మీరు ప్రయోజనం పొందుతున్నారా?
1 సమస్యలను ఎలా అధిగమించవచ్చు, సంతోషకరమైన జీవితాలను ఎలా గడపవచ్చు అన్నది తెలుసుకోవాలని నేడు కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు వ్యక్తిత్వ వికాసాలకూ మెరుగుదలకూ సహాయపడే పుస్తకాలను చదువుతున్నారు, తమ జీవితాలను ఎలా మెరుగుపరచుకోవాలో చూపించే ఉపదేశం కోసం వ్యక్తులవైపు సంస్థలవైపు చూస్తున్నారు. బహుశా, కొందరు ఆ విధంగా చేయడం వల్ల తమకు కలిగిన పరిమితమైన ప్రయోజనాలను గురించి చెప్పవచ్చు. అయితే, ప్రజలందరూ, మానవులు ప్రతిపాదించిన పద్ధతుల ద్వారా నిర్దేశాల ద్వారా శాంతినీ సంతృప్తికరమైన జీవితాన్నీ అనుభవిస్తున్నారని నేటి జీవితపు నాణ్యతను బట్టి చెప్పగలమా? అలా చెప్పడానికి ఎంత మాత్రం తావు లేదు!—1 కొరిం. 3:18-20.
2 మరొకవైపు, మన సృష్టికర్తయైన యెహోవా, తాను చెప్పేది వినేవాళ్ళకందరికీ అత్యంత సహాయకరమైన నిర్దేశాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. తన బోధల నుండి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలనే యెహోవా కోరుకుంటున్నాడు. మానవజాతి నిర్దోషంగా నడుచుకునేందుకు ఆయన తన ప్రేరేపిత వాక్యాన్ని ఉదారంగా ఇచ్చాడు. తన రాజ్యాన్ని గురించిన సువార్త భూమ్యంతటా ప్రచురించబడేలా ఏర్పాట్లు చేశాడు. (కీర్త. 19:7, 8; మత్త. 24:14; 2 తిమో. 3:16, 17) నిజమైన సంతోషకరమైన జీవితం, యెహోవా ఆజ్ఞలకు అవధానాన్నివ్వడంతో ముడిపడి ఉంది.—యెష. 48:17, 18.
3 ఈ లోకం అందించేటువంటి తమకు తాముగా చదువుకుని సహాయాన్ని పొందగల పుస్తకాల కన్నా, వ్యక్తిగత మెరుగుదలకు లోకం ప్రతిపాదించే పద్ధతుల కన్నా యెహోవా ఇచ్చే మార్గదర్శనం ఎంతో ఉన్నతమైనది. యెహోవా వాక్యంలో ఇవ్వబడిన మార్గదర్శనాన్నీ, ఆయన సంస్థ బోధిస్తున్న వాటినీ అనుసరిస్తే మనం నిజమైన సహాయాన్ని, శాశ్వతమైన ప్రయోజనాలను పొందగలం.—1 పేతు. 3:10-12.
4 మీరు సంఘ కూటాల్లో ఉన్నప్పుడు ప్రయోజనం పొందండి: యెహోవా తన మార్గాలను బోధించడంలో నేడు నిజమైన ఆసక్తిని కనబరుస్తున్నాడు. మనం ఆయన నిర్దేశాలకు అవధానమిస్తే ప్రయోజనం పొందుతాం. మన వారపు ఐదు కూటాలు, యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధకు తార్కాణాలుగా ఉన్నాయి. మనం సంఘ కూటాలకు హాజరైనప్పుడు, దేవుడ్ని గురించిన మన జ్ఞానం పెరుగుతుంది. మనం యెహోవాకు సన్నిహితులమవ్వడం ద్వారా, చెడుతనం నుండి మనలను మనం కాపాడుకోవడమెలాగో సంఘ కూటాల్లో నేర్చుకుంటాము. ఆ విధంగా మనం నవోత్తేజాన్ని పొందుతాము.
5 అంతేకాదు, సంఘ కూటాల్లో, మనం “హృదయములను విశాలపరచు”కోగల్గుతాం. (2 కొరిం. 6:13) హృదయములను విశాలపర్చుకోవడంలో, సంఘంలోని ఇతరులను గురించి తెలుసుకోవడం చేరివుంది. అపొస్తలుడైన పౌలు రోమ్‌లోని వారికి వ్రాసినట్లు, మనం ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతాం. (రోమా. 1:11, 12) హెబ్రీయుల్లో కొందరు క్రైస్తవ సహవాసాన్ని అప్పుడప్పుడు మానుకునే అలవాటును పెంపొందించుకుని ఉండవచ్చు. కనుకనే, పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, అలాంటి వారిని హెచ్చరించాడు.—హెబ్రీ. 10:24, 25.
6 జీవితంలో ఆనందభరితమైన సంతృప్తి ఉండడం అనేది ఇతరుల క్షేమాన్ని గురించి శ్రద్ధ చూపడంతో ముడిపడి ఉంటుంది. ఇతరుల సంతోషానికి తోడ్పడే మార్గాల కోసం వెదకాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. కనుక, నిశ్చయంగా మన క్రైస్తవ కూటాలు మన ప్రయోజనం కోసమూ, మనం ఎవరితోనైతే ఆరోగ్యకరమైన సాంగత్యాన్ని పెంపొందించుకున్నామో వారి ప్రయోజనం కోసమూ ఉన్నాయి. మనం ప్రయోజనం పొందాలంటే, మనవైపు నుండి కావలసిందల్లా మనం హృదయపూర్వకంగా పాల్గొనడమే.
7 ఇలాంటి తలంపునే, అపొస్తలుడైన పౌలు “దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము” అని తిమోతికి చేసిన ఉపదేశంలో తెలిపాడు. (1 తిమో. 4:7) ‘నేను సాధకము చేస్తున్నానా? సంఘ కూటాల్లో వింటున్న వాటి నుండి ప్రయోజనం పొందడాన్ని నేర్చుకుంటున్నానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. కూటాల్లో వింటున్న వాటికి మనం అవధానమిచ్చి, మనం నేర్చుకునే వాటిని ఆచరణలో పెట్టడానికి శ్రమించినప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలకు అవును అనే సమాధానాన్ని చెప్పుకోగలం. సంఘంలో సహోదరులు బోధిస్తున్నప్పుడు వారిని కాదుకానీ, తన ప్రజలకు నిర్దేశమిస్తున్న మహోపదేశకుడైన యెహోవాను మన విశ్వాస నేత్రములతో మనం తప్పనిసరిగా చూడగల్గాలి.—యెష. 30:20.
8 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటం: ఈ రెండు కూటాలు, మనం క్రైస్తవ పరిచర్యను ఫలప్రదంగా చేసేందుకు మనకు సహాయపడేలా రూపకల్పన చేయబడ్డాయి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల దాని కోసమే ఉంది. ఈ పాఠశాలలోని విద్యార్థులు నిర్దేశాలనూ ఉపదేశాన్నీ క్రమంగా పొందుతుంటారు. బహిరంగ ప్రసంగీకులుగా, దేవుని వాక్యపు బోధకులుగా మీరు సాధించిన పురోగతిని చూపగల అవకాశాలు మీకు ఈ పాఠశాలలో ఉన్నాయి. అయితే ఈ పాఠశాల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందాలంటే, మీరు ఈ పాఠశాలలో చేరి, హాజరు కావడం, క్రమంగా పాల్గొనడం, మీ నియామకాన్ని పూర్ణ హృదయంతో చేయడం అవసరం. మీకిచ్చే ఉపదేశాన్ని మీరు అంగీకరించి ఆచరణలో పెడితే, పురోగతిని సాధించగల్గుతారు.
9 సేవా కూటం, క్రైస్తవ పరిచర్య యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు బోధిస్తుంది. శిష్యులను తయారు చేసే పనిలో మనమెలా పాలుపంచుకోవచ్చో చూపిస్తుంది. ఈ రెండు కూటాల్లో అందజేయబడే సహాయం నుండి మీరూ మీ కుటుంబ సభ్యులూ పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నారా? “కుటుంబ సమేతంగా దినవచనాన్ని పరిశీలించాలని ఒక సేవా కూటంలో విన్నాము. మేము మునుపు అలా చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నాం” అని ఒక క్రైస్తవ దంపతులు చెప్పారు. దాని వల్ల వాళ్ళెలా ప్రయోజనం పొందారు? “భోజనపు బల్ల దగ్గర మా సంభాషణలు ఇప్పుడు మరింత ఆనందదాయకంగా ఉన్నాయని మేము కనుగొన్నాము. భోజనం వేళలో ఇప్పుడు వాగ్వివాదాలే లేవు” అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మరి చిన్న పిల్లలు కూడా కూటాల నుండి ప్రయోజనం పొందుతున్నారా? అవును, పొందుతున్నారు. “మా పిల్లలపై కూటాలు ప్రగాఢమైన ప్రభావాన్ని చూపుతున్నాయన్నది స్పష్టం. ఒక రోజు, మా ఆరేండ్ల కొడుకు అబద్ధాలు చెబుతుంటే పట్టుకున్నాం. అదే వారం కూటంలోని, ఉపదేశ ప్రసంగం అబద్ధాలు చెప్పడాన్ని గురించి చర్చించింది. వాడి ముఖంలో ఎంతో అపరాధ భావం కనిపించింది. వాడు వాళ్ళ నాన్న ముఖం వైపుకు చూశాడు, ఆ తర్వాత కుర్చీలో కుచించుకుపోయాడు. వాడికి విషయం అర్థమైంది. ఆ తర్వాత మాకు వాడితో ఇక సమస్యలు ఏమీ రాలేదు” అని తల్లి చెబుతుంది.
10 పరిచర్యను మెరుగుపరచుకునే సూచనలు సేవా కూటంలో ఇవ్వబడుతున్నందుకు ఒక పయినీర్ సహోదరి చాలా సంతోషిస్తుంది. ఎందుకని? “నేను పరిచర్యలో ఎప్పుడూ ఒకే పద్ధతిని ఉపయోగించేదాన్ని. మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన సూచనలు అంతగా పనిచేయవు అని కొన్నిసార్లు అనుకునేదాన్ని. కానీ, మనం ఆ సూచనలను ఉపయోగించడానికి ప్రయత్నించాలని సేవా కూటంలో విన్నప్పుడు, ఆ సూచనలను ఉపయోగించాలని భలే ఉత్సాహం కలిగేది. అలా ఉపయోగించినప్పుడు పరిచర్య నిజంగా చాలా పురికొల్పునిచ్చేది!” అని ఆమె వివరిస్తుంది. మన రాజ్య పరిచర్యలో ఒకసారి వచ్చిన సూచన ప్రకారం, ఆమె, మొదటి దర్శనంలోనే బైబిలు పఠనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టిన కొన్ని వారాల తర్వాత, ఒక అమ్మాయితో మొదటిసారి దర్శనంలోనే పఠనాన్ని ప్రారంభించింది. ఆ అమ్మాయి కొన్నాళ్ళుగా సహాయం కోసం ప్రార్థిస్తోందట.
11 ఒక ప్రసంగంలో వ్యక్తిగత ఎంపికల గురించిన బైబిలు ఉపదేశాన్ని విన్నప్పుడు యెహోవాయే మీతో స్వయంగా మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తుందా? ఒక సహోదరుడు అలాగే భావించాడు. “ఏయే రకాల వినోదాలు క్రైస్తవులకు సముచితమైనవి, ఏయే రకాల వినోదాలు అనుచితమైనవి అన్న విషయాన్ని ఇటీవల ఒక కూటంలోని, ఒక ప్రసంగంలో, ఒక సహోదరుడు చర్చించాడు. టీవీలో బాక్సింగ్ చూడడమంటే నాకు చాలా ఇష్టముండేది. కానీ, ఈ క్రీడ కూడా క్రైస్తవులకు అనుచితమైన వినోదాల కోవకు వస్తుందని ఆ కూటం తర్వాత నిర్ణయించుకున్నాను. కనుక అప్పటి నుండి నేను బాక్సింగ్ చూడడమే లేదు” అని ఆయన చెప్పాడు. అవును, ఈ సహోదరుడు, హింసాత్మకమైన ఈ క్రీడ చూడడంపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నప్పటికీ, యెహోవా నడిపింపుకు అణకువతో ప్రతిస్పందించాడు.—కీర్త. 11:5.
12 బహిరంగ ప్రసంగం, కావలికోట పఠనం, సంఘపుస్తక పఠనం: ప్రతివారం మనం వినే బహిరంగ ప్రసంగాలు వివిధ బైబిలు అంశాలను చర్చిస్తాయి. ఈ ప్రసంగాల నుండి మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతున్నారు? ఒక క్రైస్తవ భర్త తాను పొందిన ప్రయోజనాలను గురించి చెబుతూ, “ఒక బహిరంగ ప్రసంగం ఆత్మ ఫలాలనన్నింటినీ నొక్కి చెప్పింది. తానైతే, ఈ ఫలాలనన్నింటినీ అలవరచుకునేందుకు, ఒక్కోవారం ఒక్కో ఫలాన్ని ఎన్నుకుని దాన్ని అలవరచుకోవడానికి కృషి చేశాననీ, వారాంతంలో, తన దైనందిన వ్యవహారాల్లో ఆ ఫలాన్ని ఎలా కనబరిచానా అని ఆలోచించుకునేవాడిననీ, తర్వాతి వారం మరొక ఫలాన్ని అలవరచుకునేందుకు ప్రయత్నించేవాడిననీ ఆ ప్రసంగీకుడు చెప్పాడు. నాకు అది బాగా నచ్చింది, నేను కూడా అలాగే చేయడం మొదలుపెట్టాను” అని వివరించాడు. తాను నేర్చుకున్న దాన్ని ఎంత చక్కగా ఆచరణలో పెట్టాడు!
13 కావలికోట పఠనం, జీవితంలోని వివిధ పరిస్థితుల్లో బైబిలు సూత్రాలను ఆచరణలో పెట్టమని బోధిస్తుంది. జీవిత చింతలు ఉన్నప్పటికీ, హృదయాన్నీ మనస్సునూ ప్రశాంతంగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. క్రమానుగతంగా వెల్లడవుతున్న సత్యాన్ని ఎప్పటికప్పుడు మనకు తెలుపుతూ ఉంటుంది. ఉదాహరణకు, మే 1, 1999 కావలికోటలోని, “ఇవి జరుగవలసియున్నవి,” “చదువువాడు గ్రహించుగాక,” “మెలకువగా ఉండండి, తీవ్రంగా కృషిచేయండి!” అనే శీర్షికల నుండి మనం ప్రయోజనం పొందలేదా? ఈ పఠన శీర్షికలు వ్యక్తిగతంగా మీ పై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? భవిష్యత్తును గురించి యేసు ఇచ్చిన హెచ్చరికను మీరు గంభీరంగా తీసుకున్నారని మీ ప్రవర్తన ద్వారా చూపిస్తున్నారా? ‘నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలంలో నిలవడం’ కనిపించినప్పుడు రానున్న పరీక్షలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారా? (మత్త. 24:15-22) భౌతిక వస్తువులను సమకూర్చుకోవడం కాదు గానీ, యెహోవా నామాన్ని పవిత్రపరచడమే మీకు ఎక్కువ ప్రాముఖ్యమని మీ లక్ష్యాలూ, మీ జీవిత విధానమూ చూపిస్తున్నాయా? కావలికోట పఠనం నుండి ఇప్పుడు ప్రయోజనం పొందడాన్ని మనం నేర్చుకోవడం లేదా?
14 ప్రతి వారం, మనం సంఘ పుస్తక పఠనంలో ఎంత నేర్చుకుంటున్నామో ఆలోచించండి. ఈ మధ్య మనం బైబిలు గ్రంథమైన ప్రకటన పుస్తకాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం. మనం ఈ బైబిలు పుస్తకాన్ని గురించి పఠిస్తున్న ఈ నాలుగు నెలల్లో, ఒక్కోవారం గడుస్తున్న కొలది మన విశ్వాసం పెరుగుతున్నట్లు మనం చూడడం లేదా?
15 మనం ఆనందంగా జీవించడమెలాగో యెహోవా మనకు నేర్పిస్తున్నాడు: మనం దేవుని ఆజ్ఞలకు అవధానమిచ్చినప్పుడు అనవసరమైన హృదయవేదనలను నివారించుకుంటాం. అంతేకాక, ఆనందమయ జీవితమంటే ఏమిటో మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. యెహోవా నడిపింపును అనుసరిస్తూ, మనం ప్రేక్షకులముగా మాత్రమే ఉండక, ఆయన పనిలో భాగస్థులమౌతాం. అవును, దేవుని పనిని చేస్తున్నవారు ధన్యులు.—1 కొరిం. 3:9; యాకో. 1:25.
16 సంఘ కూటాలలో, మీరు వింటున్న విషయాలను ఎలా ఆచరణలో పెట్టాలో అలా వింటున్నప్పుడే ఆలోచించుకోండి. (యోహా. 13:17) మీ పూర్ణ హృదయంతో దేవునికి ఉత్సాహంగా సేవచేయండి. అలా చేసినప్పుడు మీ ఆనందం పొంగిపొర్లుతుంది. మీ జీవితం మరింత సుసంపన్నమైనదిగాను, అర్థవంతమైనదిగాను ఉంటుంది. అవును, కూటాల నుండి మీరు ప్రయోజనం పొందగలరు.