‘విని, పాండిత్యము వృద్ధిచేసికొనుము’
1 సామెతల పుస్తకం జ్ఞానమే స్వయంగా పిలుస్తున్నట్టు ఇలా వర్ణిస్తోంది: “నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. . . . నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.” (సామె. 8:6, 14, 32, 35) ఆ మాటలు, “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే జిల్లా సమావేశంలో మన కోసం ఎదురు చూస్తున్న ఆదేశాలను చక్కగా వర్ణిస్తున్నాయి.
2 ప్రపంచ వ్యాప్త సౌభ్రాతృత్వానికి కావలసిన అవసరాలను పరిశీలించి, ఆ అవసరాలను తెలియజేయడానికి సమావేశ కార్యక్రమం సిద్ధం చేయబడింది. అక్కడ అందించే ఆధ్యాత్మిక ఆదేశాలను, ఆచరణాత్మక సలహాలను ఆచరిస్తే, మనం సంతోషంగా ఉండడానికీ, యెహోవాతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికీ, నిత్యజీవపు మార్గంలో ఉండడానికీ అవి మనకు సహాయపడతాయి. నిస్సందేహంగా, మనం “విని పాండిత్యము వృద్ధిచేసికొను”టకు మంచి హేతువే ఉంది.—సామె. 1:5.
3 కార్యక్రమానికి ముందే: అక్కడ చర్చించిన విషయాలనుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, కార్యక్రమం ప్రారంభమైనప్పుడు మనం చక్కని ప్రశాంతమైన మనస్సుతో మన సీట్లలో ముందుగానే కూర్చొని ఉండాలి. అందుకు వ్యక్తిగతంగా మంచి క్రమశిక్షణ అవసరం. కార్యక్రమం మొదటినుండి వినాలంటే ఒక కీలకమైన విషయం, రాత్రి త్వరగా పడుకొని మీ బృందంలోని వాళ్ళందరూ ఉదయం అల్పాహారం చేసి సిద్ధమయ్యేందుకు సరిపడే సమయముండేలా ప్రొద్దున్నే లేవాలి. సమావేశ స్థలానికి ముందుగానే చేరుకోవాలి, అప్పుడు మీకు సీట్లు దొరకడమే కాకుండా కార్యక్రమము ప్రారంభంకావడానికి ముందుగా మీరు చూసుకోవాల్సినవేవైనా ఉంటే అందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ద్వారాలు తెరవబడతాయి, 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.
4 ఇలా సమావేశమవడంలోని ప్రధాన ఉద్దేశం “సమాజములలో యెహోవాను స్తుతిం”చడానికే కాబట్టి, ప్రతి సెషన్‌ను మన దేవుడ్ని శ్లాఘించే విధంగా ప్రారంభించాలి. (కీర్త. 26:12) అలా చేసేందుకు అన్ని సెషన్లలోనూ, ప్రారంభపు పాటను ప్రకటించడానికి ముందుగానే తమ తమ సీట్లలో కూర్చొని ఉండాలని అందరూ ప్రోత్సహించబడుతున్నారు. ఇది “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” అనే లేఖనాధారిత ఆదేశానికి అనుగుణమైనది. (1 కొరిం. 14:39) మనలో ప్రతి ఒక్కరికి అది ఎలాంటి అర్థాన్నిస్తుంది? ప్రారంభపు సంగీతం ఆరంభించడంతో చైర్మన్ వేదిక మీద కూర్చోవడం మీరు ఎప్పుడైతే చూస్తారో, వెంటనే మీరు మీ సీట్లో కూర్చోండి. అలా చేయడంవల్ల మీరు, ప్రతి సెషన్‌లోని ప్రారంభపు పాట హృదయపూర్వకంగా యెహోవాను ఎలుగెత్తి స్తుతించడంలో పాల్గొనేలా చేస్తుంది.—కీర్త. 149:1.
5 కార్యక్రమం జరుగుతుండగా: ఎజ్రా “యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకు, . . . దృఢనిశ్చయము చేసికొనెను.” (ఎజ్రా 7:10) యెహోవా అందించే ఆదేశాలను స్వీకరించడానికి మనం మన హృదయాలను ఎలా దృఢనిశ్చయము చేసుకోవచ్చు? కార్యక్రమ పట్టికలోని వివిధ అంశాల శీర్షికలను పరిశీలిస్తూ, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘ఈ కార్యక్రమము ద్వారా యెహోవా నాకు ఏమి చెబుతున్నాడు? నాకూ నా కుటుంబానికీ ప్రయోజనం చేకూరేలా ఈ సమాచారాన్ని నేను ఎలా ఉపయోగించుకోగలను?’ (యెష. 30:21; ఎఫె. 5:17) సమావేశం అయిపోయేంత వరకు మీరు అలాగే ప్రశ్నించుకోండి. మీరు ఉపయోగించుకోవాలనుకొనే అంశాలను వ్రాసుకోండి. ప్రతిరోజు సెషన్లు ముగిసిన తర్వాత వాటిని చర్చించడానికి సమయం తీసుకోండి. అలా చేయడం ఆ సమాచారాన్ని మనం అమలు చేయడానికీ, జ్ఞాపకం ఉంచుకోవడానికీ సహాయపడుతుంది.
6 ఏకంగా కొన్ని గంటలపాటు ఏకాగ్రత కలిగి ఉండడమంటే సవాలు వంటిదే. మన మనసు మరలకుండా ఉండాలంటే మనకేది సహాయపడుతుంది? కంటి శక్తిని సద్వినియోగం చేసుకోండి. చాలా మటుకు, మనం దేనిపై చూపు నిలుపుతామో అది మన ఏకాగ్రతను శాసిస్తుంది. (మత్త. 6:22) కాబట్టి, ప్రతి చప్పుడుకు లేక చిన్న కదలికకు అటు ఇటు చూడడం మానుకోండి. మీ దృష్టిని ప్రసంగీకునిమీదే కేంద్రీకరించండి. లేఖనం చదివినప్పుడు మీ బైబిల్లో చూడండి, ఆ లేఖనాన్ని చర్చిస్తున్నప్పుడు మీ బైబిలు తెరిచే ఉంచండి.
7 కార్యక్రమం జరుగుతుండగా మనం ఇతరులను ఆటంకపరచకుండా ఉండేందుకు క్రైస్తవ ప్రేమ మనలను కదిలిస్తుంది. (1 కొరిం. 13:5) ఇది ‘మౌనముగా ఉండి’ వినే సమయం. (ప్రసం. 3:7) కాబట్టి, అనవసరంగా మాట్లాడడంగానీ, అటు ఇటు తిరగడంగానీ చేయకండి. బాత్రూముకు ఎక్కువ సార్లు వెళ్ళకుండా ఉండేందుకు ముందే జాగ్రత్త పడండి. గంభీరమైన ఆరోగ్య సమస్యలుంటేనే తప్ప, నిర్దేశ సమయంవరకు తినడంగానీ, త్రాగడంగానీ చేయకండి. సెల్యులర్ ఫోన్లు, పేజర్లు, క్యామ్కోర్డర్లు, కెమెరాలు తెచ్చుకొన్నవారు ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా వాటిని ఉపయోగించకూడదు. తల్లిదండ్రులు, టీనేజర్లతోపాటు తమ మొత్తం కుటుంబం ఒకేచోట కూర్చునేలా చూడండి. అలా వాళ్ళు తమ పిల్లలను పర్యవేక్షించడానికి అవకాశముంటుంది.—సామె. 29:15.
8 అనేక దశాబ్దాలుగా ఇలాంటి సమావేశాలకు హాజరవుతున్న ఒక పెద్ద, గత సంవత్సరం తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు: “మరో విధంగా ఈ సమావేశం చాలా విశిష్టమైనదని నేను భావిస్తున్నాను. ప్రేక్షకుల్లోని చిన్న పిల్లలతోపాటు దాదాపు ప్రతి ఒక్కరు నోట్సు వ్రాసుకుంటున్నారు. అది చూడడానికి ఆనందకరమైన దృశ్యం. ప్రసంగీకుడు నిర్దేశిత లేఖనాలను చూడమని అడిగినప్పుడు బైబిళ్ళను చక్కగా ఉపయోగించారు.” అలా శ్రద్ధగా వినడం నిజంగా ప్రశంసనీయం. అది కేవలం మనకు, మన తోటి సమావేశపు ప్రతినిధులకు ప్రయోజనం తేవడమే కాకుండా, అన్నింటికంటే ముఖ్యంగా మన గొప్ప బోధకుడు, యెహోవాకు ఘనతను కూడా తెస్తుంది.—యెష. 30:20.