మీరు మీ పరిచర్యను సంపూర్ణంగా నెరవేరుస్తున్నారా?
1 యేసు శిష్యులు ప్రజలకు “సంపూర్ణంగా సాక్ష్యమిస్తూ” తమ పరిచర్యను నెరవేర్చారని అపొస్తలుల కార్యముల పుస్తకం మనకు చెబుతోంది. (అపొ. 2:40; 8:25; 28:23, NW) నిస్సందేహంగా అపొస్తలుడైన పౌలు లక్ష్యం అదే. (అపొ. 20:24) ఒక సువార్త పరిచారకుడిగా మీకూ అది ఒక లక్ష్యం కాదా? ఆ లక్ష్యాన్ని మీరెలా సాధించగలరు?
2 మీ అందింపును సిద్ధం చేసుకోండి: పరిచర్యలో మీరు ఫలప్రదమైన సాక్ష్యమివ్వాలని అనుకుంటే సిద్ధపడడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా, పత్రికల్లో వేర్వేరు అంశాలు వస్తుంటాయి కాబట్టి పత్రికలు అందించేటప్పుడు అది నిజంగా అవసరం. మనం మంచిగా సిద్ధపడి ఉండడానికి సహాయంగా ఈ నెల మన రాజ్య పరిచర్య, ప్రస్తుత కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించడానికి ఎడమ ప్రక్కనున్న కాలమ్‌లో కొన్ని నమూనా అందింపులతో ఒక క్రొత్త శీర్షికను పరిచయం చేస్తోంది. అనేకమందిని ఆకట్టుకునే ఒక సమయోచితమైన అంశాన్ని ప్రతి సంచికనుండి ఎత్తి చూపిస్తుంది. ఈ క్లుప్తమైన అందింపుల ఆధారంగా మీ సంభాషణను ఎలా వృద్ధి చేయగలరు?
3 మీ క్షేత్రంలో బాగా ప్రభావం చూపిస్తుందని మీకనిపించిన ఒక అందింపును ఎంపిక చేసుకోండి. దానికి వర్తించే ఆర్టికల్‌ను శ్రద్ధగా చదవండి, ఆసక్తిని కలుగజేసే పాయింట్లను వ్రాసుకోండి. ఇంటి యజమానికి చదివి వినిపించడానికి చర్చకు సంబంధించిన ఒక లేఖనాన్ని పత్రికలో పేర్కొన్నవాటినుండి తీసుకోండి. పత్రికను చదివేలా, సముచితమైతే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యెహోవాసాక్షుల పనికి విరాళమివ్వగలిగేలా మీ శ్రోతను ప్రోత్సహించడానికి క్లుప్తమైన ముగింపును చేర్చండి. ఇప్పుడు మీ అందింపును అభ్యాసం చేయండి.
4 బైబిలును ఉపయోగించడానికి ప్రణాళిక వేసుకోండి: మంచిగా ప్రణాళిక వేసుకుంటే, మీ అందింపులో తరచుగా ఒక లేఖనాన్ని చేర్చవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, మన క్షేత్రంలో మాట్లాడే భాషల్లోని మొత్తం బైబిళ్ళను తప్పకుండా వెంట తీసుకువెళ్ళండి. తర్వాత, బైబిలును ఉపయోగించడంలో స్థానికంగా ఎటువంటి అభ్యంతరం లేనట్లయితే మన సంభాషణ ఆరంభించడానికి బైబిలును ఉపయోగించవచ్చు. స్నేహపూర్వకంగా పలకరించిన తర్వాత మనమిలా అనవచ్చు:
▪ “దీన్ని నమ్ముతున్నారా లేదా అని మేము ప్రజలను అడుగుతున్నాము . . .” అని ఆదికాండము 1:1 చదవండి, తర్వాత “మీరు దీన్ని నమ్ముతారా?” అని అడగండి. ఆ వ్యక్తి ఒప్పుకుంటే, ఇలా అనండి: “నేను కూడా నమ్ముతున్నాను. కానీ దేవుడే సర్వము సృష్టించినట్లయితే, దుష్టత్వానికి కూడా ఆయనే బాధ్యుడని మీరు భావిస్తున్నారా?” ఆ వ్యక్తి సమాధానం విన్న తర్వాత, ప్రసంగి 7:29 చదవండి. జ్ఞానము పుస్తకంలోని 71వ పేజీ తెరచి అందులోని 2వ పేరాను చదవండి. పుస్తకం చదవమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి. ఒకవేళ ఇంటి యజమాని ఆదికాండము 1:1లోని విషయాన్ని అంగీకరించనట్లయితే, సృష్టి (ఆంగ్లం) పుస్తకాన్ని పరిశీలించమని ప్రేరేపించండి.
5 ఆసక్తిగల వారందరితో పరిచయాన్ని కొనసాగించండి: ఆసక్తి కనబరచినవారితో మీ పరిచయాన్ని కొనసాగించకపోతే మీ పరిచర్యను మీరు సంపూర్ణంగా నెరవేర్చలేరు. మీరు పత్రికలను లేక ఇతర సాహిత్యాలను ఇచ్చినా ఇవ్వకున్నా, తృప్తికరమైన చర్చ జరిగినట్లయితే ఆ వ్యక్తి పేరు, అడ్రస్ వ్రాసిపెట్టుకోండి. వెంటనే పునర్దర్శనం చేయడం ద్వారా ఆ వ్యక్తిలోని ఆసక్తిని పెంపొందించడానికి బాగా కృషి చేయండి. బైబిలు అధ్యయనాన్ని తప్పకుండా ప్రస్తావించండి.
6 తాము “దృఢసాక్ష్యమియ్యవలె”నని యేసు ఆజ్ఞాపించాడని మొదటి శతాబ్దపు శిష్యులకు తెలుసు. (అపొ. 10:42) ఆ ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే శిష్యులను చేయడానికిగల ఒకే ఒక మార్గం అదే. (మత్త. 28:19, 20) మన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చడానికి మనకు సాధ్యమైనంత వరకు మనం చేద్దాం.—2 తిమో. 4:5.