క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
యెహోవాతో నడవడం మూలంగా మీరు ఎటువంటి ఆచరణాత్మక ప్రయోజనాలను ఇప్పుడు పొందుతున్నారు? మీ జీవితంలో మొదటి స్థానం నుంచి రాజ్యాసక్తులను తోసివేసేందుకు దైవపరిపాలనేతర వ్యవహారాలను అనుమతించే శోధనను మీరెలా నిరోధించగలరు? (మత్త. 6:33) తప్పును ఒప్పుగా కనిపించేలా చేసే లోకంలో ఏది తప్పో ఏది ఒప్పో వివేచించడం కష్టంగా ఉన్నట్టు మీరు కనుగొంటారా? (హెబ్రీ. 5:14) ఆ విషయాలు, 2000వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభమవుతున్న “దేవుని మార్గాల్లో నడవడం ద్వారా ఇప్పుడు ప్రయోజనం పొందండి” అనే అంశంగల ప్రాంతీయ సమావేశంలో చర్చించబడతాయి.—కీర్త. 128:1.
ఈ ప్రాంతీయ సమావేశంలో శనివారం జరిగే కార్యక్రమంలో ఒక క్రొత్త విషయమేమిటంటే, మాదిరి సేవా కూటాన్ని నిర్వహించి చూపించడం. ఆ కార్యక్రమం కోసం ప్లాన్ చేయబడిన దానిని గురించి మీ ప్రాంతీయ పైవిచారణకర్త సంఘాలకు తెలియజేస్తారు, దాన్ని పూర్తిగా ఆనందించేందుకు అందరూ సిద్ధపడి సమావేశానికి రావచ్చు.
“పయినీరులారా—మీరెలా నడుస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి” అనే ప్రసంగం, పయినీరు పరిచర్య కోసం అనుకూలమైన సమయాన్ని కొనుక్కునేందుకు వివేకాన్నీ, సహేతుకతనూ ఎలా అభ్యసించాలో మనకు చూపిస్తుంది. (ఎఫె. 5:15-17) జీవితంలోని ప్రతి విషయమందూ దేవునికి ఏది అంగీకారయుక్తమౌతుందన్న విషయాన్ని మనం ఎలా నిశ్చయపర్చుకోగలమో “సరియైనవిగా ఉన్నట్టు కన్పించే మార్గాల విషయమై జాగ్రత్తగా ఉండండి” అనే అంశం బోధిస్తుంది. “నెరవేరిన ప్రవచనం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది” అనే ప్రసంగం, దేవుని వాక్యం పట్ల మనకున్న ప్రేమతో మన మనస్సులనూ, హృదయాలనూ నింపుకునేందుకు సహాయపడుతుంది. “దేవుని మార్గాలు—ఎంత ప్రయోజనకరమైనవి!” అనే బహిరంగ ప్రసంగం, యెహోవా దేవుని నీతియుక్తమైన కట్టడలకు అనుగుణ్యంగా నడవడం మూలంగా ఇప్పుడు పొందిన ప్రయోజనాలను నొక్కి చెబుతుంది.
మీరు దేవుని సమర్పిత సేవకుల్లో ఒకరిగా దేవుని మార్గాల్లో నడవాలనుకుంటున్నారని నీటి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా ప్రదర్శించాలన్నదేనా మీ కోరిక? అలాగైతే, అందుకు అవసరమైన ఏర్పాట్లను చేసేలా మీ సంఘ పైవిచారణకర్తతో మాట్లాడండి.
సమయోచితమైన ఈ ప్రాంతీయ సమావేశానికి తప్పిపోకుండా హాజరుకావాలని తీర్మానించుకోండి. “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు” గనుక, రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం అంతటికీ హాజరవ్వండి.—కీర్త. 128:1.