2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?
1 ఏప్రిల్ 19, బుధవారం సాయంత్రం, మన సేవా సంవత్సరంలో ప్రత్యేకమైనది. ఆ రోజు, క్రమక్రమేణా సూర్యుడు అస్తమిస్తుండగా ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షుల ప్రతి సంఘం, ప్రతి గుంపు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని జరుపుకుంటారు. మనం ఏ టైమ్ జోన్లో నివసిస్తున్నప్పటికీ, యేసుక్రీస్తు బలిని జ్ఞాపకం చేసుకోవడమనేది సంవత్సరంలో మకుటాయమాన సంఘటనగా ఉంటుంది. యెహోవాసాక్షుల 2000 క్యాలెండర్లో ఏప్రిల్ నెలలో జ్ఞాపకార్థదిన తేదీ ఉన్నతపర్చబడింది.
2 యెహోవా తన కుమారుని బలి ద్వారా వ్యక్తం చేసిన కృపపట్ల హృదయపూర్వకమైన మన అభినందనను ప్రదర్శించటానికి ఏప్రిల్ నెల మనకు మహత్తరమైన అవకాశాన్ని అందిస్తుంది. ఎలా? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.” (2 కొరిం. 5:14, 15) అవును, క్రితమెన్నడూ రాజ్యసేవకులు చేయని విధంగా ఈ నెలను అపూర్వమైన నెలగా చేసుకుంటూ మనం మనకోసం కాక, మనకోసం మరణించిన వానికోసం జీవిస్తున్నామని ఏప్రిల్ నెలలో ప్రదర్శించగలము!
3 ఏప్రిల్‌లో సహాయ పయినీర్ సేవ చేయడానికి వ్రాసివ్వండి: “దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు” అని చెప్తూ అపొస్తలుడైన పౌలు మనకు పురికొల్పే మాదిరినుంచాడు. (అపొ. 20:24) యెహోవా దేవుని గురించి సమగ్రమైన సాక్ష్యం ఇవ్వటానికి మనకూ అలాంటి ఆధిక్యతే ఉంది. గనుకనే, సహాయ పయినీర్ కార్యకలాపంలో ఏప్రిల్‌ను మనం మన అపూర్వమైన నెలగా చేసుకోవాలి!
4 అయిదు పూర్తి వారాంతాలున్న ఈ సంవత్సరపు ఏప్రిల్ నెల, పయినీరు సేవ చేయటానికి చాలామందికి ఎంతో విశిష్టమైనదిగా ఉంటుంది. సహాయ పయినీర్ల విషయంలో మనం 1998 ఏప్రిల్‌లో సర్వకాల శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నప్పుడు, 2,170 మంది దానిలో పాల్గొన్నారు అంటే మొత్తం ప్రచారకులలో 12 శాతం మంది అన్నమాట. కేవలం ఒక్క సంవత్సరం తర్వాత, 1999 ఆగస్టులో రిపోర్టు చేసిన మొత్తం ప్రచారకుల సంఖ్య మునుపటికంటే 17 కన్నా ఎక్కువ శాతం పెరిగింది. అంటే సహాయ పయినీర్ల విషయంలో మనకు మునుపున్న శిఖరాగ్ర సంఖ్యను దాటడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. పైగా, అవసరమైన గంటలు కూడా తగ్గించబడటంతో, సంఘంలోని ఇంకా అనేకులు ఈ సేవలోకి ప్రవేశించే వీలుంది. బాప్తిస్మం పొందిన ప్రతి ప్రచారకుడు ఈ ఏప్రిల్‌లో తాను సహాయ పయినీరు సేవ చేయగలనా లేదా అని ప్రార్థనాపూర్వకంగా యోచించాలి.
5 దానికి 2000 క్యాలెండర్‌లోని ఏప్రిల్ నెలను ఉపయోగించుకుంటూ ఇప్పుడే పథకం వేసుకోండి. మీరు ఏ యే రోజుల్లో క్షేత్ర సేవలో పాల్గొనగలరో నిర్ణయించుకుని, ఆ నెలలో మీరు ప్రకటనా కార్యకలాపానికి వెచ్చించగలరని అనుకునే గంటలన్నింటినీ కూడండి. నియతంగానూ, అనియతంగానూ మీరు ఇతరులకు సాక్ష్యమివ్వడంలో గడపగల సమయాన్ని కూడా దానిలో చేర్చండి. ఆ మొత్తం, సహాయ పయినీర్లు వెచ్చించవలసిన 50 గంటలకు కాస్త దగ్గరగా ఉందా? అవసరమైన గంటలు తక్కువ పడుతుంటే, సహాయ పయినీరు సేవ చేయడానికి అవసరమైనంత సమయాన్ని సంపాదించుకోగల్గేలా మీరు మీ షెడ్యూల్లో ఏమైనా మార్పులు చేసుకోగలరా? నెలకు 50 గంటలు సంపాదించుకునేందుకు గానూ మీరు ప్రతి రోజు సగటున ఒక గంట 40 నిమిషాలు మాత్రం సంపాదించుకోవలసి ఉంటుంది.
6 ఇప్పుడు క్రమ పయినీర్లకు అవసరమైన గంటలు కూడా తగ్గించబడ్డాయి గనుక, మీరు పూర్తికాల సేవలో ప్రవేశించాలని ఎదురు చూస్తున్నారా? పగటికాలం ఎక్కువగా ఉండే ఏప్రిల్ నెలే దాన్ని ఆరంభించటానికి చక్కని నెల! క్రమ పయినీర్లకు అవసరమైన 70 గంటలు చేరుకోగలనో లేదో అని మీరు అనుకుంటుంటే, 70 గంటల లక్ష్యం పెట్టుకుని ఏప్రిల్ నెలలో కేవలం సహాయ పయినీరు సేవనే ఎందుకు చేయకూడదు? మీరు చేయగలరని ఒకసారి చూసిన తర్వాత, వీలైనంత త్వరగా మీరు మరింత నమ్మకంతో క్రమ పయినీర్ల జాబితాలో చేరవచ్చు.—మన పరిచర్య, 113-14 పేజీలు చూడండి.
7 సువార్త ప్రచారకులుగా సంపూర్ణంగా భాగం వహించండి: ప్రచారకులమైనా పయినీర్లమైనా మనకందరికీ దేవునిపట్లా పొరుగువారి పట్లా ఉన్న నిజమైన ప్రేమ, మన వ్యక్తిగత పరిస్థితులు అనుమతించినంత మేరకు యెహోవా సేవలో మనం చేయగలిగినదంతా పూర్ణాత్మతో చేసేలా మనల్ని పురికొల్పుతుంది. (లూకా 10:27) అలా, “మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము” అని మనం చూపిస్తాము. (1 తిమో. 4:10) అందుకే ప్రతి ఒక్కరు రాజ్యపనిలో పూర్తి భాగం కల్గివుండి, ఏప్రిల్ నెలలో వందశాతం పాల్గొనడాన్ని మనం ఎదురు చూడవచ్చు.
8 యేసు ఇచ్చిన ఈ ప్రబోధాన్ని మరువకుందాము: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొను[డి].” అలా చెప్పిన తర్వాత వెంటనే, యేసు తన 12 మంది అపొస్తలులను సమకూర్చి వారిని ప్రకటనా పనికి పంపించాడు. (మత్తయి 9:37, 38; 10:1, 5, 7) దాదాపు ఒక ఏడాది గడిచాక, ప్రకటనా పనిలో ఆ 12 మంది బాగా తర్ఫీదు పొందిన తర్వాత, యేసు “డెబ్బదిమంది యితరులను నియమించి” వారిని పంపుతూ వారికి అలాంటి ఆదేశాలనే ఇస్తూ ఇలా అన్నాడు: “కోత విస్తారముగా ఉన్నది . . . కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.” (లూకా 10:1, 2) ఆ ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడో అపొస్తలుల కార్యముల పుస్తకం నివేదిస్తుంది. సా.శ. 33, పెంతెకొస్తునాటికి శిష్యుల సంఖ్య దాదాపు 120కి పెరిగింది. తర్వాత, శిష్యుల సంఖ్యకు మొదట 3,000 మంది, తర్వాత 5,000 మంది తోడయ్యారు. (అపొ. 1:15; 2:41; 4:4) ఆ తర్వాత, ‘శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది.’ (అపొ. 6:7) అలాగే, ఈ ఆధునిక శకంలోనూ మనం ఇంకా ఎక్కువమంది రాజ్య ప్రచారకుల కోసం యజమానిని వేడుకుంటూనే ఉండాలి! మన ప్రార్థనలకనుగుణ్యంగా, సంఘంలోని ప్రతి ప్రచారకుడూ ప్రతి నెలలోను పరిచర్యలో భాగం వహించటానికి ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోవాలి.
9 దయచేసి 2000 క్యాలెండరులో ఏప్రిల్ నెలను శ్రద్ధగా గమనించండి. ఆ నెలలోని మొదటి రెండు రోజులు శని ఆదివారాలు గనుక, నెల మొదటినుంచే ప్రారంభించేలా ఆ వారాంతం సేవలో భాగం వహించటానికి మీరు పథకం వేసుకోగలరా? ఆ నెలంతా మీ సంఘ పుస్తక పఠన గుంపుతో కలిసి ప్రతి “మ్యాగజిన్ డే”కు మీరు మద్దతునివ్వగలరా? ప్రతి ఆదివారం పరిచర్యలో ఒక గంట లేదా అంతకన్నా కాస్త ఎక్కువ సమయం గడిపే విషయమేంటి? పగటి వేళలు ఎక్కువగా ఉంటాయి గనుక సాయంవేళ వెలుగుగానే ఉంటుంది. కొన్నిసార్లు సాయంవేళ సాక్ష్యమివ్వడంలో భాగం వహించటానికి ఏర్పాట్లు చేసుకోగలరా? ఉద్యోగస్థలంలోను, స్కూల్లోను లేక ఇతర దైనందిన కార్యకలాపాల్లోను అనియత సాక్ష్యం ఇవ్వటానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవటం మర్చిపోవద్దు. మీరు పరిచర్యలో కొంత సమయం గడపగల దినాలను గుర్తుపెట్టుకోండి, ఆ నెలలో మీరు సేవలో వెచ్చించే సమయాన్ని వ్రాసి ఉంచుకోవడానికి క్యాలెండరును ఉపయోగించుకోండి.
10 పెద్దల ఆమోదం పొందిన అర్హులైన వారందరూ బాప్తిస్మం పొందని ప్రచారకులుగా సేవను ఆరంభించటానికి ఏప్రిల్ నెల మంచి అవకాశాలనిస్తుంది. మీరు ఎవరితోనైనా బైబిలు పఠనం చేస్తుంటే, తనను సువార్త ప్రచారకునిగా పరిగణించమని సంఘ పైవిచారణకర్తను అడిగేందుకు తగినంతగా ఆ వ్యక్తి అభివృద్ధి చెందాడా? మీకు బాప్తిస్మం పొందని పిల్లలున్నట్లైతే, వారి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయమై పెద్దలతో చర్చించారా? ప్రచారపు పని ప్రారంభించటానికి ఇది వారికి మంచి సమయం కాదా?—మన పరిచర్య, 97-100 పేజీలు చూడండి.
11 ఈ సంవత్సరం ఏప్రిల్ నెలను మన అపూర్వమైన నెలగా చేసుకోవటానికైన మన కృషిలో భాగంగా మనమందరం పరిచర్యలో పాల్గొని నెల చివర్లో మన క్షేత్ర పరిచర్య రిపోర్టులను ఇవ్వాల్సిన అవసరం ఉంది. (పోల్చండి మార్కు 6:30.) మొదటిసారిగా క్షేత్రసేవలో పాల్గొంటున్న బాప్తిస్మం పొందని క్రొత్త ప్రచారకులు తమ కార్యకలాపాన్ని సమయానికి రిపోర్టు చేయాలని వారిని ప్రోత్సహించాలి. మన వంతు మనం చేయటం ద్వారా, మనం ఏప్రిల్ నెల రిపోర్టుకూ, మన సాక్ష్యపు ప్రయాసల ద్వారా యెహోవాకు ఇవ్వబడే గొప్ప స్తుతికీ చక్కగా దోహదపడగల్గుతాము.
12 జ్ఞాపకార్థదినానికి మీతోపాటు ఇతరుల్ని తీసుకురండి: ఈ సంవత్సరంలో జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దిన హాజరులో కొత్త శిఖరాగ్రాన్ని చూడటం మనకు ఉత్తేజభరితంగా ఉండదా? తప్పకుండా ఉంటుంది! యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మన పట్ల ప్రదర్శించిన అతి గొప్ప ప్రేమకు తమ మెప్పును చూపించేందుకు మునుపెన్నడూ సమకూడనంతమంది ప్రజలు సమకూడినట్లవుతుంది! (యోహాను 3:16; 15:13) మీరూ మీ కుటుంబమూ జ్ఞాపకార్థ దినానికి హాజరు కాలేని విధంగా ఏ అవాంతరాలూ తలెత్తకుండా ఉండేలా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకోండి.
13 ఇతరులను జ్ఞాపకార్థ దినానికి ఆహ్వానించవలసిన సమయం కూడా ఇదే. మీరు హాజరు కావాలని కోరుకునే వారందరి లిస్టు తయారు చేయండి. గతంలో బైబిలు పఠించిన వారిని, ఇప్పుడు పఠిస్తున్న వారిని, మీరు పునర్దర్శనం చేసేవారందరినీ ఆ లిస్టులో చేర్చండి. ఇంకా ఉద్యోగ స్థలంలోనూ, పాఠశాలలోనూ, ఇరుగు పొరుగున మీకు తెలిసిన వారినందరినీ, అలాగే మీరు వ్యాపార వ్యవహారాలు నిర్వహించేవారిని అందులో చేర్చండి. ఇతర పరిచయస్థులను, మీ బంధువులను అందులో చేర్చడం మర్చిపోకండి. లిస్టును తయారు చేసుకున్న తర్వాత, ప్రతి ఒక్కరికీ హార్దికమైన, వ్యక్తిగతమైన ఆహ్వానాన్ని అందజేయడం మొదలుపెట్టండి. జ్ఞాపకార్థ కూటమి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో స్పష్టం చేయండి. ఏప్రిల్ 19 సమీపిస్తుండగా, మీ లిస్టులో ఉన్నవారికి వ్యక్తిగతంగా కానీ ఫోన్ ద్వారా గానీ మరోసారి గుర్తు చేయండి. ఆ సాయంత్రం మీతోపాటు వారిని జ్ఞాపకార్థ కూటానికి తీసుకువెళ్తానని చెప్పండి.
14 సంస్థ మునుపు ఇచ్చిన నిర్దేశనానికి అనుగుణంగానే, జ్ఞాపకార్థ దినానికి హాజరు కమ్మని తమ ప్రాంతంలో ఉన్న నిష్క్రియులైన ప్రచారకులందరినీ ప్రోత్సహించడానికి పెద్దల సభ ప్రత్యేక ప్రయత్నం చేస్తుంది. (మత్త. 18:12-14) పెద్దలు 1999 ఫిబ్రవరి 2వ తేదీ నాటి సొసైటీ ఉత్తరాన్ని పునఃపరిశీలించాలనుకోవచ్చు. సంఘ కార్యదర్శి నిష్క్రియులుగా ఉన్న ప్రచారకులందరి పట్టికను తయారు చేయాలి, వారి వద్దకు వెళ్లి వాళ్లను జ్ఞాపకార్థ దినానికి ఆహ్వానించడానికి సేవా పైవిచారణకర్త పెద్దలను నియమిస్తాడు. వీలైనంత త్వరగా వీరిని ప్రోత్సహిస్తూ కాపరి సందర్శనం చేస్తే బహుశా ఈ నిష్క్రియులు క్షేత్ర పరిచర్యలో, చివరికి ఏప్రిల్ నెలలోనే, మళ్లీ క్రియాశీలురయ్యేందుకు సహాయాన్ని అందుకోవచ్చు. క్షేత్ర సేవలో అనుభవజ్ఞుడైన ప్రచారకునితో కలిసి పరిచర్యలో పాల్గొనేందుకు వారిని ఆహ్వానించడం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
15 ఏప్రిల్ నెలకు మంచి సహకారం ఇవ్వమని ప్రోత్సహించండి! ఈ సంవత్సరం ఏప్రిల్ నెలను మన అపూర్వమైన నెలగా చేసుకోవడానికి పెద్దలు, పరిచర్య సేవకులు, కుటుంబ శిరస్సులు అందరి మధ్య మంచి సామరస్యం అవసరం. అంతా చక్కగా సంస్థీకరించబడేలా చూసేందుకూ, నడిపింపు నిచ్చేందుకూ పెద్దలు ఎంతో కృషి చేస్తారు. (హెబ్రీ. 13:7) వారమంతటిలోనూ, వారాంతాల్లోనూ క్షేత్ర సేవా కూటాల కోసం అవసరమైన, ఆచరణాత్మకమైన ఏర్పాట్లు చేయాలి. మధ్యాహ్నాల్లోనూ, సాయంవేళల్లోనూ జరిగే కార్యకలాపాల కోసం అదనంగా క్షేత్ర సేవా కూటాలను ఏర్పాటు చేయవచ్చు. ఏప్రిల్ నెల కోసం చేసిన ఏర్పాట్లన్నింటిని గూర్చిన పూర్తి వివరాలను ఇన్ఫర్మేషన్ బోర్డు మీద పెట్టాలి. క్షేత్ర పరిచర్య కూటాలను నిర్వహించేందుకు ఎవరినైనా నియమించాలి. ప్రతి గుంపుకు తగినంత ప్రాంతం ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి.
16 ఏప్రిల్ నెలలో క్షేత్ర పరిచర్యలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు అందించడం జరుగుతుంది. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించేందుకుగానూ, ఆసక్తి చూపించిన వారికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ను ప్రతిపాదించాలి. కాబట్టి, తగినన్ని పత్రికలు, బ్రోషూర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
17 నెల ముగిసిన వెంటనే క్షేత్ర పరిచర్య రిపోర్టును ఇవ్వమని పుస్తక పఠన నిర్వాహకులూ వారి సహాయకులందరూ గుంపులోని ప్రతి ఒక్కరినీ నెల చివరలో ప్రోత్సహించాలి. బహుశా, ఏప్రిల్ 30, ఆదివారం నాడు కూడా అలా ప్రోత్సహించవచ్చు. అప్పుడు, కార్యదర్శి రిపోర్టులను సరిచూసేటప్పుడు, కొంతమంది ప్రచారకులు తమ క్షేత్ర పరిచర్య రిపోర్టులను ఇవ్వలేదని ఆయన గమనిస్తే, మే 6వ తేదీ లోపల ఇవ్వమని ఆయన అందరికీ దయాపూర్వకంగా జ్ఞాపకం చేయవచ్చు, ఎందుకంటే మే 6వ తేదీకల్లా ఆయన సంఘ రిపోర్టును సొసైటీకి పంపించాలి. ప్రచారకులను వ్యక్తిగతంగా కలిసేందుకు ఆయన పుస్తక పఠన నిర్వాహకుల సహాయాన్ని కోరవచ్చు.
18 జ్ఞాపకార్థ దిన కాలం దేవుని ప్రజలకు సంవత్సరమంతటిలో అత్యంత ప్రాముఖ్యమైన సమయం. అది యెహోవా సేవలో మనకందరికీ చాలా బిజీ సమయమై ఉండాలి. అయితే, సువార్త ప్రచారకులుగా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత సంపూర్ణంగా తమ విధిని నిర్వహిస్తేనే, సహాయ పయినీరు సేవ చేయగలవారు ఆ పని చేస్తేనే, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ కూటానికి మనతోపాటు ఇతరులను తెచ్చేందుకు మనం కృషి చేస్తేనే అది బిజీ సమయమై ఉంటుంది. దేవునికి స్తుతి మహిమ కలిగేలా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలను మన అపూర్వమైన నెలగా చేసుకునేందుకు మనం కృషి చేస్తుండగా యెహోవా సుసంపన్నమైన ఆశీర్వాదాల కోసం మనం ఎడతెగక ప్రార్థిద్దాము!—హెబ్రీ. 13:15.
[3వ పేజీలోని బ్లర్బ్]
సహాయ పయినీర్లు
మన సర్వకాల-శిఖరాగ్ర సంఖ్య: 2,170
(ఏప్రిల్ 1998)
[4వ పేజీలోని బాక్సు]
మొత్తం ప్రచారకులు
మన సర్వకాల శిఖరాగ్రసంఖ్య: 21,212
(ఆగస్టు 1999)
[5వ పేజీలోని బాక్సు]
జ్ఞాపకార్థదిన హాజరు
మన సర్వకాల-శిఖరాగ్ర సంఖ్య: 47,081
(1999)