ప్రాంతీయ సేవలో ఉపయోగించుటకు ఉపోద్ఘాతాలు
వ్యాఖ్యానములు: మీరు ప్రాంతీయ సేవలో పాల్గొనేటప్పుడు ఏ విధమైన ఉపోద్ఘాతాన్ని ఉపయోగించాలో తీర్మానించుటకు, మూడు విషయాలకు అధిక శ్రద్ధనివ్వాలి: (1) “రాజ్యసువార్త” వర్తమానాన్ని ప్రకటించాలని మనమాజ్ఞాపింపబడ్డాము. (మత్తయి 24:14) మనం దానిని సూటిగా చర్చించనప్పుడు సహితం, దాని అవసరతను గ్రహించుటకు లేదా దానియెడల శ్రద్ధచూపడానికున్న అడ్డంకులను బహుశ తొలగించుటకు ప్రజలకు సహాయం చేయవలెననే విషయాన్ని మన మనస్సులో ఉంచుకోవాలి. (2) మనం కలుసుకునే ప్రజల సంక్షేమం యెడల నిజమైన శ్రద్ధ, యేసువలెనే వారి హృదయాల్ని చేరుటకు మనకు సహాయం చేస్తుంది. (మార్కు 6:34) ఆప్యాయంగా చిరునవ్వు నవ్వడం, స్నేహపూర్వకంగా పలకరించడం, వారు మాట్లాడినప్పుడు వినాలని ఇష్టపడడం, ఆ తర్వాత తదనుగుణంగా మనం మాట్లాడ్డం, ఆలాగే వారి అభిప్రాయాల్ని వారు వ్యక్తపరచేటట్లు ప్రోత్సహించే ప్రశ్నలడిగి వారి ఉద్దేశాన్ని మరిచక్కగా అర్థంచేసుకోవడం ద్వారా అటువంటి నిజమైన శ్రద్ధను చూపించవచ్చును. (1 కొరిం. 9:19-23) (3) లోకంలోని కొన్ని ప్రాంతాల్లో, సందర్శకులు తామొచ్చిన కారణాన్ని చెప్పకముందు కొన్ని ఆచారాల్ని పాటించాల్సి ఉంటుంది. మరోచోట తమకు తెలియని వ్యక్తి వచ్చినప్పుడు వెంటనే అతనెందుకొచ్చాడో తెల్పాలని గృహస్థులు ఎదురుచూస్తారు.—లూకా 10:5 పోల్చండి.
ఈ క్రిందగల కొన్ని ఉపోద్ఘాతాలు అనుభవజ్ఞులైన సాక్షులు కొందరు సంభాషణలను ఎలా ఆరంభించారో చూపిస్తాయి. మీరు నిస్సందేహముగా వాటిని మీ స్వంత మాటల్లో పెట్టాలని కోరుకుంటారు. అంతేకాదు, మంచి విజయం సాధించిన మీ సంఘమందలి ఇతర సాక్షుల సలహాలు తీసుకోవడం కూడ సహాయకరమని మీరు కనుగొంటారు.
అర్మగెద్దోను
• ‘అనేకమంది ప్రజలు అర్మగెద్దోనును గూర్చి శ్రద్ధ కల్గియున్నారు. ఒకపెద్ద అణుయుద్ధాన్ని సంబోధిస్తూ ప్రపంచ నాయకులు ఆ పదాన్ని ఉపయోగించుట వారు విన్నారు. అర్మగెద్దోనంటే మానవజాతికి దానిభావమేమని మీరనుకుంటున్నారు? . . . నిజానికి, అర్మగెద్దోనను పదం బైబిలునుండి తీసుకొనబడింది, దానికి లోకం సాధారణంగా చెప్పేదానికి భిన్నమైన భావం ఉంది. (ప్రక. 16:14, 16) తప్పించుకొనే దృష్టితో మనం వ్యక్తిగతంగా చేయాల్సిన పనులను కూడ బైబిలు చూపిస్తుంది. (జెఫన్యా 2:2, 3)’
బైబిలు/దేవుడు
• ‘హల్లో. మీకొక ప్రాముఖ్యమైన వర్తమానం తెలియజేయాలని నేను వచ్చాను. ఇక్కడ బైబిల్లో ఏంచెప్పబడిందో ఒకసారి చూడండి. (ప్రకటన 21:3, 4 వంటి లేఖనం చదవండి) దీన్నిగురించి మీరేమనుకుంటారు? అది మీ దృష్టికి బాగుందా?’
• ‘జీవిత సమస్యలతో వ్యవహరించడానికి ఆచరణయోగ్యమైన సహాయం మనమెక్కడ కనుగొనగలమో ఆ విషయాన్ని గూర్చి మేము మా పొరుగువారితో మాట్లాడుతున్నాము. గతంలో, అనేకులు బైబిల్ని పరిశీలించారు. అయితే మనం దృక్పథాలు మారుతున్న కాలంలో జీవిస్తున్నాము. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? బైబిలు దేవుని వాక్యమని మీరు నమ్ముతారా లేదా ఎవరో మనుష్యులు వ్రాసిన ఒక మంచి గ్రంథమని భావిస్తారా? . . . అది దేవునినుండి వచ్చినట్లయితే, ఒకవ్యక్తి దాన్నెలా నిశ్చయంగా నమ్మగలడని మీరు భావిస్తారు?’
[• ‘మీరు ఇంటిదగ్గర ఉన్నారు చాలా సంతోషం. నేను మా ఇరుగుపొరుగువారితో బైబిలు (లేదా, పరిశుద్ధ లేఖనాల) నుండి ప్రోత్సాహకరమైన ఒక అంశాన్ని పంచుకుంటున్నాను. మీరిలా ఎప్పుడైనా ఆలోచించారా: . . . ? (మీ సంభాషణా చర్చకు నడిపే ఒక ప్రశ్నవేయండి.)’]
• ‘బైబిలు చదవాలని మేమందర్ని ప్రోత్సహిస్తున్నాము. ప్రాముఖ్యమైన ప్రశ్నలకు అదిచ్చే జవాబులు తరచు ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఉదాహరణకు: . . . (కీర్తన 104:5; లేదా దాని. 2:44; లేదా మరొకటి).’
• ‘మేమీరోజు మన ఇరుగుపొరుగు వారందరిని సందర్శిస్తున్నాము. మేము మాట్లాడిన కొందరికి దేవునియందు నమ్మకముంది. మరికొందరికి ఆయన్ని నమ్మడం కష్టంగావుంది. మరి మీ అభిప్రాయమేమిటి? . . . మనకు కన్పించే ఈ విశ్వమును పరిశీలించుమని బైబిలు మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. (కీర్తన 19:1) ఈ గ్రహాల్ని నడిపించే నియమాలుకూడ ఆయననుగూర్చి మనకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. (కీర్తన 19:7-9)’
నేరము/భద్రత
• ‘హల్లో. మేము వ్యక్తిగత భద్రతను గూర్చి ప్రజలతో మాట్లాడుతున్నాము. మన చుట్టూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, అవి మన జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. మీలాంటి, నాలాంటి ప్రజలు హాయిగా ఏ భయంలేకుండా రాత్రులందు వీధుల్లో నడిచే కాలమొకటొస్తుందని మీరనుకుంటున్నారా? (లేదా, ఈ సమస్యకు నిజమైన పరిష్కారమున్నదని మీరు భావిస్తున్నారా?) . . . (సామె. 15:3; కీర్తన 37:10, 11)’
[• ‘నాపేరు ——. నేను ఈ ప్రాంతంలోనే ఉంటాను. నేనీ ఉదయం వస్తుండగా, ప్రతిఒక్కరు (ఇటీవలే ఆ పరిసరాల్లో జరిగిన నేరాన్ని, లేదా స్థానికంగా ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించి) గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? . . . మన జీవితాల్ని మరింత సురక్షితం చేసుకోవడానికి మనకు సహాయపడగల దేదైనా ఉందని మీరనుకుంటున్నారా? . . . (సామె. 1:33; 3:5, 6)’]
ప్రస్తుత సంఘటనలు
[• ‘నమస్కారం. నాపేరు ——. నేను ఇక్కడే (ఆ వీధిపేరు లేదా ప్రాంతం పేరు చెప్పండి) ఉంటాను. మీరు రాత్రి టివిలో వార్తలు చూశారా? . . . దాన్నిగూర్చి (శ్రద్ధచూపగల ఏదైనా ఆనాటి సంఘటనను ప్రస్తావించండి)—మీ అభిప్రాయమేమిటి? . . . ఈ లోకానికి ఏమౌతుందని ప్రజలడగడం అసాధారణ విషయం కాదా? “అంత్యదినములని” బైబిలు పిలిచే కాలంలో మనం జీవిస్తున్నామని యెహోవాసాక్షులుగా మేము నమ్ముతాము. ఇక్కడ 2 తిమోతి 3:1-5లోని వివరణాత్మక వర్ణనను ఒకసారి గమనించండి.’ (రీజనింగ్ పుస్తకములో 234-243 పేజీలుకూడ చూడండి.)
• ‘మీరీవారం వార్తాపత్రికలో ఈ విషయం చదివారా? (వార్తకు సంబంధించిన పేపరు ముక్కను చూపండి.) దీన్నిగూర్చి మీరేమంటారు . . . ?’
• ‘నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. మీరు ఎంచుకోవాల్సివస్తే, లోకమిప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో దేన్ని మొదట సరిచేయాలని మీరిష్టపడతారు? (గృహస్థునికి ఏది అత్యధిక చింతను కల్గిస్తుందో తెలుసుకున్న తర్వాత, దాన్ని మీ చర్చకు ఆధారంగా ఉపయోగించండి.)’
ఉద్యోగము/గృహవసతి
• ‘ప్రతివారికి ఉద్యోగము, గృహవసతిని కల్పించుటకు ఏమిచేస్తే బాగుంటుందని మేము మీ పొరుగువారందరితో మాట్లాడుతున్నాము. ఈ అవసరాన్ని మానవ ప్రభుత్వాలు తీర్చగలవని ఎదురుచూడ్డం సమంజసమేనని మీరనుకుంటున్నారా? . . . అయితే ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలిసిన వ్యక్తి ఒకరున్నారు; ఆయనే మానవజాతి సృష్టికర్త. (యెషయా 65:21-23)’
[• ‘ఒక మంచి ప్రభుత్వాన్ని గూర్చిన తలంపును మేము మా పొరుగువారితో పంచుకుంటున్నాము. ఎలాంటి అవినీతిలేని, ప్రతివారికి ఉద్యోగం, గృహవసతి కల్పించగల ప్రభుత్వం కావాలని అనేకులు కోరుకుంటారు. యిలా ఏ ప్రభుత్వం చేయగలదని మీరనుకుంటున్నారు? . . . (కీర్తన 97:1, 2; యెషయా 65:21-23)’]
కుటుంబము/పిల్లలు
• ‘కుటుంబ జీవిత సమస్యలనెలా మరింత శ్రేష్ఠముగా పరిష్కరించుకొనగలమనే విషయంలో ఆసక్తిగల వారందరితో మేము మాట్లాడుతున్నాము. మనం చేయగల దాన్ని చేయడానికి మనమందరం ప్రయత్నిస్తాము, అయితే మనం మరింత విజయం సాధించడానికి మనకు సహాయపడగల దేదైనావుంటే దానియందు మనం ఆసక్తి కలిగియుండమా? . . . (కొలొ. 3:12, 18-21) మన కుటుంబాలకు నిజమైన భవిష్యత్తునందించే నిరీక్షణను బైబిలు మనకందిస్తుంది. (ప్రక. 21:3, 4)’
• ‘మన పిల్లలు సంతోషంగా జీవించాలని మనందరం కోరుకుంటాము. అయితే నేడు లోకంలోవున్న కష్టాల్నిబట్టి ఒక సంతోషకరమైన భవిష్యత్తు ఉంటుందని సహేతుకంగా అపేక్షించే కారణముందని మీరనుకుంటున్నారా? . . . కాబట్టి, మనపిల్లలు పెరిగినప్పుడు వారెదుర్కొనే లోకం ఎలావుంటుందని మీరనుకుంటున్నారు? . . . దేవుడు ఈ భూమిని జీవించడానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చబోతున్నాడని బైబిలు చూపిస్తుంది. (కీర్తన 37:10, 11) అయితే మనపిల్లలు దానిలో ఉంటారా లేదా అనేది ఎక్కువగా మనం చేసుకునే ఎంపికపై ఆధారపడి ఉంటుంది. (ద్వితీ. 30:19)’
భవిష్యత్తు/భద్రత
• ‘నమస్కారం. బాగున్నారా? . . . భవిష్యత్తును గూర్చిన అనుకూల దృక్పథాన్ని మేము మా పొరుగు వారందరితో పంచుకుంటున్నాము. జీవితాన్ని మీరలా చూడ్డానికి ప్రయత్నిస్తున్నారా? . . . కొన్ని పరిస్థితులు దీన్ని కష్టతరం చేయడాన్ని మీరు గమనించారా? . . . ఈ విషయంలో బైబిలు చాలా సహాయకరంగా ఉన్నట్లు నేను గుర్తించాను. మన కాలమందలి పరిస్థితుల్ని అది కళ్లకుకట్టినట్లు వర్ణిస్తుంది, అంతేకాదు అది వాటి భావాన్ని వివరిస్తూ, వాటి ఫలితమేమై యుంటుందో మనకు తెలియజేస్తుంది. (లూకా 21:28, 31)’
• ‘హల్లో. నాపేరు ——. మీ పేరేమిటండీ? . . . బైబిలు మనకందించే గొప్ప భవిష్యత్తును గూర్చి పరిశీలించుమని నేను మీలాంటి యౌవనస్థులందరిని ప్రోత్సహిస్తున్నాను. (ప్రకటన 21:3, 4 వంటి లేఖనాన్ని చదవండి.) అది మీ దృష్టికి బాగుందా?’
గృహ బైబిలు పఠనము
• ‘ఉచిత గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించే విషయం మీకు తెల్పుదామని వచ్చాను. మీరనుమతిస్తే, దాదాపు 200 దేశాల్లో ఆయాకుటుంబాలు బైబిలును తమ గృహమందే ఎలా చర్చిస్తున్నారో కేవలం కొద్దినిమిషాల్లోనే మీకు చూపిస్తాను. మన చర్చకు ఆధారంగా వీటిలో ఏ అంశాన్నైనా మనం తీసుకోవచ్చు. (పఠన పుస్తకములో విషయసూచికను చూపించండి.) దీనిలో మీకేది నచ్చుతుంది?’
• ‘మేము ఈ బైబిలు పఠన సహాయక పుస్తకాన్ని మా పొరుగువారికి చూపిస్తున్నాము. (దాన్ని చూపండి.) దీన్ని మీరింతకు ముందు చూశారా? . . . మీరు కేవలం కొద్ది నిమిషాలు కేటాయిస్తే మీ బైబిలుతోనే దీనిని ఎలా ఉపయోగించవచ్చో నేను మీకు చూపిస్తాను.’
అన్యాయము/బాధ
• ‘మానవులు అనుభవిస్తున్న అన్యాయాన్ని, బాధనుగూర్చి దేవుడు నిజంగా శ్రద్ధ కలిగియున్నాడాని మీరెప్పుడైనా ఆలోచించారా? . . . (ప్రసంగి 4:1; కీర్తన 72:12-14)’
రాజ్యము
• ‘నేను మా పొరుగువారితో మాట్లాడినప్పుడు, ఈనాడు మనమెదుర్కొంటున్న పెద్ద సమస్యల్ని అనగా నేరము, అధిక జీవన వ్యయం (లేదా ప్రస్తుతం అనేకమంది మనస్సుల్లోవున్న విషయమేదైనా) వంటి సమస్యల్ని నిజంగా పరిష్కరించగల ప్రభుత్వం క్రింద జీవించాలని చాలామంది కోరుతున్నట్లు నేను గ్రహించాను. అది కోరదగిందే కదా? . . . ఈనాడు అలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటారా? . . . వాస్తవానికి అలా పరిష్కరించగల ప్రభుత్వం కొరకు అనేకమంది ప్రార్థించారు కూడ. నిస్సందేహంగా మీరుకూడా అలా ప్రార్థించి యుండవచ్చు, అయితే అనేకమంది దానిని ఒక ప్రభుత్వంగా తలంచడం లేదు. (దాని. 2:44; కీర్తన 67:6, 7; మీకా 4:4.)’
• ‘మేము మా పొరుగువారిని ఒక ప్రశ్న అడుగుతున్నాము. మీ అభిప్రాయాన్ని మేము ఆహ్వానిస్తాము. దేవుని రాజ్యం రావాలని, ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమిపై నెరవేరాలని ప్రార్థించుడని యేసు మనకు బోధించినట్లు మీకు తెలుసు. కాబట్టి దేవుని చిత్తం నిజంగా భూమిపై జరుగునట్లు, ఈ ప్రార్థనకు ఎప్పుడైనా జవాబు లభిస్తుందని మీరనుకుంటున్నారా? . . . (యెషయా 55:10, 11; ప్రక. 21:3-5)’
• ‘నేను నా పొరుగువారందరితో మనమందరం ఎదుర్కోవాల్సిన ఒక ముఖ్యవిషయాన్ని గూర్చి చర్చిస్తున్నాను. అదేమంటే: మనం దేవుని ప్రభుత్వాన్ని అభిమానిస్తామా, లేక మానవ పరిపాలనే మనం కోరుకుంటామా? ఈనాడున్న లోక పరిస్థితుల దృష్ట్యా, మానవుల పరిపాలన కాకుండా మరొకటి అవసరమని మీరనుకుంటున్నారా? . . . (మత్తయి 6:9, 10; కీర్తన 146:3-5)’
అంత్యదినములు
• ‘ఈనాడు ప్రపంచంలో మనచుట్టూ జరుగుతున్న సంగతుల భావాన్ని చర్చించడానికి మేమందరిని కలుస్తున్నాము. అనేకమందిలో దేవునిలోను, బైబిల్లో ఆయన మనకు నిర్దేశించిన జీవన నియమాల్లోను ఆసక్తి సన్నగిల్లడం కనబడుతుంది. ప్రజలు ఒకరియెడల ఒకరుచూపే ప్రవర్తనపై యిది గొప్ప ప్రభావం చూపింది. ఇక్కడ 2 తిమోతి 3:1-5లో వ్రాయబడిన విషయాల్ని నేను మీకు చదివి వినిపిస్తాను, అది ఈనాటి లోకానికి ఎలా సరిపోతుందని మీరు తలస్తున్నారో దయచేసి చెప్పండి. (చదవండి) . . . భవిష్యత్తుతో మంచి పరిస్థితులు వస్తాయని ఎదురుచూడ్డం సహేతుకమంటారా? (2 పేతురు 3:13)’
• ‘ఈ లోకానికి రోజులు మూడాయని అనేకులు నమ్ముతారు. మనకాలాన్ని వారు “అంత్యదినములని” పిలుస్తారు. అయితే బైబిలు మనం ప్రస్తుత లోకాంతము నుండి తప్పించుకొని, పరదైసుగా మార్చబడు భూమిపై జీవించగలమనే విషయాన్ని చెబుతుందని మీరు గ్రహించారా? (జెఫన్యా 2:2, 3)’
[సూచింపబడిన ఉపోద్ఘాతాల పట్టికలో “ప్రస్తుత సంఘటనలు” కూడ చూడండి.]
జీవితము/సంతోషము
• ‘జీవితపరమార్థాన్ని గూర్చి మిక్కిలి శ్రద్ధగల వారిని కలుసుకోవడానికి మేము మా పొరుగువారిని సందర్శిస్తున్నాము. అనేకమంది ఎంతోకొంత సంతోషాన్ని అనుభవిస్తూనేవున్నారు. అయితే వారు అనేక సమస్యల్నికూడా ఎదుర్కొంటున్నారు. మనం వృద్ధులమయ్యే కొలది, జీవితం కొద్దిపాటిదనే విషయాన్ని మనం గ్రహిస్తాం. జీవితమంటే కేవలం యింతేనా? ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? . . . (ఏదెనులో దేవుని ఆది సంకల్పాన్ని గూర్చి, ఆ తర్వాత యోహాను 17:3; ప్రకటన 21:3, 4పై వ్యాఖ్యానించండి.)’
• ‘తమ బైబిలునందు “నిత్యజీవమనే” మాటను చదివినప్పుడు వారి తలంపేమిటో తెలుసుకుందామని మేమీ రోజు మా పొరుగువారిని దాన్ని గూర్చి అడుగుచున్నాము. అది ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే ఆ మాట బైబిల్లో మనకు దాదాపు 40 సార్లు కనబడుతుంది. ఆ జీవితం మనకెలాంటి భావం కలిగివుంది? . . . దాన్ని మనమెలా పొందగలం? (యోహాను 17:3; ప్రక. 21:4)’
• ‘నేటి జీవన విధానం యెడల నిజంగా శ్రద్ధ కలిగివున్న ప్రజలతో మేము మాట్లాడుతున్నాము. సజీవంగా ఉండాలనే మనలో అనేకులు కోరుకుంటారు, కాని నిజంగా సంతోషకరమైన జీవితం అసలు సాధ్యమేనా? అని అనేకమంది ఆలోచిస్తున్నారు. మరి మీరేమంటారు? . . . ఈనాడు సంతోషానికి ఏది పెద్ద అడ్డంకని మీరంటారు? . . . (కీర్తన 1:1, 2; గృహస్థునికి శ్రద్ధ కలిగించే ఇంకొన్ని లేఖనాలు వాడవచ్చు)’
ప్రేమ/దయ
• ‘లోకంలో నిజమైన ప్రేమ లేకపోవడం విషయంలో అనేకమంది బహుచింత కలిగియున్నట్లు మేము గమనించాము. మీరుకూడా అదేవిధంగా భావిస్తున్నారా? . . . ఈ వైఖరి ఎందుకుందని మీరనుకుంటున్నారు? . . . ఈ పరిస్థితిని గూర్చి బైబిలు ప్రవచించిందని మీకు తెలుసా? (2 తిమోతి 3:1-4) దానికిగల కారణమేమిటో కూడ అది వివరిస్తుంది. (1 యోహాను 4:8.)’
• ‘నాపేరు ——. మీ పొరుగువాళ్లలో నేనొకన్ని. నాకు చాలా శ్రద్ధ కలిగించే ఒక విషయం మీతో చెబుదామని మీ దగ్గరకు వచ్చాను, మీరుకూడా తప్పకుండా దాన్ని గమనించే ఉంటారు. దయచూపడానికి ఏమంత శ్రమపడాల్సిన పనిలేదు, అయినా ఈనాడది చాలా అరుదుగా చూపించబడుతుంది. ఈ పరిస్థితి యిలా ఎందుకుందని మీరనుకుంటున్నారు? . . . (మత్త. 24:12; 1 యోహాను 4:8)’
వృద్ధాప్యము/మరణము
• ‘మనమెందుకు ముసలివారిమై చనిపోతున్నామని మీరెప్పుడైనా ఆలోచించారా? సముద్రపు తాబేళ్లు కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తాయి. కొన్ని రకాల వృక్షాలు వేల సంవత్సరాలుగా జీవించాయి. అయితే మనుష్యులు కేవలం 70 లేదా 80 సంవత్సరాలకే చనిపోతున్నారు. అలా ఎందుకని మీరెప్పుడైనా ఆలోచించారా? . . . (రోమా. 5:12) ఈ పరిస్థితి ఎప్పుడైనా మారుతుందంటారా? . . . (ప్రక. 21:3, 4)’
• ‘మరణమే ఇక ముగింపా? లేక మరణం తర్వాత ఇంకేమైనా ఉందాని మీరెప్పుడైన అడిగారా? . . . మరణాన్ని గూర్చిన ఎలాంటి సందేహాన్నైనా బైబిలు తీరుస్తుంది. (ప్రసం. 9:5, 10) ఆలాగే అది విశ్వాసులైన వ్యక్తులకు నిజమైన నిరీక్షణ కలదని కూడా చూపిస్తుంది. (యోహాను 11:25)’
యుద్ధం/శాంతి
• ‘యుద్ధం లేని లోకంలో జీవించాలని కోరే ప్రజల కొరకు నేను వెదకుతున్నాను. ఈ శతాబ్దంలోనే రెండు ప్రపంచ యుద్ధాలతోసహా, వందలాది యుద్ధాలు జరిగాయి. . . . శాంతిప్రదమైన లోకాన్ని ఎవరు తీసుకురాగలరు? . . . (మీకా 4:2-4)’
• ‘ప్రతివాళ్లు తమకు శాంతిప్రదమైన లోకం కావాలని చెప్పడాన్ని మేము గమనించాము. అనేకమంది ప్రపంచ నాయకులు కూడా అలానే చెప్తారు. కాని దాన్ని సాధించడానికి ఎందుకంత కష్టమౌతుంది? . . . (ప్రక. 12:7-12)’
‘నా మతం నాకుంది’ అని అనేకులు అన్నప్పుడు
• ‘నమస్కారం. ఈ ప్రాంతమందున్న (లేదా, ఈ బ్లాకులోనున్న) కుటుంబాల నన్నింటిని మేము సందర్శిస్తున్నాము, అనేక కుటుంబాల వారికి వారి స్వంత మతముంది. నిస్సందేహంగా మీకుకూడా ఒక మతముండవచ్చు. . . . కాని మన మతమేదైననూ, మనందరం ఏకరీతిన అధిక జీవన వ్యయాన్ని, నేరాన్ని, రోగాలు మొదలగు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాము, కాదంటారా? . . . వీటికి నిజమైన పరిష్కారమేదైనా ఉందని మీరనుకుంటున్నారా? . . . (2 పేతురు 3:13; వగైరా)’
‘నేను పనితొందర్లో ఉన్నాను’ అని చాలామంది అన్నప్పుడు
• ‘హల్లో. ఒక ప్రాముఖ్యమైన సమాచారంతో మేమీ ప్రాంతమందున్న వారందరిని సందర్శిస్తున్నాము. నిశ్చయంగా మీరూ చాలా పనితొందర్లో ఉండొచ్చు, కాబట్టి నేను విషయాన్ని క్లుప్తంగానే చెప్తాను.’
• ‘నమస్తే. నాపేరు ——. నేను మీతో దేవుని రాజ్య ఆశీర్వాదాలను గూర్చి, వాటిని మనమెలా పొందగలమనే విషయాన్ని చర్చిద్దామని వచ్చాను. కాని మీరు పనితొందరలో (లేదా, బయటకు వెళ్లే పరిస్థితిలో) ఉన్నట్లున్నారు. కాబట్టి నేను కేవలం ఈ చిన్నమాట మీతో చెప్పివెళ్తాను.’
తరచు సేవచేసిన ప్రాంతంలో
• ‘మీరు ఇంటిదగ్గర ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాంతాన్ని మేము ప్రతివారం సందర్శిస్తున్నాము. మానవజాతికి దేవుని రాజ్యం చేయబోవు అద్భుత సంగతులను గూర్చి మరింత సమాచారం మీకు తెల్పాలని వచ్చాము.’
• ‘హల్లో. మిమ్మల్ని మరలా కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. . . . ఇంట్లో అందరూ బాగున్నారు కదా? . . . నేను మీతో ఈ విషయం చెప్పివెళ్దామని వచ్చాను . . . ’
[• ‘నమస్కారం. ఎలావున్నారు? . . . మీతో మరలా ఒకసారి మాట్లాడే అవకాశం లభిస్తుందేమోనని వచ్చాను. (ఆ తర్వాత మీరు ప్రత్యేకంగా చర్చించాలని కోరే అంశాన్ని తెల్పండి.)’]