యెహోవా సహాయం కోసం ప్రార్థించండి
1 తమ పరిచర్యలో యెహోవా ఆశీర్వాదాలు అవసరమన్న విషయాన్ని యేసు తన శిష్యుల హృదయంలో చెరగని ముద్రగా వేశాడు. (మత్త. 9:37, 38) పట్టుదలతో కూడిన విన్నపాలు, విజ్ఞాపనలతోపాటు మన హృదయ పూర్వక స్తుతి ప్రార్థనలు మరియు కృతజ్ఞతా ప్రార్థనలు యెహోవా సహాయంపైనే మనం పూర్తిగా ఆధారపడుతున్నామన్న విషయాన్ని ప్రదర్శిస్తాయి. (ఫిలి. 4: 6, 7) ప్రార్థిస్తూ ఉండాలని, “ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను” చేస్తూ ఉండాలని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. పరిచర్యకు సంబంధించి మనం చేసే ప్రార్థనల విషయంలో కూడా అది అన్వయిస్తుంది.—ఎఫె. 6:18.
2 యెహోవా దేవుని నిరుపమానమైన లక్షణాలను బట్టి ఆయన నెరవేర్చిన కార్యాలను బట్టి ప్రార్థనలో మనం ఆయనను స్తుతిస్తాం. మనం ప్రకటిస్తున్న సువార్తను ఇచ్చినవానిగా కూడా మనం ఆయనను స్తుతిస్తాం. ఆయన మాత్రమే మన పరిచర్యను విజయవంతం చేస్తాడు గనుక మన స్తుతులకు ఆయన అర్హుడు.—కీర్త. 127:1.
3 తన చిత్తాన్ని గురించీ, తన సంకల్పాన్ని గురించీ మనకు యెహోవా అనుగ్రహించిన అవగాహనపట్ల మనకుగల మెప్పుదలను మన కృతజ్ఞతా ప్రార్థనలు వ్యక్తపరుస్తాయి. రాజ్య సత్యాల్ని ఇతరులతో పంచుకోవడం ఒక ఆధిక్యత కాదంటారా? పరిచర్యలో మనం నెరవేరుస్తున్న వాటన్నింటినిబట్టి మనం యెహోవాకు కృతజ్ఞతలు చెబుతాం.—కీర్త. 107:8; ఎఫె. 5:20.
4 బైబిలు పఠన ప్రతిపాదనను అంగీకరించే ప్రజలను కనుగొనడంలో సహాయం చేయమనీ, సత్యంతో వారి హృదయాలను చేరుకోవడంలో సహాయం చేయమనీ మనం సముచితంగానే యెహోవాను అడుగుతాం. అలాంటి విన్నపాలు చేయడం ద్వారా, దేవుడు మాత్రమే పరిచర్యలో మన పనిని ఫలకరమైనదిగా చేయగలడని గుర్తిస్తున్నామని సూచిస్తాం.—1 కొరిం. 3:5-7.
5 తన మ్యాగజైన్ రూట్లో ఉన్న ఒక స్త్రీ తానిస్తున్న కావలికోట, తేజరిల్లు! పత్రికలను చదవడంలేదని ఒక సహోదరి భావించింది. ఈ అమూల్యమైన పత్రికలు వృథాకావడం ఇష్టంలేని ఆ సహోదరి, ఒకవేళ ఆ స్త్రీ పత్రికలను చదవనట్లయితే, ఆమె వాటిని తిరస్కరించాలని యెహోవాకు విన్నవించుకుంది. సహోదరి మరలా ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, “ఈ పత్రికల్ని క్రమంగా తీసుకొచ్చి ఇస్తున్నందుకు థాంక్స్. నేను వాటిని చదువుతున్నాను, వాటిని నేను నిజంగా ఇష్టపడుతున్నాను” అని ఆ స్త్రీ భర్త అన్నాడు.
6 ప్రజల నిర్లిప్త వైఖరితోను, ఎగతాళితోను వ్యవహరించేందుకూ, ఇతరులకు ధైర్యంగా సాక్ష్యమిచ్చేలాగున, ఏ విధమైన మనుష్య భయాన్నైనా సరే అధిగమించేందుకూ మనకు సహాయపడమని మనం యెహోవాకు వినయంతోనూ, పట్టుదలతోనూ విజ్ఞప్తి చేసుకోవచ్చు. (అపొ. 4:31) మనం విధేయతాపూర్వకంగా పవిత్ర సేవను చేపడుతుండగా, మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నట్లై తే, “ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను” చేస్తూ ఉన్నట్లయితే యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—1 యోహా. 3:22.