రాజ్య మందిర నిర్మాణ అవసరతను పూర్తిచేయడం
1 మనం ప్రపంచవ్యాప్త ప్రాంతాన్ని చూస్తే యెహోవా భూసంస్థ అనుభవిస్తున్న గొప్ప అభివృద్ధిని గమనించడం హృదయానందకరంగా ఉంటుంది. గత సంవత్సరం, ఇండియాలోనే దాదాపు 25 క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,288 సంఘాలు ఏర్పడ్డాయి. ఈ అభివృద్ధి అంతటినిబట్టి చూస్తే, రాజ్య మందిరాల అవసరత మరింతగా పెరగడం ఆశ్చర్యమైన విషయమేమీ కాదు.
2 ప్రాంతీయ నిర్మాణ కమిటీలు: రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమాన్ని శీఘ్రగతిన కొనసాగించే ఓ మాధ్యమంగా సొసైటీ ఇప్పుడు రెండు ప్రాంతీయ నిర్మాణ కమిటీలను నియమించింది. అందులో ఒకటి తమిళనాడు సర్క్యూట్లలోని సంఘాలకు సహాయం చేయడానికీ, మరొకటి కేరళ సర్క్యూట్లలోని సంఘాలకు సహాయం చేయడానికీ నియమించింది. ఈ ప్రాంతీయ కమిటీలకు రాజ్య మందిర ప్రాజెక్టుల పర్యవేక్షణ అంటే క్రొత్త భవనాల లేక పునర్నిర్మాణాల పర్యవేక్షణ అప్పగించబడింది. రాజ్య మందిర నిర్మాణం కొరకైన ఈ యావత్తు ఏర్పాటు లోకంలో అతి సాధారణంగా కనబడే స్ఫూర్తికి భిన్నమైన స్ఫూర్తి ద్వారా అంటే ఇవ్వాలనే, త్యాగం చేయాలనే క్రైస్తవ స్ఫూర్తి ద్వారా నెరవేర్చబడుతుంది.—2 తిమో. 3:2, 4.
3 నిర్మాణ ప్లానులను సమీక్షించడంలో సహాయం చేయడానికి సొసైటీ ఈ ప్రాంతీయ కమిటీలకు కొన్ని నిర్దేశకాలను అందించింది. తద్వారా, సింపుల్‌గానూ, ఉపయోగపడే విధంగానూ ఉండే రాజ్య మందిరాన్ని రూపొందించడంలో, మరి ఆ సంకల్పం కొరకు కూడబెట్టిన వనరులను జ్ఞానయుక్తంగా ఉపయోగించడంలో స్థానిక పెద్దలకు సహాయపడేందుకు ఈ కమిటీలు సంసిద్ధతతో ఉన్నాయి. ప్రాంతీయ నిర్మాణ కమిటీల్లో సేవచేయడానికై నియమించబడిన అనుభవంగల పెద్దల పరిశీలనల నుండి పూర్తి ప్రయోజనం పొందుతూ, పెద్దల సభలు అన్ని విషయాలనూ జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకోవడం మంచిది.—లూకా 14:28-30.
4 నిర్మాణ ఖర్చులను కనిష్ఠస్థాయిలో ఉంచడం: సామర్థ్యంగల ఒక పెద్ద పర్యవేక్షణలో స్థానిక సంఘం కొరకు, ఒక కొనుగోలు విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ నిర్మాణ కమిటీలు నిర్దేశించబడ్డాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న సహోదరులు అనుకూలంగా ఉండే ధరల నిమిత్తం, అందుబాటులో ఉన్న ధరలను జాగ్రత్తగా పరిశీలించడానికై వివిధ డీలర్ల రేట్లను పోలుస్తూ బేరం చేస్తారు. ఈ విధంగా, ఏ సప్లయర్ల దగ్గర నుండి కొనుగోలు చేయాలి, ఏ సామగ్రిని కొనాలి అన్నవి నిర్ధారించవచ్చు.
5 తమ రాజ్య మందిరం నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కొన్ని సంఘాలకు అదనపు ఆర్థిక సహాయం అవసరమౌతుంది. సొసైటీ నుండి అడ్వాన్సు అడగడానికి ముందు స్థానికంగా, పెద్దలు (1) ప్రస్తుత అవసరాలకూ అలాగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధికీ సరిపోయే స్థలాన్ని కొనడానికీ, నిర్మాణ ఖర్చులకూ మొదట్లో ఎంత మొత్తం చందా ఇవ్వబడుతుంది, (2) నిర్మాణ కార్యక్రమం చేరివున్న సంఘంతో సహవాసం చేస్తున్నవారి ద్వారా స్థానికంగా ఎంత మొత్తం అప్పు సమకూడగలదు, (3) సంఘం నిర్వహణ వ్యయాన్ని భరించడానికీ, సొసైటీ నుండి తీసుకున్న అడ్వాన్సు ఏమైనా ఉంటే దాన్ని తిరిగి చెల్లించడానికీ ప్రతి నెలా ఎంత మొత్తం చందా ఇవ్వబడుతుంది అన్న విషయాలను నిర్ధారించడం కోసం సర్వే చేయాలి. ఈ సర్వే తీసుకుంటున్నప్పుడు ఇవ్వబడే స్లిప్పులపై ఎవరి పేర్లూ ఉండకూడదు.
6 రాజ్య మందిరం నమూనాని సరళంగా ఉండేలా చూసుకోండి: రాజ్య మందిరాలు ప్రమాణాలకు అనుగుణ్యంగా ఉండేలా సహాయపడేందుకు 100 మంది, 150 మంది, 250 మంది కూర్చొనగల్గే మూడు ప్రామాణిక రాజ్య మందిర నమూనాలు సొసైటీవద్ద ఉన్నాయి. స్నేహితులపైగానీ లేక సొసైటీ రాజ్య మందిర నిధి వనరులపైగానీ అనవసరమైన భారాన్ని మోపకుండా, పెద్దలు తమ సంఘ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుంటూ ఈ ప్రాథమిక నమూనాలనుండి ఎంపిక చేసుకోవచ్చు.
7 ఒక నమూనాను ఎంపిక చేసుకోవడానికి ముందు, సంఘ పెద్దలు ప్రాంతీయ కమిటీని సంప్రదించి, సొసైటీ అందించిన ప్లానులను మార్గ నిర్దేశకంగా ఉపయోగిస్తూ బిల్డింగు పూర్తి లేఅవుట్ గురించి చర్చించాలి. ప్రాంతీయ నిర్మాణ కమిటీ ఇప్పటికీ నియమించబడని చోట, తమ రాజ్య మందిర నిర్మాణ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి చర్యలనైనా తీసుకోవడానికి ముందు పెద్దలు సొసైటీని సంప్రదించాలి.
8 స్వచ్ఛంద సేవకులు ప్రశస్తమైన కార్యానికి మద్దతునిస్తారు: రాజ్య మందిర నిర్మాణంలో సహాయాన్నందించే అనేకమంది స్వచ్ఛంద సేవకులపట్ల సొసైటీ కృతజ్ఞతా భావంతో ఉంది. అయినప్పటికీ, ఇంకా అనేకమంది స్వచ్ఛంద సేవకులు అవసరమని ప్రాంతీయ నిర్మాణ కమిటీలు నివేదిస్తున్నాయి. రాజ్యాసక్తులకు మద్దతునివ్వడంలో ఇదొక ఆవశ్యకమైన సేవ.—1 కొరిం. 15:58.
9 ఒకరు స్వచ్ఛంద సేవను ఎలా అందించగలరు? రాజ్య మందిర నిర్మాణ పనివారల ప్రశ్నావళి అనే ఫారమ్‌లను రిక్వెస్టుపైన పెద్దలకు సొసైటీ ఇస్తుంది. ఈ ఫారమ్‌లు అర్హులైన వర్కర్లకు తర్వాత అందించబడతాయి. తగిన నైపుణ్యాలుండి, సంఘంలో మంచి పేరున్నటువంటి బాప్తిస్మం పొందిన ప్రచారకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రోత్సహించబడుతున్నారు. నిర్మాణ సంబంధ నైపుణ్యాలున్నవారూ, నిర్మాణేతర నైపుణ్యాలు ఉన్నవారూ అవసరం. తమ సంఘంలోని సంఘ పైవిచారణకర్త నుండి గానీ లేక సెక్రటరీ నుండి గానీ అవసరమైన ఫారాలను స్వచ్ఛంద సేవకులు పొందవచ్చు. వృత్తి పనిలోనో లేక ఆహార పంపిణీ, భద్రత, సామగ్రిని హ్యాండిల్ చేయడం, అకౌంటింగు వంటి వేరే ఏదైనా రంగంలోనో, చట్టపరమైన కాగితాల వ్యవహారాలు చూసుకోవడం వంటి పనుల్లోనో తమకు ఉన్న అనుభవాన్ని వారు పేర్కొనవచ్చు.
10 అంతేగాక, దగ్గర్లో రాజ్య మందిరం నిర్మించబడుతుంటే, మీ సంఘంలో నిర్మాణ సంబంధిత నైపుణ్యాలు లేని ప్రచారకులు సాధారణ శ్రామిక పనిలో సహాయం చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకుల ప్రశ్నావళిని పూరించనవసరం లేదు. ఈ సందర్భంలో అవసరం ఎంతుందో తెలియజేయబడుతుంది, నిర్మాణ ప్రాజెక్టులో ఇమిడివున్న సంఘంలోని పెద్దలద్వారా పొరుగున ఉన్న సంఘాల్లోని పెద్దలద్వారా ఏర్పాట్లు చేయబడతాయి.
[4వ పేజీలోని బాక్సు]
రాజ్య మందిరం పొందడం కొరకు తీసుకోవల్సిన చర్యలు:
(1) ప్రాజెక్టు కొరకూ, ఒక సంఘ ట్రస్టును ఏర్పాటు చేయడానికి ట్రస్టీలను నియమించడం కొరకూ సంఘం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి
(2) పెద్దల సభ ఇద్దరు లేక ముగ్గురు పెద్దలతో కూడిన ఒక స్థానిక నిర్మాణ కమిటీని నియమించాలి, వ్యాపార/నిర్మాణ అనుభవం ఉంటే మంచిది
(3) స్థానిక నిర్మాణ కమిటీ రాజ్య మందిర నమూనాను ఎంపిక చేసుకోవడం కొరకు ప్రాంతీయ నిర్మాణ కమిటీని గానీ లేక సొసైటీని గానీ సంప్రదించాలి
(4) ఎంపిక చేసుకున్న నమూనాను ఆమోదం నిమిత్తం సొసైటీకి పంపించాలి, మంజూరు నిమిత్తం స్థానిక అధికారులకు దాఖలు చేయడానికి సొసైటీ దాన్ని తిరిగి పంపించివేస్తుంది
(5) ప్రాజెక్టు కొరకు అందుబాటులో ఉన్న నిధుల మొత్తాన్ని పెద్దలు నిర్ధారిస్తారు. (మీకు ఆర్థిక సహాయం కావల్సివస్తే, సొసైటీకి వ్రాయండి)
(6) స్థానిక నిర్మాణ కమిటీ ప్రచారకులలో అనేకమందికి అనుకూలంగావున్న స్థలాన్ని వెదికి, కొని, దాన్ని ట్రస్టు పేరిట రిజిస్టరు చేయాలి
(7) రాజ్య మందిర నిర్మాణ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ప్రాంతీయ నిర్మాణ కమిటీ, స్థానిక నిర్మాణ కమిటీలు కలిసి పనిచేస్తాయి
[4వ పేజీలోని బాక్సు]
స్థలాన్ని అంచనా వేయడానికి చెక్‌లిస్టు
ప్లాటు
పరిమాణం (ప్రస్తుత అవసరానికీ, భవిష్యత్తు అభివృద్ధికీ సరిపోతుందా?)
ఆకృతి (స్థలాన్నంతటినీ ఉపయోగించడం దుర్లభమవుతుందా?)
నేల (అది మీ బిల్డింగుని ఆపగలదా?)
నీళ్లు (వరద ప్రమాదం? సెప్టిక్ ట్యాంకు ఓడుతుందా?)
పొరుగువారు (వారికి మీ బిల్డింగు విషయంలో అభ్యంతరం ఉందా?)
ప్రజోపయోగ సేవలు
అందుబాటు (మురుగునీటి పారుదల, నీరు, గ్యాసు, ఎలెక్ట్రిసిటీ, ఫోను)
చెత్తాచెదారం సేకరణ
పోలీసు, అగ్ని మాపక సర్వీసులు
క్రమమైన తపాలా సేవ
స్కూళ్లు దగ్గర్లో ఉన్నాయా? మంచి పేరున్నవేనా?
ఇరుగు పొరుగు
జీవన రీతి (ఉత్తమమా, అధమమా, స్థిరమా?)
పర్యావరణ పరిస్థితులు (ప్రధాన రహదారులు, ఫ్యాక్టరీలు?)
ప్రదేశం
ప్రజా రవాణా సౌకర్యాలు ఉన్నాయా?
చట్ట పరిమితులు
కొనబోయే భూమికి స్పష్టమైన హక్కును సంపాదించగలరా? (వకీలును కలవండి)
దస్తావేజు సంబంధంగా ప్రతిబంధకాలున్నాయా?
జోన్ సంబంధంగా ప్రతిబంధకాలున్నాయా? (రోడ్డుకు ఎంత దూరంలో ఉండాలి, పరిమాణం)
మీరు అనుభోగ హక్కులూ, దారి హక్కులు వంటివి ఇవ్వాలా?
ఆర్థిక విషయాలు
మీరు స్థలాన్ని కొనగలరా?
మీకు అప్పు అవసరమా?
పొంచివున్న ఖర్చులు ఉన్నాయా?
(ప్రత్యేక ధారాబందీలు, కట్టని పన్నులు?)
మీ పన్నులు ఎలా ఉంటాయి?
[4వ పేజీలోని బాక్సు]
నిర్మాణ నియమావళి పరిధిలోకి వచ్చే రంగాల ఉదాహరణలు
జోనింగ్ ప్రతిబంధకాలు
జోనింగ్ ప్రాంతాలను నిర్ధారించడం
బిల్డింగులను ఏ విధంగా ఉపయోగించవచ్చు
ప్లాటులో ఎంత శాతం స్థలాన్ని ఉపయోగించవచ్చు (సాంద్రత)
బిల్డింగు గరిష్ఠ పరిమాణం
గరిష్ఠ ఎత్తు
రోడ్డునుండీ, పొరుగునవున్న కట్టడాలనుండీ ఎంత దూరంగా ఉండాలి
పార్కింగ్ నియమాలు
కనిష్ఠ ప్లాటు-సైజు సంబంధంగా నిర్దేశకాలు
ఇవి ఒక “ప్రాంతం రూపురేఖల్ని” ఏర్పరచగలవు లేక మార్చగలవు
నిర్మాణ నియమావళి
అగ్ని ప్రమాదంనుండి రక్షణ
సురక్షితంగా సులభంగా నిష్క్రమించగల్గడం (బహిర్గమనం)
ప్రమాదకరమైన భవన నిర్మాణ ఉపయోగవస్తువులను సంభాళించడం
ప్రజా సమూహాల నిమిత్తం రూపొందించడం (ప్రజా నిర్మాణాలు)
భవన సురక్షత
తగినంత వెలుగు, స్వచ్ఛమైన గాలి సరఫరా
పారిశుద్ధ్య సంబంధిత గొట్టాలు
అగ్ని మాపక పరికరాలు
నిర్మాణం సమయంలో భద్రత
ప్రాథమిక ఉద్దేశం ప్రాణాన్ని కాపాడడమూ, బిల్డింగులో ఉండేవారి సంక్షేమమూ
[4వ పేజీలోని చిత్రం]
బాగాలేదు
[4వ పేజీలోని చిత్రం]
తృప్తికరం
[4వ పేజీలోని చిత్రం]
ఫర్వాలేదు