జీవిత కథ
యెహోవా అడిగింది చేస్తే దీవెనలు పొందుతాం
నాకు, నా భర్తకు, మా అన్నావదినలకు ఒక ప్రత్యేక నియామకం దొరికింది. దానిగురించి మమ్మల్ని అడిగినప్పుడు వెంటనే మేం, “ఖచ్చితంగా చేస్తాం” అని చెప్పాం. మేం ఆ నియామకాన్ని ఎందుకు ఒప్పుకున్నామో, యెహోవా మమ్మల్ని ఎలా దీవించాడో తెలుసుకోవాలని ఉందా? ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను.
నేను ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో ఉన్న హెమ్స్‌వర్త్ అనే పట్టణంలో 1923లో పుట్టాను. నాకు ఒక అన్న ఉన్నాడు, తన పేరు బాబ్. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు నాన్న కొన్ని పుస్తకాల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. అబద్ధమతం ప్రజల్ని ఎలా మోసం చేసిందో వివరించే ఆ పుస్తకాలు నాన్నకు ఎంతో నచ్చాయి. ఎందుకంటే మతనాయకుల ద్వంద్వ స్వభావం నాన్నకు నచ్చేది కాదు. కొన్నేళ్ల తర్వాత, బాబ్ ఎట్కిన్‌సన్ మా ఇంటికొచ్చి సహోదరుడు రూథర్‌ఫర్డ్ ప్రసంగాన్ని ఫోనోగ్రాఫ్‌లో వినిపించాడు. నాన్న తెచ్చిన పుస్తకాల్ని ప్రచురించిన గుంపువాళ్లే ఈ ప్రసంగం కూడా తయారుచేశారని మాకు అర్థమైంది. మా అమ్మానాన్నలు సహోదరుడు ఎట్కిన్‌సన్‌ను రోజూ రాత్రి భోజనానికి పిలిచి, బైబిలుకు సంబంధించి తమకున్న సందేహాలను తీర్చుకునేవాళ్లు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక సహోదరుని ఇంట్లో జరుగుతున్న మీటింగ్స్‌కు రమ్మని అతను మమ్మల్ని పిలిచాడు. మేం క్రమంగా మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాం, కొంతకాలానికి హెమ్స్‌వర్త్‌లో ఒక చిన్న సంఘం ఏర్పడింది. జోన్ సర్వెంట్స్ (అప్పట్లో ప్రాంతీయ పర్యవేక్షకులను అలా పిలిచేవాళ్లు) వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవాళ్లు, చుట్టుపక్కల సంఘాల్లోని పయినీర్లు మా ఇంటికి భోజనానికి వచ్చేవాళ్లు. ఆ సహోదరసహోదరీల ప్రభావం నా మీద బాగా పనిచేసింది.
అప్పుడు మా కుటుంబమంతా కలిసి ఒక వ్యాపారం ప్రారంభించాం. కానీ నాన్న మా అన్నతో, “నువ్వు పయినీరింగ్ చేయాలనుకుంటే ఈ వ్యాపారాన్ని ఆపేద్దాం” అని చెప్పాడు. బాబ్ పయినీరింగ్ చేయాలనుకోవడంతో తనకు 21 ఏళ్లున్నప్పుడు ఇంటిని వదిలి వేరేప్రాంతానికి వెళ్లాడు. రెండేళ్ల తర్వాత నేను కూడా పయినీరింగ్ మొదలుపెట్టాను, అప్పుడు నాకు 16 ఏళ్లు. శని-ఆదివారాల్లో తోటి సహోదరసహోదరీలతో కలిసి ప్రీచింగ్ చేసేదాన్ని కానీ మిగిలిన రోజుల్లో ఎక్కువశాతం ఒక్కదాన్నే చేసేదాన్ని. నేను ఫోనోగ్రాఫ్‌ను; క్లుప్తంగా, స్పష్టంగా బైబిలు సందేశం రాసివున్న సాక్ష్యపు కార్డులను (testimony card) ఉపయోగించేదాన్ని. యెహోవా దీవెనతో నాకొక మంచి స్టడీ దొరికింది, కొంతకాలానికి ఆ విద్యార్థి బాప్తిస్మం తీసుకుంది. ఆమె కుటుంబంలోని చాలామంది కూడా చివరికి యెహోవాసాక్షులయ్యారు. తర్వాతి సంవత్సరం నన్నూ, మేరీ హెన్షల్‌ను ప్రత్యేక పయినీర్లుగా నియమించి చెషైర్‌లోని ఒక ప్రాంతానికి పంపించారు, ముందెప్పుడూ అక్కడ ప్రకటనా పని జరగలేదు.
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధానికి మద్దతిచ్చే పనుల్ని ఆడవాళ్లతో చేయించేవాళ్లు. కానీ ఇతర మతపరిచారకులకు మాత్రం మినహాయింపు ఉండేది. మేం ప్రత్యేక పయినీర్లం కాబట్టి మమ్మల్ని కూడా మినహాయిస్తారని అనుకున్నాం. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు, నాకు 31 రోజులపాటు జైలు శిక్ష విధించారు. ఆ తర్వాతి సంవత్సరం నాకు 19 ఏళ్లు వచ్చాయి, యుద్ధానికి మద్దతిచ్చే పనులు చేయడానికి నా మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో నేను మరో రెండుసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ రెండుసార్లూ అధికారులు నాకు శిక్ష విధించలేదు. ఆ పరిస్థితి అంతటిలో పవిత్రశక్తి సహాయం నాకుందనీ, యెహోవా నన్ను స్థిరంగా బలంగా తయారు చేస్తున్నాడనీ నాకు తెలుసు.—యెష. 41:9-10, 13.
కొత్త జత
నేను ఆర్థర్ మాథ్యూస్‌ని 1946లో కలిశాను. యుద్ధంలో పాల్గొననందుకు మూడు నెలల జైలు శిక్ష అనుభవించి అప్పుడే అతను బయటికొచ్చాడు. ఆ వెంటనే, హెమ్స్‌వర్త్‌లో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న తన తమ్ముడు డెన్నిస్‌తో కలిసి ప్రీచింగ్ కొనసాగించాడు. వాళ్ల నాన్న చిన్నప్పటి నుండే వాళ్లకు యెహోవా గురించి నేర్పించాడు, టీనేజీలో ఉన్నప్పుడు వాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లిద్దరు కలిసి పయినీరింగ్ చేస్తున్న కొంతకాలానికి డెన్నిస్‌ను ఐర్లాండ్‌కు నియమించారు. దాంతో ఆర్థర్ ప్రీచింగ్‌లో ఒంటరివాడైపోయాడు. కష్టపడి పనిచేసే ఆర్థర్ మా అమ్మానాన్నలకు నచ్చాడు. దాంతో తమతోపాటు ఉండడానికి రమ్మని అతన్ని పిలిచారు. నేను మా ఇంటికి వెళ్లినప్పుడు, భోజనం తర్వాత గిన్నెలు తోమే పనిని ఇద్దరం కలిసి చేసేవాళ్లం. కాలం గడుస్తుండగా మేమిద్దరం ఉత్తరాలు రాసుకోవడం మొదలుపెట్టాం. 1948లో ఆర్థర్ మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అయితే మేము 1949 జనవరిలో పెళ్లి చేసుకున్నాం, వీలైనంత ఎక్కువ కాలంపాటు పూర్తికాల సేవలో ఉండాలనేదే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం డబ్బుల్ని ఆచితూచి ఖర్చుపెట్టేవాళ్లం, సెలవులు పెట్టుకున్నప్పుడు పండ్ల తోటలో పనికి వెళ్లి కొంత డబ్బు సంపాదించుకునేవాళ్లం. యెహోవా దీవెనతో మేం పయినీరు సేవను కొనసాగించాం.
1949లో మా పెళ్లయిన తర్వాత హెమ్స్‌వర్త్‌లో
సంవత్సరం దాటి కొంతకాలమయ్యే సరికి మమ్మల్ని ఉత్తర ఐర్లాండ్‌కి నియమించారు. మొదట ఆర్మాలో ఆ తర్వాత న్యూరీలో సేవచేశాం, ఆ రెండు పట్టణాల్లో ఎక్కువగా క్యాథలిక్కులే ఉండేవాళ్లు. ఆ ప్రాంతాల్లో మత వివక్ష చాలా ఎక్కువగా ఉండేది, కాబట్టి మేం ప్రజలకు ప్రీచింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మంచి వివేచన ఉపయోగించి మాట్లాడాల్సి వచ్చేది. మేం ఉంటున్న చోటు నుండి 16 కి.మీ. దూరంలో ఉన్న ఓ సహోదరుని ఇంట్లో మీటింగ్స్ జరుపుకునేవాళ్లం. దాదాపు ఎనిమిదిమంది హాజరయ్యేవాళ్లు. కొన్నిసార్లు మీటింగ్ అయ్యాక ఆ ఇంట్లోనే ఉండిపోయేవాళ్లం. రాత్రిపూట నేలమీద పడుకునేవాళ్లం, ఉదయం చక్కని అల్పాహారాన్ని తినేవాళ్లం. ఇప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది సాక్షులు ఉండడం చాలా ఆనందంగా ఉంది.
“మేం ఖచ్చితంగా చేస్తాం”
అప్పటికే మా అన్న, అతని భార్య లాటీ కలిసి ఉత్తర ఐర్లాండ్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్నారు. 1952లో మేం నలుగురం బెల్‌ఫాస్ట్‌లో జరిగిన జిల్లా సమావేశానికి హాజరయ్యాం. ఒక సహోదరుడు దయగా మాకు ఆతిథ్యం ఇవ్వడంతో మేం నలుగురం అతని ఇంట్లోనే ఉన్నాం. మాతోపాటు అప్పటి బ్రిటన్ బ్రాంచి సర్వెంట్ అయిన ప్రైస్ హ్యూజ్ కూడా ఉన్నాడు. ఒకరోజు రాత్రి మేమందరం కలిసి కొత్తగా వచ్చిన ప్రేమే దేవుని మార్గం అనే చిన్నపుస్తకాన్ని చర్చించుకుంటున్నాం. ఆ చిన్నపుస్తకాన్ని ప్రత్యేకంగా ఐర్లండ్‌లోని వాళ్ల కోసమే తయారుచేశారు. అయితే ఐరిష్ రిపబ్లిక్‌లోని క్యాథలిక్కులకు ప్రీచింగ్ చేయడం కష్టమని సహోదరుడు హ్యూజ్ మాతో చెప్పాడు. సహోదరులు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని, క్యాథలిక్ మతగురువులు ప్రజల్ని సహోదరుల మీదకు రెచ్చగొడుతున్నారని కూడా చెప్పాడు. తర్వాత హ్యూజ్ ఇలా అన్నాడు, “దేశమంతటా ఈ చిన్న పుస్తకాన్ని పంచిపెట్టే ప్రత్యేక ప్రచార కార్యక్రమం కోసం కారు ఉన్న భార్యాభర్తల సహాయం కావాలి.”a ఆ సందర్భంలోనే, “మేం ఖచ్చితంగా చేస్తాం” అని అన్నాం.
తోటి పయినీర్లతో కలిసి మోటర్ బైక్, సైడ్ కారులో
ఎన్నో ఏళ్లపాటు యెహోవాకు నమ్మకంగా సేవచేసిన మదర్ రట్‌లండ్ అనే సహోదరి డబ్లిన్‌లో ఉండేది. పయినీర్ల కోసం ఆమె ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచివుండేవి. మేం కూడా కొన్నిరోజులు ఆమె ఇంట్లో ఉండడానికి వెళ్లాం. ఆ తర్వాత మేము మా సామాన్లు కొన్నింటిని అమ్మేసి బాబ్ మోటర్ బైక్ ఎక్కి, కారు కొనుక్కోవడానికి వెళ్లాం. మంచి కండీషన్‌లో ఉన్న ఒక సెకండు హ్యాండ్ కారు తీసుకున్నాం. అయితే మాలో ఎవ్వరికీ కారు నడపడం రాదు కాబట్టి దాన్ని మా ఇంటికి తెచ్చి ఇవ్వమని అమ్మిన వ్యక్తినే అడిగాం. ఆ రోజు సాయంత్రమంతా ఆర్థర్ మంచం మీద కూర్చుని, కారు గేర్లను మారుస్తున్నట్లు నటిస్తూ ప్రాక్టీసు చేశాడు. తర్వాతి రోజు ఉదయం అతను గ్యారేజీలో నుండి కారును బయటికి తీయడానికి ప్రయత్నిస్తుండగా మిల్‌డ్రడ్ విల్లట్ (కొంతకాలానికి ఆమె జాన్ బార్‌ని పెళ్లి చేసుకుంది) అనే మిషనరీ సహోదరి వచ్చింది. ఆమెకు కారు నడపడం వచ్చు. ఆమె సహాయంతో కాసేపు డ్రైవింగ్ ప్రాక్టీసు చేశాక బయల్దేరడానికి సిద్ధమయ్యాం.
మా కారు, బండిలా ఉండే ఇల్లు
తర్వాత మాకు ఉండడానికి ఒక చోటు కావాలి. అయితే బండిలా ఉండే ఇంటిలో ఉండవద్దని సహోదరులు మాకు చెప్పారు ఎందుకంటే వ్యతిరేకులు దానికి నిప్పంటించే ప్రమాదం ఉంది. అందుకే మేం అద్దె ఇంటి కోసం వెతికాం కానీ దొరకలేదు. ఆ రాత్రి మేం నలుగురం కారులోనే నిద్రపోయాం. తర్వాతి రోజు ఎంత ప్రయత్నించినా రెండు పడకలున్న ఒక బండి తప్ప మాకేమీ దొరకలేదు. ఇక దాన్నే ఇల్లుగా చేసుకున్నాం. స్నేహపూర్వకంగా ఉన్న రైతుల ఖాళీ స్థలంలో దాన్ని ఉంచేవాళ్లం. అక్కడి నుండి 16-24 కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రీచింగ్ చేసేవాళ్లం. ముందు దూరంలోని కొత్త ప్రాంతానికి వెళ్లి ప్రీచింగ్ చేశాక, తిరిగి మా బండి పెట్టిన స్థలానికి వచ్చి అక్కడి ప్రజలకు ప్రీచింగ్ చేసేవాళ్లం.
ఐరిష్ రిపబ్లిక్‌కు ఆగ్నేయాన ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి ప్రకటించాం, అప్పుడు మాకు పెద్దగా వ్యతిరేకత ఏమీ ఎదురుకాలేదు. మేం 20,000 పైగా చిన్నపుస్తకాల్ని పంచిపెట్టాం. ఆసక్తి చూపించిన వాళ్లందరి పేర్లను బ్రిటన్ బ్రాంచి కార్యాలయానికి పంపించాం. ఐర్లాండ్‌లోని ఆ ప్రాంతంలో ఇప్పుడు వందలమంది సాక్షులు ఉండడం మాకెంతో సంతోషాన్నిస్తోంది.
తిరిగి ఇంగ్లాండ్‌కు, ఆ తర్వాత స్కాట్లండ్‌కు
కొన్నేళ్ల తర్వాత మమ్మల్ని దక్షిణ లండన్‌కు నియమించారు. కొన్ని వారాలకు బ్రిటన్ బ్రాంచి కార్యాలయం నుండి సహోదరులు ఆర్థర్‌కి ఫోన్ చేసి తర్వాతి రోజు నుండే ప్రాంతీయ సేవ మొదలుపెట్టమని చెప్పారు. వారంపాటు మాకు శిక్షణనిచ్చారు, ఆ తర్వాత మేము స్కాట్లండ్‌లోని మా సర్క్యూట్‌కు బయల్దేరాం, దాంతో ప్రసంగాలు సిద్ధపడడానికి ఆర్థర్‌కు ఎక్కువ టైం దొరకలేదు. ఎంత కష్టమైనా యెహోవా సేవలో వచ్చే ఎలాంటి నియామకాన్నైనా చేయడానికి ఆర్థర్ సిద్ధంగా ఉండేవాడు. అతని ఆదర్శం నన్ను ఎంతో ప్రోత్సహించింది. ప్రాంతీయ సేవ మా ఇద్దరికీ చాలా నచ్చింది. ఎవ్వరూ ప్రీచింగ్ చేయని ప్రాంతంలో కొన్నేళ్లపాటు సేవచేశాక, ఇప్పుడు ఎంతోమంది సహోదరసహోదరీల మధ్య ఉండగలగడం అద్భుతమైన దీవెన!
1962లో ఆర్థర్‌కు గిలియడ్ ఆహ్వానం వచ్చినప్పుడు మేం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గిలియడ్ శిక్షణ పది నెలలపాటు ఉంటుంది, నాకు ఆహ్వానం రాలేదు కాబట్టి నేను తనతో వెళ్లడం కుదరదు. అయితే ఆర్థర్ ఆ శిక్షణకు వెళ్లడమే మంచిదని మేం నిర్ణయించుకున్నాం. ఆర్థర్ వెళ్లిపోతే నాకు ప్రీచింగ్‌లో జత ఉండరు కాబట్టి బ్రాంచి నన్ను హెమ్స్‌వర్త్‌కు ప్రత్యేక పయినీరుగా పంపించింది. సంవత్సరం తర్వాత ఆర్థర్ తిరిగొచ్చాక, తనను జిల్లా పర్యవేక్షకునిగా నియమించారు. ఆ నియామకంలో భాగంగా మేము స్కాట్లండ్, ఉత్తర ఇంగ్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలను సందర్శించాం.
ఐర్లాండ్‌లో కొత్త నియామకం
ఆర్థర్‌కు 1964లో ఐరిష్ రిపబ్లిక్ బ్రాంచి సర్వెంటుగా సేవచేసే అవకాశం వచ్చింది. మొదట్లో బెతెల్‌కు వెళ్లడానికి భయపడ్డాను, ఎందుకంటే నాకు ప్రాంతీయ పనే బాగా నచ్చింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, బెతెల్‌లో సేవచేసే అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞురాలిని. మీకు ఇష్టం లేకపోయినా వచ్చిన నియామకాన్ని అంగీకరిస్తే, యెహోవా తప్పకుండా దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. బెతెల్‌లో నేను ఆఫీసు పనిచేశాను, ప్రచురణల్ని ప్యాకింగ్ చేసే పనిచేశాను, వంట చేయడం, శుభ్రం చేయడం లాంటి పనుల్ని చేశాను. ఆ తర్వాత కూడా కొంతకాలంపాటు ఆర్థర్ జిల్లా పర్యవేక్షకునిగా సేవచేశాడు, అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సహోదరుల్ని కలిసే అవకాశం మాకు దొరికింది. దానితోపాటు మా బైబిలు విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి చూడడంవల్ల కూడా ఐర్లాండ్‌లోని సహోదరసహోదరీలతో మాకు బలమైన బంధం ఏర్పడింది. ఎంతటి దీవెనో కదా!
ఐర్లాండ్‌లోని యెహోవాసాక్షుల చరిత్రలో నిలిచిపోయిన రోజు
ఐర్లాండ్‌లో మొదటి అంతర్జాతీయ సమావేశం 1965లో డబ్లిన్‌లో జరిగింది.b తీవ్రమైన వ్యతిరేకత మధ్య కూడా ఆ సమావేశం ఎంతో బాగా జరిగింది. మొత్తం 3,948 మంది హాజరయ్యారు, 65 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వేర్వేరు దేశాలనుండి వచ్చిన 3,500 మంది డబ్లిన్‌లో ఉన్న ప్రజల ఇళ్లలో ఉన్నారు. ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బ్రాంచి ఆఫీసు ప్రతీ కుటుంబానికి ఒక ఉత్తరం పంపించింది. ఆతిథ్యం ఇచ్చినవాళ్లు కూడా సహోదరుల మంచి ప్రవర్తనను మెచ్చుకున్నారు. ఐర్లాండ్‌లో అది నిజంగా మంచి మార్పు.
1965లో జరిగిన సమావేశానికి వచ్చిన సహోదరుడు నేథన్ నార్‌ను పలకరిస్తున్న ఆర్థర్
1983లో గాలిక్ భాషలోనినా బైబిలు కథల పుస్తకం విడుదల చేస్తున్న ఆర్థర్
1966లో ఉత్తర, దక్షిణ ఐర్లాండ్ బ్రాంచీలు డబ్లిన్ బ్రాంచిలో విలీనం అయ్యాయి. అయితే అక్కడ సాధారణంగా రాజకీయ, మత పరిస్థితుల్ని బట్టి ప్రజల మధ్య వివక్ష ఎక్కువగా ఉంటుంది. కానీ బ్రాంచి విలీనం అనేది అక్కడి పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంది. ఎంతోమంది క్యాథలిక్కులు సత్యంలోకి రావడం, ఒకప్పుడు ప్రొటెస్టంట్లుగా ఉన్న తమ సహోదరులతో కలిసి యెహోవాను సేవించడం చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది.
నియామకంలో పూర్తి మార్పు
2011లో బ్రిటన్, ఐర్లాండ్ బ్రాంచీలు విలీనం అవ్వడంతో మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి, మమ్మల్ని లండన్ బెతెల్‌కు పంపించారు. ఆ సమయంలో ఆర్థర్ ఆరోగ్యం పాడైంది, అతనికి పార్కిన్‌సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. బాధాకరమైన విషయమేమిటంటే, 2015 మే 20న 66 ఏళ్లపాటు నాకు తోడుగా ఉన్న నా భర్త చనిపోయాడు.
గత కొన్నేళ్లలో నేను వేదనను, కృంగుదలను, బాధను అనుభవించాను. ఇంతకుముందైతే నాకు ఆర్థర్ ఉండేవాడు, కానీ ఇప్పుడు తను లేకపోవడం నాకు తీరని లోటు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం. ఆర్థర్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసినప్పుడు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఐర్లాండ్, బ్రిటన్, అమెరికాలోని సహోదరసహోదరీలు కూడా నాకు ఉత్తరాలు రాశారు. వాళ్ల ఉత్తరాలే కాక, ఆర్థర్ తమ్ముడు డెన్నిస్, అతని భార్య మేవస్, నా మేనకోడళ్లు రూత్, జూడీల ప్రోత్సాహం కూడా నాకెంత సహాయం చేసిందో మాటల్లో వర్ణించలేను.
యెషయా 30:18 నాకెంతో ప్రోత్సాహమిచ్చిన లేఖనం. అక్కడిలా ఉంది, ‘మీమీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు, మీమీద కరుణ చూపించడానికి ఆయన లేస్తాడు. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడైన దేవుడు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నవాళ్లంతా సంతోషంగా ఉంటారు.’ (NW) మన సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి, కొత్తలోకంలో మనకు ఆసక్తికరమైన పనుల్ని ఇవ్వడానికి యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడని తెలుసుకోవడం నాకు నిజంగా ఓదార్పునిస్తుంది.
గడిచిన మా జీవితం గురించి ఆలోచిస్తే, ఐర్లాండ్‌లో జరిగిన ప్రకటనాపనిని యెహోవా ఎలా నడిపించాడో, దీవించాడో నాకు అర్థమైంది. ఆ పనికి మద్దతిచ్చిన వాళ్లలో నేనూ ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. యెహోవా అడిగింది చేసిన ప్రతీసారి దీవెనలు పొందుతామనేది నూటికి నూరుపాళ్లు నిజం.
b 1988 వార్షిక పుస్తకం (ఇంగ్లీషు), 109-112 పేజీలు చూడండి.