దేవుణ్ణి మహిమపరిచే విధంగా ప్రవర్తించడంలో కొనసాగండి
1 మనమెక్కడున్నా మన ప్రవర్తన, వస్త్రధారణ, కేశాలంకరణ, మనలను గురించి, మనం ఆరాధించే దేవుణ్ణి గురించి సాక్ష్యమిస్తాయి. ముఖ్యంగా దేవుని ప్రజల పెద్ద సమావేశాల్లో, ప్రజలు మనలను గమనిస్తున్నప్పుడు ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది. మనం మాదిరికరంగా ఉన్నప్పుడు, యెహోవా నామం మహిమపరచబడుతుంది. (1 పేతు. 2:12) అయితే, ఎవరో కొందరే అమర్యాదకరంగా ప్రవర్తించినా, ఆలోచనారహితంగా మాట్లాడినా, అది దేవుని నామానికీ, ఆయన ప్రజలకూ నిందను తెస్తుంది. (ప్రసం. 9:18బి) మన ప్రవర్తనను బట్టే, బయటివాళ్ళు మన సంస్థ గురించి, మనం ఆరాధించే దేవుణ్ణి గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారన్న విషయాన్ని మనస్సులో పెట్టుకుని, ‘సమస్తమును దేవుని మహిమకొరకు చేయాలి’ అన్న స్పృహ మనకుండాలి.—1 కొరిం. 10:31.
2 హోటళ్ళలో మాదిరికరమైన ప్రవర్తన: అనేక సందర్భాల్లో, యెహోవాసాక్షులకున్న క్రమబద్ధతను బట్టి, మంచి ప్రవర్తనను బట్టి, శుభ్రతను బట్టి హోటల్ సిబ్బందిలోనివాళ్ళు ఎంతో ముగ్ధులయ్యారు. ఒక మేనేజర్, తన హోటల్లో నివసించిన యెహోవాసాక్షుల కుటుంబాలను గురించి చెబుతూ, “యెహోవాసాక్షుల పిల్లలు నేను చూసిన పిల్లలందరిలో కెల్లా శ్రేష్ఠమైనవాళ్ళు! వాళ్ళు హుందాయైన మహిళల్లా, మగవాళ్ళలా డ్రెస్ చేసుకున్నారు; చాలా మర్యాదగా, వినయంగా నమ్రతగా ఉన్నారు; వాళ్ళు ఎటువంటి సమస్యలనూ సృష్టించలేదు. మీ పిల్లలను బట్టి మిమ్మల్ని అభినందించవలసిందే. మీ పిల్లలు ఇక్కడున్నందుకు చాలా ఆనందించాం” అని అన్నారు. మనతో వ్యవహరించేవారు, యెహోవా ప్రజల మధ్య ఉన్న ప్రేమను గౌరవాన్ని చూడగల్గుతున్నారు కనుకనే, ఇటువంటి వ్యాఖ్యానాలు తరచూ వస్తున్నాయి.
3 మరొకవైపు, తమ ప్రవర్తనలో నిర్లక్ష్యాన్ని కనబరిచేవారి మూలంగా, హోటల్ సౌకర్యాలను దుర్వినియోగం చేసేవారి మూలంగా ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయని ఇతర హోటల్ సిబ్బంది చేసిన వ్యాఖ్యలు చూపిస్తున్నాయి. ఇది సమస్యలకు కారణమవుతుంది, రాకూడని విమర్శలను తెస్తుంది. చిన్న పిల్లలూ, కౌమార ప్రాయంలోని పిల్లలూ అల్లరిగా క్రమశిక్షణ లేకుండా ఉన్నారని, వాళ్ళు స్విమ్మింగ్ పూల్నీ మరితర క్రీడా సౌకర్యాలనూ ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళ మీద తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదని కొందరు మేనేజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
4 చాలా మటుకు హోటళ్ళకు అతిథులు అనుసరించవలసిన నియమాలు ఉంటాయి. శబ్దం ఎక్కువగా చేయకూడదన్న నియమాన్ని లేదా గదుల్లో వంట చేయకూడదన్న నియమాన్ని కొందరు సహోదరులు ఉల్లంఘించారు. వంట చేసుకునే అనుమతిని ఇవ్వని హోటళ్ళ మేనేజర్లు, తరచూ ప్రజలు తమ హోటల్ని దుర్వినియోగం చేస్తున్నట్లు చెబుతున్నారు. వంట చేయడం వల్ల గదులు పాడు కావడమే కాక, గదుల్లో వంట చేసిన వాసన నిలిచి ఉండడం వల్ల ఆ గదులను కొన్ని రోజులు లేదా వారాల వరకు అద్దెకు ఇవ్వలేకపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. కనుక, గదుల్లో వంటచేసుకునే అనుమతి ప్రత్యేకంగా ఉంటే తప్పించి, అక్కడ వంట చేయకూడదు.
5 మేనేజ్మెంట్తో పూర్తిగా సహకరించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. యెహోవా ప్రజల గురించి ఇతరులకు ప్రతికూలమైన అభిప్రాయం కలగాలని మనమెవరమూ కోరుకోము. క్రైస్తవులముగా, మనం అన్నివేళలా నిజాయితీగా ఉండడం తప్పనిసరి. హోటళ్ళ నుండి మనం అక్కడి దుప్పట్లను గానీ మరే ఇతర వస్తువులను గానీ జ్ఞాపకార్థకంగా అంటూ తీసుకు వెళ్ళకూడదు. అది దొంగతనం; అలాగే, మనం గదిని బుక్ చేయించుకునేటప్పుడైనా, లేదా గదిలో బస చేయడానికి వెళ్ళేటప్పుడైనా గదిలో ఎంతమంది ఉండాలనుకుంటున్నాం అన్నది నిజాయితీగా చెప్పాలి.
6 సమావేశానికి సరైనవిధంగా ముస్తాబై వెళ్ళాలి: సమావేశానికి ఎలాంటి హాల్‌ను ఉపయోగిస్తున్నా, దాన్ని సమావేశం సమయంలో పెద్ద రాజ్య మందిరంగా దృష్టించాలి. ఎలాగైతే, మనం స్థానిక సంఘ కూటాలకు వెళ్ళేటప్పుడు సముచితమైన వస్త్రధారణనూ కేశాలంకరణనూ చేస్తామో, అలాగే సమావేశానికి వెళ్ళేటప్పుడూ చెయ్యాలి. సహోదర సహదరీలు లోకాత్మను ప్రతిబింబిస్తూ, అమర్యాదకరమైన వస్త్రాలను, అతి ఫ్యాషన్ దుస్తులను సమావేశానికి గానీ, ఆ తర్వాత గానీ ధరించకూడదు. అవి మనం కూడా లోకస్థులలాంటివాళ్ళమన్న తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి, సహోదరీలు, తమ డ్రెస్సుల స్టైలూ, పొడవూ విషయంలో జాగ్రత్తపడాలి. అవి మర్యాదకరంగా ఉండాలి. (1 తిమో. 2:9, 10) మనం సమావేశానికి హాజరవుతున్నప్పుడైనా, ఆ తర్వాత హోటల్లో ఉన్నప్పుడైనా, రెస్టారెంట్లో ఆహారం తీసుకుంటున్నప్పుడైనా, లేదా షాపింగ్ చేస్తున్నప్పుడైనా, ఎప్పుడైనా ఎవరికీ అభ్యంతరం కలిగించక, మనం దేవుని పరిచారకులమన్న విషయాన్ని ప్రతిబింబించాలి.—2 కొరిం. 6:3.
7 శనివారం సమావేశం ఉదయం కార్యక్రమంలో బాప్తిస్మం ఉంటుంది. బాప్తిస్మ సందర్భంలో మనం చూపవలసిన దృక్పథాన్ని గురించి ఏప్రిల్ 1, 1995, కావలికోట, 30వ పేజీ వివరిస్తుంది. “మనమందరం బాప్తిస్మాన్ని తగినంత గంభీరతతో చూడాలి. పెద్దగా భావోద్రేకంతో కేకలు అలాంటివి చేయడానికి, పార్టీలు చేసుకోవడానికి, లేక ఉత్సవం చేసుకోవడానికి అది సమయం కాదు. అలా అని, అది గంభీరమైన లేక భయంకరమైన సమయం కూడా కాదు.” బాప్తిస్మం పొందేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పల్చటి వస్త్రాలను గానీ శరీరానికి అతుక్కుపోయే వస్త్రాలను గానీ ధరించడం ఎంతమాత్రం సముచితం కాదు. అందరూ గంభీరతను, క్రైస్తవ బాప్తిస్మంలోని ఆనందాన్నీ ప్రతిబింబించాలి.
8 “మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను” అని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. (2 పేతు. 3:11,12) “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశంలో మన మాటతీరు, ప్రవర్తన, అందరి సన్మానానికీ మహిమకూ అర్హుడైన మన గొప్ప దేవుణ్ణి గురించి తెలుసుకుని ఆయనను ఆరాధించేందుకు యథార్థ హృదయులకు సహాయపడాలి.—1 కొరిం. 14:24, 25.