“సమయోచితముగా పలుకబడిన మాట”
1 జీవాన్నిచ్చే సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం మీకు సవాలుగా ఉందా? మీరు చెప్పేది, వినేవారిని గాఢంగా ప్రభావితం చేసేలా ఉండాలని మీరు అనుకుంటున్నారా? యేసు తన శిష్యులను పంపించేటప్పుడు “[మీరు] వెళ్లుచు—పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి” అని చెప్పాడు. (మత్త. 10:7) ఆ సందేశం చాలా సరళంగాను, పంచుకోవడానికి సులభంగాను ఉంది. దానిలో నేడు మార్పేమీ లేదు.
2 తరచుగా సంభాషణ ప్రారంభించేందుకు కొన్ని మాటలు చాలు. ఫిలిప్పు, ఐతియొపీయుడైన నపుంసకుడిని కలిసి, ఇలా అడిగాడు: “నీవు చదువునది గ్రహించుచున్నావా?” (అపొ. 8:30) “సమయోచితముగా పలుకబడిన మాట” ద్వారా ఎంత చక్కని ప్రతిఫలదాయకమైన చర్చ కొనసాగిందో గదా!—సామె. 25:11.
3 మీరు కూడా మీ పరిచర్యలో ఆ పద్ధతినే ఉపయోగించవచ్చు. ఎలా? గమనించేవారిగానూ పరిస్థితులకు అనుగుణంగానూ మాటలను ఎంపిక చేసుకునేవారిగాను ఉండడం ద్వారా. ఒక ప్రశ్న అడిగి, సమాధానాన్ని వినండి.
4 కొన్ని అతి మామూలు ప్రశ్నలు: సంభాషణ ప్రారంభించేందుకు చొరవ తీసుకోవడానికి ఈ క్రింద ఇవ్వబడిన ఏ ప్రశ్ననైనా మీరు ప్రయత్నించవచ్చు:
◼ “మీ ఆరాధనలో మీరు పరలోక ప్రార్థనను (లేదా, ప్రభువు ప్రార్థనను) చేస్తారా?” (మత్త. 6:9, 10) ఆ ప్రార్థనలోని కొంత భాగాన్ని మీరే చెప్పి, ఇలా అనండి: “‘పరిశుద్ధపరచమని (లేదా పవిత్రపరచమని) యేసు చెప్పిన ఆ దేవుని పేరు ఏమిటి?’ అని కొందరు అడుగుతారు, మరి కొంతమంది ‘మనం ప్రార్థించాలని యేసు చెప్పిన ఆ రాజ్యం ఏమిటి?’ అని అడుగుతారు, మీరు ఇలాంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబుల్ని కనుగొన్నారా?”
◼ “‘జీవితానికి అర్థమేమిటి’ అని మీరు ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచించారా?” అటుతర్వాత మీరు, అది దేవుని జ్ఞానంతో సంబంధం కలిగివున్న విషయమని చూపించండి.—ప్రసం. 12:13; యోహా. 17:3.
◼ “మరణం ఎన్నటికీ లేకుండా పోతుందని మీరు అనుకుంటున్నారా?” యెషయా 25:8, ప్రకటన 21:4 లేఖనాలను ఉపయోగించి నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వండి.
◼ “లోకంలో ఉన్న ఈ అల్లకల్లోలానికి సుళువైన పరిష్కారమేమైనా ఉందా?” “నీ పొరుగువాని ప్రేమింపవలెన”ని దేవుడు బోధిస్తున్నాడని చూపించండి.—మత్త. 22:39.
◼ “ఒక అంతరిక్ష దుర్ఘటన ఏదో ఒక రోజు మన భూమిని నాశనం చేస్తుందా?” భూమి ఎల్లప్పుడూ ఉంటుందన్న బైబిలు వాగ్దానాన్ని గురించి చెప్పండి.—కీర్తన 104:5.
5 సువార్తను సూటిగానూ, క్లుప్తంగానూ అలాగే స్నేహపూర్వకంగానూ అందించండి. ఇతరులతో సత్యాన్ని పంచుకొనేందుకు మీరు చేసే ప్రయత్నాలను—అది ‘ఒక్క మాట’ అయినాసరే—యెహోవా ఆశీర్వదిస్తాడు.