బైబిలు పఠనముల కొరకు పట్టుదలతో ప్రయత్నించండి
1 ఈ పాత విధానానికి కాలం చెల్లిపోతుందనడానికి చాలా సాక్ష్యాలున్నాయి. (2 తిమోతి 3:1-5) దీని అర్థమేమిటి? ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని దాని అర్థం. అయితే, కొందరు రక్షించబడుటకు సహాయము చేయడం మన వశంలో ఉంది. (సామె. 3:27) అలా చేయడానికి మనం బైబిలు పఠనాలను మొదలుపెట్టి, వాటిని నిర్వహించుటకు తీవ్రంగా కృషిచేయ్యాలి.
2 మన బైబిలు ఆధారిత ప్రచురణలను అందించడం ద్వారా ఎంతో మంచికార్యము సాధించబడింది. కాని ప్రజలకు ఎక్కువగా అవసరమైనది క్రమంగా నిర్వహించబడే గృహ బైబిలు పఠనము ద్వారా ఇవ్వబడే వ్యక్తిగత సహాయము. వారు దానిని గుణగ్రహించుటకు మనము వారికెలా సహాయం చేయగలము?
3 అనేకులు ఆసక్తికలిగుండే ప్రశ్నలను మనం అడగవచ్చు. నైతిక విలువలు ఎందుకు తీవ్రంగా పడిపోతున్నాయి, కుటుంబ జీవితం ఎందుకంతగా విచ్ఛిన్నమౌతుంది, దౌర్జన్యము, నేరము ఎందుకు ఒక ముప్పుగా పరిణమించాయి, ప్రేమగల దేవుడు ప్రస్తుత పరిస్థితులను ఎందుకు అనుమతించడనే, మున్నగు వాటిపై ప్రశ్నలను కేంద్రీకరించవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రాముఖ్యంగా ఆసక్తిని కలిగించే అంశాలను, సందర్భాలను గమనించుటకు చురుకుగా ఉండండి. ఈ ప్రశ్నలకు బైబిలు యిచ్చు స్పష్టమైన జవాబులను చూపండి. మనలనందరిని ప్రభావితం చేసే వీటిని గూర్చి మరితర అంశాలను గూర్చి బైబిలు చెప్తున్నదేమిటో నేర్చుకొనుటకు మనం అందిస్తున్న ప్రచురణలు ఎలా సహాయం చేయగలవో చూపించండి.
4 ఇంటివారిని సంభాషణలోనికి దించటం చాలా ప్రాముఖ్యం. అతనికి శ్రద్ధ కలిగించు వాటిని గ్రహించుటకు మెలకువగా ఉండండి. అతని ఆసక్తులు లేక ఆవేదనలపై మీ సంభాషణను వృద్ధి చేయండి. మానవ సమస్యలకు బైబిలిస్తున్న పరిష్కారాలను వివరిస్తున్న పుస్తకం, బ్రోషూరు, పత్రిక, లేక కరపత్రంలోని విషయం వైపు అవధానాన్ని త్రిప్పండి. వెళ్లకముందు, మీ తదుపరి దర్శనానికై అతనిలో ఆసక్తి రేపుతుందని మీరు భావించే ఒకటి లేక రెండు ప్రశ్నలను లేవనెత్తండి. మీరు తిరిగి దర్శించినప్పుడు, అతనికి ఆ ప్రశ్నలను గుర్తుచేయండి, మరియు బైబిలు యిచ్చే జవాబును కనుగొనుటకు అతనికి సహాయము చేయుటకు ప్రచురణలను ఉపయోగించండి.
5 మనము బైబిలు పఠనాలను ప్రారంభించి వాటిని క్రమంగా కొనసాగిస్తే అది ప్రజల జీవితాలను మార్చగలదు. మనం క్షేత్రంలో లేక తటస్థంగా కలిసినవారు శ్రద్ధచూపించే విషయాలపట్ల నిజమైన ఆసక్తిని చూపించాల్సిన అవసరం మనకుంది. వారి ఆసక్తిని క్రమేపి పెంచాలంటే మంచి సిద్ధపాటు అవసరం. వారిని ఒక క్రమబద్దమైన ఆత్మీయ పోషణకు తీసుకువచ్చేంత వరకు వారిని దర్శిస్తునే ఉండాలంటే ఓపిక అవసరం. ప్రజలపట్ల ప్రేమపూర్వక ఆసక్తిని కలిగి ఉండాలి. రాబోవు నాశనము నుండి వారు తప్పించబడుటకు వారికి సహాయం చేయాలని మనం నిజంగా కోరుకోవాలి. మన బైబిలు పఠన కార్యాన్ని ఒక క్రమమైన పట్టుదలతో కూడిన ప్రార్థనతో చేయాలి.—1 థెస్స. 5:17.
6 గత మూడు సంవత్సరాలలో ఇంచుమించు పది లక్షలమంది బాప్తిస్మము పొందిన శిష్యులగుట ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. (మత్తయి 28:19, 20) మనం ప్రస్తుతం ప్రతి నెలా 45 లక్షల వరకు బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నాము, మరియు ఇతరుల జీవితాలపట్ల మనకున్న శ్రద్ధను ఇది చూపిస్తుంది. మీ విషయమేమిటి? గృహ బైబిలు పఠన పనిలో పాలుపంచుకొనుటకు మీరు తీవ్రంగా కృషిచేస్తున్నారా? గుర్తుంచుకొనండి, ఈ విషయంలో మనం చూపించే యథార్థతపై మన జీవితాలు ఇతరుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి.—యెహె. 3:17-19.