సత్యమునకు సాక్ష్యమిమ్ము
1 యేసు తాను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకే ఈ లోకమునకు వచ్చితినని స్పష్టము చేసెను. ఆయన యిలా ప్రకటించెను: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే నేను యీ లోకమునకు వచ్చితిని.”—యోహాను 18:37.
2 ఆసక్తితోకూడిన తన ప్రకటనపని ద్వారా యేసు యెహోవా నామమును ఘనపర్చెను. జనుల దుఃఖకర ఆత్మీయస్థితిని గుర్తించినవాడై ప్రజలపై ఆయన వాస్తవమైన ప్రేమనుకూడా కనపర్చెను. ఆయన పనినిగూర్చి మత్తయి ఈ విధముగా వ్రాసెను: “యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు . . . సమూహములను చూచి వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదిరియున్నందున వారిమీద కనికరపడెను.” (మత్త. 9:35, 36) యేసువలెనె పొరుగువారియెడలగల మన ప్రేమతోపాటు యెహోవాయెడల మనకున్నట్టి భక్తి మనలను ప్రకటించుటకు నడిపించవలెను.
మన ముఖ్యమైన పని
3 ప్రజలయెడల, యెహోవాయెడలగల నిజమైన ప్రేమ మనకు తటస్థించు ప్రతి అవకాశమందును యెహోవాను ఆయన ఆశ్చర్యకార్యములను గూర్చిన సత్యమును ప్రజలకు బోధించుటకు మనలను నడిపించును. (కీర్తన 96:2, 3; 145:10-13) ఏమైనను, అనుదిన జీవితవత్తిడులు, జీవిత చింతలు, విస్తారమైన అన్య విషయములు మన సాక్ష్యమిచ్చు పనినుండి మనలను సులభముగా మరల్చివేయును. అందువలన, దేవుని గూర్చి ఆయన రాజ్యమును గూర్చిన సత్యమునకు సాక్ష్యమిచ్చు అత్యవసరతను ప్రధానమైనదిగా ముందుంచుకొనవలసియున్నాము. అన్నిటికంటె ప్రాముఖ్యమైనదై మన కప్పగింపబడిన ఈ ప్రాణమును రక్షించు పని నుండి మనలను మనము తొలుగజేసుకొనుటకు అనుమతింపకూడదు. (మత్తయి 24:14; 28:19, 20) యెహోవా సేవలో పనితొందర కలిగియుండుట మనకు రక్షణదాయకము, సత్యవర్తమానమును వినవలసినవారికి అది చిరకాల ప్రయోజనములను తెచ్చును.—1 కొరింథీ. 15:58.
4 రెగ్యులర్ పయినీరుగాను, లేక అక్సిలరీ పయినీరుగాను నీవు సేవచేయగలవా? నీ పరిస్థితులను సరిచూచుకొని, ఒకవేళ నీ సేవను ఈ విధముగా ఇంకను అభివృద్ధి పరచుకొనుటకు వీలున్నదేమో ఎందుకు ఆలోచించకూడదు? నీవు ఉద్యోగమునుండి రిటైర్డ్ అయినావా? అట్లయిన నీ సమయమును ప్రకటనపనిలో మరి ఎక్కువగా ఎందుకు ఉపయోగించకూడదు? ఇంకను చదువుతున్న చాలా మంది స్కూలు విద్యార్థులు క్రమముగా ఆక్సిలరీ పయినీరింగ్ చేసియున్నారు. ఈ విధంగా చేయుట శారీరకముగా, ఆత్మీయముగా ఎంతో ఉత్సాహవంతులనుగాజేసి హృదయ సంతోషమును తెచ్చును.
5 సత్యమునకు ఫలవంతముగా సాక్ష్యమిచ్చుటకు, సమయము విషయములో మంచి పట్టిక వేసుకొనవలసిన అవసరమున్నది. (ఎఫెసి. 5:15, 16) ఆక్సిలరీ పయినీరింగ్ చేయుటకు దినమునకు సగటున రెండుగంటల సేవ అవసరము. కొందరు స్కూళ్లకు లేక పనికి వెళ్లకముందే సేవకు వెళ్లుటకు ఒక గంటముందే నిద్ర లేవగోరుచున్నారు. అనేక సంఘములు సాయంకాల సాక్ష్యమును ఏర్పాటు చేయుట ద్వారా ఆక్సిలరీ పయినీర్లకు సహాయము చేసియున్నవి. మరియు, ఆక్సిలరీ పయినీర్లుగా చేయుటకు తమ సమయమును బాగుగా ఏర్పాటు చేసికొనిన అనుభవజ్ఞులైన సహోదరులతో మాట్లాడుట ద్వారా నీవు ప్రోత్సహింపబడి సహాయకరమగు సలహాలను పొందవచ్చును.
6 యెహోవా దేవుడు తన సేవకులయెడల ఎల్లప్పుడు తన మంచితనమును చూపియున్నాడు. ఆయనను యథార్థముగా సేవించువారు ఆశీర్వాదములను అధికముగా పొందియున్నారు. ఆయనను ప్రేమించువారియెడల యెహోవా మంచితనము ఇప్పటికిని కనపర్చబడుచున్నది. సత్యమునకు సాక్ష్యమిచ్చుకొలది, మన పరిస్థితులు అనుమతించినంతవరకు మనము చేయుదానిని యెహోవా అంగీకరించుటకు ఆనందించుచున్నాడు.—హెబ్రీ. 6:10.