మీరు బాహ్యరూపాన్ని మాత్రమే చూస్తారా?
1 మనం మన బహిరంగ పరిచర్యను చేస్తున్నప్పుడు, కొంతమంది ప్రజలను చూడగానే వారి విషయంలో మనకు మొట్ట మొదట్లో ఏర్పడే భావం, వారితో సువార్త పంచుకునేందుకు సంకోచించేలా మనలను చేయవచ్చు. ఉదాహరణకు, భీతిని కల్గించేలా కన్పించే ఒక వ్యక్తి ఇంటి ప్రక్కనున్న సత్యమందు ఆసక్తిగల ఒకనిని మీరు పునర్దర్శించడానికి వెళ్లినప్పుడు, ఆ వ్యక్తి ఎప్పుడూ మీవంక అనుమానిస్తున్నట్టు చూస్తున్నట్లైతే మీరెలా ప్రతిస్పందిస్తారు? అలాంటి పరిస్థితినే అనుభవించిన ఒక పయినీరు సహోదరి, ఆ వ్యక్తితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. అతడు ఆమెను మొరటుగా పలకరించాడు. కానీ, ఆశ్చర్యకరంగా అతడు బైబిలు సందేశాన్ని విని, కొంత పులకింతతో అతడు పఠనానికి అంగీకరించాడు. ఆ సహోదరి, బాహ్యరూపాన్ని బట్టి తీర్పుతీర్చనందున అతను, అతని భార్య సత్యం నేర్చుకొనేందుకు మార్గం తెరవబడింది.
2 మరొక సహోదరి, పొడవైన జుట్టు వున్న ఒక యువకుని బాహ్యరూపాన్ని చూసి మొదట్లో భయపడినా, ఆమె తాను పని చేసే స్టోర్కు అతనెప్పుడు వచ్చినా సరే అతనికి విడువక క్లుప్తంగా సాక్ష్యమిస్తూ ఉండేది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి. అతడు ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న ఒక సాక్షి. అలాంటి వ్యక్తులు ప్రతిస్పందించరు అనే తొందరపాటు ముగింపుకు రాకుండా మనల్ని ఏది నివారిస్తుంది?
3 యేసు మాదిరిని అనుసరించడం: ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణాన్ని ఇవ్వాలని యేసుకు తెలుసు. కాబట్టి, ఆయన ఇతరుల బాహ్య రూపాన్ని చూసి నిరుత్సాహపడలేదు. సరియైన సహాయ, ప్రోత్సాహాలను గనుక ఇచ్చినట్లైతే అవినీతిపరులుగా పేరుబడ్డ వాళ్లు కూడా మారడానికి ఇష్టపడవచ్చని ఆయన గ్రహించాడు. (మత్త. 9:9-13) గొప్పవారికీ పేదవారికీ ఒకే రీతిగా సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. (మత్త. 11:5; మార్కు 10:17-22) పరిచర్యలో మనం కలిసే ప్రజల బాహ్యరూపాన్ని చూసి, బహుశా వాళ్లలో ఉండే మంచి హృదయ పరిస్థితి విషయంలో మనల్ని మనం అంధులను చేసుకొని వారికి తీర్పుతీర్చకుందము గాక. (మత్త. 7:1; యోహా. 7:24) యేసు చూపించిన విశిష్టమైన మాదిరిని అనుకరించేలా మనకేది సహాయపడగలదు?
4 మన బైబిలు పఠనంద్వారా మనం, ఒకని ఆలోచనా సరళినీ, ప్రవర్తననూ, వ్యక్తిత్వాన్నీ మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉందని మనం గ్రహించగల్గుతున్నాం. (ఎఫె. 4:22-24; హెబ్రీ. 4:12) కాబట్టి, మనం అనుకూల దృక్పథం కలిగివుండి, మానవ హృదయాలను చదివే యెహోవా చేతులకు మిగిలిన విషయాల్ని విడిచిపెట్టాలి.—1 సమూ. 16:7; అపొ. 10:34, 35.
5 మనం మనుష్యులందరితో, వారి బాహ్యరూపం ఏదైనా సరే, నిష్పక్షపాతంగా సువార్తను పంచుకోవడం, ఈ అంత్య దినాల్లో జరుగుతున్న గొప్ప కోత పనికి దోహదపడుతుంది.—1 తిమో. 2:3, 4.