మీరు మీ రాజ్య మందిరాన్ని గౌరవిస్తారా?
1 “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్త. 133:1) మన సహోదరులను కలుసుకోవడానికి, ప్రేమచూపేలా, సత్కార్యములు చేసేలా ఒకరినొకరు పురికొల్పుకోవడానికి మన రాజ్య మందిరములోని కూటాలు అవకాశాన్ని కలిగిస్తాయి.—హెబ్రీ. 10:24, 25.
2 రాజ్య మందిరము మన జీవితాల్లో అంత ప్రాముఖ్యమైన ప్రక్రియను నెరవేరుస్తున్నప్పుడు, మనం దాన్ని నిజంగా గౌరవిస్తున్నామా? మనముంటున్న ప్రాంతంలో రాజ్య మందిరము సత్యారాధనకు కేంద్రం. ఆ కారణంగా, మనం దాన్ని చాలా ఉన్నతంగా దృష్టించాలి. దాన్ని ఎప్పుడూ శుభ్రంగా, మంచిస్థితిలో ఉంచాల్సిన అవసరాన్ని మనమందరమూ గ్రహించాలి. దాన్ని శుభ్రపరచడానికి మన పుస్తక అధ్యయన గ్రూపు నియమించబడే సమయాలున్నాయి. అప్పుడు ఆ పనిలో పాల్గొనడానికి సాధ్యమైతే, తప్పకుండా పాల్గొనాలని మనం కోరుకోవాలి, ఆ విధంగా, శుభ్రమైన ఆకర్షణీయమైన కూటమి స్థలానికి మనం విలువిచ్చినవారమవుతాము.
3 శుభ్రపరచడానికి మనం నియమించబడినా లేకున్నా, మనమందరం రాజ్య మందిరం మీద శ్రద్ధ చూపించవచ్చు. ఎలా? రాజ్య మందిరంలో ప్రవేశించడానికి ముందుగా మట్టి లోపలికి రాకుండా కాళ్ళను దులుపుకొనే ఒక చిన్న చర్య ద్వారా కూడా చూపించవచ్చు. ప్రత్యేకంగా గాలి వాన ఉన్నప్పుడు ఇలాంటి చర్య నిజంగా అవసరం. ఒకవేళ మనం టాయ్‌లెట్‌ను ఉపయోగించాల్సివస్తే, సింకును కూడా చుట్టూ శుభ్రంగా తుడిచి మన తర్వాత వచ్చే వ్యక్తికి శుభ్రంగా ఉండేలా చూడవచ్చు. సాహిత్యాలు, పత్రికల కౌంటర్లలో పని చేసేవారు ఖాళీ కార్టన్లను వెంట వెంటనే రాజ్య మందిరంలోంచి బయటికి తరలించడం ద్వారా తమ శ్రద్ధను చూపించవచ్చు. చెత్తను పడవేసే స్థలాల్లోనే చెత్తంతా పడవేయాలి. నేలమీద చిన్న కాగితం ముక్కగానీ వేరే ఏదైనా చెత్తగానీ మన కంటబడితే, ఇతరులెవరో తీస్తారని దాన్ని అలాగే వదిలేసే బదులు దాన్ని మనమే తీసివేయాలి.
4 అసెంబ్లీలకు, సమావేశాలకు మనం హాజరైనప్పుడు కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయి. అసెంబ్లీ స్థలం స్వచ్ఛమైన ఆరాధనకు కేంద్రం, అది మన హాలైనా లేక వేరే ఇతరుల భవనమైనా, దాన్ని గౌరవంతో చూడాలి. మనం హాలు వదిలి వచ్చేటప్పుడు మనం కూర్చున్న చోట ఎటువంటి చెత్త లేకుండా ఎప్పుడూ చూసుకోవాలి. మనం తోడ్పడే దృక్పథాన్ని కలిగివుండాలి, శుభ్రం చేయడానికి నియమించబడ్డవారు మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ చెత్తను తీస్తారులే అని భావించకూడదు.
ఒకే హాలును పంచుకోవడం
5 ప్రాపర్టీ ధరలు అధికంగా ఉండడం మూలంగా, అనేక రాజ్య మందిరాలను ఒకటి కంటే ఎక్కువ సంఘాలు వాడుకుంటున్నాయి. నగర ప్రాంతాల్లో ఒకే రాజ్య మందిరాన్ని అయిదారు సంఘాలు పంచుకొంటున్నాయి. ప్రతి సంఘం రాజ్య మందిరం మీద శ్రద్ధ చూపించాలి, అది యెహోవాది ఆయనను ఆరాధించడానికి మనం దాన్ని ఉపయోగిస్తున్నామని గుర్తుంచుకోవాలి. రాజ్య మందిరం మీద మనం చూపే శ్రద్ధ యెహోవా మీద మనకున్న ప్రేమనే కాకుండా, ఆ హాలును వాడుకునే ఇతర సంఘాల్లోని సహోదరుల మీదున్న ప్రేమను కూడా సూచిస్తుంది.
6 సాధారణంగా, రాజ్య మందిరాన్ని వారానికొక్కసారి శుభ్రం చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటున్న హాళ్ళనయితే, తమ తర్వాతి సంఘం వాళ్ళు వచ్చినప్పుడు మనోహరంగా ఉండేలా ప్రతి కూటమి తర్వాత శుభ్రం చేయాలి. ఆదివారాల్లో కూడా ఒక సంఘం తర్వాత వెంటనే మరో సంఘం వచ్చేటట్లయితే అప్పుడు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తర్వాతి సంఘం రావడానికి ఇంకా సమయముందనుకుంటే కాస్త శుభ్రం చేయడం మంచిది. ఒకేరోజు ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగించిన హాలు ఎవరూ శ్రద్ధ చూపించకుండా అలాగే వదిలేస్తే దినం గడిచేసరికి అది అపరిశుభ్రంగా తయారవుతుంది.
7 ఆధ్యాత్మిక విషయాల్లో మనం “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను” ఉన్నట్లే, రాజ్య మందిరం విషయాల్లో కూడా ఏక మనస్సుతో గౌరవాన్ని చూపిద్దాము.—1 కొరిం. 1:10.