వాళ్లలా విశ్వాసం చూపించండి
అన్యాయాన్ని తట్టుకొని నిలబడ్డాడు
ఏలీయా యొర్దాను లోయ వెంబడి నడుస్తున్నాడు. అతను హోరేబు కొండ నుండి బయల్దేరి కొన్ని వారాలుగా అలా ప్రయాణిస్తున్నాడు. ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు దేశానికి అతను వెళ్లాలనుకుంటున్నాడు. చివరికి సొంతూరుకు చేరుకున్నాడు, అక్కడ పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అనావృష్టి వల్ల ఏర్పడిన సమస్యలు మెల్లగా తొలగిపోతున్నాయి. వర్షాకాలం జల్లులు పడుతున్నాయి, రైతులు పొలాలు దున్నుతున్నారు. అదంతా చూసి ప్రవక్త మనసుకు ఎంతో హాయిగా అనిపించి ఉంటుంది, కానీ ఆయన తపనంతా ప్రజల గురించే. వాళ్లు యెహోవాను సరైన విధంగా ఆరాధించడం లేదు. చాలామంది ఇప్పటికీ బయలును ఆరాధిస్తున్నారు, ఏలీయా చేయాల్సిన పని ఎంతో ఉంది.a
ఆబేల్మెహోలా పట్టణం దగ్గర ప్రజలు పొలం దున్నడం ఏలీయా చూశాడు. 12 జతలుగా 24 ఎద్దులతో తడి నేలను దున్నుతున్నారు. ఏలీయా వెతుకుతున్న వ్యక్తి, చివర్లో ఉన్న 12వ జత ఎద్దులతో పాటు ఉన్నాడు. ఆయనే ఎలీషా. ఏలీయా చేసే పనిని కొనసాగించడానికి యెహోవా ఆయన్ని ఎంపిక చేసుకున్నాడు. అంతకుముందు ఏలీయా యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్లలో తాను ఒక్కడే మిగిలానని అనుకున్నాడు, కాబట్టి ఎలీషాను కలవడానికి ఆయన ఉవ్విళ్లూరి ఉంటాడు.—1 రాజులు 18:22; 19:14-19.
ఎలీషా ఏదోకరోజు తన స్థానంలోకి వస్తాడని ఏలీయాకు తెలుసు. కాబట్టి, ఆయన తనకున్న కొన్ని బాధ్యతల్ని ఎలీషాకు అప్పగించాలన్నా, లేదా ఎలీషాతో కలిసి యెహోవా ఇచ్చిన నియామకం చేయాలన్నా ఏలీయా వెనకాడి ఉంటాడా? ఏమో మనకు తెలీదు, అలాగని ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు రాలేదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆయన కూడా, “మనలాంటి భావాలు ఉన్న మనిషే.” (యాకోబు 5:17) ఏదేమైనా బైబిలు ఇలా చెప్తుంది: “ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన అధికారిక వస్త్రాన్ని అతని మీద వేశాడు.” (1 రాజులు 19:19) ఆ అధికారిక వస్త్రం గొర్రె తోలుతో లేదా మేక తోలుతో చేసింది అయ్యుండవచ్చు. అది యెహోవా ఆయనకు ఇచ్చిన ప్రత్యేకమైన నియామకాన్ని సూచిస్తుంది. దాన్ని ఆయన ఒక కోటులా వేసుకొని ఉంటాడు. దాన్ని ఎలీషా భుజాల మీద వేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఏలీయా తన తర్వాతి ప్రవక్తగా ఎలీషాను నియమించాడు. ఏలీయా తన దేవున్ని నమ్మాడు, ఆయనకు లోబడ్డాడు.
ఏలీయా వినయంతో తన తర్వాతి ప్రవక్తగా ఎలీషాను నియమించాడు
ఎలీషా ఏలీయా కన్నా చిన్నవాడు, కాబట్టి వయసులో పెద్దవాడైన ప్రవక్తకు సహాయం చేయాలనుకున్నాడు. ఆయన వెంటనే ఏలీయా స్థానంలోకి వచ్చేయలేదు. బదులుగా, దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధుడైన ఏలీయా ప్రవక్తతో ఉంటూ వినయంగా ఆయనకు సహాయం చేశాడు. అందుకే ఆ తర్వాత, ఎలీషా “ఏలీయా చేతుల మీద నీళ్లు పోసేవాడు” అని పిలవబడ్డాడు. (2 రాజులు 3:11) అంత సమర్థుడు, మంచి సహాయకుడు ఉండడం ఏలీయాకు ఎంత ఊరటను ఇచ్చి ఉంటుందో కదా! వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అయ్యుంటారు. బహుశా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వల్లే వాళ్లు దేశంలో పెచ్చుపెరిగిన అన్యాయాల మధ్య కూడా యెహోవాకు నమ్మకంగా సేవ చేయగలిగారు. ముఖ్యంగా రాజైన అహాబు దుష్టత్వానికి అంతూపంతూ లేకుండా పోతోంది.
మీకు ఎప్పుడైనా అన్యాయం ఎదురైందా? అవినీతి నిండిన ఈ లోకంలో చాలామందికి ఎదురౌతుంది. ఇలాంటి సమయంలో దేవున్ని ప్రేమించే ఫ్రెండ్ ఉంటే, యెహోవా సేవ చేస్తూ ఉండడానికి అతను మీకు సహాయం చేయవచ్చు. అన్యాయాన్ని సహించేటప్పుడు, ఏలీయా విశ్వాసం నుండి కూడా మీరు ఎంతో నేర్చుకోవచ్చు.
“నువ్వు లేచి … ఇశ్రాయేలు రాజైన అహాబును కలవడానికి వెళ్లు”
ప్రజల్ని మళ్లీ యెహోవాకు దగ్గర చేయడానికి ఏలీయా, ఎలీషా కష్టపడి పనిచేశారు. వాళ్లు ఇతర ప్రవక్తలకు శిక్షణ ఇచ్చారు. బహుశా అప్పట్లో, పాఠశాల విద్యార్థుల్లా ఆ ప్రవక్తలు ఒక చోట చేరి శిక్షణ తీసుకునేవాళ్లు. కొంతకాలానికి ఏలీయాకు యెహోవా కొత్త నియామకం ఇచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నువ్వు లేచి … ఇశ్రాయేలు రాజైన అహాబును కలవడానికి వెళ్లు.” (1 రాజులు 21:18) ఇంతకీ అహాబు ఏం చేశాడు?
అహాబు రాజు అప్పటికే ఒక మతభ్రష్టుడు, అప్పటివరకు పాలించిన ఇశ్రాయేలు రాజులందరిలో పరమ దుర్మార్గుడు. అతను యెజెబెలును పెళ్లిచేసుకుని బయలును ఆరాధించాడు, దేశ ప్రజల్ని కూడా బయలును ఆరాధించేలా ప్రోత్సహించాడు. (1 రాజులు 16:31-33) బయలు ఆరాధనలో సంతాన సాఫల్య పద్ధతులు, ఆచారబద్ధ వ్యభిచారం, చిన్నపిల్లల్ని బలి అర్పించడం కూడా ఉండేవి. అదీగాక, ఈమధ్యే అహాబు యెహోవా ఇచ్చిన ఒక ఆజ్ఞను మీరాడు, దుష్టుడైన సిరియా రాజు బెన్హదదును చంపకుండా వదిలేశాడు. బహుశా అతనిచ్చే సంపదలకు ఆశపడి అలా చేసివుంటాడు. (1 రాజులు 20వ అధ్యాయం) ఇక ఇప్పుడు అహాబు-యెజెబెలుల అత్యాశ, ఆస్తిపాస్తుల మీద మోజు, ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
అహాబుకు సమరయలో ఒక రాజభవనం ఉంది, అది చాలా పెద్దది! అక్కడికి దాదాపు 37 కి.మీ. దూరంలోని యెజ్రెయేలులో అతనికి ఇంకో రాజభవనం ఉంది. ఈ రెండో భవనం పక్కన ఒక ద్రాక్షతోట ఉంది. అది నాబోతు అనే అతనిది, అయితే అహాబు దురాశతో దాన్ని కావాలనుకున్నాడు. అందుకే నాబోతును పిలిపించి ఆ ద్రాక్షతోట తనకు ఇవ్వమన్నాడు. బదులుగా అతనికి డబ్బు గానీ ఇంకా మంచి ద్రాక్షతోట గానీ ఇస్తానని చెప్పాడు. కానీ నాబోతు ఇలా చెప్పాడు: “నా పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చినదాన్ని నీకు ఇవ్వడం నా ఊహకందని విషయం. ఎందుకంటే యెహోవా దాన్ని నిషేధించాడు.” (1 రాజులు 21:3) నాబోతు మొండివాడా? రాజంటే లెక్కలేదా? చాలామంది అలాగే అనుకున్నారు. కానీ నిజానికి ఆయన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. దాని ప్రకారం, ఇశ్రాయేలీయులు ఎప్పటికీ తమ కుటుంబ వారసత్వ ఆస్తిగా ఉండాల్సిన భూమిని శాశ్వతంగా అమ్మకూడదు. (లేవీయకాండం 25:23-28) నాబోతు వైపు నుండి చూస్తే, యెహోవా ధర్మశాస్త్రాన్ని మీరడం ఆయన ఊహకందని విషయం. ఆయనకు విశ్వాసం, ధైర్యం చాలా ఎక్కువని చెప్పాలి. ఎందుకంటే, అహాబుకు ఎదురు నిలవడం చాలా ప్రమాదకరమని ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.
కానీ అహాబు మాత్రం యెహోవా ధర్మశాస్త్రం గురించి రవ్వంత కూడా ఆలోచించలేదు. అతను తనకు కావాల్సింది దక్కలేదని “ముఖం మాడ్చుకుని, దిగాలుగా” ఇంటికి వెళ్లిపోయాడు. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అతను మంచం మీద పడుకొని ముఖం పక్కకు తిప్పుకున్నాడు, భోజనం కూడా వద్దన్నాడు.” (1 రాజులు 21:4) తన భర్త పిల్లవాడిలా అలగడం యెజెబెలు చూసినప్పుడు, వెంటనే ఒక కుట్ర పన్నింది. దానివల్ల అతనికి కావల్సింది అతనికి దక్కుతుంది, అదే సమయంలో నీతిగా జీవిస్తున్న ఒక కుటుంబం నాశనమౌతుంది.
ఆమె కుట్ర గురించి చదివినప్పుడు, ఆమె దుష్టత్వాన్ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఒక ఆరోపణ నిజమని నిరూపించడానికి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు సాక్షులు ఉండాలని యెజెబెలు రాణికి తెలుసు. (ద్వితీయోపదేశకాండం 19:15) కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తరాలు రాసి, నాబోతు దైవదూషణ చేశాడని తప్పుడు ఆరోపణ చేసేలా ఇద్దరు మనుషుల్ని పెట్టమని యెజ్రెయేలులో ఉన్న ప్రముఖులకు చెప్పింది. ఆ తప్పుకు ఖచ్చితంగా మరణశిక్ష పడుతుంది. ఆమె పథకం బాగా పనిచేసింది. ఇద్దరు “పనికిమాలినవాళ్లు” నాబోతు గురించి తప్పుడు సాక్ష్యం చెప్పారు, దాంతో ఆయన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఆయనతోపాటు ఆయన కొడుకుల్ని కూడా చంపేశారు!b (1 రాజులు 21:5-14; లేవీయకాండం 24:16; 2 రాజులు 9:26) నిజానికి అహాబు ఒక భర్తగా తన శిరసత్వాన్ని పక్కనపెట్టేశాడు; ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి అమాయకుల్ని చంపుకుంటూ పొమ్మని భార్యను వదిలేశాడు.
రాజు-రాణి చేసిన దాని గురించి యెహోవా ఏలీయాకు చెప్పినప్పుడు ఏలీయాకు ఎలా అనిపించి ఉంటుందో కదా! దుష్టులు అమాయకుల్ని కాళ్ల కింద అణగదొక్కడం చూస్తే చాలా బాధేస్తుంది. (కీర్తన 73:3-5, 12, 13) ఈ రోజుల్లో మనం ఘోరమైన అన్యాయాలు జరగడం తరచూ చూస్తున్నాం. దేవుని ప్రతినిధులం అని చెప్పుకునే కొంతమంది పలుకుబడి గలవాళ్లు కూడా కొన్నిసార్లు అలా చేస్తుంటారు. కాబట్టి ఈ వృత్తాంతం మనకు కాస్త ఊరటనిస్తుంది. యెహోవాకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. ఆయన అన్నీ చూస్తాడు. (హెబ్రీయులు 4:13) మరి చెడ్డ పనులు జరగడం చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు?
“నా శత్రువా, నేను నీ చేతికి చిక్కానా!”
యెహోవా ఏలీయాను అహాబు దగ్గరికి పంపించాడు. “అతను నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు” అని యెహోవా ఏలీయాతో చెప్పాడు. (1 రాజులు 21:18) ఇక ద్రాక్షతోట తనదే అని యెజెబెలు అహాబుతో చెప్పినప్పుడు, అతను వెంటనే లేచి కొత్తగా సొంతమైన తోటను చూడడానికి వెళ్లాడు. ఇదంతా యెహోవా గమనిస్తున్నాడని అతనికి కనీసం తట్టను కూడా తట్టలేదు. ఆ ద్రాక్షతోటలో నడుస్తూ, దాన్ని అందమైన తోటలా మార్చాలని కలలు కంటూ అతను ఎంతో సంబరపడిపోయి ఉంటాడు. ఇంతలోనే ఏలీయా అతని కళ్లముందుకొచ్చి నిలబడ్డాడు! అప్పటిదాకా సంతోషంతో వెలిగిపోయిన అహాబు ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. అతను కోపంతో రగిలిపోతూ ఏలీయాతో ఇలా అన్నాడు: “నా శత్రువా, నేను నీ చేతికి చిక్కానా!”—1 రాజులు 21:20.
“నా శత్రువా, నేను నీ చేతికి చిక్కానా!”
అహాబు మాటల్లో రెండు తప్పులు ఉన్నాయి. ఒకటి, ఏలీయాతో “నీ చేతికి చిక్కానా” అని అనడం ద్వారా అతను యెహోవాను మర్చిపోయాడని చూపించాడు. ఎందుకంటే, అతను ఎప్పుడో యెహోవా ‘చేతికి చిక్కాడు.’ తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి యెజెబెలు కుట్ర వల్ల వచ్చిన తోటను ఆస్వాదించడం యెహోవా ఎప్పుడో చూశాడు. అహాబు హృదయంలో కరుణ, న్యాయం, కనికరం కన్నా వస్తుసంపదల కోసం ఆరాటమే ఎక్కువగా ఉందని యెహోవా గమనించాడు. రెండు, ఏలీయాతో “నా శత్రువా” అని అనడం ద్వారా అతను యెహోవా దేవునికి స్నేహితుడూ, తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టడానికి తనకు సహాయం చేయగలవాడూ అయిన ఏలీయాపై ద్వేషాన్ని వెళ్లగక్కాడు.
అహాబు మూర్ఖత్వం నుండి మనం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. యెహోవా ప్రతీది గమనిస్తున్నాడని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా తప్పటడుగు వేస్తే అది ఆయనకు తెలుస్తుంది, మన పద్ధతి మార్చుకోవాలని ఒక ప్రేమగల తండ్రిలా ఆయన ఎంతో కోరుకుంటాడు. మనకు సహాయం చేయడానికి ఆయన తరచూ తన స్నేహితుల్ని అంటే నమ్మకమైన సేవకుల్ని ఉపయోగించుకుంటాడు. మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అర్థంచేసుకోవడానికి ఏలీయాలా వాళ్లు మనకు సహాయం చేస్తారు. దేవుని స్నేహితుల్ని మన శత్రువుల్లా చూడడం ఎంత తప్పో కదా!—కీర్తన 141:5.
ఏలీయా అహాబుతో, “అవును, నువ్వు నా చేతికి చిక్కావు” అని అనడం ఊహించుకోండి. అహాబు ఒక దొంగ, హంతకుడు, యెహోవా దేవునికి విరోధి అని ఏలీయాకు తెలిసిపోయింది. అలాంటి చెడ్డ వ్యక్తితో మాట్లాడాలంటే ఏలీయాకు ఎంత ధైర్యం కావాలో కదా! దేవుడు అహాబుకు విధించిన శిక్ష గురించి కూడా ఏలీయా చెప్పాడు. యెహోవా జరుగుతున్నదంతా చూశాడు, అహాబు కుటుంబం చెడు ప్రభావం ప్రజల మీద కూడా పడుతోంది. అందుకే యెహోవా అహాబు కుటుంబంలోని ప్రతీ మగవాణ్ణి ‘పూర్తిగా నాశనం చేయాలని’ నిర్ణయించుకున్నాడని ఏలీయా చెప్పాడు. యెజెబెలుకు కూడా శిక్ష తప్పదు.—1 రాజులు 21:20-26.
ప్రజలు తప్పు చేసి శిక్ష తప్పించుకోవచ్చని ఏలీయా అనుకోలేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది చెడ్డవాళ్లు అలా అనుకుంటారు. ఈ బైబిలు కథ, ప్రజలు ఏం చేస్తున్నారో యెహోవా దేవుడు చూస్తున్నాడని, తనదైన సమయంలో చెడ్డవాళ్లను శిక్షిస్తాడని మనకు గుర్తుచేస్తుంది. అన్యాయాలన్నిటికీ ఆయన శాశ్వతంగా ముగింపు చుక్క పెట్టే ఒక రోజు వస్తుందని బైబిలు హామీ ఇస్తుంది! (కీర్తన 37:10, 11) ‘దేవుని తీర్పుల్లో శిక్షించడం మాత్రమే ఉంటుందా? అందులో కరుణకు కూడా చోటు ఉందా?’ అని మీకు అనిపించవచ్చు.
“అహాబు … తనను తాను ఎలా తగ్గించుకున్నాడో చూశావా?”
యెహోవా తీర్పును వినగానే అహాబు స్పందించిన తీరు చూసి ఏలీయా ఆశ్చర్యపోయి ఉంటాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఆ మాటలు వినగానే అహాబు బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకున్నాడు; అతను ఉపవాసం ఉంటూ, గోనెపట్టతోనే పడుకుంటూ, బాధగా నడుస్తూ ఉన్నాడు.” (1 రాజులు 21:27) అంటే, తన ప్రవర్తన గురించి అహాబు బాధపడుతున్నాడా?
అతను తన ప్రవర్తన కొంతవరకు మార్చుకున్నాడని అర్థమౌతుంది. అతను తననుతాను కాస్త తగ్గించుకున్నాడు. గర్వం, అహంకారంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తి అలా చేయడం కష్టమే. కానీ అది నిజమైన పశ్చాత్తాపమేనా? అతని కన్నా దుష్టుడైన మనష్షే రాజు గురించి ఒకసారి ఆలోచించండి. యెహోవా మనష్షేను శిక్షించినప్పుడు అతను తననుతాను తగ్గించుకున్నాడు, సహాయం చేయమని యెహోవాను వేడుకున్నాడు. కానీ అంతటితో ఆగిపోలేదు. తన నడవడి మార్చుకున్నాడు, తాను నిలబెట్టిన విగ్రహాల్ని తొలగించాడు, యెహోవా సేవ చేయడానికి ప్రయత్నించాడు, తన రాజ్యంలోని ప్రజల్ని కూడా అలాగే చేయమని ప్రోత్సహించాడు. (2 దినవృత్తాంతాలు 33:1-17) అలాంటి పనులు ఏవైనా అహాబు చేశాడా? విచారకరంగా, అలాంటివేవీ అతను చేయలేదు.
జరిగిన దాని గురించి బాధపడుతున్నానని చూపించడానికి అహాబు చేసిన పనిని యెహోవా గమనించాడా? యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: “అహాబు నా ఎదుట తనను తాను ఎలా తగ్గించుకున్నాడో చూశావా? అతను నా ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, నేను ఆ విపత్తును అతని జీవితకాలంలో తీసుకురాను. అతని కుమారుని రోజుల్లో అహాబు ఇంటి మీదికి విపత్తు తీసుకొస్తాను.” (1 రాజులు 21:29) అంటే యెహోవా అహాబును క్షమిస్తున్నాడా? లేదు, నిజమైన పశ్చాత్తాపం చూపించిన వాళ్లమీదే యెహోవా కరుణ చూపిస్తాడు. (యెహెజ్కేలు 33:14-16) అహాబు కొంచెం పశ్చాత్తాపం చూపించాడు కాబట్టి, యెహోవా కూడా కొంచెం కరుణ చూపిస్తున్నాడు. తన కుటుంబం అంతా నాశనమవ్వడం చూసే బాధ నుండి యెహోవా అహాబును తప్పించాడు.
యెహోవా తీర్పు మాత్రం మారలేదు. ఆ తర్వాత యెహోవా, అహాబు చనిపోవడానికి దారితీసే యుద్ధంలో అతను పాల్గొనాలంటే ఏం చేస్తే బాగుంటుందని తన దేవదూతలతో చర్చించాడు. ఆ వెంటనే, యెహోవా అహాబుకు వేసిన శిక్ష అతని మీదికి వచ్చింది. యుద్ధంలో గాయపడిన అహాబు తన రథంలోనే చనిపోయాడు. ఆ విషాద సంఘటన గురించి బైబిలు ఇలా చెప్తుంది: రాజుకు చెందిన రథాన్ని కడిగినప్పుడు, అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. అప్పుడు ప్రజలు, ఏలీయా అహాబుతో చెప్పిన యెహోవా మాటలు నెరవేరాయని అర్థంచేసుకున్నారు. “కుక్కలు ఏ స్థలంలో నాబోతు రక్తాన్ని నాకాయో, అదే స్థలంలో అవి నీ రక్తాన్ని నాకుతాయి” అని యెహోవా చెప్పాడు.—1 రాజులు 21:19; 22:19-22, 34-38.
అహాబుకు జరిగింది యెహోవా నాబోతు ధైర్యాన్ని, విశ్వాసాన్ని మర్చిపోలేదని ఏలీయాకు, ఎలీషాకు, ఇతర నమ్మకమైన దేవుని ప్రజలకు గుర్తుచేసింది. న్యాయవంతుడైన దేవుడు చెడ్డవాళ్లను ఏదోక సమయంలో ఖచ్చితంగా శిక్షిస్తాడు, అలాగే సరైన కారణం ఉన్నప్పుడు కరుణ కూడా చూపిస్తాడు. (సంఖ్యాకాండం 14:18) ఆ దుష్టరాజు పరిపాలన కింద దశాబ్దాల పాటు సహనం చూపించిన ఏలీయాకు అది ఎంత శక్తివంతమైన పాఠమో కదా! మీరెప్పుడైనా అన్యాయానికి గురయ్యారా? దేవుడు న్యాయం చేస్తే చూడాలని తపిస్తున్నారా? అలాగైతే, మీరు ఏలీయాలా విశ్వాసం చూపించండి. ఆయన తన నమ్మకమైన స్నేహితుడు ఎలీషాతో పాటు అన్యాయాన్ని సహిస్తూ, దేవుని సందేశాల్ని ప్రకటించాడు.
a మూడున్నర సంవత్సరాల అనావృష్టితో యెహోవా బయలుకు శక్తిలేదని బట్టబయలు చేశాడు. బయలు వర్షాన్ని, నేలకు సారాన్ని తెస్తాడని ప్రజలు అతడిని ఆరాధించేవాళ్లు. (1 రాజులు 18వ అధ్యాయం) 2008, జనవరి 1 అలాగే ఏప్రిల్ 1 కావలికోట (ఇంగ్లీష్) పత్రికల్లో వచ్చిన “వాళ్లలా విశ్వాసం చూపించండి” ఆర్టికల్స్ చూడండి.
b బహుశా నాబోతు తర్వాత ఆయన వారసులకు ద్రాక్షతోట వస్తుందని భయపడి యెజెబెలు నాబోతు కొడుకుల్ని కూడా చంపించడానికి పథకం వేసివుండొచ్చు. అలాంటి అన్యాయాల్ని దేవుడు ఎందుకు ఆపడం లేదనే దాని గురించి తెలుసుకోవడానికి, 2014 ఏప్రిల్ - జూన్ కావలికోట పత్రికలోని “మా పాఠకుల ప్రశ్న” చూడండి.