మనమందరం యెహోవానూ ఆయన కుమారుడ్నీ ఘనపరచుదాం
ఏప్రిల్ 8న జ్ఞాపకార్థానికి హాజరయ్యేవారందరూ ఎలా పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు?
1 నేడు ప్రత్యేక ఘనత ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ లోకం ఏ పనులనైతే ఎంతో గౌరవిస్తుందో ఆ పనులను చేసేవారికి ఇవ్వబడుతుంది. కానీ, అలాంటి పనులు చాలా మట్టుకు, త్వరలోనే మరవబడతాయి. నిజంగా మొత్తం మానవాళికే ప్రయోజనాన్ని చేకూర్చే పనుల విషయమేమిటి? 2001, ఏప్రిల్ 8న సూర్యాస్తమయం తర్వాత మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నప్పుడు ప్రయోజనాన్ని చేకూర్చే ఆ పనుల్లో ప్రధానమైనదానికి అవధానాన్ని ఇస్తాము.
2 అత్యధిక ఘనతను పొందడానికి ఎవరు అర్హులు? “మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. . . . నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని” బైబిలు సమాధానమిస్తుంది. (ప్రక. 4:11) సృష్టికర్తగా యెహోవాయే సమస్త విశ్వానికీ సర్వాధిపతియైన పరిపాలకుడు. ఘనతను పొందే అర్హత ఆయనకెల్లప్పుడూ ఉంటుంది!—1 తిమో. 1:17.
3 మానవజాతికి అనంతమైన ఆశీర్వాదాలను తీసుకువచ్చే ప్రయోజనకరమైన పనులను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేశాడు. ఆయన తన తండ్రిని పరిపూర్ణముగా అనుకరించాడు. (యోహా. 5:19) ఆయన తన తండ్రికి చూపిన పరిపూర్ణ విధేయతా, నమ్మకంగా చేసిన సేవా, ఆయనను “శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హు”డిగా చేశాయి. (ప్రక. 5:12) అందుకే, ఆయన తండ్రి ఆయనను రాజుగా సింహాసనాసీనుడ్ని చేసి ఘనపరిచాడు. (కీర్త. 2:6-8) ఇక మన విషయానికి వస్తే, 2001, ఏప్రిల్ 8న మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నప్పుడు, తండ్రినీ కుమారుడ్నీ ఘనపర్చే అవకాశం మనకుంది.
4 విచారకరమైన విషయం ఏమిటంటే, మానవ చరిత్రను పరిశీలిస్తే, యెహోవాకూ ఆయన కుమారునికీ ఇవ్వవలసిన ఘనతను అతి తక్కువ మందే ఇచ్చారు. దేవుని ప్రాచీన ప్రజలైన ఇశ్రాయేలీయులు సహితం, కొన్నిసార్లు యెహోవాకు నామమాత్రపు సేవను చేశారు. అది నిజంగా ఎంతో అగౌరవకరమైనది. (మలా. 1:6) యెహోవా, యేసూ మనపై చూపిన ప్రేమను బట్టి, వాళ్ళు మనకోసం చేసినవాటి విషయమై మనకున్న మెప్పుదలను బట్టి వాళ్ళకు నమ్మకంగా విధేయత చూపించడం ద్వారా వాళ్ళకు సముచితమైన గౌరవాన్నిస్తాము. మనం వాళ్ళకు సముచితమైన ఘనతనూ గౌరవాన్నీ చూపించడంలో, దైవిక భయాన్నీ గౌరవాన్నీ చూపించడమూ, మనం అన్ని విషయాల్లోను వాళ్ళ నడిపింపును అనుసరించడమూ ఇమిడి ఉన్నాయి. ఇతరులు కూడా అలా చేసేలా వాళ్ళకు బోధించేందుకూ సహాయపడేందుకూ క్రైస్తవ సంఘం శ్రమిస్తుంది.
5 ఘనపర్చే ఒక ప్రత్యేక సందర్భం: జ్ఞాపకార్థ ఆచరణ కోసం సమకూడడం, ప్రతి సంవత్సరం యెహోవా ప్రజలు కూడుకునే అత్యంత ప్రాముఖ్యమైన సమావేశమై ఉంది. యెహోవా సేవ చేయాలని ఆయనను ఘనపర్చాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక హాజరవ్వాలి. (లూకా 22:19) 60 లక్షల క్రియాశీల సాక్షులే కాక, ఆసక్తిగల వారు కూడా వస్తారనీ అలా మొత్తం హాజరు 140 లక్షలను దాటుతుందని ఎదురు చూస్తున్నాం. మన పరలోక తండ్రిని ఘనపర్చేందుకు ఎంతటి చక్కని అవకాశం! ఈ ఆచరణ యేసుపై కేంద్రీకరించబడుతున్నప్పటికీ, ఆయన నెరవేర్చినదానికి చూపే ఘనతా గౌరవమూ ఆయనను పంపిన తండ్రినే మహిమపరుస్తాయి.—యోహా. 5:23.
6 ఈ ప్రత్యేక సందర్భానికి మద్దతునిచ్చేందుకు మనమేమి చేయగలం? క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారు పూర్తి ప్రయోజనాన్ని పొందేందుకు మనం సహాయపడవచ్చు. ఈ ప్రత్యేక సందర్భానికి హాజరవ్వమని వారిని ప్రోత్సహించండి, అవసరమైతే, వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి కావలసిన సహాయం చేస్తామని దయాపూర్వకంగా చెప్పండి. జ్ఞాపకార్థ ప్రసంగ ఉద్దేశాన్ని వివరించండి. వారిని ఇతరులకు పరిచయం చేయండి. వాళ్ళు చూస్తున్నవీ వింటున్నవీ యెహోవాను ఘనపర్చడంలో మనతో పాటు చేరేందుకు వాళ్ళను కదిలించగలవు.
7 ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. “నేను చర్చిలో ప్రభురాత్రి భోజనానికి చాలాసార్లు హాజరయ్యాను. కానీ ఇది చాలా భిన్నంగా ఉంది. ఇది సరిగ్గా బైబిలు చెబుతున్నట్లుగా ఉందని చూడగల్గాను. మీ దగ్గర సత్యముందని నేను అనుకుంటున్నాను” అని ఒక విశ్వవిద్యాలయ విద్యార్థి అన్నారు. తర్వాత ఆయన కూటాలకు క్రమంగా హాజరవ్వడం మొదలుపెట్టి, త్వరలోనే బాప్తిస్మం తీసుకున్నారు.
8 ప్రగతిని సాధించేందుకు క్రొత్తవారికి సహాయపడండి: జ్ఞాపకార్థానికి క్రొత్తవాళ్ళు ఎవరెవరు వస్తున్నారో గమనించి, త్వరలోనే వాళ్ళను సందర్శించి, అక్కడ వాళ్ళు తెలుసుకున్న చూసిన సేదదీర్చే విషయాలను పునఃసమీక్షించండి. వాళ్లు తమ బైబిలు జ్ఞానాన్ని పెంచుకోగల ఇతర కూటాల గురించి వారికి తెలియజేయండి. జ్ఞానము పుస్తకంలోని “దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండి” అనే 17వ అధ్యాయాన్ని పునఃసమీక్షించండి. అది, సంఘంలో వివిధ రకాల ఆధ్యాత్మిక ఏర్పాట్లు ఉన్నాయనీ, వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాటి నుండి ప్రయోజనం పొందవచ్చనీ వారికి తెలియజేస్తుంది. అవర్ హోల్ అసోసియేషన్ ఆఫ్ బ్రదర్స్ అనే వీడియోను చూసే ఏర్పాటు చేయండి. అందులో, యెహోవా ప్రజల ఐక్యాన్నీ, ఆనందాన్నీ, ఆసక్తినీ వారు స్వనేత్రాలతో చూడగల్గుతారు!
9 ఆసక్తిగలవాళ్ళు తాము వ్యక్తిగతంగా యెహోవాను ఎలా ఘనపర్చవచ్చు గౌరవించవచ్చు అన్న విషయాల్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. హృదయపూర్వక ప్రార్థనలు యెహోవాను ప్రీతిపరుస్తాయనీ, ఆధ్యాత్మికంగా సేదతీర్చుకునేందుకు ప్రార్థన నిత్య వనరుగా ఉంటుందనీ వివరించండి. (1 యోహా. 5:14) దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లోని 8 నుండి 12 పాఠాలను ఉపయోగిస్తూ, యెహోవాను ఘనపర్చేది ఎటువంటి ప్రవర్తనో వివరించండి. యెహోవాసాక్షులు అనే బ్రోషూర్లోని 30-1 పేజీలు చెబుతున్న దాన్ని చర్చిస్తూ, ప్రకటనా పనిలో వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా యెహోవాను ఘనపర్చే సాధ్యతను గురించి ఆలోచించమని క్రొత్తవాళ్ళను ప్రోత్సహించండి.
10 యేసు విమోచన క్రయధనము విషయమై, ఆయన శిష్యులముగా సేవ చేసే మన ఆధిక్యత విషయమై మనకున్న మెప్పుదల, తండ్రిని ఘనపరుస్తుంది ఇతరులకు ఆశీర్వాదాలను తెస్తుంది. “ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును” అని యేసు వాగ్దానం చేశాడు.—యోహా. 12:26.