మీ సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించండి
1 ఉపయోగించుకోవడానికి ప్రతీ వారం అందరికీ అందుబాటులో ఉన్న సమయం ఒకే విధంగా ఉంటుంది. అందులో నుండి సువార్తను వ్యాప్తిచేయడానికి మనం కేటాయించే సమయం ప్రత్యేకంగా విలువైనది, ఎందుకంటే అది ప్రాణాలను రక్షించే పనిలో గడుపుతున్న సమయమైవుంది. (రోమా. 1:16) దాని పట్ల మన మెప్పుదలను, ప్రణాళిక వేసుకున్న సేవకు బాగా సిద్ధపడి, సేవ కొరకైన కూటాలకు సరియైన సమయానికి రావడం ద్వారా, సేవా ప్రాంతానికి కూటం అయిన వెంటనే వెళ్ళడం ద్వారా చూపించగలం. సేవ కొరకైన కూటం అయిపోయిన తర్వాత ఊరకనే వేచివుండడానికి బదులు, మనం ప్రకటిస్తాం. “ప్రతిదానికి సమయము కలదు” అని యెహోవా మనకు బోధిస్తున్నందున, పరిచర్య కోసం వెచ్చించాలని మనం కేటాయించుకున్న సమయాన్ని మనం నిజంగా ఉపయోగించాలి.—ప్రసం. 3:1.
2 మీ సమయంతో జ్ఞానయుక్తంగా వ్యవహరించడం: క్షేత్ర పరిచర్యలో క్రమంగా భాగంవహించడానికి వీలును కల్పించేలా వేసుకున్న షెడ్యూలును స్థిరంగా అనుసరించినప్పుడు మనం అనేక ఆశీర్వాదాలను పొందుతాం. వాస్తవికంగా చూస్తే, పరిచర్యలో మనం సాధించే సత్ఫలితాలు, సేవలో మనం గడిపే మొత్తం సమయానికి తులనాత్మకంగా ఉండాలి. మనం మన దైనందిన కార్యక్రమాల్లో కొద్దిపాటి సర్దుబాట్లను చేసుకుంటే, మనం క్షేత్ర సేవలో గడపడానికి మరింత సమయాన్ని కేటాయించగలమా? ఉదాహరణకు, శనివారం పత్రికా పనిలో భాగం వహించిన తర్వాత, కొంతమందిని పునర్దర్శించేందుకు మనం కొంత అదనపు సమయాన్ని గడపగలమా? ఆదివారాన క్షేత్ర సేవలో కొంత సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే, పునర్దర్శనాలు చేయడానికో లేక ఒక బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకో మరి కొంత సమయాన్ని గడపగలమా? ఇంటింటి పరిచర్యతోపాటు అదనంగా కొంత వీధి సాక్ష్యాన్ని ఇవ్వడం సాధ్యమవుతుందా? ఈ మార్గాల్లోనూ లేదా మరితర మార్గాల్లోనూ మన సేవలో మనం అభివృద్ధి పొందగలము.
3 పరిచర్యలో ఉన్నప్పుడు, మనం జాగ్రత్తగా ఉండకపోతే మన విలువైన సమయం వృథాకావచ్చు. నిజమే, వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు, కొంతసేపు విరామం తీసుకోవడం మనం ఉపశమనం పొంది మరలా సేవలో కొనసాగేలా సహాయపడుతుంది. అయితే, సమతూకాన్ని కలిగివుండండి, ఎందుకంటే అలాంటి విరామ సమయాలు అన్నివేళలా అవసరం కాకపోవచ్చు.
4 ఇటీవలి సంవత్సరాల్లో ప్రజలను ఇండ్లవద్ద కలుసుకోవడమనేది అంతకంతకూ కష్టమవుతోంది. ఆ పరిస్థితిని అధిగమించేందుకు, చాలామంది ప్రచారకులు ఇంటింటి సాక్ష్యాన్ని రోజులో మరో సమయమందు చేస్తున్నారు. మధ్యాహ్నం దాటిన తరువాతగానీ, సాయంకాలానికి కాస్త ముందుగానీ సాక్ష్యమిచ్చేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు?
5 వీధి సాక్ష్యంలో పాల్గొన్నప్పుడు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకుంటుంటే, అది అంత ప్రతిఫలదాయకమైన సమయం కాదు. దానికి బదులు, ఒకరి నుండి ఒకరు కాస్త దూరంగా నిలబడి, ప్రజలతో సంభాషణను ప్రారంభించేలా వారిని కలుసుకోండి. ఆ విధంగా, సమయాన్ని మరింత ప్రభావవంతంగా ఉపయోగిస్తాం, చేస్తున్న సేవనుంచి గొప్ప ఆనందాన్ని పొందుతాం.
6 సాక్ష్యమిచ్చేందుకు ఉన్న అవకాశాలను చేజిక్కించుకోండి: ఒక గృహ యజమానురాలు తనకు ఆసక్తిలేదని చెప్పినప్పుడు ఒక సాక్షి, తాను మిగిలిన ఎవరితోనైనా మాట్లాడేందుకు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అది, చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఒక వ్యక్తితో మాట్లాడటానికి నడిపించింది. దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్న నిరీక్షణ, అతనికి జీవితంపై ఆశను చిగిర్చేలా చేసింది. త్వరలోనే అతడు కోలుకుని, రాజ్యమందిరంలోని కూటాలకు హాజరవుతూ, తాను క్రొత్తగా కనుగొన్న నిరీక్షణను ఇతరులతో పంచుకుంటున్నాడు!
7 సంఘపుస్తక పఠనం జరగడానికి ముందు ఒక గంటపాటు క్షేత్ర సేవలో పాల్గొనమని ఇచ్చిన సలహాను టీనేజ్లో ఉన్న ఒక సహోదరి అన్వయించుకుంది. మొదటి ఇంటి దగ్గర ఆమె 13 ఏళ్ల వయస్సున్న అమ్మాయిని కలుసుకుంది, ఆ అమ్మాయి శ్రద్ధగా విని, సాహిత్యాన్ని తీసుకుంది. ఆ మరుసటి రోజు పాఠశాలలో, అదే అమ్మాయిని ఆ సహోదరి చూసింది. ఆ తర్వాత కొంతసేపటికి, తాను ఆమెతో బైబిలు పఠనాన్ని చేస్తానని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అంగీకరించింది.
8 దాన్ని నాణ్యమైన సమయంగా చేసుకోండి: క్షేత్ర సేవలో క్రమంగా పాల్గొనడం, సువార్తను అందించడంలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు మనకు తోడ్పడుతుంది. ఇంటింటి పరిచర్యలో ప్రభావవంతమైన ఉపోద్ఘాతాన్ని ఉపయోగించడం ద్వారా సంభాషణను ప్రారంభించడంలో మీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోగలరా? గృహ బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్నప్పుడు నైపుణ్యవంతమైన బోధకునిగా తయారవ్వగలరా? అలా చేయడం ద్వారా, క్షేత్ర సేవలో మీ సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోగలరు, మీ పరిచర్యను మరింత ఫలభరితంగా చేసుకోగలరు.—1 తిమో. 4:16.
9 “కాలము సంకుచితమై యున్నది” కాబట్టి మన జీవితాలు క్రైస్తవ పనులతో నిండివుండాలి. (1 కొరిం. 7:29) ప్రకటనా కార్యక్రమం కోసం సమయాన్ని కేటాయించడమనేది, మన ప్రాధాన్యతల లిస్టులో ప్రథమ స్థానమందు ఉండాలి. సేవలో మనమంతా హితకరమైన, ఆసక్తికరమైన భాగాన్ని కల్గివుందాం. కాలమనేది యెహోవా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశ్చర్యకరమైన ఆస్తి. దానిని ఎల్లప్పుడూ జ్ఞానయుక్తంగానూ, ప్రభావవంతంగానూ ఉపయోగిద్దాము.
[4వ పేజీలోని బాక్సు]
ఈ సలహాలను పరిగణలోనికి తీసుకోండి:
◼ క్షేత్ర సేవ కొరకైన కూటాలకు సమయానికి రావాలి.
◼ వీలైనంత మట్టుకు, సాక్ష్యమిచ్చే గుంపులను చిన్నవిగా చేయండి.
◼ సేవా ప్రాంతంలోనికి వెళ్లడంలో జాప్యం జరగకుండా జాగ్రత్త వహించండి.
◼ ఎక్కువమంది ప్రజలు ఇండ్లలో ఉన్నప్పుడు సేవా ప్రాంతంలో పనిచేయండి.
◼ ఒంటరిగా పనిచేయడం సురక్షితమైనదైతే, కొన్నిసార్లు అలా పనిచేయండి.
◼ ఇంటింటి పరిచర్య చేసే ప్రాంతానికి దగ్గరలో ఆసక్తిగలవారిని పునర్దర్శించండి.
◼ మీ గ్రూపులోని ఇతరులు ఏదైనా ఒక ఇంటిదగ్గర నుంచి తిరిగి రావడం ఆలస్యమైనప్పుడు, వేచివుండక మీరు సేవలో బిజీగా ఉండండి.
◼ సాధ్యమైనప్పుడల్లా, పరిస్థితులను బట్టి ఒక గంట కంటే ఎక్కువసేపు గడపండి.