‘ప్రయాసపడవలసిన పాటుపడవలసిన’ సమయం ఏప్రిల్ నెల
1 జ్ఞాపకార్థ దినం దగ్గరపడుతున్న వారాలు, యెహోవా ప్రజలు ధ్యానించే వారాలు. క్రీస్తు మరణం ద్వారా సాధ్యమైన దానిని గురించి, యేసు చిందించిన రక్తం ద్వారా దైవదత్త నిరీక్షణ సాధ్యమవ్వడాన్ని గురించి ఆలోచించేందుకు ఇది సమయం. గత సంవత్సరం ఏప్రిల్ 19 గురించి ఆలోచిస్తే మీకు ఏమి గుర్తుకు వస్తుంది? ఆ రోజు సాయంకాలం మీరు చూసిన వ్యక్తులు మీకు గుర్తున్నారా? జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో నెలకొన్న ఉన్నత ఆధ్యాత్మిక వాతావరణం గుర్తుకు వస్తుందా? గంభీరమైన బైబిలు చర్చా, హృదయపూర్వక ప్రార్థనా గుర్తుకు వస్తున్నాయా? యెహోవా, యేసూ మీ మీద చూపించిన ప్రేమకు మీకెంత కృతజ్ఞతా భావం ఉందన్నది మరింత పరిపూర్ణంగా ప్రదర్శించాలని మీరు గట్టి నిర్ణయం చేసుకుని ఉంటారు. ఆ విషయాలను ధ్యానించడం మీపై ఇప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
2 యెహోవా ప్రజలు చూపించే కృతజ్ఞత, మాటలను మించిపోతుందన్నది స్పష్టమవుతుంది. (కొలొ. 3:15, 17) ముఖ్యంగా గత ఏప్రిల్‌లో, మనం క్రైస్తవ పరిచర్యను మరింత విస్తృతంగా చేయడం ద్వారా రక్షణ కోసం యెహోవా చేసిన ఏర్పాట్ల విషయమై మనకున్న మెప్పుదలను చూపించడానికి ప్రయత్నించాము. ఇండియాలో సహాయ పయినీర్లు వందలుగా పెరిగారు. అలా వారి సంఖ్య మునుపటి శిఖరాగ్రాని కన్నా 34 శాతం పెరిగింది. మిగతా రాజ్య ప్రచారకుల కృషితో పాటు వాళ్ళు చేసిన ప్రయత్నాల వల్ల గంటల సంఖ్యా, అందించిన పత్రికల సంఖ్యా, చేసిన పునర్దర్శనాల సంఖ్యా క్రొత్త శిఖరాగ్రాలకు చేరుకున్నాయి. వేల కొలది క్రొత్త బైబిలు అధ్యయనాలు మొదలవ్వడాన్నీ, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారి సంఖ్య క్రొత్త శిఖరాగ్రాన్ని చేరుకోవడాన్నీ చూసినప్పుడు మనకు మరింత ఆనందం కలిగింది!
3 మన నిరీక్షణను గురించి మనకున్న నిశ్చయత మనం క్రియాశీలురమయ్యేందుకు మనలను పురికొల్పుతుంది. అదే విధంగా, “మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—1 తిమోతి 4:10.
4 జీవం కోసం యెహోవా చేసిన ఏర్పాట్ల మీద మీకున్న విశ్వాసాన్ని ఈ జ్ఞాపకార్థ కాలంలో మీరెలా ప్రదర్శిస్తారు? గత ఏప్రిల్‌లో, ఇండియాలో రికార్డు చేయబడిన రాజ్యప్రచారకుల సంఖ్యలో రెండవ శిఖరాగ్ర సంఖ్యను చూశాము. ఈ ఏప్రిల్‌లో మనం దానిని మించిపోగలమా? అది మనకు సాధ్యమయ్యే పనే. ప్రతి ప్రచారకుడూ, బాప్తిస్మం పొందినవారైనా పొందనివారైనా సరే, పరిచర్యలో పాల్గొనవలసిన అవసరం ఉంది. చాలామంది క్రొత్తవాళ్ళు కూడా పాల్గొనడానికి యోగ్యులు కావచ్చు. కాబట్టి, మీరు ఏప్రిల్‌లో ప్రయాసపడేందుకు పాటుపడేందుకు పథకాలు వేస్తుండగా, క్రొత్తవాళ్ళూ, ఎక్కువ అనుభవం లేనివాళ్ళతో సహా ఇతరులూ మీతోపాటు వచ్చేందుకు మీరు వాళ్ళను పురికొల్పగల మార్గాలను గురించి ఆలోచించండి.
5 మళ్ళీ క్రియాశీలురయ్యేందుకు కొందరికి సహాయపడడం: ఎవరైనా ఒకటి రెండు నెలలుగా క్షేత్రసేవలో పాల్గొనడం లేదని మీకు తెలిస్తే, మీరు వారిని ప్రోత్సహించి మీతోపాటు క్షేత్రసేవకు రమ్మని వారిని ఆహ్వానించవచ్చు. సంఘంలోని కొందరు నిష్క్రియులుగా మారినట్లయితే, పెద్దలు వారిని సందర్శించి, ఏప్రిల్‌లో మళ్ళీ పరిచర్య ప్రారంభించమని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేస్తారు.
6 యెహోవా సేవలో మనలను బలపరచేందుకు ఆయన ఆత్మను ఇవ్వమని మనమందరమూ తప్పనిసరిగా అడుగుతూ ఉండాలి. (లూకా 11:13) ఆ ఆత్మను పొందాలంటే మనం తప్పనిసరిగా ఏమి చేయాలి? దైవ ప్రేరేపిత వాక్యాన్ని చదవాలి. (2 తిమో. 3:16, 17) అంతేగాక, వారపు ఐదు కూటాలకూ హాజరవ్వడం ద్వారా “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట”ను మనం తప్పనిసరిగా ‘వినాలి.’ (ప్రక. 3:6) పరిచర్యలో క్రమంగా పాల్గొననివారూ, నిష్క్రియులైనవారూ తమ అధ్యయన అలవాట్లను మెరుగుపరచుకునేలా, కూటాలకు క్రమంగా హాజరయ్యే అలవాటును పెంపొందించుకునేలా సహాయం చేయడానికి ఇదే అనుకూలమైన సమయం. (కీర్త. 50:23) ఒకవైపు మనం మన సొంత ఆధ్యాత్మిక క్షేమాన్ని గురించి కనిపెట్టుకుంటూనే దీన్ని చేస్తాము. అయితే, మరొకటి కూడా అవసరము.
7 “దేవుడు తనకు విధేయులైన వారికి” తన పరిశుద్ధాత్మను ఇస్తాడని అపొస్తలుడైన పేతురు వివరిస్తున్నాడు. (అపొ. 5:32) ఆ విధేయతలో, “ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలె”నన్న ఆజ్ఞను అనుసరించడం కూడా ఇమిడి ఉంది. (అపొ. 1:8; 10:42) మనం ప్రకటించేలా మనలను బలపరచేందుకు మనకు దేవుని ఆత్మ అవసరమన్నది నిజం. అయితే, యెహోవాను ప్రీతిపరచాలన్న మన కోరికను మనం ప్రదర్శించనారంభించినప్పుడు, ఆయన ఇంకా ఎక్కువగా మనకు సహాయం చేస్తాడన్నది కూడా నిజమే. ఇష్టపూర్వకంగా విధేయతను చూపడంలో తొలి చర్యలను చేపట్టవలసిన ప్రాముఖ్యతను తక్కువగా ఎంచకుండా ఉందాం!
8 పిల్లలకు సహాయపడడం: తల్లిదండ్రులారా, మీ పిల్లలు సత్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడాలని కోరుకుంటున్నారనే దానికి ఏదైనా రుజువును చూశారా? వాళ్ళు మీతోపాటు క్షేత్రసేవకు వస్తున్నారా? వాళ్ళు తమ ప్రవర్తనలో మాదిరికరంగా ఉన్నారా? అలాగైతే, ఇక వెనుకంజవేయడమెందుకు? ఈ ఏప్రిల్ నెలలో ప్రచారకుడుగా ఎంచబడే యోగ్యత మీ పిల్లవానికుందా అన్నది సంఘ సేవా కమిటీలోని ఒక సభ్యుడ్ని సంప్రదించి నిర్ధారించుకోండి. (మన పరిచర్య పుస్తకం, 99-100 పేజీలు చూడండి.) ఈ జ్ఞాపకార్థ కాలంలో, యెహోవాకు బిగ్గరగా స్తుతులు చెల్లించడంలో మీ పిల్లలు కూడా గట్టి తోడ్పాటునివ్వగలరని గుర్తించండి.—మత్త. 21:15, 16.
9 అమెరికాలోని, జార్జియాలో ఒక క్రైస్తవ తల్లి, యెహోవా గురించి ఇతరులతో మాట్లాడమని తన చిన్నారిని ఎప్పుడూ ప్రోత్సహించేది. గత సంవత్సరం, ఆ పాప తన తల్లితోపాటు పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ని ఇచ్చి, విషయ సూచికను క్లుప్తంగా వివరించింది. “నీకు ఎన్నేళ్ళు?” అని ఆయన ఆ పాపను అడిగారు. “ఏడేళ్ళు” అని పాప జవాబు చెప్పింది. ఆ పాప అంత అర్థవంతంగా మాట్లాడ్డాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆయనెందుకంత ఆశ్చర్యపోయారంటే, ఆయన చిన్నప్పుడు సాక్షులతో సహవసించినప్పటికీ, సత్యాన్ని అనుసరించడాన్ని ఒక జీవన శైలిగా చేసుకోవలసినంత గంభీరమైనదిగా ఆయన దృష్టించలేదు. త్వరలోనే ఆయనతోను, ఆయన భార్యతోను, కూతురుతోను బైబిలు అధ్యయనం మొదలయ్యింది.
10 చాలామంది యౌవనస్థులు ఇప్పటికే ప్రచారకులుగా ఉన్నారు, వాళ్ళు మనతో పాటు వచ్చి క్షేత్రసేవ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ సహచర్యాన్ని ఆనందిస్తాం. ఈ యౌవనస్థులు తమ తోటి వయస్కులను పురికొల్పి ప్రోత్సహించగలరు. అయితే, ప్రతి కుటుంబమూ, తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలను మరింత దృఢపరచుకునేందుకూ, పవిత్ర సేవలో కలిసి పని చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఒకరినొకరు బలపరచుకునేందుకూ కూడా ఏప్రిల్ చాలా చక్కని సమయం. ఈ విషయంలో కుటుంబ శిరస్సులు నాయకత్వం వహించాలి.—సామె. 24:27.
11 క్రొత్తవాళ్ళకు సహాయపడడం: మీరు బైబిలు అధ్యయనం చేస్తున్న క్రొత్తవారి విషయమేమిటి? ఈ ఏప్రిల్ నెలలో చేసే ప్రత్యేక ప్రయత్నానికి వారు తోడ్పాటునివ్వగల్గుతారా? జ్ఞానము పుస్తకం 2వ అధ్యాయం 22వ పేరాను, లేదా 11వ అధ్యాయం 14వ పేరాను మీరు చర్చిస్తున్నప్పుడు, తాము నేర్చుకుంటున్న విషయాలను ఇతరులకు చెప్పాలన్న కోరికను బహుశా వారు తెలిపివుండవచ్చు. మీరు ఈ పుస్తకాన్ని పూర్తిచేయబోతున్నట్లయితే, 18వ అధ్యాయంలో, “బహుశా మీరు నేర్చుకుంటున్నదాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చెప్పాలని మీకు ఆసక్తి ఉండవచ్చు. వాస్తవానికి, మీరు ఇప్పటికే ఈ పనిని చేస్తుండవచ్చు, యేసు కూడా అలాగే తటస్థంగా సువార్తను ఇతరులతో పంచుకున్నాడు. (లూకా 10:38, 39; యోహా. 4:6-15) ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఇష్టం ఉండవచ్చు” అని చెబుతున్న 8వ పేరాను చర్చిస్తున్నప్పుడు, ఈ విషయాన్ని స్పష్టంగా చర్చించడానికి సిద్ధంగా ఉండండి. మీరు అధ్యయనం చేస్తున్నవారి విషయంలో కూడా ఇది నిజమా?
12 మీ విద్యార్థి దేవుని వాక్యాన్ని నమ్ముతారా? ఆయన బైబిలు సూత్రాలను ఆచరణలో పెడుతున్నారా? ఆయన తన జీవితాన్ని దైవిక ప్రమాణాలకు అనుగుణ్యంగా మార్చుకున్నారా? ఆయన సంఘ కూటాలకు హాజరవుతున్నారా? ఆయన యెహోవా దేవుని సేవ చేయాలని కోరుకుంటున్నారా? అలాగైతే, ఆయన బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడయ్యేందుకూ, ఏప్రిల్‌లో మీతో పాటు పనిచేసేందుకూ యోగ్యుడేనా అన్నది నిర్ణయించేందుకు పెద్దలతో మాట్లాడమని ఆయనను ఎందుకు ప్రోత్సహించకూడదు? (మన పరిచర్య అనే పుస్తకం 97-9 పేజీలు చూడండి.) యెహోవా సేవచేసేందుకు ఆయన చేసే ప్రయత్నాలకు యెహోవా సంస్థ ఎలా మద్దతునిస్తుందన్నది ఆయన ఈ విధంగా అనుభవపూర్వకంగా స్వయంగా చూడగల్గుతాడు.
13 నిజమే కొందరు విద్యార్థులు ఇతరులకన్నా వేగంగా ప్రగతిని సాధిస్తారు. మన రాజ్య పరిచర్య, జూన్ 2000, 4వ పేజీ, 5, 6 పేరాల్లో ఉన్న నిర్దేశానికి అనుగుణ్యంగా, మొదట్లో ఆసక్తిని చూపించినా, మనతో క్రియాశీలంగా సహవసించేందుకు అదనపు సహాయం అవసరమున్న వారితో అనేకమంది ప్రచారకులు రెండవ పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నారు. యథార్థ హృదయులైన వీరు “కొద్దికాలములోనో దీర్ఘకాలములోనో” క్రీస్తు నిజ శిష్యులుగా తయారౌతారనే ఆశను వదిలిపెట్టుకోవద్దు. (అపొ. 26:29, NW) అయితే, అలాంటి వ్యక్తులతో మీరు అధ్యయనం చేసిన నెలలను “దీర్ఘకాలము” అని చెప్పగల్గేటట్లయితే, ఆ వ్యక్తులు, క్రీస్తు విమోచన క్రయధన బలి మీద తమకెంత మెప్పుదల ఉందో చూపేందుకు ఈ జ్ఞాపకార్థ కాలం మంచి అవకాశం కావచ్చునా?
14 సేవలో పాల్గొనేందుకు వారికెలా సహాయపడవచ్చు? యోగ్యులైనవారు పరిచర్య చేయడానికి బయలుదేరేలా వాళ్ళకు సహాయపడడమెలాగన్నది, యేసు ఇతరులకు ఎలా తర్ఫీదిచ్చాడో పరిశీలించడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. యేసు, ఏదో ఒక గుంపు ప్రజలను కనుగొని, వారితో మాట్లాడడం మొదలుపెట్టమని తన అపొస్తలులకు చెప్పలేదు. ఆయన మొదట, ప్రకటనా పని యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాడు. ప్రార్థనాపూర్వకమైన దృక్పథం ఉండాలి అని ప్రోత్సహించాడు, ఆ తర్వాత, ఆయన వారికి మూడు ప్రాథమిక విషయాలను ఏర్పాటు చేశాడు. అవేంటంటే, భాగస్వామి, టెరిటరీ నియామకం, సందేశము. (మత్త. 9:35-38; 10:5-7; మార్కు 6:7; లూకా 9:2, 6) మీరు కూడా అలా చేయవచ్చు. మీరు మీ సొంత బిడ్డకే సహాయపడుతున్నా, క్రొత్త విద్యార్థికి లేదా కొంతకాలంగా రిపోర్టు ఇవ్వకుండా నిష్క్రియంగా ఉన్న ఒకరికి సహాయపడుతున్నా, ఈ క్రింది లక్ష్యాలను చేపట్టేందుకు కొన్ని ప్రత్యేక ప్రయత్నాలను చేయడం సముచితంగా ఉంటుంది.
15 అవసరాన్ని నొక్కి చెప్పండి: ప్రకటనా పని యొక్క ప్రాముఖ్యతను ఆ వ్యక్తి గ్రహించేలా చేయండి. ప్రకటనా పని విషయమై ఉత్సాహాన్ని చూపండి. పరిచర్యలో సంఘం ఏయే కార్యాలను సాధిస్తుందో చూపే అనుభవాలను చెప్పండి. మత్తయి 9:36-38లో యేసు వ్యక్తీకరించిన స్ఫూర్తిని ప్రదర్శించండి. భావి ప్రచారకుడ్ని లేదా నిష్క్రియంగా ఉన్న వ్యక్తిని, పరిచర్యలో తాను వ్యక్తిగతంగా పాల్గొనడాన్ని గురించీ, ప్రపంచవ్యాప్తంగా ఈ పని సఫలమవ్వడాన్ని గురించీ ప్రార్థించమని ప్రోత్సహించండి.
16 సాక్ష్యమివ్వగల అనేక అవకాశాల గురించి ఆలోచించమని ప్రోత్సహించండి: ఇంటింటా సాక్ష్యమివ్వడానికి పుస్తక అధ్యయన గుంపుతో కలవవచ్చని పేర్కొనండి. బంధువులతోను పరిచయస్థులతోను సంభాషించడాన్ని గురించి, లేదా మధ్యాహ్న భోజన సమయాల్లో తోటి ఉద్యోగస్థులతో, లేక తోటి విద్యార్థులతో మాట్లాడడాన్ని గురించి చర్చించండి. ప్రజా రవాణాల్లో ప్రయాణం చేసేటప్పుడు, తోటి ప్రయాణికుల మీద ఆసక్తి చూపించడం ద్వారా సంభాషణను ఆరంభించవచ్చు. మనం చొరవ తీసుకున్నప్పుడు తరచూ చక్కని సాక్ష్యమిచ్చే అవకాశం లభిస్తుంది. మన నిరీక్షణను గురించి “అనుదినము” ఇతరులతో పంచుకోగల సందర్భాలు నిజంగా చాలా ఉన్నాయి.—కీర్త. 96:2, 3.
17 అయితే, సాధ్యమైనంత త్వరలో, ఇంటింటికి సాక్ష్యమిచ్చే పనిలో, మీరూ క్రొత్త ప్రచారకుడూ కలిసి పనిచేయడం అభిలషణీయం. ఏప్రిల్ నెలలో మీరు మరెక్కువ సేవ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటే, అందుకు సౌకర్యంగా ఉండే టెరిటరీ ఏమైనా దొరుకుతుందేమో టెరిటరీ సేవకుడ్ని అడగండి. అలాగైతే, మీరు ఆ ప్రాంతంలో పరిపూర్ణంగా సేవ చేసే అవకాశముంటుంది. ఉదాహరణకు, మీరు సేవ ముగిస్తుండగా లేక కూటాలకు గానీ మరితర ప్రాంతాలకు గానీ ప్రయాణం చేస్తుండగా, మునుపు ఎవరూ కనిపించని ఇంటిలో ఇప్పుడు మనుషులుండడంగానీ, మునుపు ఆసక్తి చూపినవారుండడం గానీ మీరు గమనించవచ్చు. సముచితంగా అనిపిస్తే, ప్రభావవంతంగా ఉండే సమయంలో అక్కడికి వెళ్ళి క్లుప్తంగా మాట్లాడండి. అలా చేయడం వల్ల, పరిచర్యను పరిపూర్ణంగా చేశానన్న భావనా, ఆనందమూ కలుగుతాయి.
18 ఆకర్షణీయంగా ఉండే ఒక సందేశాన్ని సిద్ధం చేసుకోండి: రాజ్య సందేశాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం ఒక విషయమైతే, దాన్ని తాను సమర్థవంతంగా పంచుకోగలనన్న నమ్మకాన్ని కలిగివుండడం మరొక విషయం. ముఖ్యంగా ఆయన క్రొత్తవాడూ, లేదా చాలాకాలంగా సేవలో పాల్గొననివాడూ అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సందేశాన్ని సిద్ధం చేసుకోవడానికి క్రొత్తవారికీ నిష్క్రియులైనవారికీ సహాయపడేందుకు వెచ్చించే సమయం ఎంతమాత్రం వ్యర్థం కాదు. సేవా కూటాలు, క్షేత్రసేవ కోసమైన కూటాలు సహాయకరమైన ఆలోచనలను ఇస్తాయి. కానీ, వ్యక్తిగత సిద్ధపాటుకు మాత్రం ప్రత్యామ్నాయం లేదు.
19 క్రొత్తవాళ్ళు సేవ కోసం సిద్ధమయ్యేందుకు మీరెలా సహాయపడగలరు? పత్రికా అందింపుతో మొదలుపెట్టండి, చాలా సరళంగా, క్లుప్తంగా ఉండేటట్లు చేయండి! వార్తల్లో తెలిసిన సంఘటనల్లో దేన్ని గురించి ఆ టెరిటరీలో ఉన్న వ్యక్తులు చింతిస్తుంటారో ఆలోచించమనండి, ఆ తర్వాత, పత్రికల్లో ఆ సంఘటనల గురించి మాట్లాడుతున్న ఒక పాయింట్‌ని కనుగొనమనండి. ఇద్దరూ కలిసి ఆ అందింపును ప్రాక్టీస్ చేసి, సాధ్యమైనంత త్వరగా పరిచర్యలో దాన్ని ఉపయోగించండి.
20 జ్ఞాపకార్థానికి క్రొత్తగా వచ్చేవాళ్ళు ప్రగతిని సాధించేందుకు సహాయపడండి: గత సంవత్సరం, ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ దిన హాజరు 148 లక్షలను దాటింది. ప్రచారకులుగా నివేదిస్తున్నవారి సంఖ్య కేవలం 60 లక్షలను దాటింది. దానర్థం, బైబిలులోని ముఖ్య బోధల్లో ఒక దాన్ని వివరించే ఈ ప్రత్యేక కార్యక్రమానికి రావడానికి దాదాపు 88లక్షల మంది ఆసక్తి చూపించారన్నమాట. అలా వచ్చిన వాళ్ళు మనలో కొందరిని వ్యక్తిగతంగా తెలుసుకోగల్గారు. ఆ పరిచయం వారికి మంచి అభిప్రాయాన్ని కలిగించివుండవచ్చు. వాళ్ళలో చాలామంది మన గురించి గొప్పగా మాట్లాడతారు, మన ప్రపంచవ్యాప్త పనికి విరాళాలనిస్తారు. ఇతరుల ముందు మనలను సమర్థిస్తారు. ఈ పెద్ద గుంపు, భవిష్యత్తులో ప్రచారకుల సంఖ్య పెరిగే సాధ్యతను చూపిస్తుంది. వాళ్ళు మరింత ప్రగతిని సాధించేందుకు మనమెలా సహాయపడగలం?
21 జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే క్రొత్తవాళ్ళలో ఎక్కువమంది మనలో ఎవరో ఒకరు వ్యక్తిగతంగా ఆహ్వానిస్తేనే హాజరవుతారు. దానర్థం, సాధారణంగా, ప్రేక్షకుల్లో కనీసం ఒకరు వాళ్ళకు పరిచయమున్న వారన్నమాట. ఎవరైనా మన ఆహ్వానానికి ప్రతిస్పందించి వస్తే, ఆయన వచ్చినప్పుడు, తాను స్వాగతించబడినట్లు అనుభూతి పొందేలా, కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా చూసే బాధ్యత మనకుంది. హాల్ అంతా క్రిక్కిరిసి ఉంటుంది కనుక, ఆయనకు ఒక సీటు చూసి పెట్టండి. ఆయనకు ఒక బైబిలును ఇవ్వండి, మీ పాటల పుస్తకాన్ని మీతోపాటు చూసి పాడమని ఆహ్వానించండి. ఆయన ప్రశ్నలేమైనా అడిగితే జవాబివ్వండి. మీరు ఆప్యాయంగా వ్యక్తిగత శ్రద్ధ చూపించడం ఆయనలో ఆసక్తిని రేకెత్తించడానికి ముఖ్య కారకం కాగలదు. నిజమే, మనకందరికీ ఈ బాధ్యత ఉంది. మనకు పరిచయంలేని ఎవరైనా కనబడితే, ఆప్యాయంగా ఆహ్వానించాలి, పరిచయం చేసుకునేందుకు క్లుప్తంగా సంభాషించాలి.
22 జ్ఞాపకార్థానికి హాజరవ్వడం ఒక వ్యక్తి తలంపులపై నిజమైన ప్రభావాన్ని చూపగలదు. ఆయన కూటానికి రావడం, ఆయన వెదుకుతున్నది మరెక్కడా కనిపించలేదనీ, మనమాయనకు ప్రతిపాదించిన దాన్ని మరింత సునిశితంగా పరిశీలించవలసిన అవసరమున్నదని ఆయన భావిస్తున్నాడనీ సూచిస్తుండవచ్చు. అవధుల్లేని యెహోవా ప్రేమ గురించి ఏమీ తెలియని వ్యక్తికి, అద్భుతమైన విమోచనా ఏర్పాటును గురించిన వివరణ దివ్య జ్ఞానోదయాన్ని కలిగించివుండవచ్చు. మనం భిన్నమైనవారమని, కపటంలేనివారమని స్నేహశీలురమని ప్రేమగలవారమని గౌరవంచూపేవారమని ఆయన వెంటనే గ్రహించివుండవచ్చు. చర్చీల్లో విగ్రహాలను గానీ అర్థరహితమైన మతకర్మలను గానీ ఆయన చూసి ఉండవచ్చు. ఆ చర్చీలకూ మన హాల్కీ ఎలాంటి పోలికా లేదని ఆయన గమనించవచ్చు. ప్రేక్షకుల్లో అన్ని రకాల ప్రజలూ ఉన్నారనీ, చందా సేకరణ లేదనీ క్రొత్తవాళ్ళు తప్పకుండా గమనిస్తారు. ఇవన్నీ చూడడం, వాళ్ళు మళ్ళీ వచ్చేందుకు శక్తివంతమైన ప్రేరణ కాగలదు.
23 క్రొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ, జ్ఞాపకార్థం తర్వాత తిరిగి వచ్చేలా సహాయం చేసేందుకు ఎవరో ఒకరు అప్రమత్తంగా ఉండాలి. మీరు క్రొత్తవాళ్ళను ఆహ్వానించినట్లయితే, మీకు ప్రత్యేక బాధ్యత ఉంది. వాళ్ళు వెళ్ళిపోక ముందు, రాజ్యమందిరంలో జరిగే ఇతర కూటాల గురించి తెలియజేయండి. తర్వాతి బహిరంగ ప్రసంగ అంశాన్ని పేర్కొనండి. వాళ్ళ ఇంటికి సమీపంలో సంఘ పుస్తక అధ్యయనం ఎక్కడ ఏ సమయంలో జరుగుతుందో వారికి తెలపండి. తర్వాత, ఇదిగో! సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అనే బ్రోషూర్‌ను వారికిచ్చి, ఏప్రిల్ 30న ఆరంభమయ్యే వారంలో “యెహోవా సృష్టి మరియు అద్భుతములు” అనే శీర్షిక నుండి “జీవమునకు పునరుద్ధరింపబడుట” అనే శీర్షిక వరకు చర్చించబడుతుందని తెలపండి. త్వరలో జరగనున్న ప్రాంతీయ సమావేశానికి, లేదా ప్రత్యేక సమావేశ దినానికి సంఘమంతా ఎందుకు హాజరు కావాలనుకుంటుందో వివరించండి.
24 వాళ్ళ ఇంటిని స్నేహపూర్వకంగా సందర్శించే ఏర్పాటు చేయండి. వాళ్ళకు ప్రాథమిక బైబిలు బోధలను పరిచయం చేసే దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్, జ్ఞానము పుస్తకము ఉండేలా చూడండి. వాళ్ళు ఇప్పటికీ అధ్యయనం మొదలుపెట్టకపోతే, ఒక బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి. యెహోవాసాక్షులు బ్రోషూర్‌ని చదవమని వారికి సూచించండి. మనం ఒక సంస్థగా ఎలా పనిచేస్తున్నామన్నది ఆ బ్రోషూర్ స్పష్టంగా చూపిస్తుంది. అవర్ హోల్ అసోసియేషన్ ఆఫ్ బ్రదర్స్ వంటి మన వీడియోలను చూసేందుకు వారిని ఆహ్వానించండి. సంఘంలోని ఇతరులు వాళ్ళను కలిసే ఏర్పాట్లను చేయండి. రానున్న నెలల్లో కూడా క్రొత్తవాళ్ళను కలుస్తూ ఉండండి; ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శించేటప్పటి కూటాలకు గానీ, జిల్లా సమావేశం ఉన్నప్పుడు దానికి హాజరయ్యేందుకు గానీ వారిని ఆహ్వానించండి. “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వార”మని తమను తాము నిరూపించుకునేందుకు వారికి అవకాశమివ్వండి.—అపొ. 13:48.
25 పెద్దలు ఏమి చేయగలరు? ఈ ఏప్రిల్ నెలలో పరిచర్యలో తీవ్రంగా కృషి చేయడంలో సంఘం సఫలమవ్వడం, ఎక్కువగా పెద్దల మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు పుస్తక అధ్యయన నిర్వహణకర్త అయితే, ఈ ప్రత్యేక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మీ పుస్తక అధ్యయన గుంపులోని ప్రతి ఒక్కరికీ సహాయపడేందుకు మీరు చేయగల విషయాల లిస్టును తయారు చేసుకోండి. మీకు నియమించబడిన గుంపులో యౌవనస్థులుగానీ, క్రొత్తవాళ్ళు గానీ, పరిచర్యలో అంత క్రమంగా పాల్గొనని వాళ్ళు గానీ, నిష్క్రియులు గానీ ఉన్నారా? వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు గానీ, పయినీర్లు గానీ, ఇతర ప్రచారకులు గానీ చొరవ తీసుకున్నారేమో అడిగి తెలుసుకోండి. మీరు స్వయంగా చేయగల ఏ సహాయాన్నైనా చేయండి. దాదాపు రెండు సంవత్సరాలుగా క్షేత్రసేవలో అంత క్రమంగా పాల్గొనని ఒక సహోదరి గత ఏప్రిల్‌లో 50 కన్నా ఎక్కువ గంటలు పరిచర్యలో గడిపింది. ఆమెలో ఇంత మార్పు ఎలా వచ్చింది? బలపరచేటటువంటి పెద్దల కాపుదల సందర్శనాలే కారణమని ఆమె చెప్పింది.
26 వచ్చే నెలలో కావలసినంత టెరిటరీ, పత్రికలూ, సాహిత్యమూ ఉండేలా పెద్దలూ, పరిచర్య సేవకులూ సహకరించుకోవాలి. క్షేత్రసేవ కోసం అదనపు కూటాలను నిర్వహించవచ్చా? అలాగైతే, ఆ ప్రత్యేక ఏర్పాట్ల గురించి సంఘంలో అందరికీ తెలియజేయండి. అంతేకాక, మీ బహిరంగ, వ్యక్తిగత ప్రార్థనల్లో రాజ్య కార్యకలాపాలను పెంచే ఈ నెలను ఆశీర్వదించమని యెహోవాను అడగండి.—రోమా. 15:30-32; 2 థెస్స. 3:1, 2.
27 ఉత్తర కరొలీనాలోని ఒక సంఘంలోని పెద్దలు, గత ఏప్రిల్‌లో పరిచర్యలో ఎక్కువగా పాల్గొనాలని అందరినీ ప్రోత్సహించారు. సహాయ పయినీరింగ్ చేయగలరేమో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని ప్రతివారం కూటాల్లో వాళ్ళు ప్రచారకులను ఆహ్వానించారు. సేవక సభలోని వారందరూ తమకు లభించిన ప్రతి అవకాశంలోను, ఏప్రిల్‌ను మునుపెన్నటికన్నా శ్రేష్ఠమైన నెలగా చేయడాన్ని గురించి ఉత్సాహంగా మాట్లాడారు. దాని ఫలితంగా, మొత్తం పెద్దలూ, పరిచర్య సేవకులతో సహా 58 శాతం మంది ప్రచారకులు ఆ నెలలో పయినీరింగ్ చేశారు!
28 పూర్తిగా భాగం వహించడంలోని ఆనందం: పరిచర్యలో ‘ప్రయాసపడి పాటుపడడం’ వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? (1 తిమో. 4:10) పైన పేర్కొన్న పెద్దలు గత ఏప్రిల్‌లో, తమ సంఘం ఆసక్తిగా చేసిన దాన్ని గురించి పేర్కొంటూ, “సహోదరులూ సహోదరీలూ క్షేత్రసేవలో తాము ఎక్కువగా చేయనారంభించినది మొదలు తమకు ఒకరి మీద ఒకరికి ఎంత ఎక్కువ ప్రేమా, సన్నిహిత భావమూ కలిగాయో తరచూ మాట్లాడుకుంటారు” అని వ్రాశారు.
29 గత ఏప్రిల్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని ఎక్కువగా నడవలేని ఒక యౌవన సహోదరుడు వాంఛించాడు. ఆయన జాగ్రత్తగా పథకం వేసుకుని, తన తల్లి, తన ఆధ్యాత్మిక సహోదర సహోదరీల సహాయంతో, సహాయ పయినీరుగా ఆ నెల అంతా సేవ చేసి ఆనందించాడు. ఆ అనుభవాన్ని గురించి ఆయన ఎలా భావిస్తున్నాడు? “నేను చాలా ఆరోగ్యవంతుడ్నని జీవితంలో మొదటిసారి అనిపించింది” అని ఆయన అన్నాడు.
30 యెహోవా రాజత్వాన్ని గురించి మాట్లాడడమనే తమకున్న ఆధిక్యతను ఎంతో విలువైనదిగా ఎంచేవారిని యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడన్న విషయంలో సందేహమేమీ లేదు. (కీర్త. 145:11, 12) మనం, ప్రభువు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరిస్తుండగా, దైవభక్తి వల్ల కలిగే ఆశీర్వాదాలు భవిష్యత్తులో ఇంకా మెండుగా ఉంటాయని అర్థం చేసుకోగలం. అపొస్తలుడైన పౌలు నిత్యజీవమనే ప్రతిఫలాన్ని అపేక్షించాడు. అయితే, ఇది తాను ఊరికే చేతులు కట్టుకుని కూర్చుని ఆశించగల విషయం కాదని ఆయనకు తెలుసు. “అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను” అని ఆయన వ్రాశాడు. (కొలొ. 1:29) ప్రాణాలను కాపాడే పరిచర్యను పూర్తి చేసేందుకు యెహోవా, యేసు ద్వారా పౌలును శక్తిమంతునిగా చేశాడు, నేడు మనలను కూడా ఆయన శక్తిమంతులను చేయగలడు. ఈ ఏప్రిల్‌లో మీకు అది అనుభవంలోకి వస్తుందా?
[3వ పేజీలోని బాక్సు]
ఏప్రిల్‌లో ప్రచురం చేసేందుకు మీరు ఎవరిని ప్రోత్సహించగలరు?
మీ బిడ్డనా?
బైబిలు విద్యార్థినా?
నిష్క్రియంగా మారిన
ఒకరినా?