యౌవనులారా—నేర్పుతో నడవండి
1 మన తండ్రియైన యెహోవా యౌవనుల ఆత్మీయాభివృద్ధిలో వ్యక్తిగత శ్రద్ధతీసుకుంటాడు. ఆయన ప్రేమపూర్వక ఆజ్ఞలను జ్ఞానయుక్తంగా వినడంద్వారా, యౌవనులు ఆయన హృదయాన్ని ఆనందపరచడమే గాక వారు ఉత్తేజాన్ని కూడా పొందుతారు. (సామె. 27:11; మత్తయి 11:28-30) యెహోవా తమకు సమర్థవంతమైన నడిపింపు నిచ్చుటకు వారు అంగీకరిస్తారు.—సామె. 16:9.
2 క్రీస్తుయేసు యౌవనుడిగా, దేవుని దయను మనుష్యుల దయను పొందడంలో మాదిరిచూపాడు. (లూకా 2:52) ఈనాడు యౌవనులు అలాగే చేయడానికి కృషి చేయాలి. ఒక యౌవనుడు ఆత్మీయ విషయాలను చేపట్టడంలోనే తన నడతను సమర్థవంతంగా నడిపించుకొంటున్నాడని కనపడాలి. యేసు పన్నెండేళ్ల వయస్సులోనే యెహోవాను గూర్చి ఇతరులతో మాట్లాడాలనే ఆసక్తి విషయంలో పేరుపొందాడు. (లూకా 2:46, 47) ఈనాడు యౌవనులు వారి విశ్వాసాన్ని ఇతరులకు వివరించడంలో అలాంటి ఆసక్తినే కనపరుస్తున్నారు.—w90 7/1 పేజీ. 29-30; w87 12/1 పేజీ. 21.
3 యౌవనులారా మీ “విలువైన వస్తువులతో యెహోవాను ఘనపర్చుటకు” ఇప్పుడే, మరి ముఖ్యంగా ఈ వేసవి శెలవు నెలల్లోనే మీరేమి చేయగలరు? (సామె. 3:9, NW) సువార్తను ప్రకటించి, బోధించే పనిలో మీరు సాధారణంగా గడిపే సమయంకంటె ఎక్కువ సమయాన్ని వీలైతే సహాయ పయినీరుగా కూడా, ఎందుకు గడపకూడదు? పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడం ద్వారా సహజంగా వచ్చే ఎన్నో మేలులను, అధిక ఆనందాన్ని బట్టి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎంతోమంది ఇతర ప్రచారకులతో కలిసి పరిచర్యలో పాల్గొనే అవకాశాన్ని కూడా ఇది మీకిస్తుంది. ఈ వారాంతంలో మీతో కలిసి పనిచేయటానికి ఒకరు లేక ఇద్దరు అనుభవంగల ప్రచారకులను ఆహ్వానించడం ద్వారా మీరు ఇప్పుడే ఆ సేవను మొదలుపెట్టవచ్చును.
4 తలిదండ్రులు తమ పిల్లలతోపాటు పరిచర్యలో పాల్గొనడమేగాక అభ్యాస కూటములను ఏర్పాటు చేయుట ద్వారా వారికి గొప్ప ప్రోత్సాహాన్ని, సహాయాన్ని ఇవ్వవచ్చు. ఇంటింటి పరిచర్య, పునర్దర్శనం, బైబిలు పఠనం వంటి వాటికి యౌవనులను తమతో రమ్మని అడగడం ద్వారా సంఘంలోని అనుభవజ్ఞులు చొరవ తీసుకోవచ్చు. ఆత్మీయంగా స్థిరంగావున్న ప్రచారకులతో సన్నిహిత సహచర్యం యౌవనులు ఎదగటానికి, “సంపూర్ణులగుటకు సాగిపోవడానికి” వారికి సహాయపడుతుంది.—హెబ్రీ. 6:1.
5 తన బోధనాసామర్థ్యాన్ని మెరుగు పరచుకోవలసిన అవసరత ప్రతి క్రైస్తవునికి వుంది. ఇందుకు యౌవనులకు మినహాయింపు లేదు. యౌవనులైన మీరు బహుశా దైవపరిపాలనా పాఠశాలలో ప్రసంగాలిచ్చే ఆధిక్యతను పొందితే, వాటిని మీరు బాగుగా సిద్ధపడుతున్నారా? చదవడానికి, వ్యక్తిగత పఠనానికి, అలాగే ధ్యానించటానికి మీకు ఒక క్రమపట్టిక వుందా? మీరు నేర్చుకున్న సంగతులను వెంటనే వ్యక్తిగతంగా అవలంభిస్తారా? మీరు విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకుని, వ్యాఖ్యానం చేయటానికి వీలయ్యే విధంగా మీరు కూటముల కొరకు బాగా సిద్ధపడుతున్నారా? కూటములలో చెప్పబడే సహాయకర అంశాలను వ్రాసుకుని, మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడే సలహాలను ఉపయోగించటానికి ప్రయత్నిస్తారా?
6 రాజ్యమందిరాన్ని శుభ్రపరచడంలో భాగం వహించడం, వృద్ధులైన లేక అనారోగ్యులైన సహోదర సహోదరీలకు ఇంటిపనులలో లేక ఇతర ఆచరణాత్మక విధాలలో సహాయం చేయడంవంటి ఆధిక్యతలు వదులుకోవద్దు. రాజ్యమందిర ఖర్చుల కొరకు సహాయం చేయటానికి, సంస్థ ప్రపంచవ్యాప్త పనికొరకు క్రమంగా విరాళాలివ్వడం వంటి వాటిని అలక్ష్యం చేయకండి.
7 ‘యెహోవా వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొంటూ,’ ఆయన నడిపింపును మనమంగీకరిస్తే, సంతోషాన్ని, సేవలో అధిక ఆధిక్యతలను ఆయన మనకిస్తాడు.—కీర్తన. 119:9.