉన్న ఒక లేఖనం చర్చతో ఎలా సంబంధం కలిగివుందో చూపవచ్చు లేక ఆ సమాచారం దైనందిన జీవితంలో ఎలా అన్వయిస్తుందో సూచించవచ్చు.—హెబ్రీ. 10:24, 25.
4 క్షేత్ర సేవ: మనం లక్ష్యాలను ఏర్పర్చుకున్నప్పుడు మన పరిచర్య చాలా మెరుగుపడుతుంది. ప్రతీ నెలా సేవలో ఇన్ని గంటలు గడపాలి అని మీకు వ్యక్తిగత లక్ష్యం ఉందా? అలా లక్ష్యం పెట్టుకోవడం సహాయకరంగా ఉందని కొంతమంది గ్రహించారు. లేదా మీ పరిచర్యకు సంబంధించి, ఇంటింటి పరిచర్యలో బైబిలును ఉపయోగించడం, మరింత అర్థవంతమైన పునర్దర్శనాలు చేయడం, బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి కృషి చేయడం లేదా అధ్యయనాల్లో మరింత ప్రభావవంతంగా బోధించడం వంటి అంశాలలో దేనినైనా మీరు మెరుగుపర్చుకోగలరా?
5 తల్లిదండ్రుల్లారా, యెహోవా సేవలో లక్ష్యాలు ఏర్పర్చుకోమని మీ పిల్లలను ప్రోత్సహిస్తున్నారా? ఒక పయినీరుగా సేవచేయడం లేదా బేతేలు కుటుంబంలో ఒక సభ్యునిగా సేవచేయడం అనేది యెహోవాపట్ల తమకున్న ప్రగాఢమైన కృతజ్ఞతను చూపించడానికి అద్భుతమైన మార్గమని వారు గ్రహించడానికి సహాయం చేయండి.—ప్రసం. 12:1, 2.
6 మనం మన కార్యకలాపాలను పరిశీలించుకుని, ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పర్చుకుని, వాటిని చేరుకోవడానికి కృషి చేస్తుండగా మనం మన సేవలో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాము, ఇతరులకు ప్రోత్సాహాన్ని కలిగించేవారిగా ఉంటాము.—రోమా. 1:11, 12.