యెహోవాతోనూ ఆయన కుమారునితోనూ సంతోషంగా ఐక్యమై
సంవత్సరంలోని అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన మార్చి 28న ఆచరించబడుతుంది
1 మార్చి 28, 2002, సూర్యాస్తమయం తర్వాత ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించడం ద్వారా మనం యెహోవా దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ సంతోషంగా ఐక్యమైవున్నామని చూపిస్తాము. అత్యంత ప్రత్యేకమైన ఆ సందర్భంలో అభిషిక్త క్రైస్తవుల శేషము, తండ్రితోనూ ఆయన కుమారునితోనూ ఇతర రాజ్యవారసులతోనూ తమకున్న ప్రత్యేక ‘సహవాసాన్ని’ ఆనందిస్తారు. (1 యోహా. 1:3; ఎఫె. 1:11, 12) లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెలు” దేవుని పనిని నెరవేర్చడంలో యెహోవాతోనూ ఆయన కుమారునితోనూ ఏక మనస్సు ఏక హృదయం కలిగి వారితో ఐక్యమవ్వడానికి సంబంధించి తమకున్న అద్భుతమైన ఆధిక్యత గురించి ధ్యానిస్తారు!—యోహా. 10:16.
2 సన్నిహితంగా కలిసి పనిచేయడం: యెహోవా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సంతోషంగా ఐక్యతతో ఉన్నారు. మానవుని సృష్టించకముందు వారు యుగాలపాటు సన్నిహిత సహచర్యాన్ని ఆనందించారు. (మీకా 5:2) అందుకే వాళ్ళిద్దరి మధ్యా ఒక ప్రగాఢమైన ప్రేమానుబంధం ఏర్పడింది. ఈ జ్యేష్ఠ కుమారుడు మానవునిగా భూమి మీదికి రాకమునుపు, మూర్తీభవించిన జ్ఞానముగా, ఇలా చెప్పగలిగాడు: “నా మూలంగా యెహోవా ప్రతిరోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.” (సామె. 8:30, ఈజీ-టు-రీడ్ వర్షన్) ప్రేమకే మూలమైన దేవునితో లెక్కలేనన్ని యుగాలు సన్నిహిత సహచర్యం చేయడం, ఆయన కుమారునిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది!—1 యోహా. 4:8.
3 యెహోవా మానవులకున్న విమోచించబడవలసిన అవసరతను దృష్టిలో ఉంచుకొని, మానవులంటే మక్కువ కలిగివున్న తన అద్వితీయ కుమారుడ్ని విమోచన క్రయధన బలిని అర్పించడానికి ఎన్నుకున్నాడు, ఆ బలే మనకు ఏకైక నిరీక్షణను ఇస్తుంది. (సామె. 8:31) ఒకే సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా, ఆయన కుమారుడు ఐక్యతతో ఉన్నట్లే, సంతోషంగా దేవుని చిత్తాన్ని చేస్తూ మనం కూడా వారితోనూ అలాగే ఒకరితో ఒకరమూ బలమైన ప్రేమానుబంధంలో ఐక్యమై కొనసాగుదాము.
4 మన హృదయపూర్వక మెప్పును చూపడం: యెహోవా మన ఎడల చూపిన ప్రేమ పట్ల ఆయన కుమారుడు అర్పించిన బలి పట్ల నిజమైన మెప్పును జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ద్వారా, జాగ్రత్తగా గౌరవంతో వినడం ద్వారా వ్యక్తపరచవచ్చు. అక్కడ ఉన్నతపర్చబడేవి ఏమిటంటే, యేసు చూపిన ప్రేమపూర్వక మాదిరి, విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి గాను మరణం వరకూ ఆయన చూపిన నమ్మకత్వం, స్థాపించబడిన దేవుని రాజ్యానికి రాజుగా ఆయన పరిపాలన, మానవజాతికి ఆ రాజ్యం తీసుకువచ్చే ఆశీర్వాదాలు వంటివి. ‘సత్యములో సహాయకులముగా’ యెహోవా చిత్తానికి అనుగుణంగా ఆసక్తితో పనిచేస్తూ మన విశ్వాసాన్ని ప్రదర్శించడంలో కొనసాగవలసిన అవసరత గురించి కూడా మనకు గుర్తుచేయబడుతుంది.—3 యోహా. 8; యాకో. 2:17.
5 మనతో సహవసించేలా ఇతరులకు సహాయపడడం: మన క్షేత్రంలోవున్న నిష్క్రియులైన సాక్షులందరూ క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు పెద్దల సభ ప్రత్యేక ప్రయత్నం చేయాలి. (మత్త. 18:12, 13) ఎవ్వరినీ మర్చిపోకుండా, అందరూ వ్యక్తిగతంగా ఆహ్వానింపబడేలా ఎవరెవరిని పిలవాలో ఒక పట్టికను తయారుచేసుకోండి.
6 జ్ఞాపకార్థానికి రాగల ఇతరులెవరి గురించైనా మీకు తెలుసా? ఈ సందర్భం పట్ల వారికున్న మెప్పుదలను అధికం చేసేందుకు చొరవ తీసుకోండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి, వాళ్ళు ఆహ్వానితులని భావించేలా చేయండి. అత్యంత ప్రాముఖ్యమైన ఈ సంఘటనకు మన బైబిలు విద్యార్థులందరినీ, ఆసక్తిగలవారినీ అలాగే కుటుంబంలోని వారినీ పరిచయస్థులనూ ఆహ్వానించేందుకు మనం చేయగలిగినదంతా చేద్దాం. “యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము”ను నేర్చుకొనే వారందరికీ ఆ విమోచన క్రయధనం యొక్క ప్రయోజనాలు అందుబాటులోనే ఉంటాయి. (ఫిలి. 3:8) క్రీస్తు అర్పించిన బలి పట్ల విశ్వాసాన్ని కలిగివుండేవారు నిత్యజీవాన్ని గురించిన దృఢమైన నిరీక్షణను పొందవచ్చు.—యోహా. 3:16.
7 యథార్థవంతులైన ప్రజలపై జ్ఞాపకార్థ ఆచరణ చూపించే ప్రభావాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయవద్దు. రెండు సంవత్సరాల క్రితం పాపువా న్యూ గినీ అనే ద్వీపదేశంలో 11 మంది ఆసక్తిగల వారు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేందుకు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం గుండా చిన్న పడవలో 17 గంటలపాటు ప్రయాణించారు. ఎందుకు? “యెహోవాను ఆరాధించే తోటి ఆరాధకులతో క్రీస్తు జ్ఞాపకార్థాన్ని ఆచరించాలనుకున్నాము; మేము పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది” అని వారు చెప్పారు. వారు చూపించిన అత్యంతాసక్తి గురించి, యెహోవాతోనూ ఆయన కుమారునితోనూ మరియు క్రైస్తవ సహోదరత్వంతోనూ ఆనందంగా ఐక్యమవ్వగలిగినందుకు వారికున్న మెప్పును గురించి ఆలోచించండి!
8 ఆసక్తిగల వారందరికీ బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి. సంఘకూటాలకు క్రమంగా హాజరవ్వమని వారు నేర్చుకుంటున్న సత్యాలను ఇతరులకు తెలియజేయమని వారిని ప్రోత్సహించండి. తమ జీవితంలో బైబిలు సూత్రాలను అనుసరించడం ద్వారా, ‘వెలుగులో నడవడానికి, సత్యాన్ని ఆచరించటానికి’ వారికి సహాయం చేయండి. (1 యోహా. 1:6, 7, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి, ఐక్యంగా ఆయన చిత్తాన్ని చేసే ఆధిక్యత పట్ల మెప్పును కనపర్చడంలో కొనసాగడానికి వారికి సహాయం చేయండి.
9 ‘ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడడంలో’ ఆనందంగా ఐక్యమవ్వడం ఎంతటి అద్భుతమైన ఆధిక్యత! (ఫిలి. 1:27, 28) యెహోవాపట్ల ఆయన కుమారుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగివుంటూ, మార్చి 28న జరిగే జ్ఞాపకార్థ ఆచరణ వద్ద ఆహ్లాదకరమైన సహవాసాన్ని అనుభవించేందుకు ఎదురుచూద్దాము.—లూకా 22:19.