సక్రమంగా నడుచుకొని, మెప్పు పొందండి!
1 “వారిలో ఉన్న ప్రశాంతత నేను వేరే ఇంకెవరిలోనూ చూడలేదు.” “అలాంటి ప్రజలు మన మధ్య ఉండడం చాలా సంతోషకరమైన విషయం.” గత సంవత్సరపు జిల్లా సమావేశాలను చూసినవారి అనేక సానుకూలమైన వ్యాఖ్యానాలకు ఇవి మచ్చు తునకలు. ఒక సంస్థగా మనకున్న మంచిపేరును అవి నొక్కి చెబుతున్నాయి. (సామె. 27:2; 1 కొరిం. 4:9) చివరికి స్తుతి యెహోవాకే చెందుతుంది. (మత్త. 5:16) దేవుడ్ని స్తుతించడానికి మరొక అద్భుతమైన అవకాశం ఈ సంవత్సరపు “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే జిల్లా సమావేశం రూపంలో ఇప్పుడు మనముందుంది.
2 సమావేశాల్లో మన ప్రవర్తన మంచిగా ఉండాలని ప్రతి సంవత్సరం మనకు దయాపూర్వకంగా జ్ఞాపికలు ఇవ్వబడుతున్నాయి. ఎందుకు? ఎందుకంటే ఈ లోకపు వైఖరి, వస్త్రాలంకరణలతోపాటు ప్రవర్తన కూడా రోజురోజుకూ చెడిపోతుంటే, మనం వారిలాగే ప్రవర్తించాలని కోరుకోము. మనం మన మంచిపేరుపై మచ్చ పడాలని కోరుకోము. (ఎఫె. 2:2; 4:17) కాబట్టి, ఇక్కడ ఇవ్వబడిన జాగ్రత్తలను మనం మనసులో ఉంచుకుందాం.
3 హోటళ్ళలో సక్రమంగా నడుచుకోండి: మనం నిజాయితీ గలవారమని అందరికీ తెలుసు. (హెబ్రీ. 13:18) కాబట్టి, మనముంటున్న హోటల్ రూములో ఎంతమంది ఉంటున్నారనే విషయంలో సత్యవంతంగా ఉండాలి. గదిలో వంట చేయడానికి అనుమతి లేకపోతే వంట చేయకూడదు. యెహోవాసాక్షులు దిగే గదుల్లోంచి తువాళ్ళు పోయేవికావు కాబట్టి వారి కోసం రూముల అద్దె తగ్గించగలిగానని ఒక మేనేజరు వ్యాఖ్యానించాడు. ఆ హోటల్ ప్రాపర్టీ చక్కగా చూసుకోబడుతుందని ఆయనకు తెలుసు. మనం హోటల్నుండి “జ్ఞాపక చిహ్నాలను” (సావనీర్లను) నిశ్చయంగా తీసుకోము. బదులుగా, వారు మనకు చేసిన సేవలకు మెప్పుదలను చూపించడానికి, టిప్స్ ఇవ్వడం మామూలైన చోట తగిన టిప్స్ ఇస్తాము. హోటల్ వాళ్ళతో అన్ని సందర్భాల్లోనూ మర్యాదగానూ సహనంతోనూ వ్యవహరిస్తాము.
4 మన పిల్లలు మర్యాదగా, విధేయతగా ప్రవర్తించడాన్ని చూసినవారు ముగ్ధులయ్యారు. (ఎఫె. 6:1, 2) తల్లిదండ్రులారా, మీ పిల్లలు స్విమ్మింగ్పూల్నుగానీ లేక ఇతర రిక్రియేషనల్ సదుపాయాలనుగానీ ఉపయోగించేటప్పుడు వారు ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేలా దయచేసి పర్యవేక్షించండి. తలుపులను గట్టిగా వేయకూడదు లేక పెద్దగా శబ్దాలు చేయకూడదు ప్రత్యేకంగా రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అలా అస్సలు చేయకూడదు.
5 అదే హోటల్లో దిగిన సాక్షేతరుల గురించి ఆలోచించడం ద్వారాకూడా మనం సక్రమంగా నడుచుకోవచ్చు. సమావేశానికి వచ్చిన కొందరు తమ కూలర్ బ్యాగులను నింపుకోవడానికి హోటల్లో ఉండే ఐస్ మిషిన్లోనుండి మొత్తం ఐసును తీసుకునేవారని కొన్ని హోటల్లు ఫిర్యాదు చేశాయి. అదే విధంగా, కొన్ని హోటల్లలో ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహార పదార్థాలను లేక కాఫీని తర్వాత ఉపయోగం కోసం తమ కంటేనర్లను నింపుకోకూడదు. హోటలు కార్యాచరణ విధానాలు మనకు వర్తించవని భావించకూడదు.
6 సమావేశ స్థలంలో సక్రమంగా నడుచుకోండి: కొందరు సహోదరులు అటెండెంట్లతో సహకరించడానికి నిరాకరించడమేకాక వారితో క్రైస్తవ విరుద్ధమైన రీతిలో ప్రవర్తించినట్లు గమనించబడింది. వాహనాల పార్కింగ్ విషయంలో సహోదరులిచ్చే సూచనలను పాటించకుండా చట్టబద్ధంగా వాహనాలను పార్కు చేయడానికి అనుమతిలేని చోట పార్కు చేయడం వల్ల, కొందరు సహోదరుల కార్లను ట్రాఫిక్ పోలీసులు లాక్కు వెళ్ళారు. నేనే-ముందు అనే వైఖరి, ఒక వ్యక్తికి సక్రమంగా ప్రవర్తించేవాడన్న గుర్తింపునూ ఇవ్వదు, యెహోవా దేవునికి మెప్పునూ తీసుకురాదు. కాబట్టి, మనం ప్రేమపూర్వకంగా, సహనంతో సహకరించుదాం.—గల. 5:22, 23, 25.
7 సమావేశపు హాలు తలుపులు ఉదయం 8 గంటలకు తెరవగానే, కొందరు సహోదర సహోదరీలు ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటూ “మంచి” సీట్ల కోసం పరుగెత్తడం కనబడింది. అలాంటి ప్రవర్తనవల్ల కొందరికి గాయాలయినట్లు తెలిసింది. మధ్యాహ్నం కోసం అల్పాహారాన్ని తెచ్చుకొమ్మని మనకు సూచించబడింది, పెద్ద విందును ఏర్పాటు చేయడం సరైనది కాదు. చూసేవారికి అది వినోదయాత్రలకు లేక పిక్నికులకు వెళ్ళినప్పుడు చేసుకునేలాంటి పార్టీయో లేక విందు భోజనపు ఫంక్షనో అని అపార్థం చేసుకునే అవకాశాన్నిస్తుంది.
8 వస్త్రధారణ, కేశాలంకరణ విషయంలో సక్రమంగా నడుచుకోండి: గత సంవత్సరంలో జరిగిన ఒక జిల్లా సమావేశం తర్వాత, ఒక మెట్రొపోలిటన్ దినపత్రిక ఎడిటర్ ఇలా వ్రాశాడు: “అన్నింటికంటే, యెహోవాసాక్షుల ప్రవర్తన ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అంతమంది గౌరవ మర్యాదలతో ప్రవర్తించే తీరు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ సమావేశపు హాల్లోని జనప్రవాహంలో వందలాది కుటుంబాలు ఆదివారం నాడు ధరించుకొనే మంచి డ్రెస్సులు, తమ తమ జాతీయ నేపథ్యాలకు ప్రతీకగా ఉంటాయి. వారి ప్రవర్తన బహిరంగ స్థలాల్లో సమకూడే ప్రజల ప్రవర్తనకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి, సాక్షులు సాధారణంగా ఉండే ఎన్నో జనసమూహాలకు చాలా భిన్నంగా ఉంటారు. నేడు ప్రజల్లో దురుసు ప్రవర్తన సర్వసాధారణమైపోయింది. . . . కానీ సాక్షుల సమూహం నిజంగా ఉపశమనమిచ్చేదిగా ఉంటుంది.” మనం మన వస్త్రధారణ, కేశాలంకరణ ద్వారాగానీ, మన ప్రవర్తన ద్వారాగానీ ఎట్టి విధంగానూ సమావేశపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అగౌరవపరచడానికి అవకాశమివ్వకుండా ఉందాం.—ఫిలి. 1:10; 1 తిమో. 2:9, 10.
9 బాప్తిస్మ సందర్భంలో సక్రమంగా నడుచుకోండి: బాప్తిస్మం తీసుకునేవారు ఈ సందర్భంలో అత్యంత గౌరవంతో ప్రవర్తించాలని కోరుకుంటారు. యోగ్యమైన దుస్తులను ధరించడంవల్ల, ఆ సందర్భానికున్న పవిత్రతకు మనం గౌరవాన్ని చూపించిన వాళ్ళమవుతాం. దీని గురించి, బైబిలు అధ్యయనం చేసేవారు వారి విద్యార్థులతో సమావేశానికి హాజరు కావడానికి ముందుగా ఏప్రిల్ 1, 1995, కావలికోటలోని “పాఠకుల ప్రశ్నలు” పరిశీలించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
10 మన సక్రమమైన దైవిక ప్రవర్తన, మన క్రైస్తవ నమ్మకాలను ధ్రువీకరించి, యథార్థహృదయులు సత్యాన్ని గుర్తించడానికి సులభతరం చేస్తుంది. కాబట్టి, “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశానికి హాజరైనప్పుడు ‘సక్రమంగా నడుచుకొని’ మెప్పు పొందండి.—రోమా. 13:3, ఈజీ-టు-రీడ్ వర్షన్.