మనం ఎలా ‘కనిపెట్టుకొని’ ఉండవచ్చు?
“నేను కనిపెట్టియుందును.”—మీకా 7:7.
1. మన ఓపిక ఎందుకు నశించవచ్చు?
యేసు రాజైన 1914లో సాతాను లోకానికి చివరి రోజులు మొదలయ్యాయి. పరలోకంలో యుద్ధం జరిగాక, యేసు అపవాదిని అతని దయ్యాలను భూమ్మీదకు పడద్రోశాడు. (ప్రకటన 12:6-10 చదవండి.) తనకు “సమయము కొంచెమే” మిగిలివుందని సాతానుకు తెలుసు. (ప్రక. 12:12.) కానీ, ఆ ‘కొంచెం సమయం’ మనలో కొంతమంది ఊహించినదానికన్నా ఎక్కువ కాలంగా కొనసాగుతుంది. అయితే, సాతాను విధానాన్ని యెహోవా అంతం చేసే రోజు కోసం ఎదురుచూసీ చూసీ మనలో ఓపిక నశించిందా?
2. మనం ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?
2 సహనం లేకపోవడం చాలా ప్రమాదకరం, దానివల్ల మనం అనాలోచితంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే, మనం ఎలా ‘కనిపెట్టుకొని’ ఉండవచ్చు? ఎలాగో ఈ కింది ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం ద్వారా చూద్దాం. (1) మీకా ప్రవక్త చూపించిన సహనం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (2) అంతం రాబోతుందని ఏ సంఘటనలు సూచిస్తాయి? (3) యెహోవా చూపించే సహనానికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
మీకా నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
3. మీకా కాలంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది?
3 మీకా 7:2-6 చదవండి. ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక స్థితి దిగజారుతూ దుష్ట రాజైన ఆహాజు పరిపాలన కింద మరింత ఘోరంగా తయారవ్వడాన్ని మీకా ప్రవక్త చూశాడు. ముళ్లచెట్టు లేదా ముళ్లకంచె దగ్గర్లో నడిచేవాళ్లకు హాని కలిగించినట్లే, చెడ్డ ఇశ్రాయేలీయులు తమతో సహవసించినవాళ్లకు హాని తలపెట్టారు. వాళ్ల చెడుతనం వల్ల ఆఖరికి కుటుంబాలు కూడా చిన్నాభిన్నమయ్యాయి. ఆ పరిస్థితిని తనకు తానుగా మార్చలేనని గ్రహించిన మీకా ప్రవక్త యెహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించాడు. ఆ తర్వాత యెహోవా చర్య తీసుకునేంత వరకు ఓపిగ్గా కనిపెట్టుకుని ఉన్నాడు. యెహోవా తప్పకుండా తగిన సమయంలో చర్య తీసుకుంటాడనే పూర్తి నమ్మకాన్ని మీకా ఉంచాడు.
4. మనం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాం?
4 మీకాలానే మనం కూడా స్వార్థపరుల మధ్య జీవిస్తున్నాం. నేడున్న చాలామంది “కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు.” (2 తిమో. 3:2, 3) మన తోటి ఉద్యోగులు, విద్యార్థులు, పొరుగువాళ్లు చూపించే స్వార్థపూరిత స్వభావం మనల్ని ఎంతో వేదనకు గురిచేస్తుంది. కొందరు దేవుని సేవకులు ఇంకా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తన అనుచరులు కుటుంబసభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటారని వివరిస్తూ మీకా 7:6లో ఉన్నలాంటి మాటల్నే యేసు చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.” (మత్త. 10:35, 36) అవిశ్వాసులైన కుటుంబ సభ్యుల నుండి వచ్చే వ్యతిరేకతను, ఎగతాళిని సహించడం ఎంత కష్టమో కదా! ఒకవేళ మనకు అలాంటి సవాలు ఎదురౌతుంటే, ఆ కుటుంబ ఒత్తిళ్లకు మనం తలొగ్గకుండా ఉందాం. బదులుగా, యథార్థంగా ఉంటూ, సమస్యల్ని యెహోవా పరిష్కరించేంత వరకు ఓపిగ్గా వేచివుందాం. ఆయన సహాయం కోసం మనం ఎడతెగక అడుగుతుంటే, సహించడానికి కావాల్సిన బలాన్ని, జ్ఞానాన్ని యెహోవా దయచేస్తాడు.
5, 6. మీకాకు యెహోవా ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు? అయితే మీకా ఏమి చూడలేదు?
5 మీకా చూపించిన సహనానికి యెహోవా తగిన ప్రతిఫలం ఇచ్చాడు. రాజైన ఆహాజు, ఆయన దుష్ట పరిపాలన అంతమవ్వడం మీకా చూశాడు. ఆహాజు కొడుకు, మంచి రాజైన హిజ్కియా సింహాసనాన్ని అధిష్ఠించి, సత్యారాధనను పునరుద్ధరించడం కూడా మీకా చూశాడు. మీకా ద్వారా షోమ్రోనుపై యెహోవా ప్రకటించిన తీర్పు సందేశం, అష్షూరీయులు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించినప్పుడు నెరవేరింది.—మీకా 1:6.
6 అయితే, యెహోవా మీకాతో చెప్పించిన అన్ని ప్రవచనాల నెరవేర్పును మీకా చూడలేదు. ఉదాహరణకు, మీకా ఇలా రాశాడు: ‘అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి అని చెప్పుకొందురు.’ (మీకా 4:1, 2) ఆ ప్రవచనం నెరవేరడానికి చాలా కాలం ముందే మీకా చనిపోయాడు. అయినాసరే, తన చుట్టూ ఉన్న ప్రజలు ఏమి చేసినా మీకా మాత్రం చనిపోయేంతవరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయం గురించి మీకా ఇలా రాశాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:5) యెహోవా తన వాగ్దానాలన్నిటినీ తప్పకుండా నెరవేరుస్తాడనే అచంచల నమ్మకం ఉండబట్టే మీకా కష్టమైన పరిస్థితులను కూడా ఓపిగ్గా సహించాడు. ఆ నమ్మకమైన ప్రవక్త యెహోవా మీద విశ్వాసం ఉంచాడు.
7, 8. (ఎ) మనం యెహోవా మీద నమ్మకం ఉంచడానికి ఎందుకు మంచి కారణం ఉంది? (బి) ఏమి చేస్తే సమయం త్వరగా గడుస్తుంది?
7 యెహోవా మీద మీకాకు ఉన్నలాంటి నమ్మకమే మనకూ ఉందా? అలా నమ్మడానికి మనకు మంచి కారణమే ఉంది, ఎందుకంటే మీకా ప్రవచన నెరవేర్పును మనం కళ్లారా చూస్తున్నాం. “అంత్యదినములలో” అన్ని జనాంగాల, భాషల, తెగల నుండి లక్షలాదిమంది “యెహోవా మందిరపర్వతము” మీదకు ప్రవాహంలా వచ్చారు. పరస్పరం యుద్ధాలు చేసుకునే దేశాల నుండి వచ్చినా ఈ సత్యారాధకులు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగా” చేసుకున్నారు, “యుద్ధముచేయ నేర్చుకొనుట” మానేశారు. (మీకా 4:3) శాంతికాముకులైన యెహోవా ప్రజల్లో ఒకరిగా ఉండడం ఎంత గొప్ప గౌరవమో కదా!
8 ఈ దుష్ట విధానానికి యెహోవా త్వరగా అంతం తేవాలని మనందరం కోరుకుంటున్నాం. అయితే, మనం దాని కోసం ఓపిగ్గా కనిపెట్టుకుని ఉండాలంటే, విషయాలను యెహోవా దృష్టికోణం నుండి చూడడం అవసరం. “తాను నియమించిన మనుష్యుని” ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మానవజాతికి తీర్పు తీర్చే ఓ రోజును యెహోవా నిర్ణయించాడు. (అపొ. 17:31) కానీ, దానికంటే ముందు అన్నిరకాల ప్రజలు, సత్యం గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని పొంది, దాని ప్రకారం ప్రవర్తించి, రక్షణ పొందే అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. ఎంతో అమూల్యమైన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. (1 తిమోతి 2:3, 4 చదవండి.) త్వరలోనే అంతం రానుంది. యెహోవా గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేసే పనిలో మనం బిజీగా ఉంటే అంతం రావడానికి మిగిలివున్న సమయం ఇట్టే గడిచిపోతుంది. అంతం వచ్చినప్పుడు, మనం అప్పటివరకు రాజ్య ప్రకటనా పనిలో నిమగ్నమై ఉన్నందుకు ఎంత సంతోషిస్తామో కదా!
అంతం రాబోతుందని ఏ సంఘటనలు సూచిస్తాయి?
9-11. మొదటి థెస్సలొనీకయులు 5:3లోని మాటలు నెరవేరాయా? వివరించండి.
9 మొదటి థెస్సలొనీకయులు 5:1-3 చదవండి. ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అని త్వరలోనే దేశాలు చాటుతుంటాయి. ఆ మాటల వల్ల మనం మోసపోకూడదంటే, “మెలకువగా ఉండి మత్తులముకాక” ఉండాలి. (1 థెస్స. 5:6) గమనార్హమైన ఆ ప్రకటనకు దారితీసే సంఘటనల గురించి ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం. అది మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి సహాయం చేస్తుంది.
10 ప్రపంచ యుద్ధం జరిగిన ప్రతీసారి దేశాలన్నీ శాంతి-సమాధానాల కోసం గొంతుచించుకొని అరిచాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతిని నెలకొల్పడానికి నానాజాతి సమితిని స్థాపించారు. ఆ తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు కూడా, అది భూవ్యాప్తంగా శాంతిని తీసుకొస్తుందని నమ్మారు. అవే మానవజాతికి శాంతిభద్రతలను తీసుకొస్తాయని రాజకీయ నాయకులు, మత నాయకులు ఎదురుచూశారు. ఉదాహరణకు, 1986వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి సంవత్సరంగా ప్రకటించింది. ఆ సంవత్సరం, ఇటలీలోని అసిస్సీలో, చాలా దేశాల నుండి వచ్చిన నాయకులు, మత పెద్దలు క్యాథోలిక్ చర్చీ పోప్‌తో కలిసి శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
11 అయితే శాంతిభద్రతలకు సంబంధించి ఆ సందర్భంలో దేశాలు చేసిన ప్రకటన గానీ, అలాంటి మరితర ప్రకటనలు గానీ, 1 థెస్సలొనీకయులు 5:3లోని మాటల నెరవేర్పు ఎంతమాత్రం కావు. ఎందుకు? ఎందుకంటే, బైబిలు చెప్పిన ‘ఆకస్మిక నాశనం’ అప్పుడు సంభవింపలేదు.
12. ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే ప్రకటన గురించి మనకేమి తెలుసు?
12 అయితే, ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే గమనార్హమైన ప్రకటన ఎవరు చేస్తారు? క్రైస్తవమత నాయకులు, ఇతర మతనాయకులు అందులో ఎలాంటి పాత్రను పోషిస్తారు? ఆ ప్రకటనలో వివిధ ప్రభుత్వ నాయకుల పాత్ర ఏమిటి? వీటి గురించి లేఖనాలు ఏమీ చెప్పడం లేదు. అయితే, ఆ ప్రకటన ఏ రూపంలో వచ్చినా, ఎంత నమ్మదగినదిగా ఉన్నా అదంతా వట్టిమాటనే విషయం మనకు తెలుసు. ఈ లోకం అప్పుడు కూడా సాతాను అధీనంలోనే ఉంటుంది. ఈ లోకం పూర్తిగా కుళ్లిపోయింది, మున్ముందు కూడా అలాగే ఉంటుంది. మనలో ఎవరైనా సాతాను లోకం చేసే ఆ ప్రచారాన్ని నమ్మి క్రైస్తవ తటస్థతను కోల్పోతే, అది ఎంత విచారకరమో కదా!
13. దూతలు నాశనకరమైన వాయువులను ఎందుకు పట్టుకుని ఉన్నారు?
13 ప్రకటన 7:1-4 చదవండి. ఒకవైపు మనం 1 థెస్సలొనీకయులు 5:3లోని మాటల నెరవేర్పు కోసం వేచిచూస్తుండగా, మరోవైపు శక్తివంతమైన దూతలు మహాశ్రమలనే నాశనకరమైన వాయువులను పట్టుకుని ఉన్నారు. వాళ్లు దేని కోసం వేచిచూస్తున్నారు? ‘దేవుని దాసులైన’ అభిషిక్తులు చివరి ముద్రను పొందే ఓ కీలకమైన ఘట్టం గురించి అపొస్తలుడైన యోహాను వివరించాడు.a ఆ చివరి ముద్ర పూర్తయిన తర్వాత దూతలు ఆ నాశనకరమైన వాయువులను వదిలేస్తారు. అప్పుడు ఏమి జరుగుతుంది?
14. మహాబబులోను నాశనం దగ్గరపడిందని ఏది సూచిస్తుంది?
14 ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను నాశనం దగ్గరపడింది. ఆ నాశనమప్పుడు, ‘ప్రజలు, జనసమూహములు, జనములు, ఆయా భాషలు మాట్లాడువాళ్లు’ దాన్ని ఏ మాత్రం కాపాడలేరు. దాని అంతం దగ్గర్లో ఉందనే సూచనలు కూడా చూస్తున్నాం. (ప్రక. 16:12; 17:15-18; 18:7, 8, 21) వాస్తవానికి మతాలను, మతనాయకులను తీవ్రంగా విమర్శిస్తూ వార్తామాధ్యమాల్లో వస్తున్న వార్తలే మహాబబులోనుకు మద్దతు కరువైందని చెప్పడానికి రుజువులు. ఇంత జరిగినా తమకేమి ప్రమాదం లేదన్నట్లు మహాబబులోను నాయకులు ధీమాగా ఉన్నారు. వాళ్లెంతగా పొరబడుతున్నారో కదా! ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే ప్రకటన వెలువడిన తర్వాత సాతాను వ్యవస్థలోని రాజకీయ నాయకులు అకస్మాత్తుగా అబద్ధమతం మీద దాడిచేసి దాన్ని మట్టుపెడతారు. మహాబబులోను మళ్లీ ఎన్నడూ ఉనికిలోకి రాదు. అవును, అలాంటి అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనల కోసం కనిపెట్టుకుని ఉండడంవల్ల మనం తగిన ప్రతిఫలం పొందుతాం.—ప్రక. 18:8, 9-10.
దేవుని సహనానికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
15. యెహోవా ఎందుకు తొందరపడి చర్య తీసుకోవడం లేదు?
15 తన నామాన్ని ప్రజలు నిందిస్తున్నా యెహోవా మాత్రం చర్య తీసుకోవడానికి సరైన సమయం కోసం సహనంగా వేచి చూస్తున్నాడు. యథార్థహృదయుల్లో ఏ ఒక్కరూ చనిపోవడం ఆయనకు ఇష్టంలేదు. (2 పేతు. 3:9, 10) మనం కూడా అలాగే భావిస్తున్నామా? యెహోవా దినం రాకముందే మనం కిందవున్న విధానాల్లో ఆయన సహనానికి కృతజ్ఞత చూపించవచ్చు.
16, 17. (ఎ) నిష్క్రియులైన వ్యక్తులకు మనం ఎందుకు సహాయం చేయాలి? (బి) నిష్క్రియులు యెహోవా దగ్గరకు తిరిగి రావడం ఎందుకు అత్యవసరం?
16 నిష్క్రియులకు సహాయం చేయండి. తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల దొరికినా పరలోకంలో సంతోషం కలుగుతుందని యేసు చెప్పాడు. (మత్త. 18:14; లూకా 15:3-7) ప్రస్తుతం తనను చురుగ్గా సేవించని వాళ్లతోసహా తన నామంమీద ప్రేమ చూపించిన వాళ్లందరి పట్ల యెహోవాకు ఎంతో శ్రద్ధ ఉంది. అలాంటి వాళ్లు సంఘంలోకి తిరిగి రావడానికి సహాయం చేసినప్పుడు మనం యెహోవాకు, దూతలకు ఎంతో సంతోషం కలిగిస్తాం.
17 ప్రస్తుతం మీరు నిష్క్రియులుగా ఉన్నారా? బహుశ సంఘంలోని ఎవరైనా నొప్పించినందువల్ల మీరు యెహోవా సంస్థతో సహవసించడం మానేసివుండవచ్చు. అది జరిగి ఇప్పటికీ కొంత సమయం గడిచిపోయివుంటుంది కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘ఇప్పుడు నా జీవితం మరింత అర్థవంతంగా, ఆనందంగా ఉందా? నన్ను నొప్పించింది యెహోవానా, లేక ఓ అపరిపూర్ణ మనిషా? యెహోవా నాకు ఎప్పుడైనా హాని తలపెట్టాడా?’ నిజానికి, యెహోవా ఎల్లప్పుడూ మనకు మంచే చేశాడు. మనం మన సమర్పణకు తగ్గట్లుగా జీవించకున్నా ఆయనిచ్చే మంచివాటిని అనుభవించే అవకాశం మనకిస్తున్నాడు. (యాకో. 1:16, 17) యెహోవా దినం త్వరలోనే వస్తుంది. యెహోవాకూ సంఘానికీ దగ్గరవ్వడానికి ఇదే సమయం.ఈ అంత్యదినాల్లో, సంఘమే సురక్షితమైన ఆవాసం.—ద్వితీ. 33:27; హెబ్రీ. 10:24, 25.
నిష్క్రియులు మళ్లీ యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి ఆయన ప్రజలు చేయగలిగినదంతా చేస్తారు (16, 17 పేరాలు చూడండి)
18. నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఎందుకు మద్దతివ్వాలి?
18 నాయకత్వం వహిస్తున్న వాళ్లకు నమ్మకంగా మద్దతివ్వండి. యెహోవా ఒక ప్రేమగల కాపరిలా మనల్ని నడిపిస్తూ, కాపాడుతున్నాడు. తన కుమారుడైన యేసును మందకు ముఖ్యకాపరిగా నియమించాడు. (1 పేతు. 5:4) లక్షకన్నా ఎక్కువ సంఘాల్లో ఉన్న పెద్దలు దేవుని గొర్రెల్లో ప్రతీఒక్కరిని కాస్తున్నారు. (అపొ. 20:28) కాబట్టి, నాయకత్వం వహిస్తున్న వాళ్లకు మనం నమ్మకంగా మద్దతిచ్చినప్పుడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞత చూపించినవాళ్లమౌతాం.
19. మనం ఒకరికొకరం ఎలా దగ్గరవ్వవచ్చు?
19 ఒకరికొకరు దగ్గరవ్వండి. దానర్థం ఏమిటి? శత్రువులు ఎప్పుడైనా దాడి చేస్తే, సుశిక్షితులైన సైనికులందరూ ఒక్కటౌతారు, అంటే శత్రువులు తమమధ్య దూరే అవకాశం లేకుండా దగ్గరదగ్గరగా వచ్చి నిలబడతారు. అలా వాళ్లు శత్రుదుర్భేద్యమైన రక్షణ శ్రేణిలా తయారౌతారు. దేవుని ప్రజలపై చేసే దాడులను సాతాను తీవ్రతరం చేస్తున్నాడు. కాబట్టి, మనం మన సహోదరులతో పోట్లాడడానికి ఇది సమయమే కాదు. మనం ఒకరికొకరం దగ్గరవ్వడానికి, ఇతరుల అపరిపూర్ణతలను పట్టించుకోకపోవడానికి, యెహోవాపై నమ్మకం ఉంచడానికి ఇది సమయం.
అపవాదిని, అతని దయ్యాలను ఎదిరించడానికి మనందరం ఒక్కటవ్వాల్సిన సమయం ఇదే. (19వ పేరా చూడండి)
20. మనమిప్పుడు ఏమి చేయాలి?
20 మనందరం ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉంటూ కనిపెట్టుకుని ఉందాం. ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే ప్రకటన కోసం, అభిషిక్తులు చివరిముద్ర పొందే సమయం కోసం ఓపిగ్గా వేచివుందాం. ఆ చివరిముద్ర తర్వాత, ఆ నలుగురు దూతలు నాశనకరమైన వాయువులను విడిచిపెడతారు, మహాబబులోను నాశనమౌతుంది. ఈ ప్రాముఖ్యమైన సంఘటనల కోసం వేచిచూస్తూ, యెహోవా సంస్థలో నాయకత్వం వహిస్తున్న వాళ్లిచ్చే నిర్దేశాల్ని పాటిద్దాం. అపవాదిని, అతని దయ్యాలను ఎదిరించడానికి మనందరం ఒకటవుదాం. కీర్తనకర్త చెప్పిన ఈ మాటల్ని పాటించాల్సిన సమయం ఇదే: “యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.”—కీర్త. 31:24.
a అభిషిక్తులు మొదటిగా ముద్రించబడడం, చివరిగా ముద్రించబడడం మధ్యవున్న తేడా గురించి మరింత సమాచారం కోసం కావలికోట 2007, జనవరి 1 సంచికలోని 30-31 పేజీలు చూడండి.