నాటుట మరియు నీరుపోయుట—శిష్యులను చేయుటకు తీసికొనబడు చర్యలు
1 “నేను నాటితిని అపొల్లో నీళ్లుపోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” (1 కొరిం. 3:6) ఆ విధంగా అపొస్తలుడైన పౌలు క్రీస్తు శిష్యులను తయారుచేయుటలోని మూడు ప్రాథమిక పద్ధతులను గుర్తించెను. మొదటి రెండు పద్ధతులైన నాటుట మరియు నీళ్లుపోయుట సమర్పించుకొని బాప్తిస్మము పొందిన దేవుని సేవకులపై ఉంచబడిన ఒక ఆధిక్యత మరియు బాధ్యత.
2 ఇందుకుగాను బహిరంగముగా, ఇంటింటను, తటస్థముగా మరియితర విధములుగా ప్రకటించవలసియుండును. యేసు ఆజ్ఞాపించిన వాటన్నింటిని గైగొనవలెనని ప్రజలకు క్రమేపి బోధించుటకూడ యిమిడియున్నది. (మత్త. 28:19, 20) ఆసక్తిచూపిన వారిని తిరిగి సందర్శించి బైబిలు చర్చలో నిమగ్నులనుచేసి వారితో బైబిలు పఠనమును చేయుట వలననే ఈ రెండవ పద్ధతి చేపట్టబడును. సత్యముయొక్క విత్తనములను విత్తి అవసరమగు నీటితో సాగుచేసి దృక్పథముతో వెన్నంటి యెహోవా యొక్క యథార్థ తోటిపనివారిగా మిమ్మును మీరు నిరూపించుకొనుచున్నారా?—1 కొరిం. 3:9.
శక్యత మరియు అవసరతను గుర్తించుము
3 ఇండియాలో 1990 సేవా సంవత్సరమందు మనము దాదాపు 4,14,000 పుస్తకములను, చిన్న పుస్తకములను మరియు యించుమించు 8,94,000 పత్రికలను పంచితిమి! జ్ఞాపకార్థదినమునకు 28,000 కంటె ఎక్కువమంది హాజరైరి. అన్నింటికన్నా మించి ఆ సంవత్సరములో సగటున 9,725 ప్రచారకులుండిరి. నాటుటకు సంబంధించిన మన పనిలో సాహిత్యముల అందింపు ఒక ముఖ్యభాగము. విత్తబడిన సత్యమను విత్తనములు క్రొత్త శిష్యులను ఉద్భవింపజేయుటలో అద్భుతమైన శక్యతను కలిగియున్నవి. అయితే దేవుని తోటిపనివారముగా ఈ ప్రజలను తిరిగి సందర్శించి, బైబిలు అంశాలపై వారికున్న ఆసక్తిని పెంపొందించుటకు కదిలించబడుచున్నామా? ఇండియాలో సంఘప్రచారకుల సగటు బైబిలు పఠనములు 0.4 ఉన్నవి. ప్రతి ప్రచారకుడు సత్యమను విత్తనములను విత్తుటయనే మొదటి మెట్టుకంటె మించి వెళ్లవలసిన తన వ్యక్తిగత బాధ్యతను మరి ఖచ్చితముగా అంచనావేసి, వృద్ధిచెందుచున్న బైబిలు పఠనములను నిర్వహించుటకు చేరుకొనగల్గితే, ఈ సగటు సంఖ్య వృద్ధి కాగలదని మేము విశ్వసిస్తున్నాము. వివిధ పరిస్థితులున్నందువలననే కొంతమంది ఒకటి లేక అంతకన్నా ఎక్కువ బైబిలు పఠనములు చేయలేక పోవుచున్నను, ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత పరిస్థితులను పునర్విమర్శించుకొనుట మంచిది.
4 కొన్ని ప్రాంతములందు ఏమి జరుగుచున్నదో చూచుట ఆసక్తిదాయకముగా ఉన్నది. సంఘములు ఫలవంతమైన ప్రాంతమును కలిగియుండి సగటున ప్రచారకుని ఒక్కింటికి ఒకటినుండి రెండు బైబిలు పఠనములను రిపోర్టు చేసినవి. క్రొత్త శిష్యుల అభివృద్ధి నిర్వహించబడుచున్న బైబిలు పఠనముల సంఖ్యతో సమాంతరముగా ఉన్నది. 1991 వార్షిక పుస్తకము నివేదించిన ప్రకారము వివిధ దేశములలో నిర్వహించబడుచున్న బైబిలు పఠనములతో ప్రచారకుల సగటు సంఖ్యను పోల్చితే దీనిని చూడవచ్చును.
5 మనము ప్రకటించు రాజ్యవర్తమానమునకు ప్రతిస్పందించు ప్రజలయెడల మనకున్న ప్రేమ, బైబిలు పఠనములను చేయుటకు మనలను పురికొల్పవలెను. ప్రజలయెడల యెహోవా ప్రేమపూర్వక లక్ష్యమును మనము యథార్థముగా వారితో పంచుకొని వారి రక్షణ ఆత్మీయవృద్ధితో ముడిపడియున్నదని గుర్తెరగాలి. (1 పేతు. 2:2) అక్షరార్థమైన మొక్కలు వృద్ధిచెందుటకు నీరు ఎలా అవసరమో, రాజ్యవర్తమానమునకు మొదట్లో కొంచెము ఆసక్తిని కనబరచిన వారిని గృహబైబిలు పఠనములద్వారా క్రమముగా దేవుని సంస్థకు నడిపిస్తే తప్ప వారు సహజముగా కూటములకు హాజరుకారు.
6 మనము చూపే విధేయతకూడ యిందు యిమిడియుండును. సత్యము పక్షముగా నుండువారు తన స్వరమును విందురని యేసు చెప్పెను. (యోహా. 18:37) ప్రకటించి, బోధించుమని ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించెను మరియు ఆ పనిని కొనసాగించులాగున ఆయన కలిగియున్న ప్రగాఢ లక్ష్యముచేత, యితరులకు సహాయము చేయుటలో మనమనుకరించు విధానమును యేసు మనకు చూపెను. (లూకా 6:40; యోహా. 13:13; 14:12) మనము చేసే ప్రయత్నము మనకును మనము బోధించు వారికిని రక్షణకరము కాగలదు.—1 తిమో. 4:16.
బైబిలు పఠనములు ప్రారంభించుటకు సహాయకములు
7 నిపుణతగల చేతిపనివారు తన పనిలో పరిపూర్ణతను సాధించుటకు తనయొద్దనున్న వివిధ పనిముట్లను ఎంచుకుంటారు. ఉపదేశకులముగా, మనయెదుట బ్రోషూర్లు, కరపత్రములతోపాటు అనేక సాహిత్యములున్నవి. వివిధ జీవన పద్ధతులు మరియు దృక్పథములుగల ప్రజల హృదయములను చేరుటకు సహాయపడు పనిముట్లుగా అవి రూపొందించబడినవి.
8 బైబిలు చర్చలను పరిచయము చేయుటకు బ్రోషూర్లను, కరపత్రములను ఉపయోగించి కొంతమంది ప్రచారకులు మంచి ఫలితాలను పొందగల్గిరి. ఉదాహరణకు, లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ కరపత్రము ఈ అద్భుతమైన నిరీక్షణను వివరించడములో 20 కంటె ఎక్కువ లేఖనములను సూచించినది లేక పేర్కొన్నది. పురికొల్పునిచ్చు అనేక బైబిలు చర్చలను వృద్ధి చేయుటకు ఈ లేఖనములను ఉపయోగించవచ్చును. మన బ్రోషూర్లు, కంటికి ఇంపుగా సూటిగా ఉన్నందున, ప్రాథమిక బైబిలు సత్యములను ప్రజలకు పరిచయముచేసి యింకను పరిశీలన చేయుమని వారిని ప్రోత్సహించవచ్చును.
9 తక్కువగా చదువుకున్నవారు లేదా దృష్టి సన్నగిల్లినవారిని మీరు ఎరిగియున్నారా? అట్టి వారితో వృద్ధిచెందే బైబిలు పఠనమును స్థాపించుటకు భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అను బ్రోషూరును ఉపయోగించుచు మీరు ప్రయత్నించారా? భవిష్యత్తునుగూర్చిన దేవుని వాగ్దానములను నేర్చుకొనుటలో గృహస్థుని నేర్పరితనముతో యిమడ్చదగు ప్రారంభ పేరాలను కలిగియున్న “లుక్!” బ్రోషూరు మరొక శ్రేష్టమైన సాధనమైయున్నది. 1982లో విడుదల చేయబడిన యు కెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ పుస్తకము అప్పటినుండి బాప్తిస్మము పొందిన 17,00,000లలో అధిక శాతము మందికి నిశ్చయముగా సహాయపడింది.
ఆసక్తిగలవారి విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించుట
10 గత 12 నెలల కాలములో మీరు ఎన్నెన్ని పుస్తకములను, చిన్న పుస్తకములను, (బ్రోషూర్లతో సహా) పత్రికలను అందించారో మీ సంఘ పబ్లిషర్ రికార్డు కార్డును గమనించుట మీకు ప్రయోజనకరము కావచ్చును. అట్టి అందింపులు అంతటితో ముగిసిపోయెనా? లేక నాటుట అనే మెట్టుకన్నా ముందుకు వెళ్లగలిగారా? మన సాహిత్యములను తీసికొనుటకు అంతటి ఆసక్తిని చూపిన వారిలో ఎంతమందిని మీరు తిరిగి కలిసికొన్నారా? మీరు విత్తిన విత్తనము మొలకెత్తినదేమో చూచుటకు తిరిగి వెళ్లారా? తగినంత నీటితో మీరు వెన్నంటి, దానిని వృద్ధి చేయుమని యెహోవాకు ప్రార్థించారా?—అపొ. కార్య. 16:14; మరియు 2 థెస్సలొనీకయులు 3:1 పోల్చుము.
11 సరిపడునంత జ్ఞానము లేదని మీరు తలంచుచున్నందున పునర్దర్శనములను లేక బైబిలు పఠనములను చేయలేక పోవుచున్నారేమో. బహుశ, అది మీకు సామర్థ్యము లేక కాదు, మీ స్వభావమే అంత. చాలినంత సామర్థ్యమునివ్వకుండ, అర్హులను చేయకుండా ఏదైనా పనిని చేసిరమ్మని యెహోవా తన ప్రజలను పంపలేదు. తన పరిశుద్ధ వాక్యముద్వారాను, సంస్థద్వారాను, “ప్రతి శ్రేష్టమైన కార్యములకు” మనలను సంసిద్ధులను చేయుచున్నాడు. (2 తిమో. 3:16, 17; 2 కొరిం. 3:5, 6) పరిశుద్ధాత్మద్వారాను, అచ్చువేయబడిన పత్రముల ద్వారాను, వేదికనుండివచ్చు నోటి ఉపదేశము, మరియు ప్రదర్శనలద్వారాను, ఆయన మనకు సహాయపడు దానిని దయచేయుచున్నాడు. అలాగే భక్తిగల సేవకుల మాదిరులు విషయము వేరే చెప్పనక్కరలేదు. యెహోవా సంస్థద్వారా లభించుచున్న ఉన్నత ఆత్మీయ విద్యకు మనము ప్రతిస్పందించవలెను.—అపొ. కార్య. 4:13 పోల్చుము.
12 మన రాజ్య పరిచర్య, దైవపరిపాలనా పాఠశాల, సేవాకూటము, మరియితర ఉపదేశ ప్రదేశములందు అందించబడుచున్నవాటిని వ్యక్తిగత అన్వయింపు చేయవలసియున్నది. హెబ్రీ క్రైస్తవులు అపొస్తలుడైన పౌలు యిలా సూటిగా చెప్పెను: “కాలమునుబట్టి చూచితే, మీరు బోధకులుగా ఉండవలసిన వారైయుండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసివచ్చెను.” (హెబ్రీ. 5:12) ఒక వృత్తిలో అనేక సంవత్సరములు పనిచేసిన వ్యక్తి తన పరికరములను ఉపయోగించుటలో కొంత నైపుణ్యమును సంపాదించునని ఎదురుచూస్తారు. యథార్థమైన ఆసక్తిచూపి శ్రద్ధతో కూడిన ప్రయత్నము చేయునప్పుడు బైబిలు చర్చలను కొనసాగించుట పట్ల నేర్చుకొనుటలోని అభివృద్ధి తేటతెల్లమగును.—సామె. 12:24; 22:29.
13 రాజ్య వర్తమానమునందు ఆసక్తి చూపినవారితో బైబిలు అంశాలను ఇంకను చర్చించుటకుగాను, తిరిగి దర్శించుటకు సమయము, ప్రయత్నము వెచ్చించవలసియుండును. అయితే మనము సత్యములో ఉన్నది యెహోవా యొక్క ప్రేమ, కరుణ వాత్సల్యములనుబట్టియేనని మనము గుణగ్రహించాలి. ఒకరు మనతో అనేక గంటలు ఓర్పుతో సత్యమును బోధించుటకు గడుపుట ద్వారా అది వ్యక్తపరచబడెను. ఆలాగే, అవసరమగా సమయాన్ని కేటాయించి, శిష్యులను చేయు ఈ అత్యంత ప్రాముఖ్యమైన పనికి దానిని సమర్పించుటకు ప్రేమ మనలను బలవంత పెట్టవలెను.—2 కొరిం. 5:14, 15; ఎఫె. 5:15, 16.
14 సాయంకాల సాక్ష్యము కొరకు ఏర్పాట్లు చేయుటకు అనేక సంఘములు సొసైటి సలహాలను పాటించినవి. ఆసక్తిచూపిన వారిని తిరిగి దర్శించుటకు సాధారణంగా సాయంకాలపు తొలిగంటలు మంచి సమయమై యుండును. సాక్ష్యమివ్వబడిన వ్యక్తులను గూర్చిన తగిన సమాచారమును కలిగియున్న యింటింటి రికార్డు. ప్రభావితమైన పునర్దర్శనములను చేయుటకు బైబిలు చర్చలను ప్రారంభించుటకు అవసరము. అట్టి నివేదికలను ఏదైన పుస్తకము లేదా బైబిలులో పెట్టివేసి వాటిని మర్చిపోకండి. మీరు ఆ పొరుగు ప్రాంతమునందే ఉండి అనేక వారముల వరకు వారిని తిరిగి సందర్శించకుండా ఉంటే ఆ వ్యక్తి హృదయములో నాటబడిన దానిని ఎత్తుకుపోవుటలో సంతసించే సాతాను ప్రతినిధుల సందర్శనకు అతనిని విడిచినట్లే. (లూకా 8:12) తగిన కాలమున తిరిగి సందర్శించి సాతాను తంత్రములను త్రిప్పికొట్టగలరా? మీ బాధ్యతను గుర్తించి, మీ ఆధిక్యతను మెచ్చుకొన్నట్లయితే, సాధ్యమైనప్పుడు, తగిన సమయమందే తిరిగి సందర్శించగలరు.—1 కొరిం. 9:16, 23.
ఎట్లు బైబిలు పఠనము ప్రారంభించుట
15 బైబిలు పఠనమును ప్రారంభించుట క్లిష్టమైన, సంకటములతోకూడిన విధానము కాదు. వారితో గృహ బైబిలు పఠనమును చేయుటకు మీరిచ్చిన ప్రత్యక్ష ఆహ్వానమును కొందరు వెంటనే అంగీకరించుదురు. అయినప్పటికిని, అనేకమంది ప్రచారకులు పఠనము పేరు ఎత్తకుండానే పఠనమువలె బైబిలు చర్చను కొనసాగించుటకు ఎంచుకొనుచున్నారు.
16 ప్రజలయెడల ప్రేమ, వారికి సహాయము చేయాలనే యథార్థకోరిక అవసరము. మంచి సిద్ధపాటుకూడా కావాలి. అప్పటికే ఆ వ్యక్తితో మీరు ఏమి చర్చించియున్నారో, బైబిలు చర్చను కొనసాగించుటలో మీరు ఏమి మాట్లాడడానికి నిశ్చయించినారో మీరు వ్రాసియుంచిన దానిని పునర్విమర్శ చేయుటకూడ యిందు ఇమిడియున్నది. మీ వ్యాఖ్యానములను కొనసాగించదల్చిన దానిని మనస్సున కలిగియుండుము. అంతకుముందు చర్చించిన అంశముపై కొన్ని అదనపు లేఖనములను మీరు ఎంచుకొనగలరా? లేదా ఆ వ్యక్తి కలిగియున్న కరపత్రమును లేదా పుస్తకమును తెరచి అందలి ప్రారంభ పేరాలను అతనితో పరిశీలించగలరా? అతడు ఆసక్తిని కనబరచిన అంశమునే మీరు ఎంచుకొనవచ్చును. ప్రారంభములో 10 నుండి 15 నిమిషములను మాత్రమే తీసికొనండి. చూపబడు ఆసక్తిని బట్టి క్రమేపి సమయాన్ని పెంచవచ్చు. ఎలా కొనసాగించాలో ఎంతసేపు ఉండాలో వివేచించుటకు మీ మంచి నిర్ణయము మీకు సహాయపడవలెను.
17 శిష్యులను చేయుటలో వృద్ధిచెందదగు పద్ధతులను అనుసరించుటయందు మీకు తోడ్పడు నిమిత్తము అనేక సంవత్సరములనుండి సహాయకరమగు అనేక సలహాలు యివ్వబడినవి. “ఫలవంతమైన బైబిలు పఠనముల ద్వారా హృదయములను చేరుము” మరియు “బైబిలు విద్యార్థులను యెహోవా సంస్థవైపు నడిపించుట” వంటి శీర్షికలు 1990 నవంబరు మరియు డిశంబరు మన రాజ్య పరిచర్యలో ప్రచురింపబడినవి. “గృహ బైబిలు పఠనములకు సిద్ధము చేసి, నిర్వహించుట” అనే శీర్షికను మార్చి 1987 మన రాజ్య పరిచర్య కలిగియున్నది. “బైబిల్ స్టడీస్” అను అంశమును ఇండెక్స్‌లో పరిశీలిస్తే సహాయకరమగు అదనపు సమాచారమును మీకు లభించగలదు.
18 బైబిలు పఠనమును ఎలా చేయాలో ఒక మాదిరిగా, సంఘ పుస్తక పఠనమునందు ఏమి చేయబడుచున్నదో అవధానమిమ్ము. అయితే ఒక గృహ బైబిలు పఠనమందు మీరు పూర్తి గావించుటకుగాను ముందుగా నియమించబడిన పఠన భాగముండదు. గనుక విద్యార్థి యొక్క సామర్థ్యము, అవసరతల కనుగుణ్యముగా మీరు పూర్తిగావించదల్చిన సారాంశమును మీరు నిర్ణయించుకోవాలి. అదనంగా, ప్రభావితమైన బైబిలు పఠనములను చేయుటలో ఆచరణాత్మక సలహాలనిచ్చుటకు నీతోపాటు పఠనమునకు వచ్చుటకు సేవాధ్యక్షుడు మరి యితర అనుభవముగల ప్రచారకులు పయినీర్లు సంతసించగలరు.
19 ప్రజలకు సహాయపడుటకు మనము చేయు ప్రయత్నములో యెహోవా కీలక పాత్ర వహించునని గుర్తెరిగి, మనము పఠించుటకుగాను ఎవరినో ఒకరిని కనుగొనుటకు మాత్రమే గాక మనము కనుగొన్న ఆసక్తిగలవారి అభివృద్ధి నిమిత్తముకూడ మనము ప్రార్థించవలెను. మన స్వభావము, మన భావనలు, అపొస్తలుడైన పౌలు రాజైన అగ్రిప్పకు సాక్ష్యమిచ్చినప్పుడు చూపిన వాటివలె ఉండవలెను. “సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు. నేడు నామాట వినుచున్న వారందరును నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించునుగాక.“ (అపొ. కార్య. 26:29) వ్యక్తిగత సహాయమునకు తక్కువ కాలము పట్టినా లేక ఎక్కువ కాలము పట్టినా, తన మాట వినుచున్న వారందరు నమ్మకమైన క్రీస్తు శిష్యులు కావలెనని పౌలు కోరెను.
20 బైబిలు పఠనములను చేయుట మనలను “దేవుని కృపాసువార్తనుగూర్చి సంపూర్ణ సాక్ష్యమిచ్చునట్లు” చేయుము. (అపొ. కార్య. 20:24) అంధకారమునుండి వెలుగునకు సాతాను అధికారమునుండి దేవునివైపు యింకను తిరుగుటకు లెక్కలేనంతమంది ఉన్నారు. (అపొ. కార్య. 26:18) సమర్పించుకొని, బాప్తిస్మము పొందిన యెహోవా సేవకులారా, సత్యమను విత్తనములను విత్తి బైబిలు చర్చలు, క్రమమైన గృహబైబిలు పఠనములద్వారా తగినంత నీటితో వారిని వెంటాడుటలో మీ వంతు భాగమును మీరు చేయవలయును. ఆ విధముగా ప్రజలు శిష్యులగుటయు యింకను యితరులు యేసుక్రీస్తు శిష్యులగుటకు సహాయపడుటలో వారు మీతోపాటు చేరుటను చూచినప్పుడు మీకు ఎంతో ఆనందము కలుగును.