అర్థవంతమైన కుటుంబ బైబిలు పఠనములను చేయుట
1 తల్లిదండ్రులు నెరవేర్చు అతి ప్రాముఖ్యమైన పనులలో ఒకటేమనగా తమ పిల్లలకు సత్యమును బోధించుట. అది యెహోవా ద్వారా యివ్వబడిన బాధ్యత. (ద్వితీ. 6:6, 7) భక్తిహీనమైన లోకములో యథార్థముగా నడుచుటకు పిల్లలకు నడిపింపు మరియు మార్గదర్శకత్వము అవసరము. వారు యెహోవాను మరియు సత్యమును ప్రేమించ నేర్చుకొని దానిని హత్తుకొనియుండు తీర్మానమును చేసికొనవలసిన అవసరత ఉన్నది. 1988 ఆగస్టు 1, వాచ్‌టవర్ పేజి 11 యిట్లు చెప్పినది: “ఇతరములైన ఎన్ని బాధ్యతలను కలిగియున్నను, లేక కష్టములను నీవు ఎదుర్కొనుచున్నను మీ పిల్లలతో సమయము గడుపుటకు ప్రథమ స్థానమును ఇవ్వవలసిన అవసరతయున్నది. కలిసి గడిపిన సమయము మీ పిల్లల హృదయములను భద్రపరచి వారిని సరైన విధానమందు ఉంచగల ఆత్మీయవిలువలను నాటుటకు నిన్ను అనుమతించును.”
2 దేవుని వాక్యమందు యివ్వబడిన మార్గసూత్రములను కుటుంబములు అనుసరించవలసియున్నట్లయిన కుటుంబ పఠనము కొరకు క్రమముగా సమయమును కేటాయించవలెను. కుటుంబ శిరస్సులు కుటుంబ ఆత్మీయతను గూర్చి శ్రద్ధ తీసుకొనుటకు ప్రథమ స్థానమివ్వవలెను. యింటివారియొక్క ఆత్మీయ అవసరతలకు ఇప్పుడు సరైన అవధానమును ఇవ్వనట్లయిన భవిష్యత్తులో తల్లిదండ్రులు గంభీరమైన సమస్యలతో వ్యవహరించవలసిన స్థితి రావచ్చును.
పఠనసమాచారము మరియు పద్ధతులు
3 దేనిని పఠించవలెను? కుటుంబమునకు ఏమి అవసరమైయున్నదో తెలుసుకొనుటకు కుటుంబశిరస్సు మంచిస్థానమందున్నాడు. ఏది ప్రయోజనకరముగా ఉంటుందని ఇతరులు తలంతురో విచారించి వారి సలహాలనుకూడా ఆయన పరిగణనలోకి తీసుకొనవచ్చును. అనుకూలముగా మలచగలుగునట్టి తీరు కుటుంబ పఠనమును ఆచరాణాత్మకముగాను, ఉత్తేజపూరితమైనదిగాను చేయును. చాలా కుటుంబములు ది వాచ్‌టవర్ నుండి వారపు పాఠమును సిద్ధపడుటకు కోరుకొనును. అయినను, కొన్నిసార్లు, పాఠశాలయందు యువకులు ఎదుర్కొను సమస్యలను గూర్చి వివరించు నిర్దిష్ట అంశములను చర్చించుటయు అవసరము కావచ్చును. స్త్రీ, పురుషులు ఒంటరిగా కలసితిరుగుట, పాఠ్యేతర కార్యక్రమములు, క్రీడలు, అవినీతికర భావములు మొదలగు వాటినిగూర్చి ముద్రించబడిన సమాచారమును నిర్మాణాత్మకంగాను మరియు ప్రోత్సాహకర పద్ధతిలోను పరిశీలించవచ్చును. కుటుంబ శిరస్సు కుటుంబమునకు ఏమి అవసరమో, మరియు ఎంత బాగా దానితో వారి హృదయములను చేరవచ్చునో యెడతెగక పునఃపరిశీలించుట ప్రాముఖ్యము.—ది వాచ్‌టవర్, ఫిబ్రవరి 15, 1971 పేజీలు 105-6 చూడుము.
4 ఒక పఠనమును ఎట్లు చేయవలెను? విశ్రాంతిదాయకమైన మరియు అదే సమయములో గౌరవపూర్వకమైన వాతావరణమును కలుగజేయుము. యాంత్రికమైన మరియు అతిగా పద్ధతిని పాటించు తీరును విడనాడుము. అదనపు ప్రశ్నలను అడుగుము. అందరు పాల్గొనునట్లు చేయుచు, ఆలోచనను రేకెత్తించు ఉపమానములను ఉపయోగించుము. సమాచారమును ఉన్నతపరచగల దృశ్య సహాయములైన పటములు, చార్టులను ఉపయోగించవచ్చును. పిల్లల వయస్సు మరియు సామర్థ్యములకు తగినట్లు ఇండెక్స్ మరియు ఇన్సైట్ వాల్యూమ్ల నుండి సమాచారమును కనుగొనమని పనిని నియమించవచ్చును. వారు జవాబివ్వగలిగిన వెంటనే చిన్న పిల్లలను కూడా చర్చలోకి దించుము. చిన్నమాటలతో జవాబివ్వగల ప్రశ్నలను వారినడుగవచ్చును. పఠనసమయములను పిల్లలను దూషించుటకు ఉపయోగించవద్దు. బదులుగా వారిని మెచ్చుకొనుచు, వారి ప్రయత్నములయెడల మెప్పునుచూపి ఆత్మీయముగా వారి దృక్పథములను వారితో పంచుకొనుము.
5 నీవు హృదయమును చేరుతున్నావని ఎట్లు నిశ్చయత గలిగియుండగలవు? ప్రతి ఒక్కరిని సమాధానములను తమ స్వంతమాటలలో పెట్టుటకు ప్రోత్సహించుము. హృదయ స్వభావమును నిర్ణయించుకొనుటకు దృక్పథములను బయలుపరచు ప్రశ్నలను అడుగుము. నీవిట్లడగవచ్చును: “ఈ విషయమును గూర్చి పాఠశాలయందలి పిల్లలు ఎట్లు భావింతురు? ఈ విషయమును గూర్చి మీకెప్పుడైనా సందేహములున్నవా?” దృక్పథమును బయటపెట్టు ప్రశ్నలను అడుగునప్పుడు పిల్లలిచ్చు సమాధానముల విషయంలో అతిగా ప్రతిస్పందించకుండునట్లు జాగ్రత్తపడుము. లేక మీ పిల్లలు యథార్థముగా తమ్మును తాము బయటపెట్టుకొనుటకు ముందుకు రాకపోవచ్చును. మాట్లాడుటకు వారికి సమయమివ్వుము. వారియందును, వారి సమస్యలందును నీవు శ్రద్ధ కలిగియున్నావని తెలిసికొనుట నీ బోధనా ప్రయత్నములను ఎంతో సులభతరము చేయును.—ది వాచ్‌టవర్, నవంబరు 1, 1986, పేజీలు 23-5 చూడుము.
6 నీ కుటుంబ బైబిలు పఠనముయొక్క ముఖ్య ఉద్దేశ్యము యెహోవా ఆలోచనలను నాటుటయేగాని, సంఘకూటములందు సమాధానములను వల్లించుట కాదనుదానిని మనస్సునందుంచుకొనుము. (ఎఫె. 3:17-19) దీని అర్థము సమాచారము హృదయములోకి పోవుటకు పనిచేయుట అని. దేవుని చిత్తమును చేయుటకు ఎందుకు ఇష్టపడవలెనో, జీవితమందు ఎందుకు అది అత్యంత శ్రేష్టమో కారణములను కుటుంబమునకు అందించుము.
7 కుటుంబ ఆత్మీయతను నిర్మించుటకు క్రమమైన కుటుంబ పఠనము అవసరము. జీవిత సమస్యలను ఎదుర్కొనుటకు పిల్లలను అది తర్ఫీదుచేసి, సిద్ధపరచును. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు సహాయపడుటకు శ్రేష్టమైన స్థానమందున్నారు. దేవుడిచ్చిన ఈ బాధ్యతను చేపట్టుము. మీరు అర్థవంతమైన కుటుంబ బైబిలు పఠనమును చేయుటయందు స్థిరత కలిగియుండుటకు ప్రతి ప్రయత్నమును చేసినట్లయిన, యెహోవా నిశ్చయముగా మిమ్ము దీవించును.