“ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి”
1 క్రైస్తవ జీవన విధానమంటే, ‘మనుష్యులందరి యెడల ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకోవడమే.’ (1 థెస్స. 5:15) మనం జిల్లా సమావేశాలకు హాజరయ్యేటప్పుడు, ఇతరులకు మేలు చేయడానికి మనకు అనేక అవకాశాలు లభిస్తాయి. మునుపెన్నటి కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం మనం నలుగురి దృష్టికీ వెళతాము, ప్రాముఖ్యంగా చెన్నై, కొచ్చి, ముంబయిలలో ఐదు నుండి పది వేలమంది వరకు హాజరవుతారని ఆశించబడుతోంది. సమావేశాన్ని చూసేవారు, సమావేశంలో వినేవారు తాము అనుభవించిన దాని ఆధారంగా మన గురించి అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు. యెహోవాసాక్షులకున్న మంచి పేరును మరింత అధికం చేసే అద్భుతమైన అవకాశం మనకు లభిస్తుంది. బైబిలు బోధ మనల్ని ఇతరుల నుండి భిన్నంగా ఉంచిందని మనతో వ్యవహరించే వారందరూ గుర్తించాలని మనం కోరుకుంటాము. మన క్రమబద్ధతపై పరిశుభ్రతపై మంచీమర్యాదలపై వారు వ్యాఖ్యానించాలని మనం కోరుకుంటాము. నిజంగానే నిస్వార్థ సహోదర స్ఫూర్తి మన మధ్య ఉందనీ, మనం ‘మన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూస్తామనీ’ వారు స్వయంగా చూసి తెలుసుకోవాలన్నది మన కోరిక. (ఫిలి. 2:4) ఈ సమావేశాల్లో మనమది చేయగల మార్గాలను పరిశీలించండి.
2 మీరు మీ వసతి కోసం అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే చేసుకున్నారా? (1) మనం ముందుగా బుక్ చేసుకోవడం, లాడ్జిలనూ డార్మెటరీలనూ సముచితమైన ధరలకు పొందేలా సహోదరులకు సహాయం చేస్తుంది. ఒకసారి మనం బుక్ చేసుకున్నాక, అంతకన్నా మంచి సౌకర్యాలున్న లాడ్జిగానీ డార్మెటరీగానీ దొరికినా దాన్ని మార్చుకోకుండా ఉండడం ముఖ్యం. మన “మాట అవునంటే అవును” అని ఉండేలా చూసుకోవాలి. (మత్త. 5:37) (2) మీరు తగిన డబ్బు ముందుగా పంపకపోతే మీ కోసం రూమ్ బుక్ చేయబడుతుందని అనుకోకండి. (3) హోటల్ సిబ్బంది అంతా చాలా నెమ్మదిగా తమ విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ వారి ఎడల సహనం, గౌరవం కలిగి ఉండండి. (4) హోటల్ సిబ్బందే మీ గదిని శుభ్రం చేసినప్పటికీ, యెహోవా ఏర్పరిచే పరిశుభ్రతా ప్రమాణాలను ప్రతిబింబించే విధంగా మీ రూమ్‌ను శుభ్రంగా ఉంచండి. (5) హోటల్ పరిసరాలను ఉపయోగించడం గురించి హోటల్ వాళ్ళు పెట్టిన అన్ని నియమాలనూ పాటించండి. (6) బేరర్లకు, స్వీపర్లకు సాధారణంగా ఇవ్వబడే టిప్స్‌ను ఇవ్వండి.
3 ఎలా మేలు చేయాలో పిల్లలకు బోధించడం: ప్రజలు మన పిల్లలను తప్పక గమనిస్తారు, చాలా సందర్భాల్లో చూపరులను ప్రభావితం చేసేది ఎక్కువగా వారే. కాబట్టి తల్లిదండ్రులారా సమావేశానికి ముందు, పిల్లలు అన్ని సమయాల్లోనూ అన్ని స్థలాల్లోనూ క్రైస్తవ ప్రవర్తనను ఏవిధంగా చూపాలని మీరు కోరుకుంటున్నారో వివరించడానికి వారితో కొంత సమయం గడపండి. (ఎఫె. 6:4) ఉదాహరణకు, నిజమైన క్రైస్తవ ప్రేమ “అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు” అని వారికి తెలియజేయండి. (1 కొరిం. 13:5) అందరూ చూసేలా పెద్దవారు సరైన మాదిరిని ఉంచడం ద్వారా ఈ మాటలను మరింత బలంగా నొక్కి చెప్పవచ్చు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం ద్వారా, హోటల్ ప్రాపర్టీ పట్ల గౌరవం చూపించడం ద్వారా, మీ చుట్టూ ఉన్నవారి పట్ల శ్రద్ధగల వారిగా ఉండడం ద్వారా మీరు మేలైనదానిని అనుసరించి నడుచుకోవచ్చు. (కొలొ. 3:20) అందరికీ మేలు చేయడానికి ఐక్యంగా కృషి చేస్తుండగా మనం ‘అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరిస్తాము.’—తీతు 2:9, 10.
4 మన మంచి ప్రవర్తన చూపరులపైనే గాక వివిధ కారణాలను బట్టి మనల్ని విమర్శించే వారిపైన కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సమావేశం వద్ద, సమావేశ నగరమంతటిలోనూ మనం చేసే ప్రతిదీ అంటే వీధుల్లో నడవడమైనా, హోటల్లో తినడమైనా, మన వసతి వద్ద విశ్రాంతి తీసుకోవడమైనా లేదా అనియతంగా సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలను ఉపయోగించుకోవడమైనా మన క్రైస్తవ సంభాషణ, చర్యలు మనం మేలైన దానిని అనుసరించాలని కోరుకుంటున్నామని నిరూపించాలి.
[4వ పేజీలోని బాక్సు]
దయచేసి గుర్తుంచుకోండి:
◼ మీరు బసచేసిన స్థలంలో ఉన్న సిబ్బందితో సహనంగా, మర్యాదపూర్వకంగా ఉండండి.
◼ అతిధులందరి ప్రయోజనార్థం, హోటల్లో దిగినా డార్మెటరీలో దిగినా వాటి నియమాలన్నింటినీ పాటించండి.
◼ రూమ్‌లను వీలైనంత శుచిగా శుభ్రంగా ఉంచండి.
◼ మీ పిల్లల చర్యలను గమనిస్తూ ఉండండి.