కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 4/1 పేజీలు 30-32
  • తండ్రి తన కొడుకుకు దగ్గరవ్వాలంటే . . .

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తండ్రి తన కొడుకుకు దగ్గరవ్వాలంటే . . .
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సాధారణంగా ఎదురయ్యే మూడు సవాళ్లు
  • మీ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే మొదలుపెట్టండి
  • మీ పిల్లలు ఇష్టపడేవాటిని ఇష్టపడండి
  • ఆత్మవిశ్వాసాన్ని పెంచండి
  • మంచి తండ్రిగా ఎలా ఉండవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీ యింటివారి రక్షణకొరకు కష్టించి పనిచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • సాటిలేని తండ్రి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 4/1 పేజీలు 30-32

తండ్రి తన కొడుకుకు దగ్గరవ్వాలంటే . . .

“నాన్నా, ఇవన్నీ నీకెలా తెలుసు?” మీ అబ్బాయి మీతో ఎప్పుడైనా అలా అన్నాడా? అలా అడిగినప్పుడు మీరు ఆశ్చర్యపోవడమే కాదు ఓ తండ్రిగా గర్వపడివుంటారు కూడా. మీ అబ్బాయి ఇంకో అడుగు ముందుకేసి, మీరిచ్చిన సలహా పాటించి ప్రయోజనం పొందితే ఇక మీ ఆనందానికి అవధులే ఉండవు.a—సామెతలు 23:15, 24.

ఏళ్లు గడుస్తున్నా మీ అబ్బాయి మీ గురించి అలాగే గొప్పగా అనుకుంటున్నాడా? లేదా ఇప్పుడు వాడికి మీమీద గౌరవం తగ్గిపోతోందని మీకనిపిస్తోందా? మీ అబ్బాయి పెద్దవాడౌతున్నా మీ మధ్య అనుబంధం అలాగే ఉండాలంటే ఏమి చేయాలి? ఈ విషయంలో తండ్రులకు ఎదురయ్యే కొన్ని సవాళ్లేమిటో ముందుగా చూద్దాం.

సాధారణంగా ఎదురయ్యే మూడు సవాళ్లు

1. సమయం లేకపోవడం: చాలా దేశాల్లో, కుటుంబ ఖర్చులను ఎక్కువగా తండ్రే చూసుకుంటాడు. కాబట్టి వాళ్లు రోజులోని ఎక్కువ సమయం ఉద్యోగంలోనే గడపాల్సివస్తుంది. దానివల్ల, కొన్ని ప్రాంతాల్లో తండ్రులు పిల్లలతో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లోని తండ్రులు తమ పిల్లలతో రోజుకు సగటున 12 నిమిషాల కన్నా తక్కువ సమయం గడుపుతున్నారని ఇటీవల అక్కడ జరిగిన ఒక సర్వేలో తేలింది.

దీని గురించి ఆలోచించండి: మీరు మీ అబ్బాయితో ఎంత సమయం గడుపుతున్నారు? రాబోయే ఒకట్రెండు వారాల్లో, ప్రతీరోజు మీ అబ్బాయితో మీరు గడిపే సమయాన్ని రాసి పెట్టుకోండి. మీ అబ్బాయితో తగినంత సమయం గడపడం లేదని చూసుకుని బహుశా మీరే ఆశ్చర్యపోతారు.

2. తమ తండ్రులు తమతో వ్యవహరించిన తీరు: కొంతమంది పురుషులకు తమ తండ్రులతో అంతగా అనుబంధం ఉండదు. ఫ్రాన్స్‌లో ఉంటున్న జాన్‌ మారి ఇలా అంటున్నాడు: “మా నాన్నా, నేనూ అంతగా మాట్లాడుకునేవాళ్లం కాదు.” అది జాన్‌ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? “దానివల్ల, ఎప్పుడూ ఊహించని సమస్యలు నాకు ఎదురయ్యాయి. ఒకటేమిటంటే, మా అబ్బాయిలతో చక్కగా మాట్లాడడం నాకు కష్టమౌతోంది” అని ఆయన అంటున్నాడు. ఇంకొంతమంది మగవాళ్లకు తమ తండ్రుల గురించి బాగా తెలుసు కానీ వాళ్ల మధ్య అంత సాన్నిహిత్యం ఉండదు. 43 ఏళ్ల ఫీలీప్‌ ఇలా అంటున్నాడు: “నా మీదున్న ప్రేమను వ్యక్తం చేయడం మా నాన్నకు కష్టంగా ఉండేది. అందుకే మా అబ్బాయి మీద మరింత ప్రేమ చూపించడానికి నేను చాలా కష్టపడాల్సివస్తోంది.”

దీని గురించి ఆలోచించండి: మీ నాన్నతో మీకు ఎలాంటి సంబంధం ఉందనేది మీరు మీ అబ్బాయితో వ్యవహరించే తీరు మీద ప్రభావం చూపిస్తోందని మీకనిపిస్తోందా? మీ నాన్నకున్న మంచి అలవాట్లనుగాని చెడు అలవాట్లనుగాని మీరు అనుసరిస్తున్నట్లు గమనించారా? ఏయే విషయాల్లో?

3. సంస్కృతి: పిల్లలను పెంచడంలో తండ్రులకు అంతగా బాధ్యత లేదని కొన్ని సంస్కృతుల్లోని ప్రజలు అనుకుంటారు. పశ్చిమ ఐరోపాలోని ఒక దేశంలో పెరిగిన లూకా ఇలా అంటున్నాడు: “నేను పెరిగిన ప్రాంతంలోని ప్రజలు, పిల్లలను పెంచడం తల్లి బాధ్యతని అనుకునేవారు.” ఇంకొన్ని సంస్కృతుల్లో, పిల్లలను క్రమశిక్షణలో పెట్టడంతప్ప తండ్రులు ఇంకేమీ చేయనవసరం లేదని భావిస్తారు. ఉదాహరణకు, ఆఫ్రికాలోని ఒక దేశంలో పెరిగిన జార్జ్‌ ఇలా అంటున్నాడు: “తమ అధికారం ఎక్కడ తగ్గిపోతుందోనని భయపడి మా సంస్కృతిలో తండ్రులు తమ పిల్లలతో కలిసి ఆడరు. అలాంటి ఆలోచన వల్లే నేను కూడా మా అబ్బాయితో సరదాగా గడపలేకపోయేవాణ్ణి.”

దీని గురించి ఆలోచించండి: మీ సమాజంలో, తండ్రులు ఎలా ఉండాలని ప్రజలు అనుకుంటారు? పిల్లల్ని చూసుకోవడం ఆడవాళ్ల పని అనుకుంటారా? తండ్రులు తమ కొడుకుల మీద ప్రేమ, ఆప్యాయత వ్యక్తం చేయడం మంచిదని అంటారా, సరికాదని అంటారా?

ఈ సవాళ్లలో ఏవైనా మీరూ ఎదుర్కొంటున్నారా? అలాగైతే వాటినెలా అధిగమించవచ్చు? కింది సలహాలు పరిశీలించండి.

మీ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే మొదలుపెట్టండి

అబ్బాయిలు తండ్రిని అనుకరించాలనే కోరికతో పుడతారనిపిస్తోంది. కాబట్టి మీ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే వాడిలోని ఆ కోరికను పూర్తిగా ఉపయోగించుకోండి. దాన్ని మీరెలా చేయవచ్చు? మీ అబ్బాయితో మీరు ఎప్పుడు సమయం గడపవచ్చు?

వీలైనప్పుడల్లా మీ రోజువారీ పనులను మీ అబ్బాయితో కలిసి చేయండి. ఉదాహరణకు, ఇంటిపనుల్లో మీకు సాయం చేయమని అడగండి. మీరు ఇల్లు ఊడుస్తున్నట్లయితే వాడికీ ఓ చిన్న చీపురు ఇవ్వండి లేదా మీరు తోటపని చేస్తున్నట్లయితే చిన్న పార చేతికివ్వండి. వాడి దృష్టిలో మీరొక హీరో. అన్ని విషయాల్లో మీలాగే ఉండాలనుకుంటాడు. అందుకే మీతో కలిసి పనిచేయడానికి ఎగిరిగంతేస్తాడు. అలాంటప్పుడు పని పూర్తిచేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టినా మీ మధ్య బంధం బలపడుతుంది. మీ అబ్బాయి కూడా కష్టపడి పని చేయడం నేర్చుకుంటాడు. పిల్లల్ని రోజువారీ పనుల్లో కలుపుకోవాలని, ఆ సమయాల్లో వాళ్లతో మాట్లాడాలని, వాళ్లకు బోధించాలని చాలాకాలం క్రితమే బైబిలు తండ్రులను ప్రోత్సహించింది. (ద్వితీయోపదేశకాండము 6:6-9) ఈ సలహా ఇప్పటికీ పనిచేస్తుంది.

మీ అబ్బాయితో కలిసి పని చేయడంతోపాటు కలిసి ఆడడం కూడా ప్రాముఖ్యం. ఆటల వల్ల పిల్లలు, తండ్రులు కలిసి సంతోషించడమే కాదు వేరే లాభాలు కూడా ఉన్నాయి. తండ్రులు తమ చిన్న పిల్లలతో కలిసి ఆడడం వల్ల పిల్లల్లో ఎక్కువ ధైర్యసాహసాలు అలవడతాయని పరిశోధనలో తేలింది.

తండ్రీకొడుకులు కలిసి ఆడుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. “ఆడుకునేటప్పుడే పిల్లవాడు తండ్రితో చక్కగా మాట్లాడతాడు” అని మీషెల్‌ ఫీజ్‌ అనే పరిశోధకుడు అంటున్నాడు. ఆడుకునేటప్పుడు తండ్రి, తన కొడుకు మీద ఉన్న ప్రేమను మాటల్లో, చేతల్లో వ్యక్తం చేయగలుగుతాడు. అలా పిల్లవాడికి కూడా ఆప్యాయత వ్యక్తం చేయడం నేర్పిస్తాడు. జర్మనీవాసి అయిన ఆన్‌డ్రే ఇలా అంటున్నాడు: “మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు మేము తరచూ కలిసి ఆడుకునేవాళ్లం. నేను వాడిని గుండెలకు హత్తుకునేవాణ్ణి, దానివల్ల తన ప్రేమను వ్యక్తం చేయాలని వాడు కూడా నేర్చుకున్నాడు.”

తండ్రి కొడుకుతో తన బంధాన్ని బలపర్చుకోవడానికి పడుకోబోయే సమయం మంచి అవకాశాన్నిస్తుంది. వీలైతే రోజూ వాడికొక కథ చదివి వినిపించండి, ఆ రోజు తనను సంతోషపెట్టిన, బాధపెట్టిన విషయాల గురించి వాడు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. అలాచేస్తే, వాడు పెద్దవాడైనప్పుడు కూడా మీతో మాట్లాడడానికి ఏమాత్రం సంకోచించడు.

మీ పిల్లలు ఇష్టపడేవాటిని ఇష్టపడండి

తండ్రి తమతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కౌమారప్రాయంలో ఉన్న కొంతమంది అబ్బాయిలు అంతగా ఇష్టపడరు. మీరేదైనా ప్రశ్న అడిగినప్పుడు మీ అబ్బాయి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇక మీతో మాట్లాడడం తనకు ఇష్టంలేదని అనుకోకండి. మీరు తనతో మాట్లాడే పద్ధతి మార్చుకుంటే మీతో మనసువిప్పి మాట్లాడడానికి తను ఎక్కువ ఇష్టపడవచ్చు.

ఫ్రాన్స్‌వాసి అయిన జాక్‌కు తన కొడుకు జేరోమ్‌తో మాట్లాడడం కొన్నిసార్లు కష్టంగా అనిపించేది. అయితే, మాట్లాడమని తన కొడుకును బలవంతపెట్టకుండా మరో పద్ధతిలో ప్రయత్నించాడు. అందుకోసం కొడుకుతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడడం మొదలుపెట్టాడు. జాక్‌ ఇలా అంటున్నాడు: “మేము ఆడిన తర్వాత అలసట తీర్చుకోవడానికి కాసేపు గడ్డి మీద కూర్చునేవాళ్లం. ఆ సమయంలో మా అబ్బాయి నాతో మనసువిప్పి మాట్లాడేవాడు. మేము కలిసి సమయం గడపడమే అంటే ఆడుకునే సమయాల్లో నేను వాడితోపాటు ఒంటరిగా ఉండడమే మా మధ్య బంధాన్ని బలపర్చింది.”

ఒకవేళ మీ అబ్బాయికి ఆటలంటే ఇష్టం లేకపోతే అప్పుడేమి చేయవచ్చు? తన కొడుకుతో కలిసి నక్షత్రాలను చూస్తూ గడిపిన సమయాన్ని సంతోషంగా గుర్తుచేసుకుంటూ ఆన్‌డ్రే ఇలా అంటున్నాడు: “మేము చల్లటి రాత్రివేళ ఆరుబయట మడత కుర్చీలు వేసుకునేవాళ్లం. తర్వాత, వెచ్చగా ఉండే బట్టలు వేసుకుని, చేతిలో టీ కప్పు పట్టుకుని ఆకాశంవైపు చూస్తూ చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఉదాహరణకు, నక్షత్రాలను సృష్టించిన దేవుని గురించి, మా వ్యక్తిగత విషయాల గురించి . . . అలా దాదాపు ప్రతీ విషయం గురించి మాట్లాడుకునేవాళ్లం.”—యెషయా 40:25, 26.

మీ పిల్లవాడు ఇష్టపడే కొన్ని విషయాలు మీకు నచ్చకపోతే అప్పుడేమి చేయాలి? అలాంటప్పుడు మీ ఇష్టాయిష్టాలను పక్కనబెట్టాల్సి ఉంటుంది. (ఫిలిప్పీయులు 2:4) దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఈయన్‌ ఇలా అంటున్నాడు: “మా అబ్బాయి వాన్‌ కన్నా నాకు ఆటలంటే ఎక్కువ ఇష్టం. వాడేమో విమానాలను, కంప్యూటర్లను ఇష్టపడేవాడు. అందుకే వాడి ఇష్టాలను నా ఇష్టాలుగా చేసుకుని ఎయిర్‌ షోలకు తీసుకెళ్లేవాణ్ణి, కంప్యూటర్‌లో ఫ్లయిట్‌ సిములేటర్‌తో ఆడుకునేవాళ్లం. అలా కలిసి సరదాగా గడపడం వల్లే వాన్‌ నాతో ఇంకా చక్కగా మనసువిప్పి మాట్లాడేవాడని నాకనిపిస్తోంది.”

ఆత్మవిశ్వాసాన్ని పెంచండి

ఏదైనా కొత్త పని నేర్చుకున్నప్పుడు మీ పిల్లవాడు, “చూడు నాన్నా, చూడు!” అంటూ ఉత్సాహంగా అరిచాడా? మీ అబ్బాయి కౌమారప్రాయానికి వచ్చాడనుకోండి, వాడు ఇప్పటికీ మీ మెచ్చుకోలు కోసం అలాగే అడుగుతాడా? బహుశా అడగకపోవచ్చు. కానీ తను పెద్దవాడైనప్పుడు చక్కగా ఆలోచించాలంటే మీ మెచ్చుకోలు తనకు తప్పక అవసరం.

తన కుమారుల్లో ఒకరితో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా ఎలాంటి ఆదర్శం ఉంచాడో గమనించండి. యేసు భూజీవితంలో ఒక ప్రత్యేక దశ మొదలయ్యేముందు, ఆయన మీదున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తూ దేవుడు ఇలా అన్నాడు: “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్తయి 3:17; 5:48) మీ అబ్బాయికి దిద్దుబాటు ఇవ్వాల్సిన, బోధించాల్సిన బాధ్యత మీకుందనే మాట వాస్తవమే. (ఎఫెసీయులు 6:4) మరి వాడు మంచి పనులు చేసినప్పుడు, మంచి మాటలు మాట్లాడినప్పుడు వాడిని మెచ్చుకోవడానికి కూడా చూస్తారా?

మెచ్చుకోవడం, ప్రేమను వ్యక్తం చేయడం కొంతమంది పురుషులకు చాలా కష్టమనిపిస్తుంది. బహుశా వాళ్లు, తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించినవాటిని కాకుండా వాళ్ల తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపించే కుటుంబాల్లో పెరిగివుండవచ్చు. మీరు కూడా అలాంటి కుటుంబంలో పెరిగివుంటే, మీ అబ్బాయిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి గట్టిగా కృషిచేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరేమి చేయవచ్చు? ముందు ప్రస్తావించిన లూకా, తన 15 ఏళ్ల అబ్బాయి మాన్వెల్‌తో కలిసి తరచూ ఇంటిపనులు చేస్తాడు. లూకా ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు, ఏదైనా పనుంటే మా అబ్బాయిని మొదలుపెట్టేయమని, అవసరమైతే నేను సహాయం చేస్తానని చెబుతాను. చాలాసార్లు, వాడే సొంతగా పని పూర్తిచేసేస్తాడు. అలా చేయడంవల్ల వాడికి సంతృప్తి ఉంటుంది, వాడి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు నేను వాడిని మెచ్చుకుంటాను. తాను అనుకున్నంత బాగా చేయలేకపోయినప్పుడు కూడా వాడు చేసిన కృషిని మెచ్చుకుంటాను.”

పెద్ద లక్ష్యాలు సాధించడానికి మీ అబ్బాయికి సహాయం చేస్తే కూడా వాడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ మీ అబ్బాయి మీరనుకున్నంత త్వరగా లక్ష్యాలను చేరుకోలేకపోతుంటే అప్పుడేమిటి? లేదా వాడి లక్ష్యాలు తప్పు కాకపోయినా మీరు పెట్టిన లక్ష్యాలకు వేరుగా ఉంటే అప్పుడేమిటి? అలాంటప్పుడు మీరు వాడి నుండి ఆశించేవాటి గురించి మరోసారి పరిశీలించడం మంచిది. ముందు చెప్పుకున్న జాక్‌ ఇలా అంటున్నాడు: “మా అబ్బాయి, వాడి సామర్థ్యాలకు తగిన లక్ష్యాలే పెట్టుకునేలా సహాయం చేస్తాను. అయితే అవి నా లక్ష్యాలు కాకుండా వాడి లక్ష్యాలే అయ్యుండేలా జాగ్రత్తపడతాను. తర్వాత, వాడు తనకు వీలైనంత వేగంతోనే వాటిని చేరుకోవాలని నేను గుర్తుంచుకుంటాను.” తన లక్ష్యాలు చేరుకునేందుకు మీ అబ్బాయికి సహాయం చేయాలంటే, వాడు తన అభిప్రాయాలను మీకు చెప్పినప్పుడు తాను బాగా చేసిన వాటిని బట్టి వాడిని మెచ్చుకోండి, తన వైఫల్యాలను అధిగమించమని ప్రోత్సహించండి.

ఇవన్నీ చేసినా కొన్నిసార్లు మీ మధ్య పొరపొచ్చాలు, సమస్యలు వస్తాయి. కానీ సమయం గడిచేకొద్దీ, మీ అబ్బాయి మీకు సన్నిహితంగా ఉండాలనే ఎక్కువగా కోరుకుంటాడు. తన విజయానికి తోడ్పడే వ్యక్తికి దగ్గరగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? (w11-E 11/01)

[అధస్సూచి]

a ఈ ఆర్టికల్‌, తండ్రీకొడుకుల అనుబంధం గురించే మాట్లాడుతున్నా ఇందులో చర్చించిన సూత్రాలు తండ్రీకూతుళ్ల అనుబంధానికి కూడా వర్తిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి