మీరు మీ సహాయ హస్తాన్ని అందిస్తారా?
1 అపొస్తలుడైన పౌలు, “ఒకదానినొకటి [ఒకరిని మరొకరు] యేకముగా పరామర్శించులాగున” ఉండాలని సంఘ సభ్యులకు ఉద్బోధించాడు. (1 కొరిం. 12:24) కాబట్టి, మనం ఒకరిపట్ల మరొకరం వ్యక్తిగత శ్రద్ధను చూపించాలి, అవసరమైనప్పుడు ప్రేమపూర్వకమైన సహాయాన్ని అందించేందుకు సుముఖులై ఉండాలి. ఉదాహరణగా, మన మధ్యనున్న కొంతమంది ఆధ్యాత్మిక సహోదరీలు, తమ పిల్లలను సత్యమందు పెంచడంలో ఒంటరి పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ సహోదరీలు, తమ పిల్లలకు ఆధ్యాత్మిక శిక్షణనివ్వడం కోసం బాధ్యతా భారాన్ని పూర్తిగా మోస్తున్నారు. ఖచ్చితంగా వాళ్లు, మన దయాపూర్వక ప్రోత్సాహం పొందడానికీ, వారి “అవసరముల”ను బట్టి ఆచరణాత్మక మద్దతును పొందడానికీ వాళ్లు అర్హులు. (రోమా. 12:13 ఎ) మీరు వారికి మీ సహాయ హస్తాన్ని అందించగలరా?
2 మీరు సహాయం చేయగలిగే మార్గాలు: ప్రజా రవాణాపై ఆధారపడిన వారిని కూటాలకూ, సమావేశాలకూ మీ సొంత వాహనాలపై తీసుకువెళ్ళి తీసుకురావడంలో మీ సహాయ హస్తాన్ని అందించడం, బహుశా ఆ కుటుంబం ఆర్థికంగా చెప్పుకోదగినంత మొత్తాన్ని ఆదా చేసుకోవడానికి కారణమౌతుంది. చిన్న పిల్లలుగల ఒక తల్లికి, కూటాలలో ఆ పిల్లల పట్ల శ్రద్ధ చూపించడం విషయంలో సహాయపడితే, బహుశా ఆమె జరుగుతున్న కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందగలదు. అలాగే, ఆమె క్షేత్ర సేవకు తనతోపాటు తన పిల్లల్ని తీసుకు వస్తున్నప్పుడు ఆమెకు సహాయ హస్తాన్ని అందించడం, ఆమెకు కొంత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. పిల్లలపై నిజమైన శ్రద్ధను చూపిస్తూ, వారితో స్నేహంగా ఉండడం, మన యౌవనులను అనుకూల మార్గంలో ప్రభావితం చేసేందుకు ఎంతగానో తోడ్పడగలదు. ఒంటరి తల్లి లేక తండ్రి ఉన్న కుటుంబాలను మీ కుటుంబ పఠనంలో కూర్చొనేందుకు అప్పుడప్పుడూ ఆహ్వానించడం, వారికి ఆధ్యాత్మిక మద్దతును ఇస్తుంది.
3 వివేచన గలవారై ఉండండి: సహాయం అవసరంలేదని భావించే వ్యక్తిని మన సహాయాన్ని తీసుకోమని బలవంతం చేయకుండా జాగ్రత్తవహించాలి. మనం అవసరమైన సహాయం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం కలుగజేసికోవాలని కోరుకోకూడదు. నిజమే, అవసరంలో ఉన్న సహోదరికి సహాయం చేసే మంచి స్థానంలో సహోదరీలూ, వివాహ దంపతులూ ఉంటారు.
4 ఒకరికొకరం ‘శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుకోవాలని’ క్రైస్తవులందరూ ప్రోత్సహించబడుతున్నారు. (రోమా. 12:13 బి) మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు సహాయ హస్తాన్ని అందించడమనేది, మనం మన మధ్య కల్గివున్న క్రీస్తులాంటి ప్రేమను చూపించడానికున్న అనేక మార్గాల్లో ఒకటైవుంది.—యోహా. 13:35.