స్కూలునుండి పూర్తి లాభాన్ని పొందండి
1 ఇది చాలామంది యౌవనులు స్కూల్లో క్రొత్త తరగతిలోకి ప్రవేశించే సమయం. స్కూల్లో క్రొత్త టెర్మ్ ప్రారంభంలో కొన్ని సవాళ్లూ, చింతలూ ఉన్నప్పటికీ, తమ విద్యనుండి పూర్తి లాభాన్ని పొందడానికి, శ్రద్ధగా తమను తాము మల్చుకునే యౌవనస్థులకు తాము పొందగల్గే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
2 ఒక చక్కని ప్రాథమిక విద్య ఒకరి ఆత్మీయ పురోభివృద్ధికి తోడ్పడగలదు. తన యౌవనంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడన్నది తాను పెద్దయిన తర్వాత ఏమి సాధించగలడన్న దానిపై చాలా ప్రభావం చూపుతుంది. స్కూలు విద్య విషయంలో కూడా “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీ. 6:7) యౌవనస్థులు తమ స్కూలు పాఠాలను శ్రద్ధగా చదువుకుంటే, యెహోవాకు మరింత ఉపయోగకరంగా ఉండేటట్లు చేయగల నైపుణ్యాలను వారు సంపాదించగలరు.
3 స్కూల్లో సరైన కోర్సులను ఎంపిక చేసుకునేందుకు జాగ్రత్తతో కూడిన ముందాలోచన అవసరం. జీవితంలో ఆత్మీయ లక్ష్యాలను చేరుకునేందుకు అత్యంత ఆచరణయోగ్యమైన శిక్షణను అందించే కోర్సులను ఎంపిక చేసుకునేందుకు తలిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయాలి. తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం ద్వారా, యౌవనులు పని చేస్తూ తమను తాము పోషించుకోగల్గే స్థాయిలో ఉండి పయినీరు సేవచేయగల్గుతారు. తామెక్కడ సేవ చేసినప్పటికీ వారి ప్రాథమిక విద్య యెహోవాకు స్తుతులు తీసుకురావడానికి సహాయం చేయాలి.
4 యౌవనస్థులారా, మీరు స్కూల్లో చదివే కాలమంతటినుండి పూర్తి లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయడంలో, ఏదో లౌకిక సంబంధ కెరీర్ను వెంబడించే బదులుగా పవిత్ర సేవలో అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడంపై కేంద్రీకరించండి. యెహోవా చిత్తాన్ని చేయడానికి మీ జీవితాన్ని ఉపయోగించడానికి కృషిచేయండి. తద్వారా, మీరు యెహోవాకు స్తుతి తెచ్చేలాగున మీరు మీ మార్గాల్ని సఫలం చేసుకుంటారు.—కీర్త. 1:3.