నీవు ఒక పయినీరుగా యెహోవాను సేవించగలవా?
1 “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశమొకదానిలో ఒక ప్రసంగీకుడు: “నీవు పయినీరు సేవ చేయగలవా?, నీవు పయినీరు సేవ చేస్తావా?” అని అడిగాడు. ఆర్మగెద్దోను చాలా సమీపముగా ఉండి, క్రితమెన్నటికంటెను ప్రకటన పనిని ఇది అత్యవసరమైనదిగా చేస్తున్నందున ఈ ప్రశ్నలు చాలా సమంజసమైనవని ఆయన సూచించాడు.—1 కొరిం. 7:29ఎ.
2 పయినీరు సేవ కష్టమైన పని అనడంలో సందేహము లేదు. దానికి స్వయం శిక్షణ, మంచి వ్యవస్థీకరణ అవసరము. అయినా, పరిచర్యలో మనము పడిన శ్రమ “వ్యర్థము కాదు.” (1 కొరిం. 15:58) అయితే, మన సమయమును, శక్తిని హరించే మనమెన్నుకొను ఇతర కార్యాలను గూర్చి అలాగే చెప్పగలమా? యెహోవా యెడలగల ప్రేమ క్రైస్తవులను ఆయన సేవలో ఆసక్తిగలవారిగా ఉండుటకు ప్రేరేపించును. యెహోవా సేవ కొరకైన ఆసక్తి అనేకులను పయినీరు పనికి నడిపినది.—1 యోహా. 5:3; ప్రక. 4:11.
3 అప్పుడప్పుడే ఉన్నత పాఠశాల విద్యను ముగిస్తున్న యౌవనులైన యెహోవా సేవకులు, పయినీరు సేవనుగూర్చి గంభీరంగా ఆలోచిస్తున్నారు. అది పూర్తిగా సముచితమైనది. పూర్తికాల పరిచర్య కంటే మిక్కిలి ప్రాముఖ్యమైన వృత్తి మరొకటేముంది? (మత్త. 6:33) దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి; ఇది యెహోవా పని. ఈ పనిలో ఒకని యౌవనము నుండే నిమగ్నమైయుండుట ఎంతటి ఆధిక్యత!—మత్త. 24:14.
4 తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలను పూర్తికాల సేవను చేపట్టుటకు ప్రోత్సహిస్తున్నారా? ఈ యోగ్యమైన పనిలో వారి పూర్ణ హృదయమును, ఆత్మను, మనస్సును, బలమును ఉపయోగించాలని మీరు కోరుకుంటున్నట్లు మీ పిల్లలు స్పష్టంగా అర్థము చేసుకుంటున్నారా? (మార్కు 12:30) అనేక యౌవన ప్రచారకులు వారి పాఠశాల కాలములోనే అవకాశమున్న ప్రతిసారి సహాయ పయినీరు సేవలో పాల్గొనుట ద్వారా క్రమ పయినీరు పనికి తమ్మునుతాము సిద్ధము చేసుకొంటున్నారు. నిజముగా యెహోవా యెడల అటువంటి భక్తి ఆయన హృదయమును ఉల్లాసపరచును.—సామె. 27:11.
5 నిజమే, అందరికి పయినీరు సేవచేయుటకు వారి ననుమతించే పరిస్థితులు లేవు. అయినా, వివాహితుడవైనా లేక ఒంటరిగా ఉన్నవాడవైనా, యౌవనులమైనా లేక వృద్ధులమైనా సువార్తయొక్క పయినీరు పరిచారకునిగా నీవు యెహోవాను సేవించుటను గంభీరముగా, ప్రార్థనా పూర్వకంగా పరిశీలించావా? (కొలొ. 3:23) వివాహితులైన అనేకమంది యౌవన దంపతులు, వారిలో ఒక్కరైనా లేక ఇద్దరూ పయినీరు సేవను చేయగలిగేలా తమ పరిచర్యను విస్తృత పరచుకొనుటకు కృషిచేస్తున్నారు.
6 ప్రస్తుతము మీరు క్రమ పయినీర్లుగా సేవచేయగల స్థితిలో లేకపోతే, సహాయ పయినీరుగా సేవ చేయగలరా? బహుశా మీ సంఘములోని అనేకమంది ప్రచారకులు ఏప్రిల్ మాసములో అలాచేయుటకు పథకము వేసుకుంటుండవచ్చును. వారితో నీవునూ చేరగలవా? యెహోవా యథార్థ సేవకులందరు అనేక ఆశీర్వాదములు పొందినను, గొర్రెలాంటివారిని వెదకుటకు రాజ్యసేవలో ఎక్కువ సమయమును గడపగల స్థానమందున్నవారికి అదనపు ఆశీర్వాదములు వేచివున్నవి.—అపొ. కా. 20:35.