పత్రిక ముఖ్యాంశం | బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా చదవాలి?
ఆసక్తిని పెంచుకోవడానికి ఏమి చేయాలి?
బైబిలు చదవడం మీకు బోరుగా ఉంటుందా? లేదా ఆసక్తిగా ఉంటుందా? అది మీరు ఎలా చదువుతున్నారనే దానిమీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీ ఆసక్తిని, ఆనందాన్ని పెంచుకోవడానికి ఏమి చేయవచ్చో పరిశీలిద్దాం.
ఆధునిక భాషలో ఉన్న నమ్మదగిన బైబిల్ని తీసుకోండి. మీరు చదువుతున్న బైబిల్లో కష్టంగా ఉండే పదాలు, మీకు తెలియని పాత పదాలు ఎక్కువగా ఉంటే చదవాలని అనిపించదు. కాబట్టి చదివిన వెంటనే అర్థమై, మీ హృదయంలోకి వెళ్లే మంచి భాషలో ఉన్న బైబిల్ని తీసుకోండి. అదే సమయంలో ఆ బైబిలు జాగ్రత్తగా, ఖచ్చితంగా అనువాదం చేసినదై ఉండాలి.a
టెక్నాలజీ ఉపయోగించండి. ముద్రించిన పుస్తకాలతో పాటు డిజిటల్ కాపీలుగా కూడా బైబిలు అందుబాటులో ఉంది. కొన్ని బైబిళ్లను ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు లేదా మీ కంప్యూటర్‌లో, ట్యాబ్‌లో, ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అలాంటి కొన్ని బైబిళ్లలో ఒక విషయం గురించి వేరే వచనాల్లో ఏమి ఉందో సులువుగా చూడొచ్చు లేదా మీరు చదువుతున్న వచనాన్ని వేరే అనువాదాలతో పోల్చి చూసుకోవచ్చు. మీకు చదవడం కన్నా వినడం ఇష్టమైతే కొన్ని భాషల్లో బైబిలు రికార్డింగ్‌లు కూడా ఉన్నాయి. ప్రయాణిస్తున్నప్పుడు, బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు, వినడానికి అనుకూలంగా ఉండే ఏదైన పని చేసుకుంటున్నప్పుడు చాలామంది చక్కగా బైబిలు రికార్డింగ్‌లు వింటుంటారు. మీకు వీలయ్యే ఒక పద్ధతిని ప్రయత్నించి చూడండి.
బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పరికరాలు. మీరు బైబిలు చదువుతున్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే బైబిలుకు సంబంధించిన కొన్ని పరికరాలను ఉపయోగించండి. మీరు చదువుతున్న భాగంలో ఉన్న ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి బైబిలు మ్యాపులు చూడొచ్చు. మీరు చదువుతున్న దాన్ని చక్కగా ఊహించుకోవడానికి, సరిగ్గా చిత్రీకరించుకోవడానికి అవి సహాయం చేస్తాయి. ఈ పత్రికలో ఉన్న ఆర్టికల్స్ లేదా jw.org వెబ్‌సైట్‌లో “బైబిలు బోధలు” సెక్షన్‌లో ఉన్న ఆర్టికల్స్ బైబిల్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి.
వేర్వేరు పద్ధతుల్లో చదవండి. బైబిల్ని మొదటి పేజీతో మొదలుపెట్టి చదవడానికి భయంగా ఉంటే మీకు బాగా ఇష్టమైన పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టి మీ ఆసక్తిని పెంచుకోవచ్చు. పేరుగాంచిన బైబిలు వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే, వాళ్ల గురించి బైబిల్లో ఉన్న భాగాలను ఒక్కొక్కటిగా చదవడం మొదలుపెట్టవచ్చు. “బైబిల్లో ఉన్నవాళ్ల గురించి తెలుసుకుంటూ బైబిల్ని లోతుగా చదవండి” అనే బాక్సులో నమూనా పద్ధతి ఉంది. లేదా ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని బైబిల్ని చదవవచ్చు లేదా సంఘటనలు జరిగిన క్రమంలో చదవవచ్చు. వీటిలో ఏదో ఒకటి ఎందుకు ప్రయత్నించకూడదు?
a చాలామంది న్యూ వరల్డ్‌ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ బైబిల్ని ఖచ్చితంగా, నమ్మదగినదిగా, సులువుగా అర్థమయ్యేలా ఉందని తెలుసుకున్నారు. ఈ బైబిల్ని యెహోవాసాక్షులు తయారు చేశారు, ఇది 130 భాషల్లో ఉంది. jw.org వెబ్‌సైట్ నుండి లేదా JW Library app నుండి మీరు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు పుస్తకం రూపంలో కావాలంటే యెహోవాసాక్షులు మీ ఇంటికి వచ్చి ఇస్తారు.