దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించండి
1 ఒక అధికారికి సాక్ష్యమిస్తున్నప్పుడు, “ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.” (అపొ. 8:35) ఫిలిప్పు ‘సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాడు.’ (2 తిమో. 2:15) అయితే, నేడు చాలామంది ప్రచారకులు సాక్ష్యమిచ్చేటప్పుడు బైబిలును చాలా అరుదుగా ఉపయోగిస్తున్నట్లు ప్రయాణ పైవిచారణకర్తలు గమనించారు. మీరు మీ పరిచర్యలో బైబిలును ఉపయోగిస్తున్నారా?
2 మనం నమ్మే ప్రతిదానికీ, బోధించే వాటన్నింటికీ దేవుని వాక్యమే మూలాధారం. (2 తిమో. 3:16, 17) ఆ వాక్యమే ప్రజలను యెహోవాకు దగ్గరయ్యేలా చేస్తుంది, నిరంతరం వారికి బోధిస్తుంది. అందుకే మన పరిచర్యలో కేవలం మనకు ఆసక్తిగా ఉన్న విషయాలను మాట్లాడడం కంటే మనం బైబిలును ఉపయోగించడం ప్రాముఖ్యం. (హెబ్రీ. 4:12) బైబిలు గురించి అనేకమందికి చాలా తక్కువ తెలుసు కాబట్టి, అది అందించే ఆచరణాత్మకమైన మార్గనిర్దేశాన్ని చూపించడానికి, భవిష్యత్తులో మానవాళి కోసం ఏముందో దాన్ని చూపించడానికి మనం బైబిల్లోంచి చదవాల్సిన అవసరం ఉంది.
3 నేరుగా బైబిల్లోంచే చదవండి: ప్రకటించేందుకు వెళ్ళేటప్పుడు మరీ పెద్దగా ఉండే బ్యాగు తీసుకెళ్ళకుండా మీరు ప్రయత్నించవచ్చు. అవసరమైన సాహిత్యాలను ఒక చిన్న బ్యాగులో పెట్టుకుని, బైబిలును చేతిలో లేక జేబులో పెట్టుకుని వెళ్ళవచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదో ప్రసంగం ఇవ్వబోతున్నారని ఆ వ్యక్తికి అనిపించకుండా బైబిలును చాలా సులభంగా తీసి చదవవచ్చు. వింటున్న వ్యక్తి మీతోపాటు చదవగలిగేలా బైబిలును పట్టుకోండి. బహుశా ఒక లేఖనాన్ని పైకి చదవమని ఆయనను అడగవచ్చు. కేవలం మీరు చెబుతున్న మాటలు వినడంకంటే బైబిలు ఏమి చెబుతోందో ఆయన స్వయంగా చూసినప్పుడే ఎక్కువ ప్రభావముంటుంది. ఆయన చదివింది అర్థం చేసుకొనేలా, ఆ లేఖనంలోని భావాన్ని తెలియజేసే ముఖ్యమైన పదాలను నొక్కి చెప్పండి.
4 ఒక లేఖన అందింపు: మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తర్వాత, మీరిలా అడగవచ్చు: “ప్రజలు తమ జీవితాలకు నడిపింపు కోసం విభిన్న ఆధారాలను వెతకుతారు. ఆచరణాత్మకమైన మార్గనిర్దేశాన్నిచ్చే మంచి మూలాధారం ఏదని మీరు భావిస్తున్నారు? [జవాబు చెప్పనీయండి.] ఈ వ్యాఖ్యానం గురించి మీకేనిపిస్తుంది? [సామెతలు 2:6, 7 చదివి, జవాబు కోసం ఆగండి.] విషాదకరంగా, మానవుని జ్ఞానంలో లోపముందని రుజువైంది, అది అనేకమందిని నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. అయితే, దేవుని జ్ఞానం ఎల్లప్పుడూ నమ్మదగినది, ప్రయోజనకరమైనది అని రుజువైంది.” ఆ తర్వాత మీరు అందించే ప్రచురణను చూపించి, దేవుని ఆచరణాత్మక జ్ఞానానికి ఒక ఉదాహరణను దాన్నుండి తీసి, చెప్పండి.
5 యేసు యథార్థ హృదయులకు సహాయపడడానికి లేఖనాలను ఉపయోగించాడు. (లూకా 24:32) పౌలు తను బోధించేవాటిని లేఖనాలతో రుజువు చేశాడు. (అపొ. 17:2, 3) దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించడంలో ఇంతకుముందటికంటే ఎక్కువ నైపుణ్యాన్ని మనం సంపాదిస్తే, పరిచర్యలో మన సంతోషము, దృఢ విశ్వాసము అధికమవుతాయి.