‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు’ ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు
“ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు.”—ద్వితీ. 32:4.
1. యెహోవా న్యాయం తప్పడనే నమ్మకం తనకు ఉందని అబ్రాహాము ఎలా చూపించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?’ అని నమ్మకమైన అబ్రాహాము అడిగాడు. (ఆది. 18:25, NW) అది సందేహంతో అడిగిన ప్రశ్న కాదు. బదులుగా ఆ ప్రశ్న అడగడం ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో యెహోవా సరైన తీర్పు తీరుస్తాడనే నమ్మకాన్ని అబ్రాహాము వ్యక్తం చేశాడు. యెహోవా ‘దుష్టునితో పాటు నీతిమంతున్ని చంపడనే’ పూర్తి నమ్మకం అబ్రాహాముకు ఉంది. కొంతకాలానికి, యెహోవా తన గురించి తాను ఇలా చెప్పాడు, ‘ఆయన ఆశ్రయదుర్గం, ఆయన కార్యం సంపూర్ణమైనది, ఎందుకంటే ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మకస్థుడైన దేవుడు, ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు; ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు.’—ద్వితీ. 31:19; 32:4, NW.
2. యెహోవా అన్యాయం చేయడం అసాధ్యమని ఎందుకు చెప్పవచ్చు?
2 యెహోవా ఎప్పుడూ న్యాయం తప్పడని అబ్రాహాము ఎందుకు నమ్మాడు? ఎందుకంటే నీతిగా, న్యాయంగా ప్రవర్తించే విషయంలో యెహోవాయే అత్యుత్తమ ఆదర్శం. నిజానికి “నీతి,” “న్యాయము” అనే పదాల్ని హీబ్రూ లేఖనాల్లో ఎక్కువగా కలిపి వాడారు. ఎందుకంటే ఆ రెండు పదాలు ఒకేలాంటి అర్థాన్ని ఇస్తాయి. యెహోవా ప్రమాణాలు ఎల్లప్పుడూ సరైనవే కాబట్టి, ఆయన తీర్పులు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాయి. అందుకే బైబిలు ఇలా చెప్తుంది, “ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు.”—కీర్త. 33:5.
3. నేడున్న లోకంలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక ఉదాహరణ చెప్పండి.
3 నేడు ఈ లోకమంతా అన్యాయంతో నిండిపోయింది. అయితే, యెహోవా మాత్రం ఎల్లప్పుడూ న్యాయమే చేస్తాడని తెలుసుకోవడం వల్ల మంచి మనసున్నవాళ్లు ఓదార్పు పొందవచ్చు. ఉదాహరణకు, చేయని నేరానికి కొంతమందికి అన్యాయంగా జైలు శిక్ష విధించారు. అయితే ఆధునిక టెక్నాలజీ సహాయంతో దర్యాప్తు చేసిన తర్వాతే వాళ్లు నిర్దోషులనే విషయం తేలింది. కానీ అప్పటికే వాళ్లు ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిపోయారు. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు ఎంతో బాధ, కోపం కలుగుతాయి. అయితే, భరించడానికి ఇంతకంటే కష్టంగా ఉండే మరో రకమైన అన్యాయం కూడా ఉంది. అదేమిటి?
క్రైస్తవ సంఘంలో అన్యాయం
4. ఒక క్రైస్తవుని విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు ఎదురౌతుంది?
4 లోకంలో తమకు ఏదోక విధంగా అన్యాయం జరుగుతుందని క్రైస్తవులకు తెలుసు. కానీ, క్రైస్తవ సంఘంలో ఎవరికైనా అన్యాయం జరిగిందని మనకు తెలిసినప్పుడు లేదా మనకే అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు మన విశ్వాసానికి పరీక్ష ఎదురౌతుంది. అలాంటప్పుడు మీరెలా స్పందిస్తారు? దానివల్ల మీరు అభ్యంతరపడతారా?
5. క్రైస్తవ సంఘంలో ఎవరికైనా లేదా మనకే అన్యాయం జరిగితే మనమెందుకు ఆశ్చర్యపోము?
5 మనందరం అపరిపూర్ణులం కాబట్టి, పొరపాట్లు చేస్తుంటాం. అందుకే సంఘంలో ఎవరో ఒకరి వల్ల మనకు అన్యాయం జరగవచ్చు లేదా మనవల్ల వేరొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉండవచ్చు. (1 యోహా. 1:8) ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ అన్యాయం జరిగినప్పటికీ నమ్మకమైన క్రైస్తవులు ఆశ్చర్యపోరు లేదా అభ్యంతరపడరు. ఒక సహోదరుడు లేదా సహోదరి వల్ల మనకు అన్యాయం జరిగినా నమ్మకంగా ఉండడానికి సహాయం చేసే చక్కని సలహాల్ని యెహోవా బైబిల్లో ఉంచాడు.—కీర్త. 55:12-14.
6, 7. ఒక సహోదరునికి సంఘంలో ఎలాంటి అన్యాయం జరిగింది? దాన్ని సహించడానికి అతనికి ఏ లక్షణాలు సహాయం చేశాయి?
6 సహోదరుడైన విల్లీ డీల్ అనుభవాన్ని పరిశీలించండి. అతను 1931 నుండి స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఉన్న బెతెల్‌లో సేవచేశాడు. 1946లో అతను అమెరికాలోని, న్యూయార్క్‌లో గిలియడ్ పాఠశాల ఎనిమిదవ తరగతికి హాజరయ్యాడు. ఆ పాఠశాల పూర్తైన కొంతకాలానికి, అతన్ని స్విట్జర్లాండ్‌లో ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. అతను తన జీవిత కథలో ఇలా చెప్పాడు, “నేను పెళ్లి చేసుకుంటున్నానని 1949, మే నెలలో స్విట్జర్లాండ్‌లోని బ్రాంచికి చెప్పాను.” దానికి బెర్న్ బ్రాంచి కార్యాలయం, “క్రమ పయినీరుగా తప్ప ఇంకే సేవావకాశాలు నీకు ఉండవు” అని జవాబు ఇచ్చింది. సహోదరుడు డీల్ ఇలా వివరిస్తున్నాడు, “నన్ను ప్రసంగాలు ఇవ్వవద్దని చెప్పారు . . . చాలామంది మమ్మల్ని బహిష్కరించబడిన వ్యక్తుల్లా చూశారు, పలకరించడం కూడా మానేశారు.”
7 మరి సహోదరుడు డీల్ ఎలా స్పందించాడు? అతనిలా చెప్పాడు, “పెళ్లి చేసుకోవడం లేఖనాలకు విరుద్ధం కాదని మాకు తెలుసు. అందుకే మేము ప్రార్థన చేస్తూ భారమంతా యెహోవా మీద వేశాం, ఆయనపై నమ్మకం ఉంచాం.” పెళ్లి విషయంలో యెహోవా అభిప్రాయమేమిటో కొంతమంది సహోదరులు అర్థం చేసుకోలేకపోయారు. కానీ కొంతకాలానికి వాళ్లు తమ ఆలోచనను సరిచేసుకున్నారు. సహోదరుడు డీల్ మళ్లీ సేవావకాశాలు పొందాడు. అవును, నమ్మకంగా ఉన్నందుకు యెహోవా అతనికి ప్రతిఫలమిచ్చాడు.a ఇప్పుడు మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచిద్దాం, ‘నాకు కూడా అలాంటి అన్యాయమే జరిగితే, యెహోవా ఆ పరిస్థితిని చక్కదిద్దేవరకు ఓపిగ్గా ఉంటానా? లేదా నా సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ న్యాయం కోసం పోరాడతానా?’—సామె. 11:2; మీకా 7:7 చదవండి.
8. మనకు లేదా వేరేవాళ్లకు అన్యాయం జరిగిందని పొరబడే అవకాశం ఎందుకు ఉంది?
8 కొన్నిసార్లు మనం ఒక విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడంవల్ల కూడా మనకు లేదా మరొకరికి సంఘంలో అన్యాయం జరిగిందని అనిపించవచ్చు. ఎందుకు? మనం అపరిపూర్ణులం కాబట్టి పరిస్థితిని తప్పుగా అర్థంచేసుకొని ఉండవచ్చు. అంతేకాదు మనకు నిజానిజాలు పూర్తిగా తెలిసుండకపోవచ్చు. మనం సరిగ్గా అర్థంచేసుకున్నా, చేసుకోకపోయినా ఆ పరిస్థితి గురించి యెహోవాకు ప్రార్థించాలి, ఆయన మీద ఆధారపడాలి, నమ్మకంగా ఉండాలి. ఇలా చేసినప్పుడు, మనం ‘యెహోవామీద కోపించుకోకుండా’ ఉండగలుగుతాం.—సామెతలు 19:3 చదవండి.
9. ఈ ఆర్టికల్‌లో అలాగే తర్వాతి ఆర్టికల్‌లో మనం ఎవరెవరి గురించి పరిశీలిస్తాం?
9 బైబిలు కాలాల్లో, అన్యాయాన్ని ఎదుర్కొన్న ముగ్గురు యెహోవా సేవకుల నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో, అబ్రాహాము ముని మనుమడైన యోసేపు గురించి, అతని అన్నలు చేసిన అన్యాయం గురించి తెలుసుకుంటాం. తర్వాతి ఆర్టికల్‌లో, రాజైన అహాబుతో యెహోవా వ్యవహరించిన విధానం గురించి అలాగే సిరియాలోని అంతియొకయ సంఘంలో పేతురుకు ఎదురైన అనుభవం గురించి పరిశీలిస్తాం. ఈ ముగ్గురి గురించి పరిశీలిస్తుండగా, యెహోవా గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి, ఆయనతో మనకున్న స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఆలోచించడానికి ప్రయత్నించండి. మరిముఖ్యంగా మనకు అన్యాయం జరిగిందని బలంగా అనిపించినప్పుడు ఆయనతో మన స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఆలోచించండి.
యోసేపుకు జరిగిన అన్యాయం
10, 11. (ఎ) యోసేపుకు ఏయే విషయాల్లో అన్యాయం జరిగింది? (బి) జైల్లో ఉన్నప్పుడు యోసేపుకు ఏ అవకాశం దొరికింది?
10 యోసేపు యెహోవాకు నమ్మకమైన సేవకుడు. తనకు పరిచయంలేని వాళ్ల చేతుల్లో అతను అన్యాయానికి గురయ్యాడు. అయితే, అతనికి అన్నిటికన్నా ఎక్కువ బాధ కలిగించిన విషయమేమిటంటే, తన సొంత అన్నలు కూడా అతనికి అన్యాయం చేశారు. యోసేపుకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, అతని అన్నలు అతన్ని ఎత్తికెళ్లి, బానిసగా అమ్మేశారు. యోసేపును కొనుక్కున్నవాళ్లు అతన్ని ఐగుప్తుకు తీసుకెళ్లారు. (ఆది. 37:23-28; 42:21) కొంతకాలం తర్వాత, ఆ పరాయి దేశంలో ఒక స్త్రీని బలత్కరించబోయాడనే నింద యోసేపుపై మోపి, ఎలాంటి విచారణ చేయకుండానే అతనికి జైలు శిక్ష విధించారు. (ఆది. 39:17-20) యోసేపు ఒక బానిసగా, ఖైదీగా దాదాపు 13 సంవత్సరాలు బాధపడ్డాడు. యోసేపు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? తోటి సహోదరసహోదరీలవల్ల మనకు అన్యాయం జరిగినప్పుడు అవి మనకు ఎలా సహాయం చేస్తాయి?
11 యోసేపు జైల్లో ఉన్నప్పుడు, రాజు దగ్గర పనిచేసే పానదాయక అధిపతిని కూడా జైల్లో వేశారు. ఒక రాత్రి పానదాయకుడికి కల వచ్చింది. అయితే యెహోవా సహాయంతో యోసేపు ఆ కల అర్థాన్ని వివరించాడు. ఆ పానదాయకుడు విడుదలౌతాడని, మళ్లీ ఫరో దగ్గర పనిచేస్తాడని యోసేపు వివరించాడు. దాని తర్వాత, యోసేపు తన పరిస్థితిని ఆ పానదాయకుడికి వివరించాడు. అలా వివరిస్తున్నప్పుడు యోసేపు కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పలేదు. కాబట్టి యోసేపు మాట్లాడిన విధానం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.—ఆది. 40:5-13.
12, 13. (ఎ) తనకు జరిగిన అన్యాయం విషయంలో యోసేపు రాజీపడలేదని మనకెలా తెలుసు? (బి) యోసేపు పానదాయకుడికి ఏ విషయం చెప్పలేదు?
12 ఆదికాండము 40:14, 15 చదవండి. యోసేపు తనకు జరిగిన దానిగురించి చెప్తూ “దొంగిలబడితిని” అని ఉపయోగించిన మాటను గమనించండి. నిస్సందేహంగా, యోసేపుకు అన్యాయం జరిగింది. తన మీద మోపిన నింద అబద్ధమని, తాను తప్పు చేయలేదని కూడా యోసేపు స్పష్టంగా చెప్పాడు. అందుకే, తన గురించి ఫరోకు చెప్పమని యోసేపు పానదాయకుడిని అడిగాడు. ఎందుకలా అడిగాడు? యోసేపు తన ఉద్దేశాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు, “యీ యింటిలో [లేదా జైలు] నుండి నన్ను బయటికి రప్పించు.”
13 ఏ ప్రయత్నం చేయకుండా తన పరిస్థితితో రాజీపడదామని యోసేపు అనుకున్నాడా? లేదు. తనకు చాలా రకాలుగా అన్యాయం జరిగిందని యోసేపుకు తెలుసు. అందుకే, తన పరిస్థితి గురించి పానదాయకుడికి వివరించాడు. అతని సహాయంతో బయటకు రావచ్చని యోసేపు ఆశపడ్డాడు. కానీ సొంత అన్నలే తనను అమ్మేశారనే విషయాన్ని యోసేపు ఎవ్వరికీ, కనీసం ఫరోకు కూడా చెప్పినట్టు లేఖనాల్లో లేదని గమనించండి. నిజానికి అతని అన్నలు ఐగుప్తుకు వచ్చి, యోసేపుతో సమాధానపడినప్పుడు ఫరో వాళ్లను ఆహ్వానించి ఐగుప్తులో ఉండనిచ్చాడు. అంతేకాదు “దేశమంతటిలోనున్న మంచి వస్తువుల్ని” ఆనందించమని చెప్పాడు.—ఆది. 45:16-20.
లేనిపోనివి చెప్పడం వల్ల సమస్య మరింత పెద్దది అవ్వవచ్చు (14వ పేరా చూడండి)
14. సంఘంలో మనకు అన్యాయం జరిగితే, చెడుగా మాట్లాడకుండా ఉండడానికి ఏది మనకు సహాయం చేస్తుంది?
14 సంఘంలో మనకు అన్యాయం జరిగిందని అనుకుంటే, దానిగురించి అందరికి చెప్పకుండా జాగ్రత్తపడాలి. నిజమే, ఒక సహోదరుడు ఘోరమైన పాపం చేస్తే దాని గురించి పెద్దలకు చెప్పి సహాయం కోసం అడగవచ్చు. (లేవీ. 5:1) అయితే చాలా సందర్భాల్లో, చేసిన తప్పు ఘోరమైన పాపం కాకపోవచ్చు. అప్పుడు తప్పు చేసిన సహోదరునితో మనమే సమాధానపడవచ్చు. దానిగురించి వేరేవాళ్లకు, పెద్దలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. (మత్తయి 5:23, 24; 18:15 చదవండి.) ఈ పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటూ, బైబిలు సూత్రాల్ని పాటిద్దాం. కొన్నిసార్లు మనం పరిస్థితిని అపార్థం చేసుకున్నామని, మనం అనుకున్నట్లుగా అన్యాయం జరగలేదని గ్రహించవచ్చు. తప్పు చేశాడని మనం అనుకున్న సహోదరుని గురించి తొందరపడి చెడుగా మాట్లాడనందుకు అప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, మనం అనుకున్నట్లుగా అన్యాయం జరిగినా, జరగకపోయినా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల పరిస్థితి ఎన్నడూ మెరుగవ్వదని గుర్తుపెట్టుకోండి. యెహోవాకు, మన సహోదరులకు నమ్మకంగా ఉంటే మనం అలాంటి పొరపాటు చేయకుండా ఉండగలుగుతాం. కీర్తనకర్త ఇలా అంటున్నాడు, “యథార్థమైన ప్రవర్తన గలిగి” ప్రవర్తించే వ్యక్తి “నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు.”—కీర్త. 15:2, 3; యాకో. 3:5.
అత్యంత ప్రాముఖ్యమైన సంబంధాన్ని గుర్తుంచుకోండి
15. యెహోవాతో ఉన్న సంబంధం యోసేపుకు ఎలా ఒక ఆశీర్వాదంగా మారింది?
15 మనం యోసేపు నుండి మరో ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అతను అన్యాయాన్ని అనుభవించిన 13 సంవత్సరాలు కూడా విషయాల్ని యెహోవా దృష్టితో చూశాడు. (ఆది. 45:5-8) తాను అనుభవిస్తున్న కష్టాలకు యెహోవాను నిందించలేదు. నిజమే, యోసేపు తనకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేదు, అలాగని కోపాన్ని కూడా పెంచుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఇతరుల లోపాలను బట్టి లేదా వాళ్లు చేసిన తప్పులను బట్టి యోసేపు యెహోవాకు దూరమవ్వలేదు. యోసేపు నమ్మకంగా ఉండడం వల్ల యెహోవా తనకు ఎలా న్యాయం చేశాడో, తననూ తన కుటుంబాన్నీ ఎలా ఆశీర్వదించాడో చూడగలిగాడు.
16. సంఘంలో మనకు అన్యాయం జరిగితే, యెహోవాకు మనమెందుకు మరింత దగ్గరవ్వాలి?
16 అదేవిధంగా మనం కూడా యెహోవాతో మనకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచుతూ, దాన్ని కాపాడుకోవాలి. తోటి సహోదరుల అపరిపూర్ణతల్ని బట్టి మనం ప్రేమించే, ఆరాధించే దేవునికి దూరమవ్వకూడదు. (రోమా. 8:38, 39) బదులుగా ఒకవేళ మనకు సంఘంలో అన్యాయం జరిగితే, యోసేపును అనుకరిస్తూ యెహోవాకు మరింత దగ్గరౌదాం. విషయాల్ని యెహోవా చూసినట్టు చూడడానికి ప్రయత్నిద్దాం. సమస్యను బైబిలు సూత్రాల ప్రకారం పరిష్కరించడానికి చేయగలిగినదంతా చేశాక, ఆ విషయాన్ని యెహోవాకు వదిలిపెట్టేయాలి. యెహోవా తాను అనుకున్న సమయానికి, తన విధానంలో సమస్యను పరిష్కరిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.
‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవునిపై’ నమ్మకం ఉంచండి
17. ‘భూమంతటికీ న్యాయం తీర్చే’ యెహోవా పట్ల మనకు నమ్మకం ఉందని ఎలా చూపించవచ్చు?
17 ఈ దుష్టలోకంలో జీవించినంత కాలం మనం ఎన్నో రకాలుగా అన్యాయాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. అప్పుడప్పుడు, మీకు లేదా మీకు తెలిసినవాళ్లకు సంఘంలో అన్యాయం జరిగినట్లు అనిపించవచ్చు. అప్పుడు అభ్యంతరపడకండి. (కీర్త. 119:165) బదులుగా దేవునికి నమ్మకంగా ఉంటూ, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి, ఆయనపై ఆధారపడండి. అపరిపూర్ణతవల్ల మీరు పరిస్థితిని అపార్థం చేసుకొని ఉండవచ్చు అంతేకాదు బహుశా మీకు విషయాలన్నీ తెలిసుండకపోవచ్చు. యోసేపును అనుకరిస్తూ, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి. లేకపోతే పరిస్థితి మరింత ఘోరంగా తయారవ్వవచ్చు. సమస్యను మీ ఇష్టప్రకారం పరిష్కరించడానికి చూసే బదులు యెహోవాకు నమ్మకంగా ఉంటూ పరిస్థితిని ఆయన చక్కబెట్టే వరకు ఓపిగ్గా ఎదురుచూడండి. అప్పుడు, యోసేపు పొందినట్టే యెహోవా ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతారు. ‘భూమంతటికీ న్యాయం తీర్చే’ యెహోవా ఎల్లప్పుడూ న్యాయమే చేస్తాడు. ఎందుకంటే ‘ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి.’—ఆది. 18:25; ద్వితీ. 32:4, NW.
18. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
18 అన్యాయాన్ని ఎదుర్కొన్న మరో ఇద్దరు యెహోవా సేవకుల గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాళ్ల ఉదాహరణల్ని పరిశీలించడంవల్ల న్యాయాన్ని యెహోవా దృష్టితో చూసేందుకు వినయం, క్షమించే గుణం ఎలా సహాయం చేస్తాయో తెలుసుకుంటాం.
a సహోదరుడు విల్లీ డీల్ జీవిత కథ కోసం 1991, నవంబరు 1 కావలికోట (ఇంగ్లీషు) సంచికలో వచ్చిన ‘యెహోవా నా దేవా, నేను నిన్నే నమ్ముకున్నాను’ అనే ఆర్టికల్ చూడండి.