ఆసక్తిని రేకెత్తించేందుకు ప్రస్తుత సంఘటనలను ఉపయోగించండి
1 మీ పరిచర్యను తాజాగానూ బైబిలు సందేశం పట్ల ప్రజల ఆసక్తిని రేకెత్తించేదిగానూ ఉండేలా, మంచి మంచి ఆలోచనలు నిరంతరం కావాలని కోరుకుంటారా? అలాగైతే ఈ ప్రపంచంలోను, మీ సమాజంలోను ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో వాటిని ఉపయోగించి మీ సంభాషణను ప్రారంభించండి. మీరు ప్రస్తుత స్థానిక వార్తలు గానీ, జాతీయ సంఘటనలు గానీ, అంతర్జాతీయ వార్తలను గానీ ఉపయోగించవచ్చు. ఈ విషయాలు ఎల్లప్పుడూ మారుతుంటాయి. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణలను పరిశీలించండి.
2 ఆర్థిక సమస్యలు, జీవన వ్యయం ప్రజలు నిజంగా చింతించేలా చేస్తాయి. కాబట్టి మీరిలా చెప్పవచ్చు:
◼ “మీరు [ఒక వస్తువు పేరు చెప్పండి] ధరలు మళ్ళీ పెరుగుతున్నాయని వార్తల్లో విన్నారా?” లేక, ఏదైనా కంపెనీ పనిలేనందువల్ల తాత్కాలికంగా పనివాళ్ళను తొలగించిన పరిస్థితి ఉంటే నిరుద్యోగం గురించి కూడా మీరు వ్యాఖ్యానించవచ్చు. మీరు ఆ సంభాషణను ఎలా కొనసాగించాన్నది మీ పైనే ఆధారపడివుంటుంది, మీరు ఇలా కూడా అడగవచ్చు, “జీవించడం ఎందుకింత కష్టంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా?” లేక “మన నిత్యావసరాలు తీర్చుకోవడానికి ఎల్లప్పుడూ చాలా కష్టంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా?”
3 కుటుంబాల్లో లేదా పాఠశాలల్లో విద్యార్థుల మధ్య జరిగిన విషాద నంఘటనలు లేక హింసాత్మక సంఘటనల గురించిన నివేదికలు మరొక సంభాషణకు ఆధారాన్నిస్తాయి. మీరిలా అడగవచ్చు:
◼ “మీరు వార్తా పత్రికలో [సమాజంలో జరిగిన ఆ విషాద సంఘటనను పేర్కొనండి] గురించి చదివారా?” అప్పుడు ఇలా అడగండి, “ప్రపంచంలో ఇంత దుష్టత్వం ఉండడానికి గల కారణమేమిటని మీరు అనుకుంటున్నారు?” లేక “మనం భద్రతగా ఉండగల సమయం ఎప్పటికైనా వస్తుందని మీరు భావిస్తున్నారా?”
4 వినాశనాన్ని సృష్టించిన వరదలను గూర్చిన, భూకంపాలను గూర్చి వివిధ దేశాల్లో జరిగే పౌరసంబంధ అల్లర్లను గూర్చిన విషయాలు కూడా ఆసక్తిని రేకెత్తించగలవు. ఉదాహరణకు, మీరిలా అడగవచ్చు:
◼ “[పకృతి వైపరీత్యం పేరు చెప్పి] దానికి దేవుడు బాధ్యుడా?” లేక, ఇటీవల చెలరేగిన పౌరసంబంధ అల్లర్లను సూచిస్తూ మీరు ఇలా అడగవచ్చు: “ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటుంటే, దాన్ని సాధించడం మాత్రం ఎందుకంత కష్టంగా ఉంటుంది?”
5 మీరు ఉపోద్ఘాతంగా ఉపయోగించడానికి ప్రస్తుత సంఘటలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో అప్రమత్తంగా ఉండండి. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకంలోని 3, 4 పేజీల్లో “ప్రస్తుత సంఘటనలు” అనే అంశం క్రింద సహాయకరమైన సలహాలు ఇవ్వబడ్డాయి. రాజకీయ, సామాజిక వివాదాంశాల్లో ఒకరి పక్షం వహించడాన్ని నివారించండి. దానికి బదులు లేఖనాలవైపుకూ, మానవజాతి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాన్ని తీసుకువచ్చే దేవుని రాజ్యం వైపుకూ వారి అవధానాన్ని మళ్ళించండి.