మీకెటువంటి అలవాటుంది?
1 యెహోవాకు మనం చేసే ఆరాధనలో క్రైస్తవ కూటాలు చాలా ప్రాముఖ్యమైనవి. “కొందరు అలవాటుగా” మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానకండి అని అపొస్తలుడైన పౌలు మనకు సహేతుకముగానే ఉద్బోధించాడు.—హెబ్రీ. 10:25, NW.
2 క్రైస్తవ కూటాల్లో మీ సహోదరులను కలుసుకునే విషయంలో మీకూ అలాంటి అభిప్రాయమే ఉందా? ఈ విషయంలో మీ అలవాటు ఏమి వెల్లడి చేస్తుంది? మీరు సంఘ పుస్తక అధ్యయనంతో పాటు అన్ని కూటాలకు క్రమంగా హాజరవుతారా? లేక కూటాలకు హాజరు కాకుండా మానుకునే అలవాటుందా? మీ జీవితంలో కూటాలకు ఏ స్థానముంది? కూటాలకు క్రమంగా హాజరు కమ్మని మీరు ఇతరులను ప్రోత్సహిస్తున్నారా? క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరైనవారిని క్రమంగా కూటాలకు హాజరు కమ్మని ప్రోత్సహిస్తున్నారా?
3 మనకు మన దైనందిన కార్యక్రమాలు ఉన్నప్పటికీ, పౌలు చెప్పిన సలహాను నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యం వల్ల లేక తన అదుపులో లేని ఇతర పరిస్థితుల వల్ల ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా ఒక కూటానికి హాజరు కాలేకపోవచ్చు, కాని అది ఆయనకు అలవాటు కాకూడదు. (రోమా. 2:21) ఒక క్రైస్తవునికి దైవపరిపాలనా కార్యకలాపాలతోపాటు, బాధ్యతగా నిర్వహించాల్సిన ఇతర కార్యాలు అనేకం ఉన్నప్పటికీ, ఆయన శ్రేష్ఠమైన కార్యాలేవో వాటిని గుర్తించాల్సిన అవసరముంది. (ఫిలి. 1:9-11) ఒక క్రైస్తవుని శ్రేష్ఠమైన కార్యాల్లో మన ఆధ్యాత్మిక సంక్షేమానికి ఆవశ్యకమైన కూటాలు కూడా ఉన్నాయి.
ఒకర్నొకరు ప్రోత్సహించుకోండి
4 పౌలు రోమీయులకు వ్రాసినప్పుడు వారిని చూడడానికి మిగుల అపేక్షిస్తున్నాను అని అన్నాడు. అలా ఎందుకన్నాడు? ఆత్మసంబంధమైన కృపావరమేదైనా వారికిచ్చి వారిని ‘స్థిరపరచాలని’ ఆయనలా అన్నాడు. (రోమా. 1:11) సహవాసము ప్రాముఖ్యమని ఆయన భావించాడు, అవును, “ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలెనని” లేక పరిశుద్ధ బైబల్ ప్రకారం “పరస్పరం ప్రోత్సాహపరచుకోవాలని” ఆయన అన్నాడు కాబట్టి సహవాసము అవసరమే. (రోమా. 1:11, 12) పౌలు తాను ఒక అపొస్తలుడైనప్పటికీ క్రైస్తవ సహవాసం ద్వారా ప్రోత్సాహం పొందాల్సిన అవసరం తనకూ ఉందని గుర్తించాడు.
5 అదే విధంగా, మనం మన కూటాల్లో ఒకరిపట్ల ఒకరం ప్రేమ చూపించుకోవడానికి, సత్కార్యములు చేయడానికి పురికొల్పుకోవాలి. స్నేహపూర్వకమైన ఒక చిరునవ్వు, మృదువైన పలకరింపు కూడా ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపించగలవు. నిర్మాణాత్మకమైన వ్యాఖ్యానాలు, కార్యక్రమంలో చక్కగా సిద్ధపడిన భాగాలు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్న ఇతరులను చూడడం, కూటాల్లో కేవలం సహోదరుల మధ్య ఉండడం కూడా చాలా ప్రోత్సాహాన్నిస్తాయి. దినం గడిచేసరికి మనం అలసిపోయినప్పటికీ, సాధారణంగా కూటానికి హాజరైన తర్వాత మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. మన సహోదరులు మనపై చూపించే స్నేహమూ ప్రేమా మనం “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తు”టకు ప్రోత్సాహాన్నిస్తాయి. (హెబ్రీ. 12:1, 2) దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం ద్వారా, ప్రజలకు మన నిరీక్షణ గురించి నిశ్చలంగా చెప్పడానికి సిద్ధపడి ఉండగలము. నిజంగా, కూటాలకు హాజరవడం వలన మనమెన్నో ఆశీర్వాదాలను పొందుతాము.
6 ఇంతకు ముందెన్నడూ లేనంతగా మనమిప్పుడు మన విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకొని, ఇతరులపై ప్రేమను చూపుతూ సత్కార్యాలను చేయాలి. మనం సమాజముగా కూడడం మానుకునే అలవాటులో పడిపోకూడదు. మనం జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చినవారితోపాటు ఇతరులూ కూటాలకు క్రమంగా హాజరవడానికి వారిని ప్రోత్సహించడానికి, అందుకు కావల్సిన సహాయం చేయడానికి మనస్సాక్షి పూర్వకంగా కృషి చేయాలి. ఆ విధంగా, ఇతరులపై మనకున్న ప్రేమను, క్రైస్తవ కూటాలపై మనకున్న మెప్పుదలను చూపించగలము.