విస్తృతి కొనసాగడం రాజ్యమందిరాల అవసరతను పెంచుతుంది
1 ఎంతో కాలం క్రితం యెహోవా ప్రవక్త “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును” అని ప్రవచించాడు. (హగ్గ. 2:7) అనేకులు సత్యం నేర్చుకొని, యెహోవా ఆరాధికులు కావడాన్ని దైవిక బోధ సాధ్యంచేసిందన్న రుజువును నిశ్చయంగా మనం చూస్తున్నాం. కేవలం ఇండియాలో 1994 సేవా సంవత్సరంలో 1,312 మంది బాప్తిస్మం తీసుకున్నారని గమనించడం ఎంత పులకరింతగా ఉందో! ఈ క్రొత్త వారికందరికీ సహాయపడుతూ ఉండేందుకు మనకు సాధ్యమైనంత మేరకు యెహోవా పనికి మద్దతునిస్తున్నామని నిశ్చయం కలిగివుండేలా మన ‘ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనవలసిన’ అవసరం ఉంది. (హగ్గ. 1:5 పోల్చండి) అవును, యెహోవాను స్తుతించే క్రొత్త జనసమూహాలకు తగిన ఆరాధనాలయాలను సమకూర్చడంలో సహాయపడడం, దేవుని పనికి మద్దతునివ్వడంలో ముఖ్యభాగంగా కొనసాగుతుంది.
2 ఈ 1994 లో అనేక రాజ్యమందిరాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇంకా అనేకము నిర్మించబడుతున్నాయి. యెహోవా పని నిజంగా “కొండల కంటె ఎత్తుగా” ఎత్తబడింది. (యెష. 2:2) సంస్థ, 52 సంఘాలకు క్రొత్త రాజ్యమందిరాలను కలిగి ఉండడాన్ని సాధ్యపరచింది. క్రొత్త రాజ్యమందిరాలను కట్టుకునేందుకు మరిన్ని సంఘాలకు సహాయపడేలా ఆర్థిక సహాయాన్ని తీసుకున్న సంఘాలు తిరిగి చెల్లిస్తున్నాయి. కాబట్టి, రాజ్యమందిరాల కొరకు ఆర్థికంగా సహాయం పొందిన సంఘాలు ప్రతి నెల ఆరంభంలోనే నమ్మకంగా తిరిగి చెల్లించడం ద్వారా తమ మెప్పుదలను చూపిస్తాయి. ప్రతిష్ఠించబడిన కొన్ని రాజ్యమందిరాలకు పెట్టుబడి అంతా ఆయా సంఘాలనుండే వచ్చిందన్న వాస్తవం మరొక ప్రోత్సాహకరమైన అభివృద్ధి. వీటిలో కొన్ని సంఘాలు వస్తుసంబంధంగా అంత సంపన్నమైనవి కాకపోయినా, తమ సమాజంలో సత్యారాధన ఎత్తబడడాన్ని చూడాలని అవి నిర్ణయించుకున్నాయన్నది గమనించదగిన విషయం.
3 చూపరులను ఆకర్షించింది: రాజ్యమందిరాలను కడుతున్న సహోదరులపై యెహోవా పరిశుద్ధాత్మ పనిచేసిందన్న రుజువు యితరులకు సాక్ష్యంగా పనిచేసింది. వస్లోరస్, జోహాన్స్‌బర్గ్‌లోని సత్వర రాజ్యమందిర నిర్మాణ ఫలితంగా ఒక లౌకిక వ్యక్తి ఎంతగా ప్రభావితురాలైందంటే, దేశంలో వివాదం చేలరేగుతున్నప్పటికీ, యెహోవాసాక్షులు సాధించుకున్న దానియెడల తన మెప్పును వ్యక్తపర్చడానికి ఆమె రేడియో స్టేషన్‌కి వచ్చింది. మరొక సందర్భంలో, ఉత్తర ట్రాన్స్వాన్లోని పెద్దల సభ యిలా వ్రాసింది: “ఈ మందిర నిర్మాణం చూపరులపై సూటైన ప్రభావాన్ని చూపింది. ప్రయాణికులు, తాము చూస్తున్నది నిజమేనా అని రూఢిపరచుకునేందుకు బస్సులు, టాక్సీలు, కార్లు ఆపేవారు. ఒక వ్యాపారి యిలా వ్యాఖ్యానించాడు: ‘సజ్జనులారా, నేను బైబిలు నుండి చదివిన ఐకమత్యాన్ని, ప్రేమను మీరు యిప్పుడు కనబరుస్తున్నారు, నిజంగా నిజ క్రైస్తవత్వాన్ని ప్రతిబింబించేది మీ గుంపు మాత్రమే.’..... ఆ గ్రామ పెద్ద యిలా అన్నాడు: ‘నిజంగా యిది ఏ స్ఫూర్తితో నెరవేరిందో దాన్ని నేను అభినందిస్తున్నాను.... నిజంగా రాజకీయవేత్తలు మీలాగ పనిచేసి ఉంటే, మనం నేడు చూస్తున్న హత్యలు జరిగేవి కావు. కాబట్టి, మీ కార్యాలను, మీ కూటాలను మీకనుకూలమైన సమయంలో జరుపుకోడానికి మీ మతం అనుమతించబడిందని స్థిరంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దానికిక ప్రతిబంధాలేమీ లేవు.’”
4 “మ్లూసీలోని అద్భుతమైన నిర్మాణ పథకంలో వివిధ జాతులలో నుండి వచ్చిన 300 కన్నా ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులను చూసిన ఒక పరిశీలకుడు ‘నమ్మశక్యంకానిది!’ అని వ్యాఖ్యానించాడు,” అని ఒక స్థానిక వార్తాపత్రిక నివేదించింది. మరొక ప్రాంతంలోని సంఘ సేవాకమిటీ యీ విధంగా వ్రాసింది: “రాజ్యమందిర నిర్మాణం రెండురోజుల్లో ముగియడం చూసి స్థానిక ప్రజలు ఎంతగా ఆశ్చర్యపోయారంటే, మేము ఉపయోగించినవి నిజమైన యిటుకలేనా కాదా అని ముట్టుకొని చూడడానికి వచ్చారు. కొందరు ప్రజలు తాము చూసిన దాని ఫలితంగా బైబిలు పఠనం కావాలని కోరడానికి వచ్చారు.”
5 ఎక్కువ స్వచ్ఛంద సేవకుల అవసరముంది: ఏ సంఘమైతే క్రొత్త రాజ్యమందిరాన్ని నిర్మించి, లేదా ఉన్నవాటినే నవీకరించి దానిలో కూడుకుంటుందో, ఆ సంఘంలోనే లభ్యమయ్యే నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని నిర్మాణ కమిటీలు చూస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పనిని చేయడంలో ఇతర స్థానిక పెద్దలకు, పరిచారకులకు తర్ఫీదునివ్వడానికి, వారితో కమిటీ కలిసి పనిచేస్తుంది. పెంపొందించుకున్న అవసరమైన నైపుణ్యాలు రాజ్యమందిర నిర్మాణంలో ఉపయోగపడుతాయి. ఆత్మీయంగా పరిపక్వతగల యీ సహోదరులు ఆ ప్రాంతంలో పట్టిక వేయబడిన యితర రాజ్యమందిర నిర్మాణ పథకాల్లో సహాయపడగలరు. కాబట్టి, రాజ్యమందిర నిర్మాణ పథకంతోనున్న సంఘంతో సహవసించే వారు, నిర్మాణ కమిటీ మరియు దానితో పనిచేసేవారు తమ రాజ్యమందిర నిర్మాణ పనినంతటినీ చూసుకుంటారులే అని అనుకోకుండా, సిద్ధ మనస్సును, సహకరించే మనోభావాన్ని చూపించవలసిన అవసరముంది. (నెహె. 4:6) సహోదరులు తర్ఫీదునొందిన తర్వాత, వెంటనే క్రొత్త మందిరాలు నిర్మించవలసిన లేదా మెరుగైన వసతులను ఏర్పరచుకోవలసిన అవసరమున్న యితర సంఘాల్లో కూడా సహాయపడేందుకు ప్రేమ వారిని పురికొల్పాలి. (నెహె. 5:19; ఫిలి. 2:3,4) సరైన నైపుణ్యాలుగల బాప్తిస్మం తీసుకున్న, సంఘంలో మంచి స్థాయిలోనున్న ప్రచారకులు యీ విస్తారమైన పనిని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రోత్సహించబడుతున్నారు.
6 స్వచ్ఛంద సహాయం మెచ్చుకోబడింది: రాజ్యమందిర నిర్మాణ పథకంలో చేరకముందు, యీ పథకాన్ని పూర్తి చేయడమంటే చాలా పెద్ద బాధ్యత అని సహోదరులెవరూ అనుకోలేదు. ఒక రాజ్యమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత సంఘ పెద్దలు యిలా వ్రాశారు: “నిర్మాణ కమిటీలోని సహోదరుల నుండి లభించిన ఓర్పుతో కూడిన మార్గనిర్దేశము నిజంగా మాకో మహత్తరమైన ఆశీర్వాదము. . . మా క్రొత్త రాజ్యమందిర నిర్మాణానికి సహాయపడేందుకు నిర్మాణ కాలమంతటిలో, ఎన్నో సందర్భాల్లో, లెక్కలేనన్నిసార్లు, సహోదరులు దూర ప్రాంతాలనుండి ప్రయాణం చేసి ఎన్నో గంటలు వెచ్చించారు, తమ పరికరాలను, ఉపకరణాలను ఉపయోగించారు, వస్తువులను కూడా విరాళంగా యిచ్చారు. ఈ సహోదరుల ఉదారత వారికి ‘సహోదర సమూహమంతటిపై ప్రేమ’ ఉందని చూపిస్తుంది, అది మాకు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నదో!—1 పేతు. 2:17.”
7 ఒక సంఘం వ్రాసినట్లు, సహోదరుల సిద్ధమనస్సు మరియు ఆసక్తి వ్యక్తపర్చబడింది: “గమనిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచే విధంగా బాగా కష్టపడి పనిచేసిన సంసిద్ధతగల సహోదర సహోదరీలనుబట్టి కృతజ్ఞతలు.” కచ్చితంగా కీర్తన 133:1, 3 లోని మాటలు నిజమే: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” రాజ్యమందిర నిర్మాణంలో పనిచేసే కొందరు తమ పొరుగు సంఘాల్లో రాజ్యమందిర నిర్మాణంలో సహాయపడేందుకు తమ ఉద్యోగంలో సెలవు తీసుకున్నారు. దానికి ప్రతిస్పందనగా, అతిథేయులైన సంఘంలోని సభ్యులు పథకానికి పూర్తి మద్దతునిస్తూ, యథార్థ మెప్పుదలను చూపించారు. కమిటీతో పనిచేసిన ఒక పెద్ద, సహోదరులను సేవించడం ఎంతటి ఆధిక్యతో వ్యక్తం చేయడానికి ఉత్తరం వ్రాశాడు. ఆయన యీ విధంగా వ్యాఖ్యానించాడు, “సహోదరులు తమను తాము యెహోవాకు సమర్పించుకున్న దానిప్రకారం చేస్తూ, వారికి సహాయపడేందుకు వందలకొలది కిలోమీటర్లనుండి ప్రయాణం చేసి రావడం సంఘాలను ఎంతగానో ప్రోత్సహించింది.... నిజంగా, మనం ప్రేమగల సహోదరత్వాన్ని ఏర్పరచుకున్నాం!” ఒక సహోదరి తన భావాలను యీ విధంగా వ్యక్తపరిచింది: “రాజ్యమందిర నిర్మాణం జరిగినచోట నాకు కలిగిన సంతోషాన్నిబట్టి కృతజ్ఞతలు వ్యక్తం చేయకుండా ఉండలేను. నేను నిర్మాణపనిలో పాల్గొనడంలో యిప్పటికి, యిది మూడవ మందిరము.”
8 ఒక సంఘం తమ పథకం పూర్తయిన తర్వాత, తమ స్థానిక భవన నిర్మాణ కమిటీకి (పెద్ద బ్రాంచీల్లో ఎక్కువ రాజ్యమందిరాల నిర్మాణానికి తోడ్పడేందుకు స్థానిక భవన నిర్మాణ కమిటీలను రూపొందించారు. అయితే, ఇండియాలో ఇలాంటి కమిటీలను ఇంతవరకూ రూపొందించలేదు) వ్రాసిన ఉత్తరంలో యీ విధంగా ఉంది: “మీకు ఎంతో కృతజ్ఞతలు తెలిపేందుకు యిది వ్రాస్తున్నాం! మీరు మా కోసం మందిరాన్ని నిర్మించడానికి వచ్చేందుకు, మీ సంఘ కూటాలను, మీ నిద్రను, మీ కుటుంబాలతో ఉండడంలోని సంతోషాన్ని, మీ వినోదాన్ని, మీ ప్రాంతీయ పరిచర్యను, యింకా ఎక్కువగానే వదులుకున్నారు. మీరు మా కోసం చేసిన వాటికి మేము అర్హులము కాము. మీవంటి మంచి, సమర్పించుకున్న సహోదరులతో సహవసించడం మాకు గర్వకారణంగా, ఘనతగా భావిస్తాము. మీతోపాటు చిరునవ్వుతో, పెనుగాలిని, ఎండను, చలిని లక్ష్యపెట్టకుండా కష్టపడి పనిచేసిన మీ కుటుంబాలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాము. మీకు మళ్ళీ కృతజ్ఞతలు. ‘యెహోవా, మేలుకై మిమ్ములను జ్ఞాపకముంచుకొనును గాక.’—నెహె. 13:31.”
9 రాజ్యమందిర భద్రత: క్రమేణ రాజ్యమందిరాల్లో దోపిడీలు ఎక్కువవుతున్నాయి. ఎన్నోసార్లు శబ్దోపకరణం (సౌండ్ ఎక్విప్మెంట్) దొంగిలించబడింది. ఈ సమస్యను కొంతవరకు పరిమితం చేయడానికి యీ సలహాలు సహాయపడతాయి: (1) శబ్దోపకరణాలన్నింటిని (వాణిజ్యపరంగా లభ్యమగు) పటిష్ఠమైన స్టీలు పెట్టెలో ఉంచండి, అందులోని వస్తువులను భద్రంగా ఉంచేందుకు సరైన తాళాలు వేయండి; (2) బయటకు కన్పించకుండా, పెట్టెను గచ్చులోగాని లేదా గోడలోగాని పెట్టి గొళ్ళెం వేయండి. (3) పోలీసులు గుర్తించగలిగేలా, అలా దొంగిలించిన వాటిని తిరిగి యివ్వగలిగేలా, సంఘం పేరును అన్ని ఉపకరణాలపై వ్రాయించండి.
10 కొన్ని సంఘాలు భద్రత కొరకు రాజ్యమందిరానికి ఫ్లాట్‌ను చేర్చాయి, అలాంటి కేసుల్లో సంఘం తన పేరిట రిజిస్టరు చేసిన టెలిఫోన్ కలిగి ఉండాలని మేము సిఫారసు చేస్తున్నాము. అలా దాన్ని చూసుకునే వ్యక్తి, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, సహాయం కొరకు ఫోను చేయగలుగుతాడు. వ్యక్తిగతంగా చేసే ఫోనులకు చెల్లించుకోవలసిన బాధ్యత దాన్ని చూసుకునే వ్యక్తిపై ఉంది. అంతేకాక, చూసుకునే వ్యక్తితో అద్దె, అనువంశిక పరిమితులు, కర్తవ్యాలు మరియు అనువంశిక కాలవ్యవధి కొరకు అవసరమైన నోటీసును గూర్చిన సమ్మతి పత్రం పెద్దల సంఘం వ్రాయాలి.
11 ఆర్థిక విరాళాలు సహాయపడడంలో కొనసాగుతున్నాయి: సంస్థకు వచ్చే ఉదారమైన చందాలు గతంలో సంఘాలకు సహాయపడ్డాయి, అలాగే భవిష్యత్తులోనూ సహాయపడతాయి. యెహోవా దేవుడే నిస్వార్థంగా యివ్వడంలో నాయకత్వం వహించడం లేదా? (యాకో. 1:17) ఇవ్వడానికి మన సామర్థ్యాలు, అవకాశాలు భిన్నంగా ఉంటాయన్నది నిజమే, అయినప్పటికీ, మన వ్యక్తిగత ఖర్చులో సర్దుకోడం ద్వారా, నిర్మాణ పనికి మద్దతునివ్వడంలో పూర్తి భాగం కలిగియుండవచ్చని మనం గ్రహించవచ్చు. అలాంటి ఉదారత తప్పకుండా యెహోవా హృదయానికి సంతోషాన్ని, అలాగే మన సహోదరులకు గొప్ప ప్రోత్సాహాన్ని యివ్వగలదు.
12 నేడు “గొప్ప సమూహము” మరి ఎక్కువగా రాజ్య వర్తమానానికి ప్రతిస్పందిస్తుంది. యెహోవా ఆత్మీయ ఆలయంలోనికి “యిష్టవస్తువులు” ప్రవహిస్తున్నాయి, ఆయన తన ‘మందిరమును మహిమతో నింపుతున్నాడు.’ (ప్రక. 7:9; హగ్గ. 2:7) అదనపు రాజ్యమందిరాల కొరకు వెంటనే ముగియనున్న పనులకు మద్దతునిస్తూ, హగ్గయి కాలంలోని నమ్మకస్థులైన యూదులవలె మనం మన హృదయాలను యెహోవా పనిపై ఉంచెదముగాక. ఇటీవలి సంవత్సరాల్లో అనేక మంచి రాజ్యమందిరాలు నిర్మించబడినప్పటికీ, పెరుగుదల ఎంతో వేగంతో ఉంది, అంతేగాక, అనేక సంఘాలు యిప్పటికీ, అవాంఛనీయమైన పరిస్థితుల్లో కూటాలు జరుపుకుంటున్నాయి. మనకు సాధ్యమైనంత మేరకు దేవుని సేవకు మద్దతునివ్వడంలో కొనసాగడమే, ఆయన మనకు అప్పగించిన పనిలో పాలుపంచుకోడానికి చక్కని మార్గమై ఉంది.
[6వ పేజీలోని బాక్సు]
ఒక రాజ్యమందిరాన్ని ఏర్పరచుకోవడమెలా
ఈ ఆరంభ పనులను ఒకదాని తర్వాత ఒకటి చేపట్టండి:
మీ ప్రాంతీయ కాపరిని కలవండి
పథకంలోని ప్రాముఖ్యమైన విషయాలను చర్చించండి.
ట్రస్టును రూపొందించండి
ప్రతిపాదన ద్వారా ట్రస్టీ సభను నియమిస్తూ, ట్రస్టును రూపొందించండి. సంవిధానపు ప్రతుల కొరకు సంస్థకు వ్రాయండి. ఫారముల కొరకు సంస్థను అడగండి. ట్రస్టును చట్టబద్ధమైన అధికారులచేత (లీగల్ అథారిటీస్) నమోదు (రిజిస్టరు) చేయించండి. ట్రస్టు పేరట ఫండునుంచేందుకు సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించండి.
నిర్మాణ కమిటీని నియమించండి
నిర్మాణ కమిటీలో ముఖ్యంగా వ్యాపార/నిర్మాణ అనుభవంగల ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది పెద్దలుంటారు.
ఎక్కువ మంది ప్రచారకులకు కేంద్రంగా ఉండగల స్థలాన్ని(లను) నిర్ణయించండి
ముఖ్యంగా సమభూమియై ఉండాలి; మత సంబంధ కట్టడాలను నిర్మించడానికి కేటాయించబడిన స్థలము (రిలీజియస్ జోనింగ్) అయి ఉండాలి; బంకమన్ను, రాళ్ళుగల అమితంగా శబ్దం వినిపించే స్థలాలు అయ్యుండకూడదు.
ఆస్తిని సంపాదించి, దానిని మీ ట్రస్టు పేరిట రిజిస్టరు చేయండి
ఉదాహరణ: యెహోవాసాక్షుల నూతనలోక సంఘ ట్రస్టు. సొసైటీ పేరట రిజిస్టరు చేయకండి.
స్థలము ప్రమాణము (లేదా టైటిల్ డీడ్) ప్రతిని సొసైటీకి పంపండి.
లభ్యమైన డబ్బు మొత్తాన్ని నిర్ణయించండి
మీకు ఆర్థిక సహాయము అవసరమున్నట్లయితే, నిర్మాణావసరాలకు మాత్రమే సొసైటీకి వ్రాయండి.
మీరు ఆ స్థలంలో ఏదైనా పనిని ఆరంభించకముందే ఇన్సూరెన్స్ సంపాదించండి
ఇన్సూరెన్స్‌ను గూర్చి సొసైటీకి వ్రాయండి.
సొసైటీని సంప్రదించండి
మీరు పరిష్కరించలేని సమస్యలు ఉత్పన్నమైనట్లయితే, సొసైటీని సంప్రదించండి.