బౌద్ధమతస్థునికి మీరేమి చెప్తారు?
1 కొన్ని దేశాల్లో, బాప్తిస్మం తీసుకొనే వారిలో సగానికిపైగా బౌద్ధమత నేపథ్యంనుంచి వచ్చినవారే. సత్యం వైపుకు వీరిని ఆకర్షిస్తున్నదేమిటి? బౌద్ధమతస్థునికి మీరు సువార్తను ఎలా అందించగలరు?
2 యథార్థమైన శ్రద్ధను చూపించండి: బౌద్ధమత నేపథ్యం నుంచి వచ్చిన అనేకమంది, తమను సత్యంవైపుకు ఆకర్షించినది బాగా తర్కించడం కాదని చెప్పారు. దానికి బదులుగా, వారి పట్ల యథార్థంగా చూపించబడిన వ్యక్తిగత శ్రద్ధ మూలంగానే వారు కదిలించబడ్డారు. అమెరికాలో నివసిస్తున్న ఒక ఆసియా దేశపు స్త్రీ, తనను కలిసిన ఒక సహోదరి చూపిన స్నేహభావానికి ముగ్దురాలై ఆ సహోదరి తనతో బైబిలు పఠనం చేయడానికి ఆమె అంగీకరించింది. ఆ స్త్రీ ఆంగ్లభాషను బాగా మాట్లాడలేకపోయినా, ఆ సహోదరి ఎంతో సహనాన్ని చూపించింది. ఆ స్త్రీ అలసిపోయో లేదా అశక్తురాలయ్యో పఠనం చేయించుకోలేనప్పుడు, సహోదరి ఆమెను కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడి, మరోసారి పఠనం చేయడానికి ఏర్పాటును చేసేది. చివరికి ఆ స్త్రీ, ఆమె ఇద్దరు కుమారులూ, వృద్ధురాలైన ఆమె తల్లీ బాప్తిస్మం తీసుకున్నారు. ఆమె తన జన్మ స్థలానికి తిరిగి వెళ్ళి అక్కడ, సత్యం నేర్చుకొనేలా అనేకమందికి సహాయం చేసింది. ఆమె కుమారుల్లో ఒకరు ఇప్పుడు, బ్రాంచి ఆఫీసులో సేవ చేస్తున్నారు. యెహోవా ‘దయనూ మానవులయెడల ఆయనకున్న ప్రేమనూ’ చూపించడం మూలంగా ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయో కదా!—తీతు 3:4.
3 బౌద్ధమతస్థుల భావాలు: బౌద్ధమతస్థులు సాధారణంగా మత సహనంగలవారు. వారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించినా, నిర్దిష్టమైన మత సిద్ధాంతాన్ని హత్తుకొనివుండడం అవసరమని పరిగణించరు. కాబట్టి, వారిలో వ్యక్తివ్యక్తికీ నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయి. బౌద్ధ మతశాఖల్లోని ఒకశాఖ బోధించే బోధలలో ఒక సాధారణ ఇతివృత్తం ఏమిటంటే, జీవితమంతా దుఃఖమయమైనప్పటికీ జ్ఞానోదయాన్ని పొందడం ద్వారా ఒకడు, దుఃఖభరితమైన జన్మలను ఎత్తాల్సిన పునర్జన్మల చక్రాన్ని ఆపుచేయవచ్చు. ఈ చక్రాన్నుంచి విడుదల పొందాలంటే, ఒక వ్యక్తి నిర్వాణం పొందాలనీ, నిర్వాణమనేది ఒక స్థలమో, ఒక సంఘటనోగాక దుఃఖం, చెడులులేని ఒక అభావమైనందున అది వర్ణింపనశక్యమైన ఒక స్థితి అనీ చెప్పడం జరుగుతుంది. (మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) 9-10 పేజీలు చూడండి.) ఇది మనకేమి చెప్తోంది? బౌద్ధమత తత్త్వజ్ఞానంపై చర్చలు జరపడం అంత ప్రతిఫలదాయకం కాకపోవచ్చు. దానికి బదులుగా, అందరూ ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించండి.
4 పరస్పర అవసరాలను నొక్కి తెల్పండి: భూమిపై జీవితమంటేనే దుఃఖమయమని బౌద్ధమతస్థులు సాధారణంగా అంటూవుంటారు గనుక, భూమిపై నిత్యజీవం అన్న తలంపే తెలివితక్కువ అభిప్రాయమన్న తలంపు వారికి రావచ్చు. అయినా, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించాలన్న, దుఃఖం నిర్మూలించబడడాన్ని చూడాలన్న, జీవితార్థాన్ని తెలుసుకోవాలన్న అభిలాషను మనమంతా పంచుకుంటాం. అలాంటి పరస్పరావసరాలను ఎలా ఉన్నతపర్చవచ్చో గమనించండి.
5 మీరు ఈ ఉపోద్ఘాతాన్ని ఉపయోగించవచ్చు:
◼ “అమాయకులైన అనేకమంది ప్రజలు బాధననుభవించే లోకంలో నేడు మనం జీవిస్తున్నాము. బాధకూ, దుఃఖానికీ అంతాన్ని తీసుకువచ్చేందుకు ఏది అవసరమని మీరు నమ్ముతున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] నన్ను బాగా ఓదార్చిన ఒక ప్రాచీన వాగ్దానం ఉంది. [ప్రకటన 21:4 చదవండి.] ఆ సమయం ఇంకా రాలేదనుకోండి, కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని మనం చూడాలనుకుంటాం, కాదంటారా?” బాధలు ఎలా అంతం అవుతాయనే దాన్ని గూర్చి వివరించే ఒక ప్రచురణనివ్వండి.
6 ఒక పెద్ద వయసు వ్యక్తితో మీరిలా చెప్పవచ్చు:
◼ “ప్రస్తుతం ప్రవాహంలా కొట్టుకొస్తున్న అనైతిక తలంపులను గురించీ, అవి మన పిల్లలపై చూపించే ప్రభావాన్ని గురించీ బహుశా మీరూ నాలానే ఆలోచిస్తూవుండవచ్చు. యువతమధ్య ఎందుకింత అనైతికత పెరిగిపోతోంది? [ప్రతిస్పందించనివ్వండి.] ఇస్లామ్, హిందూ, క్రైస్తవ మతాలు ప్రారంభం కాకముందు ఎంతోకాలం క్రిందట వ్రాయబడిన ఒక గ్రంథంలో దాన్ని గురించి ముందుగానే తెలియజేయబడిందన్న విషయం మీకు తెలుసా? [2 తిమో. 3:1-3 చదవండి.] జ్ఞానం అంతకంతకూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ పరిస్థితులు అధికమౌతున్నాయి. [7వ వచనం చదవండి.] అనేక మంది ప్రజలు తెలుసుకోలేని సత్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఈ పుస్తకం నాకు సహాయపడింది. దాన్ని చదవడానికి మీరు ఇష్టపడతారా? తగిన పుస్తకాన్నిగానీ, బ్రోషూర్నుగానీ అందించండి.
7 బౌద్ధమతస్థులు సాధారణంగా బైబిలును పవిత్ర గ్రంథంగా గౌరవిస్తారు. కాబట్టి, బైబిల్ని తెరచి చదవండి. (హెబ్రీ. 4:12) బైబిలుపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని గురించి ఒకరు తన అభ్యంతరాన్ని తెలియజేస్తే, బైబిలు రచయితలంతా ఆసియా దేశస్థులేనని తెలియజేయండి.
8 ఏ ప్రచురణలు బాగా పనిచేస్తాయి? ఈ క్రింది సాహిత్యాలను అనేకమంది ప్రచారకులు విజయవంతంగా ఉపయోగించారు: దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం); కుటుంబ సంతోషానికిగల రహస్యము; యువత అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలనూ, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, అందుబాటులో ఉంటే మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా? అనే రాజ్య వార్త నెం. 35. ఇప్పుడు సత్యాన్ని నేర్చుకుంటున్న బౌద్ధమతస్థుల్లో అనేకమంది మొదటిగా దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్నూ, ఆ తర్వాత జ్ఞానము పుస్తకాన్నీ పఠిస్తున్నారు.
9 పౌలు ఏథెన్సులో ప్రకటించేనాటికి దాదాపు 400 సంవత్సరాలకు పూర్వమే బౌద్ధమత మిషనరీలు అక్కడకు వచ్చారని చెప్పబడుతున్నప్పటికీ, బౌద్ధమత అభిప్రాయాలచే ప్రభావితుడైన ఏ వ్యక్తినైనా ఆయన కలిశాడా లేదా అన్న విషయం అనిశ్చయం. అయినప్పటికీ, అన్ని తరహాల ప్రజలకు సాక్ష్యమివ్వడాన్ని గురించి పౌలు ఎలా భావించేవాడో అన్న విషయం మనకు బాగా తెలుసు. “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని” ఆయన తనను తాను ‘అందరికిని . . . దాసునిగా చేసికొన్నాడు.’ (1 కొరిం. 9:19-23) ప్రజల యందు వ్యక్తిగత శ్రద్ధను చూపించడం ద్వారా, మనం కలుసుకునే ప్రతి ఒక్కరికీ మనం సాక్ష్యమిస్తుండగా మనమంతా కల్గివున్న నిరీక్షణను గురించి నొక్కి చెప్పడం ద్వారా మనమూ అలాగే చేయవచ్చు.