“నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?”
1 భూవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి మదిలో ఆ ప్రశ్నే ఉంది. శతాబ్దాలుగా మానవజాతి ఎంతో సాధించినప్పటికీ, సహస్రాబ్దాలుగా తమను పట్టిపీడించిన ప్రధానమైన కష్టాలు ఇంకా అలాగే ఉండడంవల్ల వాటి నుండి ఎప్పుడో ఒకప్పుడు విడుదల పొందుతామనే భ్రమలో ప్రజలు లేరు. (యోబు 14:1; కీర్త. 90:10) మానవజాతి ఉపశమనాన్ని ఎక్కడినుండి పొందగలదు?
2 నవంబరు నెలలో, మన పొరుగువారికి ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని మనం కలిగివుంటాం. ఎలా? రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టడం ద్వారా. ఆ కరపత్రం పేరు “నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?” మనం నవంబరు 1, బుధవారం నుండి రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టాలన్న బలమైన కోరికతో ఆ పనిలో పాల్గొంటాం. ఈ లక్ష్యంలో, ప్రతి వారంలోని మొదటి ఐదు రోజులు రాజ్య వార్త నెం. 36ను అందించడంపై శ్రద్ధ చూపుతాం. శని ఆదివారాల్లో ఇటీవలి పత్రికలతో పాటు దానిని అందిస్తాం.
3 దానిలో మీరు పూర్తి భాగాన్ని కలిగివుంటారా? పెద్దలు, పరిచర్య సేవకులు, పయినీర్లు ఆ పనిలో ముందుంటారు కాబట్టి, ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నడిపింపు తీసుకోవాలనుకుంటారు. చాలామంది ప్రచారకులు, నవంబరు నెలలో సహాయ పయినీరు చేయడానికి అనుగుణంగా పరిస్థితులను సర్దుబాటు చేసుకొన్నారు. ఇతరులు, పరిచర్యలో సాధారణంగా గడిపే సమయం కన్నా ఎక్కువ సమయాన్ని వెచ్చించేందుకు పథకం వేసుకున్నారు.
4 సంఘ పుస్తక పఠన నిర్వాహకులు తమ గుంపులోని ప్రతి ఒక్కరూ రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టడంలో పూర్తిగా భాగం వహించేలా ప్రోత్సహించడంలో కీలకస్థానం వహించగలరు. కొంతమంది ప్రచారకులు ప్రకటనాపనిలో నిష్క్రియులుగా ఉండవచ్చు. అలాంటివారికి సహాయాన్నందించడం కోసం ఏమి చేయవచ్చో తెలుసుకోవడానికి, పెద్దలు వారిని సందర్శించాలి. నిష్క్రియంగా ఉన్న ప్రతి ప్రచారకునికి పరిచర్యలో తగిన సహాయం అందించేలా, అనుభవజ్ఞులైన ప్రచారకులు వారిలో ఒక్కొక్కరితో పనిచేసేందుకు ఆ నెలలో ఏర్పాట్లు చేయవచ్చు. ఈ ప్రచారకులను చైతన్యవంతం చేసేందుకు కావలసినవి, కేవలం రాజ్య వార్త నెం. 36 యొక్క సులభమైన అందింపులు మాత్రమే.
5 జ్ఞానము పుస్తకాన్ని పూర్తి చేయబోతున్న బైబిలు విద్యార్థులు, బాప్తిస్మం పొందని ప్రచారకులుగా అర్హులైనవారు పరిచర్యలో భాగంవహించడం మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా ఉంటుంది. ఈ ఉత్తేజపూరితమైన పనిలో చిన్నపిల్లలు కూడా భాగంవహించవచ్చు.
6 అవసరమైనదల్లా ఒక సులభమైన అందింపు మాత్రమే. మీరిలా చెప్పవచ్చు:
◼ “[నగరం లేక పట్టణం పేరు]లోని ప్రతి కుటుంబానికి ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని అందించే పనిలో నేను స్వచ్ఛందంగా సేవచేస్తున్నాను. ఇది మీ ప్రతి. దయచేసి దీన్ని చదవండి.” రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టేటప్పుడు ప్రచారానికి ఉపయోగించే బ్యాగ్‌ను తీసుకువెళ్ళకుండా ఉండడం శ్రేయస్కరం.
7 క్షేత్రసేవ కోసం మంచి ప్రణాళికతో కూడిన కూటాలు: సాక్ష్యమివ్వడం కొరకైన ఏర్పాట్లు అనువైనవిగానూ ఆచరణాత్మకమైనవిగానూ ఉండేలా పెద్దలు తప్పకుండా చూడాలి. ప్రత్యేకించి సేవా పైవిచారణకర్త, ప్రతి ఒక్కరూ పూర్తిగా పరిచర్యలో పాల్గొనేందుకు వీలుగా ఇళ్ళు, వ్యాపార ప్రాంతాలు సరిపడేన్ని ఉన్నాయా అన్నది నిర్ధారించుకోవాలి. వారపు రోజుల్లోనూ వారాంతాలలోనూ సాయంత్రాల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడ క్షేత్రసేవకు కూటాల్ని నిర్వహించాలి. స్కూలు విద్యార్థుల, షిఫ్ట్ వర్కర్ల ఇంకా ఇతరుల ప్రయోజనార్థమై సాయంకాలానికి కాస్త ముందు కలుసుకోవడానికి ఏర్పాట్లు చేయవచ్చు.
8 ఇండ్లలో లేని వారిని గూర్చి ఏమి చేయాలి: ఎంతమందిని కలిసి మాట్లాడగలమో అంతమందితో మాట్లాడడమే మన లక్ష్యం. మీరు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఒకవేళ ఎవరూ లేకపోతే మరోరోజు మరో సమయంలో వారిని కలిసేందుకు వాళ్ళ చిరునామా వ్రాసుకోండి. ఆ లక్ష్యంలో చివరి వారం వరకూ ఆ ఇంటి వారిని మీరు కలవలేకపోయినట్లయితే రాజ్య వార్త నెం. 36ను వాళ్ళ కోసం, దారిన వెళ్ళేవారికి కనిపించనిచోట ఒక ప్రతిని విడిచిపెట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఈ లక్ష్యం సమయంలో పూర్తి చేయలేనంత పెద్ద ప్రాంతాల్లోనూ పని చేస్తున్నప్పుడు, ఇండ్లలో ఎవరూ లేకపోతే రాజ్య వార్త నెం. 36 ప్రతిని మొదటి సందర్శనంలోనే విడిచిపెట్టి రమ్మని స్థానిక పెద్దలు మీకు నిర్దేశించవచ్చు.
9 పూర్తిగా నిమగ్నులమై ఉందాం! ఈ లక్ష్యం పూర్తయ్యేలోగా, తమ ప్రాంతాలను పూర్తి చేయడానికి సంఘాలు కృషిచేయాలి. మీ ప్రాంతం చాలా పెద్దదైతే, ఆచరణాత్మకమూ క్షేమకరమూ అయిన చోట కొందరు ప్రచారకులు ఒంటరిగా పని చేయవచ్చు. కావల్సినంత మంది యోగ్యులను చేరుకునేందుకు ఈ ఏర్పాటు సహాయం చేస్తుంది. ఆసక్తి చూపించిన వారి వివరాలతో ఒక మంచి పట్టికను తయారుచేసుకోవడాన్ని మర్చిపోవద్దు.
10 సంఘానికి ఎన్ని అదనపు పత్రికలు అవసరమో పెద్దలు ముందే తెలుసుకుని, దాని ప్రకారం ఆర్డర్ చేయాలి. ప్రతి సంఘానికీ కరపత్రాలు పంపబడతాయి కనుక, రాజ్య వార్త నెం. 36 కోసం ఆర్డర్ పంపవలసిన అవసరం లేదు. కరపత్రాల పంపిణీ కోసం ప్రత్యేక, క్రమ, సహాయ పయినీర్లు ఒక్కొక్కరికీ 300 ప్రతులూ ఒక్కో ప్రచారకునికి 100 ప్రతుల చొప్పున కేటాయించబడతాయి. కాబట్టి ఈ ప్రత్యేక కార్యకలాపంలో నిమగ్నులవ్వడానికి, మీరు ఆసక్తితో ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారా? దేవుడు వాగ్దానం చేసిన సమీప భవిష్యత్తులోని జీవితాన్ని గురించి తెలుసుకొనేందుకు మన పొరుగువారికి సహాయపడేలా మనం ఎంతటి ఆధిక్యతను పొందామో కదా!