ఇతరుల అవసరాలను తీర్చడానికి మనం ఎలా సహాయపడవచ్చు?
“ఎన్నికలు ముగిశాక మా ప్రాంతంలో హింస చెలరేగింది. దాంతో వేలమంది యెహోవాసాక్షులు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాల్సివచ్చింది. ఆహారం, మందులు అరుదుగా దొరికేవి, మిగిలినవాటి ధర చుక్కల్లో ఉండేది. బ్యాంకులు మూతబడ్డాయి, ఎ.టి.ఎమ్.లలో డబ్బులు ఖాళీ అయిపోయాయి, కొన్ని అసలు పనిచేయకుండా పోయాయి” అని అభివృద్ధి చెందుతున్న ఓ దేశంలో సంఘపెద్దగా సేవచేస్తున్న ఫ్రాన్స్వా అన్నాడు.
అక్కడి బ్రాంచి కార్యాలయంలోని సహోదరులు తక్షణమే నిధులను, అత్యవసర వస్తువులను ఆ దేశంలోని వివిధ రాజ్యమందిరాల్లో తలదాచుకున్న సహోదరులకు పంపించారు. ప్రత్యర్థి ముఠాలు ఇరువైపులా రోడ్లను మూసివేశాయి. అయితే, సాక్షులు తటస్థంగా ఉంటారని ఇరువర్గాల వారికి తెలిసుండడంతో, బ్రాంచికి సంబంధించిన వాహనాలను మాత్రం వెళ్లనిచ్చేవాళ్లు.
ఫ్రాన్స్వా ఇంకా ఇలా చెబుతున్నాడు: “మేము ఒక రాజ్యమందిరానికి వెళ్తున్నప్పుడు, ఓ సైనికుడు మా వ్యాన్ మీద బుల్లెట్ల వర్షం కురిపించాడు. అయితే ఆ బుల్లెట్లు మా మధ్య నుండి వెళ్లాయి కానీ మాకు తగల్లేదు. చేతిలో ఆయుధంతో అతను మావైపు పరుగెత్తుకు రావడం చూసి మేము వ్యాన్ను వెంటనే వెనక్కి తిప్పి వేగంగా బ్రాంచి కార్యాలయానికి వచ్చేశాం. మేము బతికి ఉన్నందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. ఆ తర్వాతి రోజే, ఆ రాజ్యమందిరంలో తలదాచుకున్న 130 మంది సహోదరసహోదరీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వాళ్లలో కొంతమందిని బ్రాంచి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి సద్దుమణిగే వరకూ అక్కడే వాళ్లకు ఆశ్రయం కల్పించి ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలు తీర్చారు.”
“ఇతర ప్రాంతాల్లోని సహోదరులు చూపించిన శ్రద్ధవల్ల యెహోవాపై తమ నమ్మకం ఇంకా పెరిగిందని చెబుతూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశం నలుమూలల ఉన్న సహోదరులు బ్రాంచి కార్యాలయానికి ఎన్నో ఉత్తరాలను రాశారు” అంటూ ఫ్రాన్స్వా ముగించాడు.
ప్రకృతి వల్ల లేదా మనుష్యుల వల్ల వైపరిత్యాలు సంభవించినప్పుడు, అవసరంలో ఉన్న సహోదరులకు “చలి కాచుకొనుడి, తృప్తిపొందుడి” అని మనం చెప్పం. (యాకో. 2:15, 16) బదులుగా వారి భౌతిక అవసరాలను తీర్చాలనుకుంటాం. మొదటి శతాబ్దంలో కూడా కరువు రాబోతుందనే హెచ్చరికను విన్న తర్వాత, “శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.”—అపొ. 11:28-30.
యెహోవా సేవకులమైన మనం అవసరంలో ఉన్నవారికి వస్తుపరంగా సహాయం చేయడానికి ముందుంటాం. అయితే, ప్రజలకు ఆధ్యాత్మిక అవసరం కూడా ఉంది. (మత్త. 5:3) ప్రజలు ఆ అవసరాన్ని గుర్తించి, దాన్ని తీర్చుకునేలా వాళ్లకు సహాయం చేయడం కోసమే యేసు తన అనుచరులకు శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ ఇచ్చాడు. (మత్త. 28:19, 20) ఆ పని చేయడానికి మనలో ప్రతీ ఒక్కరం మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని ధారాళంగా వెచ్చిస్తాం. ఒక సంస్థగా మనం విరాళాల్లో కొంతమొత్తాన్ని వస్తుపరంగా సహాయం చేయడానికి ఉపయోగించినా, ముఖ్యంగా వాటిని రాజ్యానికి సంబంధించిన పనుల కోసం, సువార్తను వ్యాప్తిచేయడం కోసం ఉపయోగిస్తాం. అలా దేవునిపై, పొరుగువారిపై మనకున్న ప్రేమను చూపిస్తాం.—మత్త. 22:37-39.
ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు ఇస్తున్నవాళ్లు, తమ విరాళాలను సంస్థ సరైన విధంగా, ప్రాముఖ్యమైన వాటికోసం ఉపయోగిస్తుందనే నమ్మకంతో ఉండవచ్చు. అవసరంలో ఉన్న మీ సహోదరులకు మీరు చేయూతనివ్వగలరా? శిష్యుల్ని చేసే పనిలో మీ వంతుగా మద్దతివ్వాలని కోరుకుంటున్నారా? అలాగైతే, “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.”—సామె. 3:27.