మీ ఆత్మీయ అవసరమును తీర్చుకొనుట
1 “తమ ఆత్మీయ అవసరత విషయములో మనస్సుగల వారు ధన్యులు,” అని యేసు చెప్పెను. (మత్త. 5:3, NW) మన ఆత్మీయ అవసరత విషయములో మనస్సు నిలుపుట ఎందుకంత ప్రాముఖ్యము? దానిని గూర్చి మన మనస్సు నిలిపియున్నామని ఎట్లు చూపగలము? దాని విషయములో మనలను పడద్రోయు ఏ ఆపదలను మనము తప్పించుకొనవలెను. మరియు ఆత్మీయ అవసరత విషయములో మనస్సు కలిగియుండుట వలన కలుగు ఆశీర్వాదములేవి?
2 నిస్సంశయముగా మనమందరము మన భౌతిక క్షేమము మరియు సరైన ఆహారమునకుగల సంబంధమును గూర్చి ఎరిగియున్నాము. ఒక వ్యక్తి క్రమముగా తన భౌతిక అవసరతలను నిర్లక్ష్యము చేసి మంచి శ్రేష్టమైన పనిని దినముల తరబడి యెడతెగక చేస్తానని ఆశించలేడు. మనము ఆత్మీయముగా పోషింపబడుటను నిర్లక్ష్యము చేస్తే అదే సూత్రము అన్వయిస్తుంది.—మత్త. 4:4; యోహా. 17:3.
అవసరములను తీర్చుకొనుటకు కూటములు సహాయపడును
3 మన ఆత్మీయక్షేమమునకును మరియు ఆత్మీయముగా పోషింపబడు కార్యక్రమమునకును ప్రత్యక్షసంబంధమున్నది. మన కూటములలో “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు” మన అవసరతను తీర్చుటకు రకరకముల శ్రేష్టమైన ఆత్మీయ వంటలను అందించుచున్నాడు. (మత్తయి 24:45-47) ప్రతి కూటము ఒక నిర్దిష్టమైన సంకల్పముకొరకు పనిచేయును. వీటిలో ఏదియు నిర్లక్ష్యపరచబడకూడదు. నీవు అన్ని కూటములకు సిద్ధపడి వాటికి క్రమముగా హాజరగుదువా?
4 మన వారపు ఐదు కూటములలో కేవలము మూడింటిని గూర్చి క్లుప్తముగా పరిశీలించుదాము. అభివృద్ధి చెందుతూ వెళ్లు సత్యముతో సమానముగా వెళ్లుటకు ముఖ్యముగా ఏర్పరచబడిన కూటము కావలికోట పఠనము, పరిచారకులుగా ప్రవీణులమగునట్లు దైవపరిపాలనా పాఠశాల సహాయము చేయును. సంఘపుస్తక పఠనము బైబిలుయొక్క అనేక అంశములను శ్రద్ధతో పఠించు సమయమును దయచేయును.
5 సంఘకూటములకు నీవు సిద్ధపడుదువా? కొందరు పఠన సమాచారమును పైపైన చూచుకుంటూ, గబగబ ప్రశ్నలకు సమాధానములను అండర్‌లైన్ చేసికొందురు గాని, అచ్చట యివ్వబడిన లేఖనములను చూడరు. వ్యాఖ్యానించుటకు వారు కొంతమట్టుకు సిద్ధపడవచ్చును. అయితే అందుబాటులోయున్న ఆత్మీయపోషణయొక్క పూర్తిభాగమును వారు పొందుదురా? నీవు నీ కుటుంబము కూటములకు సిద్ధపడు విధానమందు అభివృద్ధి చెందవలసిన అవసరమేమైనా యున్నాదా?
సమయమును కొనుము
6 మీరు కూటములకు సిద్ధపడుటకు సమయమును కేటాయించుకొనినప్పుడు, దూరదర్శినేగాని, లేక తక్కువ ప్రాముఖ్యముగల ఇతర కార్యక్రమమేగాని మీ పథకములకు అంతరాయము కలిగించుటకు అనుమతించకుము. ప్రత్యేకముగా కుటుంబ యజమానులు క్రమమైన బైబిలు పఠన కార్యక్రమమునకు, కూటముల సిద్ధపాటుకు, ప్రాంతీయసేవలో పాల్గొనుటకు హత్తుకొనియుండునట్లు తమ కుటుంబములకు సహాయము చేయవలెను. అందరు ‘సమయమును పోనియ్యక’ అను అపొస్తలుడైన పౌలు సలహాను గంభీరముగా తీసుకొని మన ఆత్మీయతకు ప్రాధాన్యతనివ్వవలెను.—ఎఫెసీ. 5:15-17.
7 మన ఆత్మీయ అవసరత విషయము మనస్సుగలవారమై యుండుట ద్వారా, స్వయం సంతుష్టి లేక స్వయంతృప్తి అను ఆపదలను తప్పించుకొందుము. వ్యక్తులముగా, మరియు కుటుంబములుగా మనకు నిజమైన ఆత్మీయ అవసరతలున్నవి. మన ఆత్మీయ అవసరతను తీర్చుకొనుటకు మనము చేయు ప్రయత్నముపైన మన నిత్యసంతోషము ఆధారపడియుండును.