ప్రకటిస్తూనే ఉండండి!
1 “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెన”న్నది దేవుని చిత్తమై ఉంది. (1 తిమో. 2:4) అందుకే, సువార్తను ప్రకటించమన్న నియామకాన్ని ఆయన మనకిచ్చాడు. (మత్త. 24:14) ప్రకటిస్తూ ఉండడం ఎందుకు అవసరమో మనం గుర్తించినట్లయితే, మనకు ఎదురయ్యే ఎలాంటి నిరుత్సాహమైనా లేక ఎలాంటి అవరోధమైనా మనలను ఆటంకపర్చదు.
2 పట్టువిడువకుండా ఎందుకు వెళ్ళడం? మనం చెప్పేదానిని ప్రజలు మరచిపోయేలా చేసే లేక తేలికగా తీసుకొనేలా చేసే అవరోధాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. గనుక దేవుని రక్షణ సువార్తను గురించి మనం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. (మత్త. 24:38, 39) అంతేకాక, ప్రజల జీవన పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతుంటాయి. లోక పరిస్థితులు కూడా ఒక్క రాత్రిలోనే చాలా వేగంగా మారిపోగలవు. (1 కొరిం. 7:31) మనం ఎవరికైతే ప్రకటిస్తున్నామో, వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు లేక ఏదో ఒక రోజు క్రొత్త క్రొత్త సమస్యలను చింతలను ఎదుర్కోవచ్చు, అటువంటి సందర్భంలో వాళ్ళు మనం అందించిన సువార్త గురించి గంభీరంగా ఆలోచించవచ్చు. మీ దగ్గరికి సత్యాన్ని తీసుకువచ్చిన సాక్షి పట్టువిడువకుండా వచ్చినందుకు మీరు కృతజ్ఞులై ఉండరా?
3 దేవుని కనికరాన్ని అనుకరించడానికి: దుష్టులపై తీర్పును అమలుచేయడానికి ముందు కొంత సమయం గడిచేందుకు యెహోవా సహనంతో అనుమతించాడు. తన వైపుకు తిరిగి, రక్షణను పొందమని మనద్వారా ఆయన నీతిహృదయులను ఎడతెగక కోరుతున్నాడు. (2 పేతు. 3:9) దేవుని కనికరాన్ని గురించిన వర్తమానాన్ని ప్రజల ముందు పెట్టకపోయినా, చెడు మార్గాలనుండి తొలగనివారందరిపైకి దేవుడు తీసుకొనివచ్చే తీర్పును గురించి వారికి హెచ్చరించకపోయినా మనం రక్తాపరాధులమౌతాం. (యెహె. 33:1-11) మనం చేసే సేవకు ప్రతీసారి ప్రతిస్పందన దొరకకపోయినా సరే యథార్థవంతులు దేవుని గొప్ప కనికరాన్ని ప్రశంసించేలా వారికి అన్ని విధాలా సహాయం చేయడానికి మనం ఎన్నడూ వెనుకాడకూడదు.—అపొ. 20:26, 27; రోమా. 12:11.
4 మన ప్రేమను ప్రదర్శించడానికి: యెహోవా దేవుడే, భూమియందంతటా సువార్త ప్రకటించాలన్న ఆజ్ఞను యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. (మత్త. 28:19, 20) ప్రజలు వినడానికి తిరస్కరించినప్పటికీ, పట్టువిడవకుండా సరైనదాన్ని చేయడం ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమను, భక్తిని చూపించే అవకాశం మనకు ఉంది.—1 యోహా. 5:3.
5 మనం ప్రకటిస్తూనే ఉండాలని దృఢ నిశ్చయం చేసుకొందము గాక! యెహోవా ‘రక్షణ దినము’ ఇంకా ఉండగానే ఉత్సాహంతో అలా చేద్దాం.—2 కొరిం. 6:2.