వినండి, నేర్చుకోండి
1. జిల్లా సమావేశంలో విని, నేర్చుకోవాలంటే కాస్త ఎక్కువ కృషి ఎందుకు అవసరం?
1 త్వరలోనే, 2013 జిల్లా సమావేశాలు మొదలౌతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రస్తుత అవసరాలకు సరిపోయే కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి ఎంతో కృషి జరిగింది. మీరు మొత్తం మూడు రోజులూ హాజరవడానికి ఏర్పాట్లు చేసుకున్నారా? సాధారణంగా పెద్దపెద్ద సమావేశాల్లో మన దృష్టిని మళ్లించే విషయాలు చాలా ఉంటాయి, కాబట్టి కార్యక్రమాన్ని శ్రద్ధగా వినాలంటే కాస్త ఎక్కువగా కృషి చేయడం తప్పనిసరి. సమావేశంలోని భాగాలు సంఘ కూటాల కంటే ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి, ఎక్కువసేపు మనసు నిలపాల్సివుంటుంది. దానికితోడు, ప్రయాణంవల్ల ఇతర కారణాలవల్ల కాస్త అలసట కూడా ఉంటుంది. కాబట్టి మనం శ్రద్ధగా విని, నేర్చుకోవాలంటే ఏం చేయాలి?—ద్వితీ. 31:12.
2. సమావేశ కార్యక్రమానికి మనం మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
2 సమావేశానికి ముందు: మన అధికారిక వెబ్‌సైట్ www.jw.orgలో సమావేశ కార్యక్రమ పట్టిక ఉంటుంది; అందులో అన్ని ప్రసంగాల అంశాలు, వాటి పక్కన ఒకట్రెండు ముఖ్యమైన లేఖనాలు ఉంటాయి. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే, ఆ సమాచారాన్ని ముందుగా చూసి, సమావేశంలో వినబోయే వాటికోసం మన హృదయాల్ని సిద్ధం చేసుకోవచ్చు. (ఎజ్రా 7:10) మీ కుటుంబమంతా సమావేశం గురించి ఆశగా ఎదురుచూసేలా మీ కుటుంబ ఆరాధనలో ఈ కార్యక్రమం గురించి చర్చించుకోవడానికి సమయం కేటాయించగలరా?
3. శ్రద్ధగా వినాలంటే మనం ఏమి చేయాలి?
3 సమావేశంలో: వీలైతే, కార్యక్రమం మొదలవడానికి ముందే బాత్రూమ్‌కి వెళ్లడంలాంటి పనులను ముగించుకోండి. మీ సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, అలా చేస్తే కార్యక్రమం జరిగేటప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు వంటివాటి వల్ల మీ దృష్టి మళ్లదు, ఇతరులకు మెసేజ్‌లు పంపాలనే ఆలోచనలు తగ్గుతాయి. ఒకవేళ మీ ఫోన్ ఆన్‌చేసి ఉంచాల్సి వస్తే, ఫోన్లు వచ్చినా ఇతరుల ఏకాగ్రతకు భంగం కలగని విధంగా దాన్ని సెట్ చేయండి. కార్యక్రమం జరిగేటప్పుడు మీరు టాబ్లెట్ కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంటే, ఇతరుల అవధానం దాని మీదకు మళ్లని విధంగా దాన్ని వాడండి. కార్యక్రమం జరుగుతున్నప్పుడు తినడం, తాగడం లాంటివి చేయకండి. (ప్రసం. 3:1) మీ చూపు ప్రసంగీకుని మీద నిలపండి. ఆయన లేఖనం చదివినప్పుడు మీ బైబిలు తెరచి చూడండి. క్లుప్తంగా నోట్సు రాసుకోండి.
4. తమ పిల్లలు విని, నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు ఏమి చేయాలి?
4 మన పిల్లలు కూడా వినాలని, నేర్చుకోవాలని మనం కోరుకుంటాం. సామెతలు 29:15 ఇలా చెబుతుంది: “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” కాబట్టి కుటుంబంలో అందరూ ఒకేచోట కూర్చోవడం మంచిది, అలాచేస్తే పిల్లలు మాట్లాడుకుంటూనో, ఫోన్‌లో మెసేజ్‌లు పంపిస్తూనో, అటూఇటూ తిరుగుతూనో ఉండకుండా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేలా తల్లిదండ్రులు చూసుకోవచ్చు. అక్కడ చెప్పేవన్నీ విని అర్థం చేసుకునేంత వయసు వాళ్లకు లేకపోయినా, నిద్రపోకుండా, నిశ్శబ్ధంగా కూర్చోవడం మీ పిల్లలకు నేర్పించవచ్చు.
5. కార్యక్రమాన్ని పునఃసమీక్షించుకోవడం ఎందుకు ప్రయోజనకరం, అదెలా చేయవచ్చు?
5 ప్రతీరోజు కార్యక్రమం తర్వాత: మరీ ఆలస్యం చేయకుండా త్వరగా నిద్రపోయి, తగినంత విశ్రాంతి తీసుకోండి. మీరు విన్నవాటిని మననం చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ప్రతీరోజు సాయంత్రం కుటుంబమంతా కలిసి కార్యక్రమంలో విన్నవాటి గురించి కాసేపు చర్చించుకుంటే ప్రయోజనం ఉంటుంది. భోజనానికి స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్తే, మీ నోట్సు తీసుకెళ్లి మీకు బాగా నచ్చిన ఒకట్రెండు అంశాలు వాళ్లకు చెప్పవచ్చు. సమావేశం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చాక, నేర్చుకున్న విషయాలను మీ కుటుంబం ఎలా అన్వయించుకోవచ్చో మీ కుటుంబ ఆరాధనలో చర్చించండి. కొత్తగా విడుదలైన ప్రచురణలను చదవడానికి కూడా ప్రతీవారం కొంత సమయాన్ని కేటాయించవచ్చు.
6. సమావేశానికి హాజరైనంత మాత్రాన సరిపోతుందా? వివరించండి.
6 మనం ఏదైనా విందుకు వెళ్లామనుకోండి, వడ్డించిన ఆహారాన్ని తినకపోతే, జీర్ణించుకోకపోతే అక్కడకు వెళ్లి ఏం ప్రయోజనం? జిల్లా సమావేశంలో మన కోసం ఏర్పాటు చేయబోయే ఆధ్యాత్మిక విందు విషయంలో కూడా అంతే. కాబట్టి, మనమందరం సమావేశంలోని ప్రతీ భాగానికి హాజరై, శ్రద్ధగా విని, నేర్చుకున్నవాటిని అన్వయించుకుని ఆ విందు నుండి పూర్తి ప్రయోజనం పొందుదాం.