క్రొత్తవానికి, అనుభవంగల పరిచారకునికి అవసరమైనవి
1 కీర్తనల గ్రంథకర్తెన దావీదు ఇలా అడిగాడు: “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?” కొన్ని చక్కని పదాలతో దావీదు ఇలా జవాబిచ్చాడు: “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.” (కీర్తన 15:1, 2) ఆ అవసరతలు మారలేదు. ఈనాడు ఆరాధించేందుకు క్రైస్తవ సంఘమునకు వచ్చేవారందరు లైంగిక దుర్నీతిని, త్రాగుబోతుతనాన్ని వదలివేయాలి. జగడమాడువారికి, కోపోద్రేకులకు, వంచనతో మాట్లాడువారికి యెహోవా ప్రజలమధ్య తావులేదు. మనము క్రొత్త పరిచారకులమైనా లేక అనుభవజ్ఞులమైనా, దేవుని వాక్యంలో చూపబడిన ఉన్నత ప్రమాణాలను అనుసరించడంలో నమ్మకంగా ఉండాలి.—గలతీ 5:19-21.
2 చాలామంది క్రొత్తవారు యెహోవా సంస్థతో సహవసిస్తున్నారు. యౌవనస్థులు, పెద్దవయస్కులు కూడా తమ జీవిత విధానం దేవుని కట్టడలకు సరితూగులాగున తమ ఆలోచనలను మార్చుకున్నారు. దక్షిణ అమెరికాలోని ఒక బాలుడు తలిదండ్రుల నడిపింపు లేకుండా పెరగడం వలన అతనిలో తీవ్రమైన వ్యక్తిత్వపు సమస్యలు వృద్ధి అయ్యాయి. అతను 18వ ఏటకు చేరేటప్పటికి మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఆ అలవాటును కొనసాగించడానికి దొంగతనం చేసినందువలన అప్పటికే చెరసాల శిక్షను కొంత అనుభవించాడు. బైబిలు పఠనం చేయుటమూలంగా, తన పూర్వపు స్నేహితులతో కలవటం మానేశాడు, యెహోవా సాక్షుల మధ్య క్రొత్త స్నేహితులను కనుగొన్నాడు, చివరికి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు.
3 అదేవిధంగా, మనము “నీతియు యథార్థమైన భక్తియుగలవారమై,” మన ప్రవర్తనంతటిలో దేవుని ప్రీతిపరచుటకు తీర్మానించుకోవాలి. (ఎఫెసీ. 4:24) మనము దేవుని పర్వతమువంటి సంస్థలో ఉండాలంటే, “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడా . . . పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము . . . నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనాల్సిన” బాధ్యత మనకున్నది.—కొలొస్స 3:9, 10.
4 దేవుని వాక్యము, ఒక శక్తివంతమైన ప్రభావము: బైబిలు ద్వారా మనకు బయలుపరచబడిన విధంగా యెహోవా వ్యక్తిత్వము మన ఆలోచనను మన క్రియలను సరియైన రీతిలో శక్తివంతముగా ప్రభావితం చేయగలదు. (రోమా. 12:2) హృదయాలను పరిశోధించి, మనస్సులను మార్చగల శక్తి ఆయన వాక్యానికి ఉంది. (హెబ్రీ. 4:12) మనము నైతికంగా ఉన్నతమైన జీవితాన్ని గడపాలని, బహిరంగ పరిచర్యలో పూర్తిగా పాల్గొనాలని, క్రైస్తవ కూటాలను అలక్ష్యం చేయకూడదనేవి యెహోవా చిత్తమునుబట్టి కోరబడుచున్నవని ప్రేరేపిత లేఖనాలు మనకు బోధిస్తున్నాయి.
5 ఈ అపాయకరమైన కాలాల్లో, పెరుగుతున్న ఒత్తిడులు ఒక క్రైస్తవుడు దేవుని న్యాయవిధులను ఉల్లంఘించుటకు ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ వ్యక్తిగత పఠనమును, కుటుంబ పఠనమును, సంఘ కూటాలను, లేక పరిచర్యను అలక్ష్యం చేస్తే, ఒకప్పుడు దృఢంగా ఉన్న క్రైస్తవుడు కూడా విశ్వాసం నుండి జారిపోవచ్చు, బహుశ చెడు ప్రవర్తనలో పడిపోవచ్చు. అందుకే పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు: “నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియ జాగ్రత్త కలిగియుండుము” మరియు “నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము.”—1 తిమోతి 4:16; 2 తిమోతి 2:7.
6 క్రొత్తగా సహవసిస్తున్నవారమైనా లేక సంవత్సరాల అనుభవంగల వారమైనా, మన జీవం కాపాడబడాలంటే మనము దేవుని అవసరతలను మన దృష్టియందు స్పష్టంగా ఉంచుకుని, పరిచర్యలో పూర్తిగా సమతూకం కలిగియుండి, మన నిరీక్షణను దృఢంగా ఉంచుకోవాలి. (1 పేతురు 1:13-16) దేవుని నీతియుక్తమైన కట్టడలను ప్రతిదినము పాటించడం తప్పనిసరి.
7 ఈ 1993 సేవా సంవత్సరపు ఆఖరు నెలలో క్షేత్రసేవయందు పాల్గొనుటను మీ గురిగా చేసుకొనండి. ఇతరులు విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయుట, క్షేత్రపరిచర్యలో ఫలభరితంగా ఉండుటకు తీర్మానించుకొనండి. (రోమా. 1:12) వ్యక్తిగత పఠనం, కుటుంబ పఠనం, కూటములకు హాజరగుటను క్రమంగా చేయడం ద్వారా మీ ఆలోచనలను శ్రేష్ఠమైన విషయాలపై ఉంచండి. (ఫిలిప్పీ. 4:8) దేవుని కట్టడలకు అనుగుణ్యంగా జీవించడం ద్వారా ఆయనను ప్రీతిపరచాలన్న మీ ప్రయత్నాలు తప్పక గమనించబడతాయి.—కొలొస్స 3:23, 24.