కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 ఏప్రిల్‌ పేజీలు 23-27
  • యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఘోరమైన అన్యాయం
  • దేవుడిచ్చిన న్యాయమైన తీర్పు
  • వినయం కాపాడుతుంది
  • సంఘంలో వేషధారణ పొడచూపిన సందర్భం
  • క్షమిస్తూ ఉండండి
  • అన్యాయాన్ని తట్టుకొని నిలబడ్డాడు
    కావలికోట: అన్యాయాన్ని తట్టుకొని నిలబడ్డాడు
  • దుష్ట రాణికి శిక్ష పడింది
    నా బైబిలు పుస్తకం
  • అన్యాయాన్ని మీరు సహించగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెజెబెలు—ఓ దుష్ట రాణి
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 ఏప్రిల్‌ పేజీలు 23-27
అంతియొకయలో ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మారిన అన్యుల్ని దూరంగా ఉంచి, యూదులైన క్రైస్తవులతో కలిసి తింటున్న అపొస్తలుడైన పేతురు

యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా?

“నేను యెహోవా నామమును ప్రకటించెదను . . . ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.”—ద్వితీ. 32:3, 4.

పాటలు: 15, 2

మనకు అన్యాయం జరిగినప్పుడు, ఈ లేఖనాల్ని గుర్తుచేసుకోవడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతాం?

  • ద్వితీయోపదేశకాండము 32:4

  • 1 పేతురు 5:5

  • మత్తయి 6:14

1, 2. (ఎ) నాబోతుకు, అతని కొడుకులకు ఎలాంటి అన్యాయం జరిగింది? (బి) ఏ రెండు లక్షణాల గురించి ఈరోజు ఆర్టికల్‌లో నేర్చుకుంటాం?

దేవున్ని, రాజును దూషించారని ఇద్దరు పనికిమాలిన వ్యక్తులు ఒకతనిపై నింద వేశారు. వాళ్లు చెప్తున్నది అబద్ధం. అయినాసరే ఆ వ్యక్తిని, అతని కొడుకుల్ని చంపబోతున్నారు. ఏ తప్పూ చేయని ఆ అమాయకుల్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే, న్యాయాన్ని ప్రేమించే వాళ్లకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇదంతా కథ కాదు, నిజంగా జరిగిన ఒక సంఘటన. అవును, రాజైన అహాబు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో యెహోవాను నమ్మకంగా సేవించిన నాబోతు జీవితంలో ఆ సంఘటన జరిగింది.—1 రాజు. 21:11-13; 2 రాజు. 9:26.

2 నాబోతు జీవితంలో జరిగిన ఒక అనుభవం గురించి ఈరోజు ఆర్టికల్‌లో చర్చిస్తాం. అంతేకాదు తొలి శతాబ్దంలోని ఒక నమ్మకమైన సంఘపెద్ద చేసిన పెద్ద తప్పు గురించి కూడా చర్చిస్తాం. యెహోవాలా మనం కూడా న్యాయంగా ప్రవర్తించాలంటే వినయం, క్షమించే గుణం ఉండడం ఎందుకు అవసరమో ఆ ఇద్దరి అనుభవాలు మనకు నేర్పిస్తాయి.

ఘోరమైన అన్యాయం

3, 4. నాబోతు ఎలాంటి వ్యక్తి? తన ద్రాక్షతోటను అహాబు రాజుకు అమ్మడానికి అతను ఎందుకు ఒప్పుకోలేదు?

3 ఆ కాలంలో చాలామంది ఇశ్రాయేలీయులు చెడ్డ వ్యక్తులైన అహాబు రాజును, అతని భార్య యెజెబెలు రాణిని ఆదర్శంగా తీసుకున్నారు. ఆ ఇశ్రాయేలీయులు అబద్ధ దేవుడైన బయలును ఆరాధిస్తూ యెహోవాను, ఆయనిచ్చిన నియమాలను పక్కన పెట్టేశారు. కానీ నాబోతు మాత్రం యెహోవాతో తనకున్న స్నేహానికి విలువిచ్చాడు, దానికోసం తన ప్రాణాన్ని కూడా లెక్కచేయలేదు.

4 1 రాజులు 21:1-3 చదవండి. అహాబు రాజు నాబోతు దగ్గరికి వెళ్లి అతని ద్రాక్షతోటను తనకు అమ్మమని అడిగాడు. లేదా అంతకన్నా మంచి ద్రాక్షతోట ఇస్తానని అహాబు రాజు అన్నాడు. కానీ నాబోతు ఒప్పుకోలేదు. ఎందుకు? నాబోతు గౌరవపూర్వకంగా ఇలా చెప్పాడు, ‘నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రము వల్లపడదు.’ దానికిగల కారణమేమిటంటే, వారసత్వంగా వచ్చిన ఆస్తిని శాశ్వతంగా అమ్ముకోకూడదనే నియమాన్ని యెహోవా ఆ కాలంలో ఇచ్చాడు. (లేవీ. 25:23; సంఖ్యా. 36:7) దీనిబట్టి, నాబోతు యెహోవా మాట విన్నాడని చెప్పవచ్చు.

5. నాబోతు ద్రాక్షతోటను చేజిక్కించుకోవడం కోసం యెజెబెలు రాణి ఎలాంటి దారుణమైన పనులు చేసింది?

5 నాబోతు ద్రాక్షతోటను అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో అహాబు రాజు, అతని భార్య కలిసి దారుణమైన పనులు చేశారు. ఎలాగైనా ఆ ద్రాక్షతోటను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో, యెజెబెలు రాణి ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించి నాబోతుపై అబద్ధ సాక్ష్యం చెప్పించింది. దాంతో నాబోతును, అతని కొడుకుల్ని రాళ్లతో కొట్టి చంపారు. నాబోతుకు జరిగిన ఇంత ఘోరమైన అన్యాయం విషయంలో యెహోవా ఎలాంటి చర్య తీసుకున్నాడు?

దేవుడిచ్చిన న్యాయమైన తీర్పు

6, 7. తాను న్యాయాన్ని ప్రేమించే దేవుడినని యెహోవా ఎలా చూపించాడు? అది నాబోతు కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఎందుకు ఓదార్పునిచ్చి ఉంటుంది?

6 యెహోవా వెంటనే అహాబు దగ్గరకు ఏలీయాను పంపించాడు. ఏలీయా అహాబు దగ్గరకు వెళ్లి, అతను చేసింది హత్య, దొంగతనం అని చెప్పాడు. యెహోవా ఇచ్చిన తీర్పు ఏమిటి? నాబోతు, అతని కొడుకులు ఎలాగైతే చంపబడ్డారో; అలాగే అహాబు, అతని భార్య, వాళ్ల కొడుకులు కూడా చంపబడతారు.—1 రాజు. 21:17-25.

7 అహాబు చేసిన దారుణమైన పనుల వల్ల నాబోతు కుటుంబసభ్యులు, స్నేహితులు చాలా బాధపడ్డారు. అయితే నాబోతుకు జరిగిన అన్యాయాన్ని చూసి, యెహోవా వెంటనే చర్య తీసుకోవడం వాళ్లకు ఓదార్పును ఇచ్చివుంటుంది. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ల వినయానికి, యెహోవాపై వాళ్లకున్న నమ్మకానికి పరీక్షగా మారి ఉండవచ్చు.

8. యెహోవా ఇచ్చిన తీర్పును విన్న అహాబు ఏమి చేశాడు? ఫలితం ఏమిటి?

8 యెహోవా ఇచ్చిన తీర్పును విన్న అహాబు, ‘తన బట్టలు చింపుకొని ఒంటి మీద గోనెపట్ట వేసుకున్నాడు; అతను ఉపవాసం ఉంటూ, గోనెపట్ట వేసుకొనే పడుకుంటూ, బాధగా నడుస్తూ ఉన్నాడు.’ అవును, అహాబు తనను తాను తగ్గించుకున్నాడు. అంతేకాదు ఎంత పెద్ద తప్పు చేశానని కుమిలిపోయాడు. అప్పుడు యెహోవా ఏలియాతో ఇలా చెప్పాడు, ‘అతను నా ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, అతని జీవితకాలంలో నేను విపత్తును తీసుకురాను. అతని కొడుకు రోజుల్లో అహాబు ఇంటి మీదికి విపత్తు తీసుకొస్తాను.’ (1 రాజు. 21:27-29,NW; 2 రాజు. 10:10, 11, 17) మన మనసుల్లో ఏముందో తెలుసుకోగల ‘హృదయ పరిశోధకుడైన యెహోవా’ అహాబు మీద కనికరం చూపించాడు.—సామె. 17:3.

వినయం కాపాడుతుంది

9. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నాబోతు కుటుంబసభ్యులకు, స్నేహితులకు వినయం ఎలా సహాయం చేసివుంటుంది?

9 అహాబు చనిపోయేంతవరకు అతని కుటుంబాన్ని యెహోవా శిక్షించడని విన్నప్పుడు, నాబోతు కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఎలా అనిపించి ఉంటుంది? బహుశా దేవునిపై వాళ్లకున్న విశ్వాసానికి అది ఒక పరీక్షగా అనిపించి ఉంటుంది. కానీ వినయం ఉంటే వాళ్లు తమ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారు. ఎందుకు? వినయం ఉన్నవాళ్లు, దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడనే నమ్మకంతో ఆయన్ని ఆరాధించడంలో కొనసాగుతారు. (ద్వితీయోపదేశకాండము 32:3, 4 చదవండి.) భవిష్యత్తులో పునరుత్థానం జరిగినప్పుడు నాబోతు కుటుంబసభ్యులు తమ ఆప్తుల్ని కలుసుకుంటారు. అదే నాబోతుకు, అతని కొడుకులకు జరిగే పూర్తి న్యాయం. (యోబు 14:14, 15; యోహా. 5:28, 29) సత్యదేవుడు ‘గూఢమైన ప్రతి అంశం గూర్చి విమర్శ చేసేటప్పుడు ఆయన ప్రతీ క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెస్తాడని’ వినయంగల వ్యక్తి గుర్తిస్తాడు. (ప్రసం. 12:14) మనకు తెలియని విషయాల్ని కూడా యెహోవా పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి యెహోవా మీదున్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వినయం మనకు సహాయం చేస్తుంది.

10, 11. (ఎ) ఎలాంటి సందర్భాలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి? (బి) వినయం మనల్ని ఏయే విధాలుగా కాపాడుతుంది?

10 సంఘపెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారని అనుకోండి. అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికిగల కారణాలు మీకు అర్థంకాలేదు లేదా వాళ్లు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చలేదు. అప్పుడు మీరేమి చేస్తారు? ఉదాహరణకు, మీరు లేదా మీకిష్టమైన వాళ్లు సంఘంలో ఒక సేవావకాశాన్ని పోగొట్టుకుంటే మీరేమి చేస్తారు? లేదా మీ వివాహ భాగస్వామినో, కొడుకునో, కూతురినో, లేదా సన్నిహిత స్నేహితుడినో బహిష్కరించడం మీకు నచ్చకపోతే? తప్పు చేసిన వ్యక్తిపై కనికరపడడం సంఘపెద్దలు చేసిన పొరపాటని మీకు అనిపిస్తే? ఇలాంటి సందర్భాలన్నీ యెహోవాపై మనకున్న విశ్వాసాన్ని, ఆయన నేడు మన సంఘాల్ని నడిపిస్తున్న విధానంపై నమ్మకాన్ని పరీక్షిస్తాయి. ఒకవేళ మీకే ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైతే వినయం ఎలా సహాయం చేస్తుంది? అది సహాయం చేసే రెండు విధానాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

సంఘం విషయంలో పెద్దలు తీసుకున్న ఓ నిర్ణయాన్ని విని అభ్యంతరపడిన ఒక సహోదరుడు

సంఘపెద్దలు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చకపోతే ఏమి చేస్తారు? (10, 11 పేరాలు చూడండి)

11 మొదటిగా, మనకు నిజానిజాలు పూర్తిగా తెలియవని గుర్తించడానికి వినయం సహాయం చేస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి గురించి అన్నీ విషయాలు తెలుసని మనకు అనిపించినా, నిజానికి ఆ వ్యక్తి హృదయంలో ఏముందో యెహోవాకు మాత్రమే తెలుసు. (1 సమూ. 16:7) ఇవి మనం గుర్తుంచుకుంటే, మనకు పరిమితులు ఉన్నాయనీ, మన ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఉందనీ వినయంగా గుర్తిస్తాం. రెండవదిగా, ఎవరికైనా అన్యాయం జరిగినట్లు మనకు అనిపించినా లేదా మనకే అన్యాయం జరిగినా దేవునికి లోబడుతూ, ఓపిగ్గా ఉంటూ, ఆయన పరిస్థితిని చక్కదిద్దేవరకు వేచిచూడడానికి వినయం సహాయం చేస్తుంది. బైబిలు ఇలా చెప్తోంది, ‘దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు, భక్తిహీనులకు క్షేమము కలుగదు, వాళ్లు దీర్ఘాయువును పొందరు.’ (ప్రసం. 8:12, 13) వినయంగా ఉంటే, మనకే కాదు మనం ఆలోచిస్తున్న విషయంతో సంబంధమున్న ప్రతీఒక్కరికి ప్రయోజనం కలుగుతుంది.—1 పేతురు 5:5 చదవండి.

సంఘంలో వేషధారణ పొడచూపిన సందర్భం

12. ఇప్పుడు మనమేమి పరిశీలిస్తాం? ఎందుకు?

12 మొదటి శతాబ్దంలో సిరియాలోని అంతియొకయలో ఉన్న క్రైస్తవుల విశ్వాసానికి, క్షమాగుణానికి పరీక్ష ఎదురైంది. అసలు అప్పుడేమి జరిగిందో తెలుసుకుని, మనకు క్షమించే గుణం ఉందో లేదో పరిశీలించుకుందాం. అంతేకాదు యెహోవా తన న్యాయప్రమాణాల విషయంలో రాజీపడకుండానే తప్పుచేసిన వాళ్లను ఎలా క్షమించగలుగుతున్నాడో అర్థంచేసుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది.

13, 14. అపొస్తలుడైన పేతురు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాడు? ఆయన ధైర్యవంతుడని ఎలా చెప్పవచ్చు?

13 సంఘపెద్దగా సేవచేస్తున్న అపొస్తలుడైన పేతురు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు సుపరిచితుడు. అతను యేసుకు దగ్గరి స్నేహితుడు, యేసు అతనికి ఎన్నో ముఖ్యమైన బాధ్యతలు కూడా అప్పగించాడు. (మత్త. 16:19) ఉదాహరణకు, సా.శ. 36లో కొర్నేలికి, అతని ఇంట్లో ఉన్నవాళ్లందరికీ మంచివార్త ప్రకటించే బాధ్యత పేతురుకే ఇవ్వబడింది. ఆ బాధ్యత ఎందుకు ప్రత్యేకమైనది? ఎందుకంటే కొర్నేలి యూదుడు కాదు, అతను సున్నతి పొందని అన్యుడు. కొర్నేలి అలాగే అతని ఇంట్లో ఉన్నవాళ్లందరూ పవిత్రశక్తిని పొందడం చూసి, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వవచ్చని పేతురు గుర్తించాడు. పేతురు ఇలా అన్నాడు, “వీళ్లు మనలాగే పవిత్రశక్తిని పొందారు కాబట్టి వీళ్లు నీళ్లలో బాప్తిస్మం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా?”—అపొ. 10:47.

14 సా.శ. 49లో, క్రైస్తవులుగా మారిన అన్యులు సున్నతి పొందాలా వద్దా అని నిర్ణయించడానికి అపొస్తలులు, పెద్దలు యెరూషలేములో కలుసుకున్నారు. ఆ సందర్భంలో పేతురు ఎంతో ధైర్యంగా, సున్నతి పొందని అన్యులు పవిత్రశక్తి పొందడాన్ని తాను కళ్లారా చూశానని చెప్పాడు. పరిపాలక సభ నిర్ణయం తీసుకోవడానికి పేతురు అనుభవమే సహాయం చేసింది. (అపొ. 15:6-11, 13, 14, 28, 29) జరిగినదాన్ని పేతురు ఎంతో ధైర్యంగా చెప్పినందుకు యూదులు, క్రైస్తవులుగా మారిన అన్యులు అతనికి కృతజ్ఞతలు చెప్పివుంటారు. అంతేకాదు పేతురు నమ్మకస్థుడు, పరిణతిగల వ్యక్తి కాబట్టి అతన్ని నమ్మడం ఆ కాలంలోని క్రైస్తవులకు సులభమై ఉంటుంది.—హెబ్రీ. 13:7.

15. సిరియాలోని అంతియొకయలో ఉన్నప్పుడు పేతురు ఏ తప్పు చేశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

15 నిర్ణయం తీసుకోవడానికి యెరూషలేములో కలుసుకున్న తర్వాత పేతురు సిరియాలోని అంతియొకయకు వెళ్లాడు. అక్కడ ఉన్నప్పుడు అతను అన్యులైన సహోదరులతో సమయం గడిపాడు. పేతురుకున్న జ్ఞానం, అనుభవం నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవడం వాళ్లకు ఎంత నచ్చివుంటుందో కదా! కానీ హఠాత్తుగా పేతురు వాళ్లతో కలిసి భోంచేయడం మానేసినప్పుడు ఆ సహోదరులు ఆశ్చర్యపోయివుంటారు, బహుశా బాధపడివుంటారు కూడా. అతను దూరంగా ఉండడమే కాకుండా బర్నబాను, అలాగే ఇతర యూదులను కూడా వాళ్లకు దూరంగా ఉండమని చెప్పాడు. అతను చేసిన పనివల్ల సంఘం విడిపోయి ఉండేది. కానీ పరిణతిగల ఈ సంఘపెద్ద ఎందుకు అంత పెద్ద తప్పు చేశాడు? అంతకన్నా ముఖ్యంగా పేతురు చేసిన తప్పు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఒక సంఘపెద్ద మాటలు లేదా పనులు వల్ల మనకు బాధ కలిగినప్పుడు ఆ పాఠం మనకెలా సహాయం చేస్తుంది?

16. పేతురు ఏవిధంగా సరిదిద్దబడ్డాడు? ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి?

16 గలతీయులు 2:11-14 చదవండి. పేతురు మనుషులకు భయపడ్డాడు. (సామె. 29:25) అన్యులను యెహోవా ఎలా చూస్తున్నాడో అపొస్తలుడైన పేతురుకు తెలుసు. అయినాసరే, క్రైస్తవులుగా మారిన అన్యులతో కలిసివుంటే, యెరూషలేము నుండి వస్తున్న క్రైస్తవులు తనను చిన్నచూపు చూస్తారేమోనని పేతురు భయపడ్డాడు. అపొస్తలుడైన పౌలు పేతురుతో వేషధారణ చూపించవద్దని చెప్పాడు. ఎందుకు? ఎందుకంటే, సా.శ. 49లో యెరూషలేములో కలుసుకున్నప్పుడు పేతురు అన్యులకు మద్దతిస్తూ మాట్లాడడం పౌలు చూశాడు. (అపొ. 15:12; గల. 2:13, అధస్సూచి) పేతురు ప్రవర్తన వల్ల బాధపడిన ఆ క్రైస్తవులు ఏమి చేశారు? నొచ్చుకుని యెహోవాను ఆరాధించడం మానేశారా? తన ప్రవర్తననుబట్టి పేతురు సంఘ బాధ్యతలు కోల్పోయాడా?

క్షమిస్తూ ఉండండి

17. యెహోవా క్షమించడం వల్ల పేతురు ఎలా ప్రయోజనం పొందాడు?

17 పౌలు ఇచ్చిన సలహాను వినయంగా పాటించి పేతురు తన ఆలోచనాతీరును మార్చుకున్నాడు. అయితే పేతురును బాధ్యతల్లో నుండి తీసేసినట్లు బైబిల్లో లేదు. నిజానికి, అది జరిగిన కొంతకాలానికి దేవుని పవిత్రశక్తి సహాయంతో పేతురు రెండు పత్రికల్ని రాశాడు. ఇప్పుడు అవి బైబిల్లో ఉన్నాయి. అతను తన రెండవ పత్రికలో, పౌలును “ప్రియ సోదరుడు” అని కూడా పిలిచాడు. (2 పేతు. 3:15) పేతురు చేసిన పొరపాటువల్ల క్రైస్తవులుగా మారిన అన్యులు బాధపడివుంటారు. అయినాసరే, సంఘానికి శిరస్సైన యేసు అతనిని ఉపయోగించుకుంటూనే వచ్చాడు. (ఎఫె. 1:22) పేతురును క్షమించడం ద్వారా యేసును, ఆయన తండ్రిని అనుకరించే అవకాశం ఆ తొలి క్రైస్తవులకు దొరికింది. అపరిపూర్ణుడైన ఒక వ్యక్తి పొరపాటు వల్ల వాళ్లలో ఎవ్వరూ యెహోవాకు దూరంకాలేదు.

18. మనం ఎలాంటి సందర్భాల్లో యెహోవా న్యాయ ప్రమాణాల్ని అనుకరించాల్సి రావచ్చు?

18 మొదటి శతాబ్దంలోని సంఘపెద్దలు ఎవ్వరూ పరిపూర్ణులు కారు. మనకాలంలో కూడా క్రైస్తవ సంఘాల్లోని పెద్దలు పరిపూర్ణులు కారు. బైబిలు ఇలా చెప్తోంది, “మనమందరం ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం.” (యాకో. 3:2, అధస్సూచి) ఈ మాట నిజమని మనందరికీ తెలుసు. కానీ ఎవరైనా మన విషయంలో పొరపాటు చేస్తే మనమెలా స్పందిస్తామనేదే అసలు ప్రశ్న? యెహోవాలా మనం కూడా న్యాయంగా ప్రవర్తిస్తామా? ఉదాహరణకు, ఒక సంఘపెద్ద పక్షపాతం చూపిస్తున్నట్లు మాట్లాడితే మీరేమి చేస్తారు? ఒక సంఘపెద్ద ముందూవెనకా ఆలోచించకుండా ఒక మాట అనడం వల్ల మీకు బాధనిపిస్తే యెహోవాకు దూరమౌతారా? లేదా, అసలు ఆ సహోదరుడు సంఘపెద్దగా ఉండడానికి సరిపోడని అనుకునే బదులు, సంఘానికి శిరస్సైన యేసు పరిస్థితిని చక్కబెట్టేవరకు ఓపిగ్గా ఎదురుచూస్తారా? ఆ సంఘపెద్ద చేసిన తప్పు గురించే ఆలోచిస్తూ ఉండకుండా, అతను ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా సేవచేస్తున్నాడనే విషయంపై మనసుపెడతారా? మిమ్మల్ని బాధపెట్టిన సహోదరుడు సంఘపెద్దగా కొనసాగుతూనే ఉంటే, లేదా ఎక్కువ నియామకాల్ని పొందుతూ ఉంటే మీరు సంతోషిస్తారా? ఒకవేళ మీరు ఆ సహోదరుడిని క్షమిస్తే, మీరు యెహోవాను అనుకరిస్తూ న్యాయంగా ప్రవర్తిస్తున్నారని చూపిస్తారు.—మత్తయి 6:14, 15 చదవండి.

19. మనం ఏమి చేయాలని నిర్ణయించుకోవాలి?

19 మనం న్యాయాన్ని ప్రేమిస్తాం. కాబట్టి సాతాను, అతని దుష్టలోకం చేసిన అన్యాయాలన్నిటికీ యెహోవా ముగింపు పలికే రోజు కోసం మనం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నాం. (యెష. 65:17) ఈలోపు మనకు అన్యాయం జరిగే సందర్భాలు ఎదురౌతుంటాయి. అలా జరిగినప్పుడు, వినయంగా ఉంటూ నిజానిజాలు మనకు పూర్తిగా తెలియవని గుర్తించాలి. అంతేకాదు మనల్ని బాధపెట్టినవాళ్లను మనస్ఫూర్తిగా క్షమించాలి. అలాచేస్తే మనం యెహోవా న్యాయ ప్రమాణాల్ని పాటించిన వాళ్లమౌతాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి