‘దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి’
1 మీరు ఏదైనా మంచి బహుమానాన్ని అందుకున్నప్పుడు దానిపట్ల మీ యథార్థమైన కృతజ్ఞతను చూపించాలనుకుంటే, మీ దృక్పథం ద్వారా, మీ చర్యల ద్వారా చూపించరా? తప్పకుండా చూపిస్తారు! యెహోవా మానవజాతి పట్ల చూపించే మంచితనము, కృప గురించి అపొస్తలుడైన పౌలు ఎలా ప్రతిస్పందించాడో గమనించండి. ఆయనిలా అన్నాడు: “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.” ఆ “వరము”లో ఏమి ఇమిడి ఉంది? మన పట్ల “దేవుడు కనుపరచిన అత్యధికమైన కృప” అంతా ఇమిడి ఉంది, ఆ కృపయొక్క అత్యంత గొప్ప వ్యక్తీకరణ మన పాపాల కోసం తన స్వంత కుమారుడ్ని విమోచన క్రయధన బలిగా అర్పించడమనే వరం.—2 కొరిం. 9:14, 15; యోహా. 3:16.
2 పౌలు వ్యక్తపరచిన కృతజ్ఞత కేవలం పైపై మాటలేనా? ఎంతమాత్రం కాదు! ఆయన తన ప్రగాఢమైన కృతజ్ఞతను అనేక విధాలుగా చూపించాడు. తన తోటి క్రైస్తవుల సంక్షేమం పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉండి, వారు దేవుని కృప నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి వారికి సహాయం చేసేందుకు తాను చేయగలిగినదంతా చేయాలని కోరుకున్నాడు. అలాంటి వారి గురించి పౌలు ఇలా చెప్పాడు: “మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” (1 థెస్స. 2:8) పౌలు, సంఘంలో అప్పటికే భాగమైయున్నవారు తమ రక్షణను నిశ్చయపరచుకోవడానికి వారికి సహాయం చేయడమే గాక, ‘నిత్యజీవం పట్ల సరైన మనోవైఖరి గలవారిని’ కనుగొనడానికి నేలపైనా, సముద్రంపైనా వేలాది మైళ్ళు ప్రయాణించి, అవిరామంగా సువార్త ప్రకటించాడు. (అపొ. 13:48, NW) యెహోవా తన కోసం చేసిన దానంతటిని బట్టి పౌలుకున్న కృతజ్ఞత, ‘దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించేలా’ ఆయనను కదిలించింది.—కొలొ. 1:25.
3 యెహోవా మన కోసం చేసిన దానంతటిని బట్టి మనకున్న కృతజ్ఞత, మన సంఘంలో అవసరమైన వారికి ఆధ్యాత్మిక సహాయాన్ని అందించడానికి మనల్ని కదిలించదా? (గల. 6:10) మన ప్రాంతమంతటిలోనూ రాజ్య సువార్త ప్రకటించడంలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొనేలా మనం పురికొల్పబడడం లేదా?—మత్త. 24:14.
4 మన కృతజ్ఞతను చూపించడానికి ఒక అవకాశం: యెహోవా, యేసు మన కోసం చేసినదాని పట్ల మెప్పును చూపించడానికి ప్రతి సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ మనకు ప్రత్యేక అవకాశాన్నిస్తుంది. ఇది కేవలం ఒక కూటమో లేదా కేవలం ఒక జ్ఞాపకార్థ సంఘటనో కాదు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” యేసు చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (లూకా 22:19) క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ, యేసు ఎలాంటి వ్యక్తి అనేదాన్ని గురించి ధ్యానించవలసిన సందర్భం. అది, ఆయన తాను గడిపిన నమ్మకమైన జీవన విధానాన్ని బట్టి, తాను అర్పించిన బలిని బట్టి తనకు అనుగ్రహించబడిన మహిమతోనూ, రాచరికంతోనూ నేడు సజీవంగా, చురుగ్గా ఉన్నాడని గుర్తించవలసిన సమయం. క్రీస్తు, క్రైస్తవ సంఘ వ్యవహారాలను, కార్యకలాపాలను నిర్దేశిస్తుండగా ఆయన శిరస్సత్వానికి మన విధేయతను చూపించడానికి కూడా ఈ ఆచరణ ఒక అవకాశాన్ని ఇస్తుంది. (కొలొ. 1:17-20) క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు దేవుని ప్రజలందరూ గౌరవపూర్వకంగా హాజరవ్వాలి. ఈ సంవత్సరం అది మార్చి 28, 2002, గురువారం సూర్యాస్తమయం తర్వాత నిర్వహించబడుతుంది.
5 గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు ముందు శ్రద్ధతో చేసిన కృషి వల్ల, ఇండియాలో శిఖరాగ్రస్థాయిలో 52,725 మంది హాజరయ్యారు. ఈ సంవత్సరం ఎంతమంది హాజరవుతారు? ఎంతమంది హాజరవుతారనేది, హాజరు కావడానికి సాధ్యమైనంత ఎక్కువమందికి సహాయం చేయడంలో మనం ‘ప్రయాసముతో పాటుపడడం’పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.—1 తిమో. 4:10.
6 ప్రభు రాత్రి భోజనానికి హాజరవ్వడమే గాక, మనం మన క్షేత్ర సేవలో ఎక్కువగా పాల్గొనగలుగుతాము. వేలాదిమంది సహోదర సహోదరీలు ఒకటి రెండు నెలలు సహాయ పయినీరు సేవ చేస్తారనడంలో సందేహం లేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం, మార్చి నుండి మే వరకు, జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, సగటున 1,515 మంది సహాయ పయినీరు సేవ చేశారు. ఈ సంవత్సరం సహాయ పయినీరు సేవ చేసే ఆధిక్యతను ఆనందించడానికి మీరు తగిన ఏర్పాట్లు చేసుకోగలరా? క్రీస్తు బలికి సంబంధించి దేవుడు చేసిన ప్రేమపూర్వక ఏర్పాటు పట్ల మీ యథార్థమైన మెప్పును చూపించడానికి అది ఒక చక్కని మార్గమై ఉంటుంది. ఈ క్రింది అనుభవాలు చూపిస్తున్నట్లుగా, యెహోవా ఆశీర్వాదం తప్పక లభిస్తుందని మీరు నిశ్చయత కలిగి ఉండవచ్చు.
7 ఉద్యోగం చేస్తున్న ఒక సహోదరి గత మార్చిలో తాను సహాయ పయినీరు సేవ చేసినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని గురించి ఇలా వ్రాసింది: “జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, తమ పరిస్థితులు అనుమతించే ప్రతి ఒక్కరు సహాయ పయినీరు సేవ చేయాలని ఫిబ్రవరి 2001 మన రాజ్య పరిచర్య ప్రోత్సహించింది. మార్చిలో ఐదు శనివారాలు ఉన్నాయి గనుక, ఇది నా షెడ్యూల్‌తో సరిగ్గా సరిపోయింది. కాబట్టి నేను సహాయ పయినీరు దరఖాస్తు నింపడానికి నిర్ణయించుకున్నాను.” నెల ఆరంభంలో, ఒక గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించాలనే లక్ష్యాన్ని ఆమె పెట్టుకుంది. మరి ఆమె ఆ లక్ష్యాన్ని సాధించిందా? ఆ నెలలో సాక్ష్యమిస్తున్న 52వ గంటలో ఆమె ఆ లక్ష్యాన్ని సాధించింది! చివరికి ఆమె చెబుతున్నదేమిటి? “మనం అదనపు కృషి చేసినప్పుడు మనకు అద్భుతమైన ఆశీర్వాదములు లభిస్తాయి.”
8 కుటుంబమంతా కలిసి పయినీరు సేవ చేసేవారికి లభించే ప్రయోజనాలేమిటి? గత ఏప్రిల్‌లో అలా కలిసి పయినీరు సేవచేసిన, నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం, అది చిరస్మరణీయమైన నెలగా నిలిచిపోయిందని కనుగొన్నది. తల్లి ఇలా అంది: “మేము పరిచర్యలో ఐక్యంగా ఉండేవాళ్ళం కాబట్టి ప్రతి రోజు మాకు ఎంత ఆశాజనకమైన దృక్పథం ఉండేదో! ప్రతి రోజూ సేవా కార్యకలాపాల గురించి చేసే చర్చలు, రాత్రి భోజనాల వేళను చాలా ఆనందకరమైన సమయంగా చేసేవి.” కుమారుడు ఇలా అన్నాడు: “సాధారణంగా ఉద్యోగానికి వెళ్ళిపోయే నాన్నగారితో, వారపు దినాల్లో క్షేత్ర సేవలో కలిసి పనిచేయడం నాకెంతో నచ్చింది.” దానికి, తండ్రి ఇలా జత చేస్తున్నాడు: “మన కాలంలో అత్యంత ప్రాముఖ్యమైనదైన కార్యకలాపంలో మేము కలిసి పని చేస్తున్నామన్నది కుటుంబ శిరస్సుగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.” మీ కుటుంబం కూడా కలిసి పయినీరు సేవ చేయగలదా? ఈ జ్ఞాపకార్థ కాలంలో మీ కుటుంబమంతా కలిసి సహాయ పయినీరు సేవ చేయడం సాధ్యమవుతుందా అని మీరంతా కలిసి ఎందుకు చర్చించకూడదు?
9 మార్చి నెలను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా? మన రాజ్య పరిచర్య 2000వ సంవత్సరం తొలిభాగంలో, “2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?” అనే ప్రశ్న అడిగింది. దానికి ప్రతిస్పందన ఎలా ఉంది? పలు అంశాల్లో శిఖరాగ్ర స్థాయిని చేరుకున్నాము. ఒక నెలలో శిఖరాగ్ర స్థాయిలో 3,287 మంది సహాయ పయినీరు సేవ చేశారు. అంతేగాక, బైబిలు అధ్యయనాల్లో, గంటల్లో, ప్రచారకుల్లో, పునర్దర్శనాల్లో క్రొత్తగా శిఖరాగ్ర స్థాయిని చేరుకోవడం జరిగింది. ఆ ప్రత్యేకమైన నెలలో ఆధ్యాత్మిక కార్యకలాపాల సంరంభం వల్ల మీ సంఘంలో పెల్లుబికిన ఉత్సాహం మీకు గుర్తుందా? గత సంవత్సరం సాధించిన వాటికి సమానమైన లేదా అంతకన్నా ఎక్కువ ఈ సంవత్సరం మనం సాధించగలమా? అందరూ కలిసి కృషి చేస్తే మార్చి 2002 “మన అపూర్వమైన నెల” కాగలదు. ఎందుకు మార్చినెలే?
10 మార్చి, కార్యకలాపాలకు ప్రత్యేక నెల ఎందుకు కావాలనేదానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, మార్చి చివరలో జ్ఞాపకార్థ ఆచరణ ఉంటుంది గనుక, దానికి హాజరు కావడానికి వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించడానికి నెల తొలి భాగంలో మనకు కావలసినంత సమయం లభిస్తుంది. రెండవది, ఈ సంవత్సరం మార్చిలో ఐదు పూర్తి వారాంతాలు ఉన్నాయి గనుక ఉద్యోగం చేసేవాళ్ళు లేదా స్కూల్లో చదువుకునే వాళ్ళు సహాయ పయినీరు సేవ చేయడం సులభంగా ఉంటుంది. ఈ మధ్య పేజీల్లో ఇవ్వబడిన కాలెండరును ఉపయోగిస్తూ, ఇప్పుడే కూర్చుని ఆచరణీయమైన ఒక షెడ్యూల్‌ను ఎందుకు తయారుచేసుకోకూడదు? సహాయ పయినీరు సేవ చేయడం మనమనుకునే దానికన్నా సులభమే. ఉదాహరణకు, ఐదు వారాంతాల్లోనూ 8 గంటలు క్షేత్ర సేవ చేయడానికి ప్రక్కన పెట్టుకుంటే, అవసరమైన 50 గంటల్ని చేరుకోవడానికి మీరు మిగతా నెలంతటిలోనూ అదనంగా కేవలం 10 గంటలు సంపాదించుకోవలసి ఉంటుందంతే.
11 ‘దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి’ సంఘంలో అందరికీ సహాయం చేయడానికి పెద్దలు ఏమి చేయవచ్చు? కూటాల భాగాల ద్వారా, వ్యక్తిగత సంభాషణల ద్వారా ఉత్సాహాన్ని రేకెత్తించండి. సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు, వారి సహాయకులు తమ గుంపుకు నియమించబడినవారిలో ఒక్కొక్కరితో మాట్లాడడానికి చొరవతీసుకుని వ్యక్తిగత సహాయాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయాలి. దయతో కూడిన కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు లేదా కొన్ని ఆచరణాత్మకమైన సూచనలు మాత్రమే సరిపోవచ్చు. (సామె. 25:11) తమ షెడ్యూళ్ళలో స్వల్ప సవరింపులు చేసుకోవడం ద్వారా తాము సహాయ పయినీరు సేవ చేసే ఆధిక్యతను పొందగలమని అనేకులు తెలుసుకుంటారు. అనేక సంఘాల్లో, పెద్దలు, పరిచర్య సేవకులు, వారి భార్యలు, వీరందరూ కాకపోయినా, వీరిలో అత్యధికులు జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో సహాయ పయినీరు సేవ చేయడం ద్వారా చక్కని మాదిరిని ఉంచారు. చాలా మంది ప్రచారకులు వారితో కలవడాన్ని ఇది ప్రోత్సహించింది. శారీరక పరిమితుల వల్ల లేదా ఇతర పరిస్థితుల వల్ల, కొంతమంది ప్రచారకులు పయినీరు సేవ చేసే స్థితిలో ఉండకపోవచ్చు, కానీ మిగతా సంఘంతో పాటు తమకు సాధ్యమైనంత ఎక్కువగా పరిచర్యలో పాల్గొనడం ద్వారా తమ కృతజ్ఞతను చూపించమని వారిని ప్రోత్సహించవచ్చు.
12 పనిలో సాఫల్యం, పెద్దలు జాగ్రతగా ప్లాన్ చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. క్షేత్ర సేవ కోసమైన కూటాలను వారమంతటిలోనూ అనుకూలమైన సమయాల్లో ఏర్పాటు చేయాలి. సాధ్యమైతే, సేవ కోసమైన కూటాలన్నిటిని నిర్వహించే పనిని సేవా పైవిచారణకర్త యోగ్యులైన సహోదరులకు ముందుగా అప్పగిస్తాడు. గ్రూపులను సంస్థీకరించడం, సేవా ప్రాంతాన్ని కేటాయించడం, ప్రార్థన చేయడం వంటివాటన్నిటితో సహా ఈ కూటాలను 10 నుండి 15 నిమిషాల్లో ముగించడానికి మంచి సిద్ధపాటు అవసరం. (సెప్టెంబరు 2001 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నా భాగం చూడండి.) నెలంతటిలో ప్రకటనా కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతాయో తెలియజేసే షెడ్యూల్‌ను సంఘానికి స్పష్టంగా వివరించి, దాన్ని సమాచార బోర్డుపై ఉంచాలి.
13 అందరికీ తగినంత క్షేత్రం ఉండేలా చూడాలి. తరచుగా ప్రకటించని సేవా ప్రాంతాల్లో ప్రకటించడానికి ఏర్పాట్లు చేసేందుకు సేవా పైవిచారణకర్త, సేవా ప్రాంతానికి సంబంధించిన వ్యవహారాలను చూస్తున్న సహోదరుడ్ని కలవాలి. తాళం వేసి ఉన్న ఇండ్లను మళ్ళీ సందర్శించడానికీ, వీధుల్లోనూ షాపు షాపుకూ సాక్ష్యమివ్వడానికీ, సాయంకాలాల్లో సాక్ష్యమివ్వడానికీ ప్రాధాన్యతను ఇవ్వాలి. సముచితమైన చోట, కొంతమంది ప్రచారకులకు టెలిఫోన్ సాక్ష్యమివ్వడంలో సహాయం చేయవచ్చు.
14 మళ్లీ సేవ చేయడానికి వారికి సహాయం చేయండి: మీ సంఘ సేవా ప్రాంతంలో, సువార్త ప్రకటించే పనిలో నిష్క్రియులైన వారు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు ఇంకా సంఘంలో ఒక భాగమే, గనుక వారికి సహాయం అవసరం. (కీర్త. 119:176) ఈ లోకాంతం సమీపించింది గనుకా, నూతన లోకం అతిసమీపంలో ఉంది గనుకా, నిష్క్రియులుగా మారిన వారికి సహాయం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేయడానికి మంచి కారణం ఉంది. (రోమా. 13:11, 12) గత ఐదు సంవత్సరాల్లో, ప్రతి సంవత్సరం దాదాపు 300 మంది తమకు అందజేయబడిన సహాయానికి ప్రతిస్పందించి, తిరిగి క్రియాశీలురయ్యారు. మొదట్లో ఉన్న ప్రేమను, నమ్మకాన్ని పునరుజ్జీవింపజేసుకొనేలా సహాయం చేయడానికి మనం ఏమి చేయవచ్చు?—హెబ్రీ. 3:12-14.
15 గత కొద్ది సంవత్సరాల్లో నిష్క్రియులుగా మారిన వారికి ఎలా సహాయం చేయవచ్చో చర్చించడానికి పెద్దల సభ సమకూడాలనుకోవచ్చు. (మత్త. 18:11-14) సంఘ కార్యదర్శి సంఘ ప్రచారకుల రికార్డు కార్డులను పరిశీలించి, నిష్క్రియులుగా మారిన వారందరి పేర్లను వ్రాసిపెట్టుకోవాలి. వారికి సహాయం అందజేయడానికి కాపరి సందర్శన ఏర్పాటు ద్వారా ప్రత్యేక ప్రయత్నం చేయాలి. ఒక పెద్ద తనకు ఒకానొక ప్రచారకుడితో మునుపు పరిచయం ఉన్నందునా ఆయనతో తాను సహవసించినందునా ఆయనను తానే సందర్శించాలని కోరుకోవచ్చు లేదా సహాయం చేయమని ఇతర ప్రచారకులను కోరవచ్చు. ఇప్పుడు నిష్క్రియులుగా మారిన వారితో మునుపు అధ్యయనం చేసిన ప్రచారకులు, అవసరమైన ఈ సమయంలో తాము ప్రత్యేకమైన సహాయాన్ని అందించగలిగేలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకోవచ్చు. నిష్క్రియులుగా మారిన వారిలో అనేకులు దేవుని వాక్యాన్ని మళ్లీ ప్రకటించడాన్ని ప్రారంభించడానికి పురికొల్పబడతారని ఆశిద్దాం. వారు యోగ్యులైతే, వారు ప్రకటనా పనిని పునఃప్రారంభించడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం కన్నా మంచి అవకాశం మరొకటి ఉండదు!—మరిన్ని వివరాల కోసం, నవంబరు 2000 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నా భాగం చూడండి.
16 ప్రకటించడానికి ఇతరులు యోగ్యులు కాగలరా? “అన్యజనులందరియొక్క యిష్టవస్తువుల”ను తీసుకురావడం ద్వారా యెహోవా తన ప్రజలను ఆశీర్వదించడాన్ని కొనసాగిస్తున్నాడు. (హగ్గ. 2:7) ప్రతి సంవత్సరం వేలాదిమంది బాప్తిస్మం తీసుకోని ప్రచారకులయ్యేందుకు యోగ్యులవుతున్నారు. వారెవరు? యెహోవా సాక్షుల పిల్లలు, అలాగే అభివృద్ధి సాధిస్తున్న బైబిలు విద్యార్థులు. వారు సువార్త ప్రచారకులయ్యేందుకు యోగ్యులు కాగలరని మనకెలా తెలుస్తుంది?
17 యెహోవా సాక్షుల పిల్లలు: చాలా మంది పిల్లలు తాము బాప్తిస్మం తీసుకోని ప్రచారకులుగా సేవ చేయడం ఇంకా ప్రారంభించకపోయినప్పటికీ, సంవత్సరాలుగా వారు ఇంటింటి పరిచర్యకు తమ తల్లిదండ్రుల వెంట వెళ్తున్నారు. వారు ప్రకటనా పనిని ప్రారంభించడానికి మార్చి నెల మంచి సమయం కావచ్చు. మీ పిల్లవాడు యోగ్యుడో కాదో మీకెలా తెలుస్తుంది? “బాలుడు తన ప్రవర్తనలో మాదిరికరంగా వుంటే, సువార్తనుగూర్చి ఇతరులతో మాట్లాడుటద్వారా తన విశ్వాసాన్ని స్వయంగా వ్యక్తపరచగల్గి, అలా తన హృదయ ప్రేరణవల్ల సేవచేస్తూవుంటే,” యోగ్యుడేనని, మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము పుస్తకంలోని 100వ పేజీ చెబుతోంది. మీ పిల్లవాడు యోగ్యుడవుతాడని మీరు భావిస్తే, సంఘ సేవా కమిటీలోని ఒక పెద్దతో మాట్లాడండి.
18 యోగ్యులైన బైబిలు విద్యార్థులు: ఒక బైబిలు విద్యార్థి పరిజ్ఞానాన్ని పొంది, కొంతకాలంగా కూటాలకు హాజరవుతుంటే, ఆయన రాజ్య ప్రచారకుడ్ని కావాలని కోరుకోవచ్చు. అలాంటి విద్యార్థితో మీరు అధ్యయనం చేస్తుంటే, ఈ ప్రశ్నలను పరిశీలించండి: ఆయన తన వయస్సుకు, సామర్థ్యానికి అనుగుణంగా అభివృద్ధి సాధిస్తున్నాడా? ఆయన తన విశ్వాసాన్ని అనియతంగా ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాడా? ఆయన “నవీన స్వభావమును” ధరించుకొంటున్నాడా? (కొలొ. 3:9) మన పరిచర్య పుస్తకంలోని 97-9 పేజీల్లో క్లుప్తంగా తెలియజేయబడిన, బాప్తిస్మం తీసుకోని ప్రచారకులకు ఉండవలసిన యోగ్యతలను కలిగి ఉన్నాడా? అలాగైతే, మీతోనూ, మీ విద్యార్థితోనూ ఇద్దరు పెద్దలు కలవడానికి ఏర్పాట్లు చేయబడేలా మీరు సంఘ సేవా కమిటీని సంప్రదించాలి. ఆయన యోగ్యుడైతే, బహిరంగ పరిచర్యలో పాల్గొనడం ప్రారంభించవచ్చునని ఇద్దరు పెద్దలు ఆయనకు తెలియజేస్తారు.
19 ఏప్రిల్, మే నెలల మాటేమిటి? ఇవి కూడా క్షేత్ర పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడానికి ప్రత్యేకమైన నెలలు. మార్చిలో సహాయ పయినీరు సేవ చేసే అనేకులు ఏప్రిల్ మరియు/లేదా మే నెలల్లో మళ్లీ అలా చేయగలుగవచ్చు. ఏప్రిల్ మే నెలల్లో పరిచర్యలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను అందజేయడానికి ప్రాధాన్యతను ఇస్తాము. వాటిని చదివే వారి జీవితాలపై అవి ఎంత ప్రయోజనకరమైన ప్రభావాలను చూపించాయో కదా! ప్రపంచవ్యాప్తంగా జరిగిన అద్భుతమైన పెరుగుదలను సాధించడంలో ఈ పత్రికలు అధిక పాత్ర పోషించాయి. ఏప్రిల్, మే నెలల్లో సాధ్యమైనంత మందికి పత్రికలు అందజేయడానికి ప్రత్యేక ప్రయత్నం జరుగుతుంది. పూర్తిగా భాగం వహించడానికి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.
20 ప్రకటనా పనిలో ఎక్కువగా పాల్గొనడానికి చేయబడిన ప్లాన్లను బట్టి, సంఘం ద్వారా మీరు పొందే పత్రికల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉంటుందా? సేవా సంవత్సరమంతటిలోనూ, మన పత్రికా దినంగా నియమింపబడిన దినమైన, ప్రతి శనివారం మనం కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందజేస్తాము. అయితే, చాలామంది సహాయ పయినీరు సేవలో పాల్గొంటారు గనుక, మనమందరం రెండు పూర్తి నెలలపాటు పత్రికలను అందజేస్తాము గనుక, సంఘం ద్వారా మీరు తీసుకునే పత్రికల సంఖ్యను పెంచడం అవసరం కావచ్చు. అలాగైతే, మీ సంఘంలోని పత్రికా సేవకుడికి వెంటనే తెలియజేయండి. అదే సమయంలో, సాహిత్య సేవకుడు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపతారా? అనే కరపత్రాలు అందరూ ఉపయోగించడానికి తగినన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
21 మన రాజ్య పరిచర్యలోని “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” అనే శీర్షిక పట్ల అనేకులు కృతజ్ఞతను వ్యక్తపరిచారు. మాదిరి పత్రిక అందింపులను నేర్చుకోవడం ద్వారా మీరు ఈ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందారా? ప్రతి వారం మీ కుటుంబ బైబిలు అధ్యయనంలో కొంత సమయాన్ని, ఈ అందింపులను ప్రాక్టీస్ చేయడానికి ఎందుకు ఉపయోగించకూడదు?
22 ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలం నుండి పూర్తి ప్రయోజనం పొందండి: ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలం కోసం ప్లాన్ చేయబడిన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పూర్తిగా పాల్గొనడం ద్వారా, అపొస్తలుడైన పౌలు వలె, మనం “చెప్ప శక్యము కాని ఆయన వరమును” బట్టి ఎంతగా కృతజ్ఞులమై ఉన్నామో యెహోవాకు చూపిద్దాము. ఆ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో, (1) సంవత్సరంలోని అత్యంత ప్రాముఖ్యమైన సందర్భమైన, 2002, మార్చి 28, గురువారం నాడు ప్రభు రాత్రి భోజన ఆచరణకు హాజరవ్వడం; (2) నిష్క్రియులుగా మారిన వారికి ‘మొదట ఉండిన ప్రేమను’ పునరుజ్జీవింపజేసేందుకు సహాయం చేయడం (ప్రక. 2:4; రోమా. 12:11); (3) బాప్తిస్మం తీసుకోని ప్రచారకులయ్యేందుకు యోగ్యులైన మన పిల్లలకు, బైబిలు విద్యార్థులకు సహాయం చేయడం; మరియు (4) సాధ్యమైనంత సంపూర్ణంగా సువార్త ప్రకటన పనిలో నిమగ్నమవ్వడం, చివరికి మార్చిలోనూ ఆ తర్వాతా సహాయ పయినీరు సేవ చేయడం.—2 తిమో. 4:5.
23 ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో రాజ్య సువార్త ప్రకటించడంలో మనమందరం సంపూర్ణంగా భాగం వహించి, యెహోవా మన కోసం చేసిన దానంతటిని బట్టి మనకున్న కృతజ్ఞత యొక్క లోతును చూపించాలన్నది మన హృదయపూర్వక పార్థన.
[6వ పేజీలోని బాక్సు]
2002 మార్చి కోసం వ్యక్తిగత క్షేత్ర సేవా షెడ్యూలు
ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం
1 2
పత్రికా దినం
3 4 5 6 7 8 9
పత్రికా దినం
10 11 12 13 14 15 16
పత్రికా దినం
17 18 19 20 21 22 23
పత్రికా దినం
24 25 26 27 28 29 30
పత్రికా దినం
31 జ్ఞాపకార్థ ఆచరణ సూర్యాస్తమయం తర్వాత
మార్చిలో సహాయ పయినీరు సేవ చేయడానికి పరిచర్య కోసం మీరు మొత్తం 50 గంటలు షెడ్యూలు వేసుకోగలరా?