కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 7 పేజీలు 59-70
  • “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా” పురికొల్పే కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా” పురికొల్పే కూటాలు
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంఘ కూటాలు
  • వారాంతంలో జరిగే కూటం
  • వారం మధ్యలో జరిగే కూటం
  • క్షేత్రసేవా కూటాలు
  • కొత్తగా ఏర్పడిన సంఘాల్లో లేదా చిన్న సంఘాల్లో కూటాల ఏర్పాట్లు
  • ప్రాంతీయ సమావేశాలు
  • ప్రాదేశిక సమావేశాలు
  • ప్రభువు రాత్రి భోజనం
  • ఆరాధన కోసం సమకూడడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • క్షేత్రసేవా కూటాలు, వాటికున్న ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి
    మన రాజ్య పరిచర్య—2015
  • క్షేత్రసేవా కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందండి
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 7 పేజీలు 59-70

7వ అధ్యాయం

“ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా” పురికొల్పే కూటాలు

శతాబ్దాలుగా, యెహోవా ప్రజలు ఓ క్రమపద్ధతిలో సమకూడుతున్నారు. ప్రాచీన ఇశ్రాయేలులో, మూడు ముఖ్యమైన పండుగలను ఆచరించడానికి పురుషులందరూ యెరూషలేముకు వెళ్లేవాళ్లు. (ద్వితీ. 16:16) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా క్రమంగా సమకూడేవాళ్లు, తరచూ సహోదరుల ఇళ్లల్లో కలుసుకునేవాళ్లు. (ఫిలే. 1, 2) నేడు మనం కూడా కూటాల్లో, ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో సమకూడుతున్నాం. దేవుని సేవకులు ఎందుకు అలా సమకూడతారు? ఎందుకంటే అది మన ఆరాధనలో ఓ ముఖ్యమైన భాగం.—కీర్త. 95:6; కొలొ. 3:16.

2 అంతేకాదు, కూటాలకు హాజరైనవాళ్లు కూడా ప్రయోజనం పొందుతారు. ప్రతీ ఏడో పర్ణశాలల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పబడింది: “వాళ్లు విని మీ దేవుడైన యెహోవా గురించి నేర్చుకొని, ఆయనకు భయపడుతూ ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా మీరు ప్రజల్ని అంటే పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని, మీ నగరాల్లో ఉన్న పరదేశుల్ని సమావేశపర్చండి.” (ద్వితీ. 31:12) కాబట్టి, సమకూడడానికి ముఖ్య కారణం ‘యెహోవాచేత బోధించబడడం.’ (యెష. 54:13) అంతేకాదు, కూటాల్లో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, ప్రోత్సాహం పొందడానికి, తోటివాళ్ల సహవాసం ద్వారా బలపడడానికి కూడా అవకాశం దొరుకుతుంది.

సంఘ కూటాలు

3 సా.శ. 33 పెంతెకొస్తు పండుగ తర్వాత సమకూడిన శిష్యులు అపొస్తలులు బోధించేవాటిని పట్టుదలతో నేర్చుకుంటూ, “ప్రతీరోజు ఏక మనసుతో, ఒకే ఉద్దేశంతో ఆలయంలో కలుసుకుంటూ” ఉన్నారు. (అపొ. 2:42, 46) ఆ తర్వాత కాలంలో, క్రైస్తవులు ఆరాధన కోసం సమకూడినప్పుడు ప్రేరేపిత లేఖనాల్ని, అపొస్తలులూ ఇతర శిష్యులూ రాసిన ఉత్తరాల్ని చదివేవాళ్లు. (1 కొరిం. 1:1, 2; కొలొ. 4:16; 1 థెస్స. 1:1; యాకో. 1:1) అంతేకాదు, సంఘమంతా కలిసి ప్రార్థించేవాళ్లు. (అపొ. 4:24-29; 20:36) కొన్నిసార్లు, మిషనరీ సేవలో తమకు ఎదురైన అనుభవాల్ని చెప్పేవాళ్లు. (అపొ. 11:5-18; 14:27, 28) బైబిలు సిద్ధాంతాలను, అలాగే ప్రవచనాల నెరవేర్పులను పరిశీలించేవాళ్లు. క్రైస్తవ ప్రవర్తనకు, దైవభక్తికి సంబంధించిన విషయాల గురించి బోధించేవాళ్లు. ఉత్సాహంగా మంచివార్త ప్రకటించమని అందర్నీ ప్రోత్సహించేవాళ్లు.—రోమా. 10:9, 10; 1 కొరిం. 11:23-26; 15:58; ఎఫె. 5:1-33.

ఈ కష్టమైన చివరి రోజుల్లో, క్రమంగా కూటాలకు హాజరవ్వడం ద్వారా వచ్చే ప్రోత్సాహం మనకు అవసరం

4 నేడు, క్రైస్తవ కూటాలు అపొస్తలుల కాలంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతున్నాయి. పౌలు పవిత్రశక్తి ప్రేరణతో హెబ్రీయులు 10:24, 25 లో ఇచ్చిన ఈ సలహాను మనం పాటిస్తాం: “మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయడం కొందరికి అలవాటు, కానీ మనం అలా మానేయకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం, ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇవన్నీ చేద్దాం.” ఈ కష్టమైన చివరిరోజుల్లో క్రమంగా కూటాలకు వెళ్లడం ద్వారా కలిగే ప్రోత్సాహం మనకు అవసరం. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం, మన యథార్థతను కాపాడుకుంటాం. (రోమా. 1:11, 12) క్రైస్తవులమైన మనం కుటిలమైన, వక్ర తరం మధ్య జీవిస్తున్నాం. భక్తిహీన ప్రవర్తనను, లోక సంబంధమైన కోరికల్ని విడిచిపెట్టాం. (ఫిలి. 2:15, 16; తీతు 2:12-14) కాబట్టి యెహోవా ప్రజలతో కాకుండా, ఈ లోకంలో ఇంకెవరితో సహవసించగలం? (కీర్త. 84:10) దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, చర్చించుకోవడం కన్నా ప్రయోజనకరమైనది ఇంకేదైనా ఉందా? మన ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడిన అలాంటి వేర్వేరు కూటాల గురించి పరిశీలించండి.

వారాంతంలో జరిగే కూటం

5 వారాంతంలో జరిగే కూటంలోని మొదటి భాగం బైబిలు ప్రసంగం. అది, ప్రత్యేకంగా సాక్షులుకాని వాళ్లకోసం లేదా మొదటిసారి కూటాలకు వస్తున్న వాళ్లకోసం తయారుచేయబడింది. కొత్తగా సహవసిస్తున్నవాళ్ల ఆధ్యాత్మిక అవసరాల్ని, అలాగే సంఘ ప్రచారకుల ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడంలో బహిరంగ ప్రసంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.—అపొ. 18:4; 19:9, 10.

6 క్రీస్తుయేసు, ఆయన అపొస్తలులు, వాళ్ల సహచరులు నేడు యెహోవా ప్రజల సంఘాల్లో మనం జరుపుకునేలాంటి బహిరంగ కూటాల్ని జరుపుకునేవాళ్లు. యేసు భూమ్మీద జీవించినవాళ్లలో అత్యంత గొప్ప ప్రసంగీకుడు అనడంలో సందేహం లేదు. ఆయన గురించి కొంతమంది ఇలా అన్నారు: “ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు.” (యోహా. 7:46) వినేవాళ్లను ఆశ్చర్యపరుస్తూ యేసు అధికారంగల వ్యక్తిలా మాట్లాడాడు. (మత్త. 7:28, 29) ఆయన ప్రకటించిన సందేశాన్ని హృదయంలోకి తీసుకున్నవాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందారు. (మత్త. 13:16, 17) అపొస్తలులు కూడా యేసు బాటలో నడిచారు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున పేతురు ఇచ్చిన శక్తివంతమైన ప్రసంగాన్ని అపొస్తలుల కార్యాలు 2:14-36 లో మనం చదవవచ్చు. ఆ ప్రసంగాన్ని విన్న వేలమంది చర్య తీసుకునేలా ప్రోత్సహించబడ్డారు. ఆ తర్వాత, ఏథెన్సులో పౌలు ఇచ్చిన ప్రసంగాన్ని విన్నవాళ్లలో కూడా కొందరు విశ్వాసులయ్యారు.—అపొ. 17:22-34.

7 అదేవిధంగా నేడు కూడా ప్రతీవారం సంఘాల్లో అలాగే ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో ఇవ్వబడే బహిరంగ ప్రసంగాల ద్వారా లక్షలమంది ప్రయోజనం పొందుతున్నారు. మనం క్రైస్తవ బోధల్ని బాగా తెలుసుకోవడానికి, రాజ్య సేవలో కొనసాగడానికి అలాంటి ప్రసంగాలు సహాయం చేస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్లను, ఇతరుల్ని మన కూటాలకు ఆహ్వానించడం ద్వారా, బైబిల్లోని ప్రాథమిక బోధల్ని తెలుసుకునేలా మనం వాళ్లకు ఎంతో సహాయం చేయవచ్చు.

8 బహిరంగ ప్రసంగాలు వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు బైబిలు సిద్ధాంతాలు, ప్రవచనాలు, కుటుంబానికి, వైవాహిక జీవితానికి సంబంధించిన లేఖన సూత్రాలు, సలహాలు అలాగే యౌవనస్థులకు ఎదురయ్యే సవాళ్లు, క్రైస్తవ ప్రమాణాలు వంటి అంశాల గురించి ప్రసంగాలు ఉంటాయి. కొన్ని ప్రసంగాలు యెహోవా చేసిన అద్భుతమైన సృష్టి గురించి నొక్కి చెప్తాయి. మరికొన్ని ప్రసంగాలు, బైబిలు కాలాల్లోని వ్యక్తుల ఆదర్శవంతమైన విశ్వాసం, ధైర్యం, యథార్థత గురించీ అలాగే వాళ్లనుండి మనం నేర్చుకోగల పాఠాల గురించీ చెప్తాయి.

9 బహిరంగ ప్రసంగాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మనం దాన్ని శ్రద్ధగా వినాలి. అలాగే ప్రసంగీకుడు చెప్పే లేఖనాల్ని బైబిల్లో చూడాలి. ఆయన లేఖనాల్ని చదువుతూ వివరిస్తున్నప్పుడు బైబిల్లో గమనిస్తూ ఉండాలి. (లూకా 8:18) ఆ విధంగా, చర్చిస్తున్న విషయాల్ని మనం రూఢిపర్చుకున్నప్పుడు, నేర్చుకున్న వాటికి అంటిపెట్టుకొని ఉండాలనీ వాటిని పాటించాలనీ నిశ్చయించుకుంటాం.—1 థెస్స. 5:21.

10 ప్రసంగీకులు అందుబాటులో ఉంటే, సంఘంలో ప్రతీవారం తప్పకుండా బహిరంగ ప్రసంగం ఉంటుంది. కొన్నిసార్లు, దగ్గరి సంఘాల నుండి కూడా ప్రసంగీకులు వచ్చి బహిరంగ ప్రసంగం ఇస్తారు. ఒకవేళ సంఘంలో ప్రసంగీకులు తక్కువగా ఉంటే, వీలైనప్పుడల్లా ఆ ప్రసంగాలు ఇవ్వబడతాయి.

11 వారాంతంలో జరిగే కూటంలోని రెండో భాగం, కావలికోట అధ్యయనం. కావలికోట అధ్యయన ప్రతిలో ఉన్న ఆర్టికల్స్‌ ప్రశ్నాజవాబుల పద్ధతిలో చర్చించబడతాయి. కావలికోట ద్వారా యెహోవా మనకు తగిన సమయంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తాడు.

12 కావలికోట అధ్యయన ఆర్టికల్స్‌ తరచూ, మన రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాల్ని ఎలా అన్వయించుకోవాలో చర్చిస్తాయి. క్రైస్తవులు “లోక స్ఫూర్తిని” ఎదిరించడానికి, అపవిత్రమైన ప్రవర్తనకు దూరంగా ఉండడానికి ఈ ఆర్టికల్స్‌ తోడ్పడతాయి. (1 కొరిం. 2:12) బైబిలు సిద్ధాంతాల మీద, ప్రవచనాల మీద కావలికోట పత్రిక మరింత వెలుగును ప్రసరింపజేస్తుంది. దానివల్ల, సత్యంలో వెనకబడకుండా ప్రతీఒక్కరం నీతిమంతుల దారిలో ఉండగలుగుతాం. (కీర్త. 97:11; సామె. 4:18) మనం కావలికోట అధ్యయనానికి హాజరై, వ్యాఖ్యానాలు చేయడం ద్వారా, దేవుని నీతియుక్తమైన కొత్తలోకం కోసం సంతోషంగా ఎదురుచూడగలుగుతాం. (రోమా. 12:12; 2 పేతు. 3:13) కావలికోట అధ్యయనం ద్వారా మనం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని పెంపొందించుకుంటాం. యెహోవాను ఉత్సాహంగా సేవించాలనే మన కోరిక కూడా బలపడుతుంది. (గల. 5:22, 23) అలాగే, మనం కష్టాల్ని తట్టుకోవడానికి బలాన్ని పొందుతాం, “వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు” సాధించేలా “భవిష్యత్తు కోసం మంచి పునాది” వేసుకుంటాం.—1 తిమో. 6:19; 1 పేతు. 1:6, 7.

13 ఆధ్యాత్మిక పోషణ కోసం చేయబడిన ఈ ఏర్పాటు నుండి మనమెలా పూర్తి ప్రయోజనం పొందవచ్చు? ఒంటరిగా గానీ కుటుంబమంతా కలిసి గానీ ఆర్టికల్‌ని ముందే సిద్ధపడాలి, ఇచ్చిన లేఖనాల్ని బైబిల్లో చూడాలి, కూటం జరుగుతున్నప్పుడు సొంతమాటల్లో వ్యాఖ్యానించాలి. అలా చేస్తే, సత్యం మన హృదయంలో నాటుకుపోతుంది. అంతేకాదు, మన విశ్వాసాన్ని వ్యాఖ్యానాల ద్వారా తెలియజేసినప్పుడు, ఇతరులు వాటిని విని ప్రయోజనం పొందుతారు. వేరేవాళ్లు వ్యాఖ్యానిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వింటే, వారంవారం చర్చించే ఆర్టికల్‌ నుండి ప్రయోజనం పొందుతాం.

వారం మధ్యలో జరిగే కూటం

14 మన క్రైస్తవ జీవితం, పరిచర్య అనే కార్యక్రమం కోసం ప్రతీవారం సంఘమంతా రాజ్యమందిరంలో కలుసుకుంటుంది. మనం దేవుని పరిచారకులుగా ‘అర్హులమయ్యేలా’ సహాయం చేయడానికి ఆ కూటంలోని మూడు భాగాలు రూపొందించబడ్డాయి. (2 కొరిం. 3:5, 6) దానికి సంబంధించిన పట్టిక, సమాచారం ప్రతీనెల వచ్చే మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ఉంటాయి. పరిచర్యలో ఎలా మాట్లాడాలో తెలియజేసే నమూనాలు కూడా ఈ వర్క్‌బుక్‌లో ఉంటాయి.

15 ఈ కూటంలోని మొదటి భాగం పేరు, దేవుని వాక్యంలో ఉన్న సంపద. బైబిలు వృత్తాంతాల నేపథ్యాన్ని, సందర్భాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ భాగం సహాయం చేస్తుంది. అంతేకాదు, ఆ వృత్తాంతాల్లోని పాఠాల్ని మనమెలా అన్వయించుకోవచ్చో కూడా ఈ భాగం చర్చిస్తుంది. ఈ భాగంలో ఓ ప్రసంగం, బైబిల్లోని కొన్ని వచనాల్ని చదవడం, అలాగే ఆ వారంలో చదవాల్సిన బైబిలు అధ్యాయాలపై చర్చ ఉంటాయి. వాటికి సంబంధించిన దృశ్య సహాయకాలు, వర్క్‌షీట్లు మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ఉంటాయి. ఇలా బైబిల్ని లోతుగా పరిశీలించడంవల్ల వ్యక్తిగత జీవితంలో ప్రయోజనం పొందుతాం, అలాగే మన బోధనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటాం. దానివల్ల, ‘ప్రతీ మంచిపని చేయడానికి పూర్తిగా సమర్థులు అవ్వగలుగుతాం, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాం.’—2 తిమో. 3:16, 17.

16 ఈ కూటంలోని రెండో భాగం పేరు, చక్కగా సువార్త ప్రకటిద్దాం. పరిచర్య కోసం సిద్ధపడే అవకాశం అందరికీ ఇవ్వడానికి, ప్రకటించే-బోధించే పనిలో తమ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి ఈ భాగాన్ని రూపొందించారు. విద్యార్థి నియామకాలతో పాటు నమూనా సంభాషణ వీడియోలు పరిశీలించబడతాయి. మనం “శిష్యునికి ఉండేలాంటి నోటిని” సంపాదించుకోవడానికి కూటంలోని ఆ భాగం సహాయం చేస్తుంది. దానివల్ల “అలసిపోయిన వ్యక్తికి సరైన మాటలతో ఎలా జవాబివ్వాలో” తెలుసుకుంటాం.—యెష. 50:4.

17 ఈ కూటంలోని మూడో భాగం పేరు, మన క్రైస్తవ జీవితం. మన రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాల్ని ఎలా అన్వయించుకోవాలో ఈ భాగం పరిశీలిస్తుంది. (కీర్త. 119:105) ఈ భాగంలో ముఖ్యమైన అంశం, సంఘ బైబిలు అధ్యయనం. కావలికోట అధ్యయనంలాగే సంఘ బైబిలు అధ్యయనం కూడా ప్రశ్నాజవాబులతో చర్చించబడుతుంది.

18 ప్రతీనెల మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ను అందుకోగానే పెద్దల సభ సమన్వయకర్త, లేదా ఆయనకు సహాయం చేసే మరో పెద్ద, దాన్ని జాగ్రత్తగా విశ్లేషించి ఓ పట్టికను తయారుచేస్తాడు. ప్రతీవారం, బోధించే సామర్థ్యం ఉండి, పెద్దల సభ ఆమోదించిన ఒక పెద్ద ఆ కూటానికి ఛైర్మన్‌గా ఉంటాడు. కూటం సమయానికి మొదలై, సమయానికి ముగిసేలా చూసుకోవాల్సిన బాధ్యత ఛైర్మన్‌దే. అంతేకాదు, విద్యార్థి నియామకాలు ఉన్నవాళ్లను మెచ్చుకోవాల్సిన, వాళ్లకు సలహా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే.

19 మనం క్రమంగా క్రైస్తవ జీవితం, పరిచర్య కూటానికి సిద్ధపడుతూ, దానికి హాజరౌతూ, దానిలో పాల్గొంటూ ఉంటే లేఖన పరిజ్ఞానం పెరుగుతుంది; బైబిలు సూత్రాల్ని అర్థంచేసుకుంటాం; ఆత్మవిశ్వాసంతో సువార్త ప్రకటిస్తాం; శిష్యుల్ని చేసే పనిలో నైపుణ్యం సాధిస్తాం. ఆ కూటానికి హాజరౌతున్న బాప్తిస్మం తీసుకొననివాళ్లు కూడా మన ప్రేమపూర్వక సహవాసం నుండి, వేదికపై నిర్వహించబడే భాగాల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ కూటానికి, అలాగే ఇతర కూటాలకు సిద్ధపడేటప్పుడు మనం కావలికోట లైబ్రరీ, JW లైబ్రరీ, కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ (మీ భాషలో ఉంటే), అలాగే రాజ్యమందిరంలో ఉన్న లైబ్రరీని కూడా ఉపయోగించుకోవచ్చు. రాజ్యమందిరంలోని లైబ్రరీలో, అందుబాటులో ఉన్న యెహోవాసాక్షుల ప్రచురణలు, వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ లేదా యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, ఇతర బైబిలు అనువాదాలు, ఒక డిక్షనరీ, ఉపయోగపడే ఇతర రెఫరెన్స్‌ పుస్తకాలు ఉంటాయి. కూటాల ముందుగానీ తర్వాతగానీ ఈ లైబ్రరీని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

క్షేత్రసేవా కూటాలు

20 వారం మధ్యలోగానీ, వారాంతాల్లోగానీ ఆయా సమయాల్లో కొన్ని నిమిషాలపాటు జరిగే క్షేత్రసేవా కూటం కోసం ప్రచారకులు కలుసుకుంటారు. సాధారణంగా, ఈ కూటాలు సహోదర సహోదరీల ఇళ్లల్లో లేదా మరితర అనువైన స్థలాల్లో జరుగుతాయి. ఈ కూటాన్ని రాజ్యమందిరంలో కూడా చేసుకోవచ్చు. వేర్వేరు ప్రాంతాల్లో చిన్నచిన్న గుంపులుగా కలుసుకోవడం వల్ల, ప్రచారకులు క్షేత్రసేవా కూటానికి, పరిచర్య చేయాల్సిన క్షేత్రానికి సులభంగా వెళ్లడం వీలౌతుంది. అంతేకాదు, ప్రచారకులు ఎవరెవరితో పనిచేయాలో గుంపు పర్యవేక్షకుడు త్వరగా నిర్ణయించగలుగుతాడు, అప్పుడు అందరూ ఆలస్యం చేయకుండా క్షేత్రానికి వెళ్లవచ్చు. గుంపు పర్యవేక్షకుడు తన గుంపులోని వాళ్లపట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం కూడా వీలౌతుంది. గుంపులు విడివిడిగా క్షేత్రసేవా కూటాన్ని జరుపుకోవడం వల్ల ప్రయోజనాలున్నా, అప్పుడప్పుడు పరిస్థితుల్నిబట్టి కొన్ని గుంపుల్ని కలిపి కూటం జరుపుకోవాల్సి రావచ్చు. ఉదాహరణకు, వారం మధ్యలో కొంతమంది ప్రచారకులే పరిచర్యకు వెళ్తుంటే, గుంపులను కలపడం లేదా రాజ్యమందిరంలో గానీ మరో అనువైన చోట గానీ అందరూ కలుసుకొని క్షేత్రసేవా కూటం జరుపుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. దీనివల్ల, కలిసి పరిచర్య చేయడానికి ప్రచారకులకు ఎవరోఒకరు అందుబాటులో ఉంటారు. అలాగే, సెలవు రోజుల్లో కూడా సంఘమంతా కలిసి రాజ్యమందిరంలో క్షేత్రసేవా కూటం జరుపుకోవచ్చు. లేదా, కావలికోట అధ్యయనం తర్వాత సంఘమంతా కలిసి క్షేత్రసేవా కూటాన్ని జరుపుకోవాలనుకోవచ్చు.

21 క్షేత్రసేవా గుంపులు విడివిడిగా కలుసుకుంటే, గుంపు పర్యవేక్షకుడు క్షేత్రసేవా కూటాన్ని నిర్వహిస్తాడు. అప్పుడప్పుడు గుంపు పర్యవేక్షకుడు ఈ కూటాన్ని నిర్వహించడానికి, తనకు సహాయకునిగా ఉన్న సహోదరుణ్ణి లేదా అర్హుడైన మరో సహోదరుణ్ణి నియమించవచ్చు. ఈ కూటంలో పరిచర్యకు అవసరమైన అంశం గురించి చర్చించడానికి నిర్వాహకుడు ముందే సిద్ధపడి ఉండాలి. పరిచర్యకు ఏర్పాట్లు చేసిన తర్వాత, గుంపులో ఉన్న ఒకరు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆలస్యం చేయకుండా అందరూ క్షేత్రానికి వెళ్తారు. క్షేత్రసేవా కూటం ఐదు నుండి ఏడు నిమిషాలపాటు జరుగుతుంది. ఒకవేళ అది సంఘ కూటాల తర్వాత జరుగుతుంటే, అంతకన్నా తక్కువ సమయంలోనే దాన్ని ముగించాలి. ఆ కూటం, పరిచర్యకు వెళ్తున్నవాళ్లకు ప్రోత్సాహాన్ని, అవసరమైన సలహాల్ని, నిర్దేశాన్ని ఇచ్చేదిగా ఉండాలి. కొత్తవాళ్లు లేదా సహాయం అవసరమైనవాళ్లు శిక్షణ పొందడానికి అనుభవమున్న ప్రచారకులతో కలిసి పనిచేయవచ్చు.

కొత్తగా ఏర్పడిన సంఘాల్లో లేదా చిన్న సంఘాల్లో కూటాల ఏర్పాట్లు

22 శిష్యులు ఎక్కువౌతున్న కొద్దీ సంఘాలు కూడా పెరుగుతాయి. సాధారణంగా, కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ పర్యవేక్షకుడు దరఖాస్తు పెడతాడు. అయితే, కొన్ని సందర్భాల్లో చిన్న గుంపులు తమకు దగ్గర్లో ఉన్న సంఘంతో సహవసిస్తే మరింత ప్రయోజనం పొందవచ్చు.

23 కొన్నిసార్లు, చిన్న సంఘాల్లో అందరూ సహోదరీలే ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, సంఘంలో సహోదరి ప్రార్థన చేసేటప్పుడు లేదా కూటాలు నిర్వహించేటప్పుడు లేఖన ఏర్పాటు ప్రకారం తలమీద ముసుగు వేసుకుంటుంది. (1 కొరిం. 11:3-16) చాలావరకు, ఆమె ప్రేక్షకులవైపు తిరిగి కూర్చుని కూటాల్ని నిర్వహిస్తుంది. సహోదరీలు కూటాల్లో ప్రసంగాలు ఇవ్వరు. బదులుగా వాళ్లు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని చదివి, దానిమీద వ్యాఖ్యానిస్తారు. అప్పుడప్పుడు వాళ్లు ఆ సమాచారాన్ని ప్రశ్నాజవాబుల రూపంలో గానీ, ప్రదర్శన రూపంలో గానీ అందించవచ్చు. బ్రాంచితో ఉత్తరప్రత్యుత్తరాలు జరపమని, కూటాలు నిర్వహించమని బ్రాంచి కార్యాలయం ఒక సహోదరికి చెప్పవచ్చు. కొంతకాలానికి వాటిని చేయడానికి సహోదరులు అర్హత సంపాదించుకున్నాక, వాళ్లు ఆ బాధ్యతల్ని చూసుకుంటారు.

ప్రాంతీయ సమావేశాలు

24 ప్రతీ సంవత్సరం, రెండు ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. అవి ఒక్కరోజు జరిగే సమావేశాలు. ఒకే సర్క్యూట్‌కు చెందిన సంఘాలు వాటికి హాజరౌతాయి. ఈ సంతోషకరమైన సందర్భాల్లో, తమ “హృదయాల్ని విశాలం” చేసుకుని క్రైస్తవ సహవాసం ఆనందించే అవకాశం హాజరైన ప్రతీఒక్కరికి దొరుకుతుంది. (2 కొరిం. 6:11-13) యెహోవా సంస్థ ఓ నిర్దిష్ట అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని లేఖనాధారిత ముఖ్యాంశాల్ని, సమావేశ కార్యక్రమంలోని వివిధ భాగాల్ని తయారుచేస్తుంది. ప్రసంగాలు, ప్రదర్శనలు, పునర్నటనలు, తనలోతాను మాట్లాడుకునే సన్నివేశాలు, ఇంటర్వ్యూల ద్వారా సమాచారం అందించబడుతుంది. సమయానుకూలమైన ఆ ఉపదేశం హాజరైన వాళ్లందర్నీ బలపరుస్తుంది. ఈ సమావేశాల్లో, కొత్త శిష్యులు యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు గుర్తుగా బాప్తిస్మం తీసుకుంటారు.

ప్రాదేశిక సమావేశాలు

25 సంవత్సరానికి ఒకసారి, పెద్ద సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. సాధారణంగా, ఇవి మూడు రోజులపాటు జరిగే ప్రాదేశిక సమావేశాలు. వీటికి చాలా సర్క్యూట్లలోని సంఘాలు హాజరౌతాయి. చిన్న బ్రాంచీలు, తమ క్షేత్రంలో ఉన్న సంఘాలన్నీ కలిసి ఒకేచోట సమావేశం జరుపుకోవడం ఉపయోగకరంగా ఉండవచ్చు. కొన్ని దేశాల్లో, పరిస్థితుల్నిబట్టి లేదా సంస్థ ఇచ్చే నిర్దేశాన్నిబట్టి ఈ సమావేశ ఏర్పాట్లు మారవచ్చు. అప్పుడప్పుడు, కొన్ని దేశాల్లో అంతర్జాతీయ లేదా ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి, వాటికి వేర్వేరు దేశాల నుండి వేలమంది సాక్షులు హాజరౌతారు. ఎన్నో సంవత్సరాలుగా, యెహోవాసాక్షులు సమావేశాల గురించి అందరికీ చెప్పడం వల్ల చాలామంది రాజ్యసువార్తను తెలుసుకున్నారు.

26 యెహోవా సమర్పిత ప్రజలు తోటి సాక్షులతో ఐక్యంగా దేవున్ని ఆరాధించడానికి, సంతోషంగా గడపడానికి సమావేశాలు అవకాశాన్నిస్తాయి. అంతేకాదు, ఆ సమావేశాలు బైబిలు సత్యంపై మరింత వెలుగును ప్రసరింపజేస్తాయి. కొన్ని సమావేశాల్లో, వ్యక్తిగత అధ్యయనం చేసుకోవడానికి, సంఘ కూటాల్లో అధ్యయనం చేయడానికి, లేదా పరిచర్యలో ఉపయోగించడానికి కొత్త ప్రచురణలు విడుదలౌతాయి. సమావేశాల్లో బాప్తిస్మం ఏర్పాటు కూడా ఉంటుంది. సమావేశాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి సహాయం చేస్తాయి. నిజంగా, యెహోవా ప్రజలు సమర్పిత క్రైస్తవుల అంతర్జాతీయ సహోదర బృందంగా రూపొందారని సమావేశాలు రుజువు చేస్తాయి. వాళ్లు యేసుక్రీస్తు శిష్యుల గుర్తింపు చిహ్నాన్ని ధరించుకున్నారు.—యోహా. 13:35.

27 యెహోవా ప్రజల స్థానిక సంఘ కూటాలకు, ప్రాంతీయ, ప్రాదేశిక సమావేశాలకు హాజరవడం ద్వారా మనం ఆయన ఇష్టం చేయడానికి బలాన్ని పొందుతాం. అంతేకాదు, మన క్రైస్తవ విశ్వాసాన్ని నీరుగార్చే లోక ప్రభావాల నుండి కాపాడబడతాం. ఆ కూటాలు, సమావేశాలు యెహోవాకు మహిమను, స్తుతిని తెస్తాయి. (కీర్త. 35:18; సామె. 14:28) అంతం దగ్గరపడుతున్న ఈ సమయంలో, తన సమర్పిత ప్రజలు ఆధ్యాత్మిక సేదదీర్పు పొందడానికి, యెహోవా ఇలాంటి సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆయనకెంతో కృతజ్ఞులం.

ప్రభువు రాత్రి భోజనం

28 సంవత్సరానికి ఓసారి యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలన్నీ, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను లేదా ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరిస్తాయి. (1 కొరిం. 11:20, 23, 24) యెహోవా ప్రజలకు, సంవత్సరమంతటిలో జరిగే అత్యంత ముఖ్యమైన కూటం ఇదే. జ్ఞాపకార్థ ఆచరణను ఖచ్చితంగా ఆచరించమని యేసు ఆజ్ఞాపించాడు.—లూకా 22:19.

29 జ్ఞాపకార్థ ఆచరణ తేదీ లేఖనాల్లో సూచించినట్లుగా ప్రాచీనకాల పస్కా పండుగ రోజునే వస్తుంది. (నిర్గ. 12:2, 6; మత్త. 26:17, 20, 26) సా.శ.పూ. 1513⁠లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైనందుకు గుర్తుగా, ప్రతీ సంవత్సరం పస్కాపండుగను జరుపుకునేవాళ్లు. ఇశ్రాయేలీయుల చాంద్రమాన క్యాలెండరులో మొదటి నెల (నీసాను) 14వ రోజున వాళ్లు పస్కా గొర్రెపిల్లను తిని, ఐగుప్తు బానిసత్వాన్ని విడిచి రావాలని యెహోవా చెప్పాడు. (నిర్గ. 12:1-51) ఆ తేదీ రావడానికి, యెరూషలేములో వసంత కాలంలో పగలూ రాత్రి సమానంగా ఉండే రోజుకు దగ్గర్లోని అమావాస్య నుండి 13 రోజులు లెక్కించాలి. సాధారణంగా జ్ఞాపకార్థ ఆచరణ తేదీ, వసంత కాలంలో పగలూ రాత్రి సమానంగా ఉండే రోజు తర్వాత వచ్చే మొదటి నిండు పౌర్ణమి రోజున వస్తుంది.

30 జ్ఞాపకార్థ ఆచరణను ఎలా చేయాలో, మత్తయి 26:26-28 వచనాల్లో యేసు స్వయంగా చెప్పిన మాటల్నిబట్టి అర్థమౌతుంది. ఈ ఆచరణ నిగూఢమైన మంత్రాలు జపిస్తూ చేసే ఆచారం కాదు. బదులుగా ఇది, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు తోటి వారసులుగా ఉండడానికి ఎంచుకోబడినవాళ్లు పాలుపంచుకునే సూచనార్థక భోజనం. (లూకా 22:28-30) ఇతర సమర్పిత క్రైస్తవులందరూ, అలాగే ఆసక్తిగల వాళ్లు ఆ ఆచరణను శ్రద్ధగా గమనించేందుకు ప్రభువు రాత్రి భోజనానికి హాజరవ్వాలని ప్రోత్సహించబడుతున్నారు. వాళ్లు ఆ ఆచరణకు హాజరవడం ద్వారా, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనుషులందరి ప్రయోజనం కోసం చేసిన ఏర్పాటుపట్ల కృతజ్ఞత చూపిస్తారు. జ్ఞాపకార్థ ఆచరణకు కొన్నిరోజుల ముందు ఒక ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఉంటుంది. జ్ఞాపకార్థ ఆచరణ గురించి ఉత్సాహం నింపడానికి, కొత్తవాళ్లకు బైబిలు అధ్యయనం మీద మరింత ఆసక్తి కలిగించడానికి ఆ ప్రసంగం రూపొందించబడింది.

31 ‘ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి ఒకరి గురించి ఒకరు ఆలోచించే’ కూటాల్లో కలుసుకునేందుకు యెహోవాసాక్షులు సంతోషంగా ఎదురుచూస్తారు. (హెబ్రీ. 10:24) నమ్మకమైన బుద్ధిగల దాసుడు, మన ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి కూటాల్ని ఏర్పాటు చేస్తున్నాడు. వీటన్నిటికి క్రమంగా హాజరై, ఈ ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందమని యెహోవా సేవకులందర్నీ, అలాగే ఆసక్తిగల వాళ్లను ప్రోత్సహిస్తున్నాం. యెహోవా తన సంస్థ ద్వారా చేస్తున్న ఈ ఏర్పాట్లపట్ల హృదయపూర్వక కృతజ్ఞత చూపించడం ద్వారా దేవుని సేవకులు ఐక్యంగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాను స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుస్తాం.—కీర్త. 111:1.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి